మంగళవారం, నవంబర్ 27, 2012

బీన్స్ కూరలు...

ఆ మధ్య ఎప్పుడో ఓ సందర్భంలో బ్లాగు మిత్రులొకరు సింపుల్ గా చేసుకోగలిగే వంటల గురించి రాస్తే బావుంటుంది అన్నారు. ఇప్పటివరకూ పులిహోర, నూడుల్స్, ఉప్మా మరియు స్నాక్స్ గురించి అప్పుడప్పుడూ చెప్పుకున్నాం కదూ. ఇవాళ కూరల సంగతి చూద్దాం. అంటే మొత్తం అన్ని కూరల గురించీ కాదు, ఇంగ్లీష్ కూరలైన బీన్స్, కేరట్, టమాటాలతో తక్కువ టైంలో, తక్కువ శ్రమతో, వీలైనంత రుచిగా చేసుకోగలిగే కూరల కబుర్లు అన్నమాట. పదండి, అలా వంటింట్లోకి వెళ్లి మాట్లాడుకుందాం.

శీతాకాలం వచ్చేసింది కదా, నాలుక కొంచం ఖారం ఖారం, ఘాటు ఘాటు రుచులు కోరుకుంటుంది. అల్లం, పచ్చిమిర్చీ ఉన్నది అందుకే కదూ. ఆ రెంటినీ సన్నగా తరిగి పక్కన పెట్టండి ముందు. బీన్సూ, కేరట్టూ ఒకే సైజు ముక్కలు కోసేసుకుంటే మరో పని కూడా అయిపోతుంది. కుక్కర్లో బియ్యం ఎలాగూ పెడతారు కదూ, ఆ గిన్నె మీద మూత పెట్టేసి ఈ బీన్సు, కేరట్టు ముక్కలని మూత మీద సద్దేసి, ఓ చిటికెడు పసుపు జల్లేసి, కుక్కరు మూత బిగించి స్టవ్ మీదకి ఎక్కించేయండి. నాలుగంటే నాలుగే విసిల్స్ రానిచ్చి, స్టవ్ కట్టేయండి.

ఇయర్ ఫోన్స్ లో కనుక ఆర్.నారాయణమూర్తి పాటల్లాంటివి వస్తూ ఉంటే, అర్జెంటుగా మార్చేసి ఇళయరాజాకో, కేవీ మహదేవన్ కో షిఫ్ట్ అయిపోండి ముందు. ఇప్పుడు బాండీని రెండో స్టవ్ మీద పెట్టి, కించిత్ వేడెక్కాక ఓ చెంచాడు నూనె పోయండి. మరీ ఎక్కువ అక్ఖర్లేదు. నూనె తగుమాత్రం వేడెక్క గానే, తరిగి పక్కన పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి, ఓ వేపు రానిచ్చి, పచ్చిమిర్చి చేర్చండి. ఇవి వేగుతూ ఉండగా శనగపప్పు, చాయ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కాసిన్ని మెంతులు చేర్చి వేగనివ్వండి. గరిటతో కదుపుతూ ఉండక్కర్లా.. ఈలోగా టమాటాలు ముక్కలు కోసుకుని, బాండీ లోకి జార విడవొచ్చు.


టమాటా ముక్కలు వేసేశాక బాండీ మీద మూత పెట్టి, వింటున్న పాట సగం అవ్వగానే ఆ మూత తీసేయాలి. టమాటా ముక్కలు ఇట్టే మెత్తబడతాయన్న మాట. కుక్కర్ చల్లారింది కదా. జాగ్రత్తగా విసిల్ తీసేసి, ఒక్క క్షణం ఆగి మూత తీసి, మరో క్షణం ఆగి, ఆవిరి బయటికి పోగానే ఉడికిన బీన్సూ, కేరట్టూ ముక్కలని గరిటె సాయంతో బాండీలోకి బదలాయించాలి. ఓ తిప్పు తిప్పేసి, బాండీ మీద మూత పెట్టేయాలి. బాండీలో తడి తక్కువగా ఉన్నట్టాయనా, మూత మీద కాసిన్ని నీళ్ళు చిలకరించాలి. ఈ బ్రేక్ లో కొత్తిమీర సంగతి చూద్దాం. రెండు తాజా మొక్కలు తీసుకుని, ఓసారి కడిగేసి వేళ్ళు కోసి పడేసి, నీళ్ళు పిండేసి మిగిలింది సన్నగా తరిగి పెట్టుకోవాలి.

కొత్తిమీర పని అయ్యాక, బాండీ మూత తీసి, కూర ఓసారి కలిపి, ఉప్పు వేసి మళ్ళీ కలిపి, మళ్ళీ ఓ క్షణం మూత పెట్టి తియ్యాలి. రుచికి కావలిస్తే ఓ పావు స్పూను చక్కర కూడా చేర్చుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు కొత్తిమీర జల్లేసి, మరో క్షణం మూత పెట్టి ఉంచి, స్టవ్ కట్టేయడమే. ఒకవైపు వేడన్నం, మరోవైపు వేడి వేడి కూర...మధ్యలో నేనెందుకు చెప్పండి? కూర వండగా మిగిలిన బీన్సూ, కేరట్టూ రెండు రోజులకి వాడు మొహం వేసేస్తాయి. అలాగని రేపు కూడా ఇదే కూర తినలేం కదా.. ఉపాయం లేని వాడిని ఊరి నుంచి తరిమేయమని సామెత.. ఊళ్ళో ఉండడం కోసం ఉపాయాలు సిద్ధం పెట్టుకుని ఉండాలన్న మాట. ఇదే కూరని మరో రుచి వచ్చేలా చేసుకోడం ఎలాగో చూద్దాం ఇప్పుడు.

అల్లం, పచ్చిమిర్చీ బదులుగా ఎండు మిరపకాయలని తీసుకుని ముక్కలుగా తుంపుకోండి. ఒక స్పూను నూనె సహితంగా బాండీ వేడెక్కగానే, ముందుగా ఎండుమిర్చి ముక్కలని వేగనివ్వండి. అవి వేగుతూ ఉండగానే శనగపప్పు, చాయ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులూ మామూలే. ఇవి వేశాక టమాటా ముక్కల కన్నా ముందు కాసిన్ని ఉల్లిపాయ ముక్కలు చేర్చండి. ఈ ఉల్లి ముక్కలు బంగారు వర్ణంలోకి వేగాక (వేలికి ఉన్న ఉంగరాన్నీ, వేగుతున్న ఉల్లిపాయ ముక్కలనీ మార్చి, పోల్చి, చూడక్కర్లేదు) అప్పుడు టమాటా ముక్కలు చేర్చండి. కొత్తిమీర గార్నిష్ తో సహా మిగిలిన విధానంలో ఏ మార్పూ లేదు. వేడి వేడి కూర వడ్డించుకుని రుచిలో తేడా గమనించడం మర్చిపోకండి.

జెండాకూర అనీ, అదికూడా చేసేసుకోవచ్చు కాసిన్ని బంగాళా దుంప ముక్కలు చేర్చుకుని. కుక్కర్లో పెట్టేప్పుడే బీన్సూ, కేరట్టూ ముక్కలతోపాటు, చెక్కు తీసిన బంగాళా దుంపల ముక్కలు కూడా చేర్చేసుకుని, పసుపు వేయకుండా ఊరుకోవాలి. అల్లం పచ్చిమిర్చీ తో అయితే ఉల్లి లేకుండానూ, ఎండుమిర్చి కారం అయితే ఉల్లి చేర్చీ రెండు రకాలుగానూ చేసేసుకోవచ్చు కూరని. గార్నిష్ కూడా కొత్తిమీర బదులు, పుదీనా ప్రయత్నించవచ్చు, ఇష్టమైతేనే సుమా. ఈ కూరలు కేవలం అన్నంలోకి మాత్రమే కాదు, చపాతీలు, రొటీల్లోకి కూడా భలే బావుంటాయి. అన్నట్టు, కేవలం చపాతీల కోసం చేసుకునే కూరలు ఉన్నాయి. వాటి విషయాలు మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం.  రుచి గలదని మిక్కిలి తినరాదు కదా మరి.

17 కామెంట్‌లు:

  1. ఈ ఉల్లి ముక్కలు బంగారు వర్ణంలోకి వేగాక (వేలికి ఉన్న ఉంగరాన్నీ, వేగుతున్న ఉల్లిపాయ ముక్కలనీ మార్చి, పోల్చి, చూడక్కర్లేదు) :)) చాలా బాగుంది .

    ఎంత సింపుల్ గా చెప్పారు .చక చకా ఐదు నిముషాల్లో ఐపోతుంది.

    రిప్లయితొలగించండి
  2. Good dish & narration.
    Next time mix the same directly into rice and you get Biryani. ;)

    రిప్లయితొలగించండి
  3. కూర సంగతి తర్వాత మాట్లాడుకుందాం కానీ, ముక్కలు మాత్రం ఎంత ఆర్టిస్టిక్‌గా కోసారండీ!! అన్నీ ఒకే షేప్.. ఒకే సైజ్!! సూపరసలు :))

    రిప్లయితొలగించండి
  4. హహహ సూపరుందండీ పోస్టు :)) ఉంగారాన్ని ఉల్లిపాయముక్కలని పోల్చి చూడక్కర్లేదన్నారు సరే.. అదేదో వింటూన్నపాట సహం అయ్యాక మూత తీయమన్నారు కదా మరి మూత పెట్టేప్పుడే ఏపావు పాటలోనో ఉంటే అపుడేంజేయాలా? రాజా పాటలు మామపాటలంటే కొన్ని ఏడెనిమిది నిముషాల నిడివి ఉంటాయ్ కొన్ని ఒకటి రెండు నిముషాల పాటలుంటాయ్ అవొస్తే ఏంజేయాలో మరికాస్త వివరంగా చెప్పాలని కోరడమైనది :-)))

    రిప్లయితొలగించండి
  5. ఆహా!ఎంత సులభంగా మీ తరహాలో హాస్యంగా చెప్పేశారండీ!

    జెండాకూర - భలే పేరు పెట్టారు.

    మీరు చెప్ప్లిన పద్ధతులు అన్ని కూరగాయలకు వాడచ్చు!
    నేనైతే అల్లం+పచ్చిమిర్చి స్టైలు ఉత్తరభారత వంటలకి, ఎండుమిర్చి+పోపు దక్షిణ వంటలకి వాడతాను.

    మీ జెండాకూరతో నేను ఇంకో వెరైటీ చేస్తా - ఆ జెండాకూర బాండీలోనే అన్నం కలిపి, మసాలాలు కలిపి, 'మిక్స్ వెజ్ రైస్' అని పేరు పెట్టి ఇంట్లోని జనాలమీద వదులుతా.

    రిప్లయితొలగించండి
  6. అబ్బో మురళి గారు పాకశాస్త్ర ప్రవీణులే ..:)

    రిప్లయితొలగించండి
  7. ఇవి ముందు మనమే రుచి చూడాలా? పక్క వాడు చూసిన తరువాత మనం ధైర్యం చెయ్యాలా? చెప్పారు కాదు.....దహా.

    రిప్లయితొలగించండి
  8. కూర సంగతి తర్వాత చూద్దాం కానీ కారట్, బీన్స్ అంత అందంగా ఎలా తరగాలో ఓ టపా రాద్దురూ. :)

    రిప్లయితొలగించండి
  9. మగవాళ్ళు ఇంత సులువుగా వంట చేస్తారని అనుకోలేదు సుమండీ . శిశిర గారు అడిగినట్టు కూరకన్న కార్రేట్ , బీన్స్ ముక్కలు చూస్తుంటే నోరూరిపాయిందనుకోండి .

    రిప్లయితొలగించండి
  10. వంట చేయడం ఇంత సులువు అన్నట్టు రాసేస్తే ,వంట గదిలో తెగ కష్ట పడిపోతున్నట్టు నటించే మా లాంటి ఆడాళ్ళు అందరూ ఎమైపోతారండి ?

    రిప్లయితొలగించండి
  11. @రాధిక (నాని): అవునండీ... చాలా సింపుల్ గా అయిపోయే కూరలు.... ధన్యవాదాలు...

    @చాతకం : అది బిర్యానీ కాదండీ, ఫ్రైడ్ రైస్ అవుతుంది కదా :-) ...ధన్యవాదాలు

    @నిషిగంధ: ఫోటో బాగా వచ్చిందండీ, అంతే :) ధన్యవాదాలు...

    రిప్లయితొలగించండి
  12. @వేణూ శ్రీకాంత్: హమ్మయ్య!! నేను మరీ సవివరంగా రాసేశానేమో అని అనుమానిస్తూ ఉండగా మీ వ్యాఖ్య... ఇంకా సందేహాలకి తావు ఉందన్న మాట!! టమాటా లే కాబట్టి ఓ వేపు ఎక్కువైనా, తక్కువైనా పెద్దగా ఇబ్బంది ఉండదు లెండి :-) ధన్యవాదాలు..

    @జేబీ: మిక్స్ వెజ్ రైస్ ప్రయోగం నేనూ చేస్తూనే ఉంటానండీ... అన్నీ ఒకే టపాలో ఎందుకూ అని ప్రస్తావించలేదు అంతే :-) ధన్యవాదాలు

    @ధాత్రి: దీన్ని ప్రావీణ్యం అంటారా అండీ? :-) ధన్యవాదాలు...

    రిప్లయితొలగించండి
  13. @బులుసు సుబ్రహ్మణ్యం: ఇల్లాలి వంట మొదట రుచి చూసేది ఇంటాయనే అవుతాడు కదండీ...కాబట్టి వైస్ వెర్సా చేసేయడమే.. ఏమో, ఎవరికి తెలుసు? ఏ కూరలో ఏ అదృష్టం దాగి ఉందో :-) :-) ...ధన్యవాదాలు

    @శ్రావ్య వట్టికూటి: ధన్యవాదాలండీ...

    @శిశిర: అబ్బా... టపా వరకూ ఎందుకండీ.. చాకుని తిన్నగా కాకుండా, కొంచం వంకరగా పెట్టి తరిగేయడమే :-) ..ధన్యవాదాలు...

    రిప్లయితొలగించండి
  14. @శారదా విభావరి: ధన్యవాదాలండీ...

    @సుధ : ఆడవాళ్ళ కష్టాన్ని గురించి కామెంట్ చేసే మగదూర్ ఎవరికీ లేదు కాబట్టి, ఏమీ పర్లేదండీ :-) :-) ...ధన్యవాదాలు...

    రిప్లయితొలగించండి
  15. చాలా బాగా రాశారండి. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి