మంగళవారం, అక్టోబర్ 30, 2012

రెండు సన్నివేశాలు

మనకి ప్రియమైన వ్యక్తిని మరొకరికి అప్పగించడం అన్నది ఎంతో వేదనతో కూడుకున్న విషయం. ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడూ, ఆపై అప్పగింతలప్పుడూ తల్లి మాత్రమే బాధ పడదు. తండ్రి కూడా బాధ పడతాడు. నిజానికి తల్లి కన్నా ఎక్కువే బాధ పడతాడు కానీ, బయట పడడు. మన సమాజం మగవాడికి విధించిన కనిపించని కట్టుబాట్ల ఫలితం ఇది. తాళి కట్టిన భార్యనో, పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్న ప్రియురాలినో మరొకరికి శాశ్వతంగా అప్పగించాల్సిన పరిస్థితే వస్తే, ఆ మగవాడి పరిస్థితి వర్ణనాతీతమే.

వెండితెర సాక్షిగా రెండు సన్నివేశాలు. రెంటినీ రూపు దిద్దిన దర్శకుడు ఒక్కరే. కళాతపస్వి కే. విశ్వనాథ్. రెండు సినిమాలూ ఏడాదిన్నర తేడాతో విడుదలై, ప్రేక్షకుల మీద తమవైన ముద్ర వేసినవే. వీటిలో మొదటిది 'సప్తపది.' వర్ణ వ్యవస్థని ఇతివృత్తంగా తీసుకుని విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఓ సద్బ్రాహ్మణ నాట్యాచార్యుడి కూతురు హేమ ఓ నర్తకి. తన బృందంలోని వేణు గాన కళాకారుడు హరిబాబుతో ప్రేమలో పడుతుంది ఆమె. తన ప్రేమని వ్యక్త పరిచాక, హరిబాబు ఓ హరిజనుడనీ, తన ప్రేమకోసం కులాన్ని దాచిపెట్టాడనీ తెలుస్తుంది హేమకి. అయినా ఆమె ప్రేమలో ఏ మార్పూలేదు.

హేమ మాతామహుడు యాజులు గారికి కులం పట్టింపు ఎక్కువ. స్వకులం వాడే అయినా అల్లుడు నాట్యాచార్యుడు కావడంతో కూతురి పెళ్లి అభ్యంతరం ఆయనకి. కూతురు మరణించినా రెండు కుటుంబాల మధ్యనా దూరం అలాగే ఉంటుంది. హేమ నాట్య ప్రదర్శన చూసిన యాజులు గారి ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుంది. స్నేహితుడు రాజు గారు కూడా ఇందుకు కొంత కారణం. హేమని తన మనవడు (కొడుకు కొడుకు) గౌరీనాధానికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. కూతురి ప్రేమ విషయం తెలియని హేమ తండ్రి, ఆమెతో సంప్రదించకుండానే పెళ్ళికి అంగీకరిస్తారు.

పరంపరాగతంగా వచ్చిన అర్చక వృత్తిలో స్థిరపడ్డ గౌరీనాధుడు, తాతగారి మాటప్రకారం హేమని పెళ్లి చేసుకుంటాడు. కానీ కాపురం చేయలేకపోతాడు. ఆమె భార్యగా కాక తను పూజించే పర దేవతగా కనిపిస్తుంది అతనికి. కారణాలు అన్వేషిస్తుండగా, హేమ ప్రేమ విషయం తెలుస్తుంది అతనికి. హరిబాబుని తీసుకు వచ్చి అతనికి హేమని అప్పగిస్తాడు. ఊరివారిని ఎదిరించి మరీ, మనవడి నిర్ణయాన్ని సమర్ధిస్తారు యాజులు గారు. సినిమా ముగింపు సన్నివేశంలో, హరిబాబుని పడవలో తీసుకు వచ్చిన గౌరీనాధం, తను మాత్రం ఒడ్డునే నిలబడి ఉంటాడు. మంగళ వాయిద్యాలు, చీర సారెలతో తాతయ్య వెంట రేవుకి వస్తుంది హేమ.

తాతయ్య కాళ్ళకి నమస్కరించి సెలవు తీసుకుని, పడవలో ఉన్న తను ప్రేమించిన వాడిని చేరుకోవాలి ఆమె. రేవు ఒడ్డున తనకి తాళి కట్టినవాడు. అగ్నిసాక్షిగా పెళ్ళాడినా భర్త కాలేక పోయినవాడు. అయినప్పటికీ, తన మనసు తెలుసుకున్న వాడు. అతని నుంచి వీడుకోలు తీసుకోడం ఎలా? అప్పటికే కొంగు భుజం చుట్టూ కప్పుకున్న హేమ తల వంచుకునే నమస్కరిస్తుంది గౌరీనాధానికి. ఒక్కసారి కళ్లెత్తి, రెండు చేతులూ పైకెత్తి నవ్వుతూ తనని ఆశీర్వదిస్తున్న గౌరీనాధాన్ని చూస్తుంది. హేమకే కాదు సినిమా చూస్తున్న ప్రేక్షకులకి కూడా ఆ క్షణంలో గౌరీనాధుడు గాలిగోపురం అంత ఉన్నతంగా కనిపిస్తాడు.


'సప్తపది' విడుదలైన రెండేళ్ళ లోపుగానే కళాతపస్వి నుంచి వచ్చిన మరో కళాత్మక చిత్రం 'సాగర సంగమం.' కథా నాయకుడు బాలూ, నాట్యాన్ని ప్రేమించిన వాడు. నాట్యాన్ని తప్ప మరి దేనినీ ప్రేమించని వాడూను. అంతటి వాడూ మాధవి ప్రేమలో పడతాడు. ఆమె తన పక్కన ఉంటే చాలు అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా ఆమెకి తన ప్రేమని ప్రతిపాదిస్తాడు. మాధవి వివాహిత. తాళి కట్టిన భర్త గోపాలరావు ఆమెని ఏలుకోలేదు. పెళ్లి పీటల మీదే వదిలేసి వెళ్లి పోయాడు. ఆమె ఆ గాయాన్ని మాన్పుకునే ప్రయత్నంలో ఉండగానే బాలూ పరిచయమయ్యాడు.

బాలూ ప్రతిపాదనని మాధవి అంగీకరించ బోతున్నతరుణంలో ఆమె జీవితంలో తిరిగి ప్రవేశిస్తాడు గోపాలరావు. బాలూ-మాధవిల ప్రేమని గ్రహిస్తాడు అతడు. నిండు మనసుతో వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలనీ అనుకుంటాడు కూడా. వాళ్ళని ఒకటి చేసి తను కెనడా వెళ్లిపోవాలి అన్నది అతని ఆలోచన. కానీ, బాలూ ఆలోచన వేరు. ప్రేమ కన్నా తాళికి విలువ ఇవ్వాలి అనుకుంటాడు. మాధవి, గోపాలరావుకి చెందడమే న్యాయం అనుకుంటాడు. అందుకు ఆమెని ఒప్పిస్తాడు. మాధవి, కాపురానికి కెనడా వస్తోందని గోపాలరావుకి చెబుతాడు.

ఆవేళ మాధవి ప్రయాణం. రైల్లో లగేజీ సద్దుకుంటూ ఆమె, టికెట్ కలెక్టర్ తో మాట్లాడుతూ ఆమె భర్త. అప్పుడు స్టేషన్ కి వస్తాడు బాలూ. చేతిలో ఓ కెమెరా. తనకి మాధవిని పరిచయం చేసిన కెమెరా. గోపాలరావుని అనుమతి కోరతాడు, ఫోటో కోసం. బాలూ, మాధవితో ఫోటో దిగుతాడనుకుని అందుకు సమ్మతిస్తాడు గోపాలరావు. కానీ, బాలూకి కావాల్సింది మాధవి-గోపాలరావుల ఫోటో. అతను ఫోటో తీసుకున్నాక రైలు కదలడానికి సిద్ధ పడుతున్న వేళ, బోగీ గుమ్మంలో భర్త పక్కన నిలబడి బాలూకి నమస్కరిస్తుంది మాధవి. ఆమె కళ్ళలో కనిపించేది కృతజ్ఞత మాత్రమేనా?

మరి బాలూ స్పందన ఏమిటి? తను చేసిన పని మంచిదనే అతను అనుకుంటున్నాడు. కానీ, ఆ పని మనస్పూర్తిగా చేశాడా? మాధవిని వదులుకోడానికి అతను సిద్ధంగానే ఉన్నాడా? ఆ క్షణంలో బాలూని చూసిన ప్రేక్షకులకి అతని మీద జాలీ, బాధా, కోపమూ ఏకకాలంలో కలుగుతాయి. రైల్లో వెళ్ళిపోయిన మాధవి, స్టేషన్లో మిగిలిపోయిన బాలూ చెరగని ముద్ర వేసేస్తారు ప్రేక్షకుల మనసుల్లో.


ఈ రెండు సన్నివేశాల్నీ తెరకెక్కించిన విశ్వనాథ్ ని మాత్రమే కాదు, రెండు సినిమాలకీ సంభాషణలు అందించిన జంధ్యాలనీ అభినందించి తీరాలి. ప్రత్యేకించి ఈ రెండు సన్నివేశాలకీ ఎలాంటి సంభాషణలూ రాయనందుకు.. మాటల కన్నా, మౌనమే శక్తివంతంగా పని చేసే సందర్భాల్ని గుర్తించినందుకు...

(టపా ఆలోచనని ప్రోత్సహించి, ఫోటోలు సమకూర్చిన బ్లాగ్మిత్రులు కొత్తావకాయ గారికి కృతజ్ఞతలు...)

18 కామెంట్‌లు:


  1. సంగీత దర్శకులని మర్చిపోయారు.. మొదటి సన్నివేశం అంత గమనించలేదు కానీ రెండవ సన్నివేశానికి ఇళయరాజా ప్రాణం పోశారు .. మీరు చెప్పిన సన్నివేశం కళ్ళల్లో కదలగానే ఇళయరాజా ఇచ్చిన సంగీతం (BGM) గుండెల్లో మెదులుతుంది .

    రిప్లయితొలగించండి
  2. కాన్సెప్ట్ చాలా బావుందండీ.. మీ పరిశీలన కూడా!!
    ఈ ఆఖరిమాటలు అంతకంటే ఎక్కువగా.......

    "ఈ రెండు సన్నివేశాల్నీ తెరకెక్కించిన విశ్వనాథ్ ని మాత్రమే కాదు, రెండు సినిమాలకీ సంభాషణలు అందించిన జంధ్యాలనీ అభినందించి తీరాలి. ప్రత్యేకించి ఈ రెండు సన్నివేశాలకీ ఎలాంటి సంభాషణలూ రాయనందుకు.. మాటల కన్నా, మౌనమే శక్తివంతంగా పని చేసే సందర్భాల్ని గుర్తించినందుకు..."

    :-)

    రిప్లయితొలగించండి
  3. చాలా చక్కగా చెప్పారండీ. నేను సప్తపది సరిగా చూడలేదుకానీ, సాగరసంగమం ఈ మధ్యే చూసాను. అందులో ఎన్ని సీనులు విశ్వనాథ్ గారు ఎంత ఆలోచించి తీసారో అనిపిస్తుంది. నాకు బాగా గుర్తుండిపోయింది "తకిట తథిమి" పాట చివరలో జయప్రద బొట్టుపెట్టుకుని వస్తుంది. అలా పెట్టుకోవటాని ఆవిడ ఎంత మధనపడిందో మనిని ఒక్క dialog లేకుండా చూపించారు డైరెక్టర్ గారు!

    మంచి సన్నివేసారు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  4. మీరు చెప్పిన రెండు సన్నివేశాలలో రెండో సినిమా సాగర సంగమం చూసి ఉన్నాను. జయప్రద కి పెళ్లి సమయంలో ఏదో గొడవలు వచ్చి ఆ పెళ్ళికొడుకు వెళ్లి పోతాడు. ఆతర్వాత ఏ కబురూ ఉండదు. కమల హాసన్ తో పరిచయం , ఆమె మనసులో అతని పట్ల ఇష్టం పెరగటం, అతనికీ ఆమెను తన జీవిత భాగస్వామిగా స్వీకరించాలన్నంతగా ఇష్టం ఏర్పడడం అంతా బాగానే ఉంది. కాని సదరు పెళ్లి కొడుకు తిరిగి రాగానే తాళికి విలువ అంటూ కమల్ ఆమెను అతనికి అప్పచెప్పటం, ఆ పెళ్లి కొడుకు వీళ్ళ మధ్య ఉన్న ప్రేమను అర్థం చేసుకొని వాళ్ల ఇద్దరి జీవితాలని కలపాలని అనుకోవటం, ఇద్దరూ ఆమె నీకే సొంతం అంటే, నీకే సొంతం అని వంతులు వేసుకోవటం మరీ డ్రమాటిక్ గా ఉంది. మధ్యలో జయప్రద మనస్సులో ఎవరు ఉన్నారో, ఎవరితో ఆమె జీవితం పంచుకోవాలనుకుంటుందో ఆ విషయం అస్సలు ఎవరూ పట్టించుకోరు. దసరా బుల్లోడు సినిమాలో లాగా వాడు నీ వాడే, కాదు నీవాడే అని చంద్రకళ వాణిశ్రీ లు పాడినట్లు డైలాగులు. కాక పోతే ఇక్కడ జెండర్ మారింది అంతే.

    రిప్లయితొలగించండి
  5. నాకు ఆ సప్తపది సినిమా ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుందండీ,అది చూసిన వెంటనె సాగర సంగమం చూడాలనిపిస్తుంది అంతే చూసేస్తాను.

    పైన వాసు గారు చెప్పినట్లు సంగీత దర్శకుడి ప్రతిభ కూడా చెప్పుకోవాలండోయ్ ముఖ్యంగా ఆ సాగర సంగమం సినిమా సన్నివేశం విషయంలో.

    రిప్లయితొలగించండి
  6. నాకు కనబడిన అసంబద్ధతను గౌరి కృపానందన్ గారు స్పష్టంగా చెప్పారు. జయప్రద భర్త తిరిగి వచ్చాక, కమలహాసన్ ఒక్కమాటతో ఆమెను కన్విన్స్ చేసి, తన దారిని తను వెళ్ళిపోయి ఉండవచ్చు. సముద్రం ఒడ్డున డిస్కషన్స్, ఆమె నీకు దక్కాలి, కాదు నీకు, అతను ఫుటోలు తీసుకోవడం ఇదంతా 'ప్రేమ ' ను గ్లోరిఫై చేయడానికి చేసిన వృథా ప్రయాసలా ఉంది.

    రిప్లయితొలగించండి
  7. ఒకే దర్శకుని సిమాలలో పోలికలున్న రెండు సన్నివేశాలను (ఒక రకంగా పరస్పరం వ్యతిరేకమైనవి) బాగా పట్టుకున్నారు!

    >>ఆ క్షణంలో బాలూని చూసిన ప్రేక్షకులకి అతని మీద జాలీ, బాధా, కోపమూ ఏకకాలంలో కలుగుతాయి

    నాకు మాత్రం కోపం, ఈసడింపూ కలుగుతాయి. ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి కష్టాలు పడితే, బాధో జాలో కలుగుతుంది. కాని యీ సినిమాలో కథానాయకుడిది బలహీనమైన వ్యక్తిత్వం. అతి అమాయకత్వం, అర్థంలేని మొండితనం. గొప్ప కళాకారుడన్న ఒకే ఒక్క కారణం వల్ల అతని లోపాలన్నిటినీ క్షమించెయ్యగల విశాల హృదయం నాకు లేదు! :) అలాగే జయప్రద పాత్ర చిత్రణ కూడా ఏమాత్రం సవ్యంగా లేదు. చదువుకున్నదీ, స్వతంత్ర ప్రవృత్తి కలిగినదీ, కాస్తోకూస్తో తెలివైనదీ అయిన ఆమె, కమలహసన్ని యిష్టపడికూడా, మౌనంగా భర్తతో వెళ్ళిపోవడం అర్థంలేని విషయం. సినిమా అంతా యీ పాయింటు మీద ఆధారపడి నడవడం వల్ల సినిమా కథ నాకు బొత్తిగా నచ్చలేదు. సప్తపది సినిమా కథనంలో ఉన్న బిగువు సాగరసంగమంలో లేదు. సప్తపదిలో కథానాయకుడు లేడు, కథ ఉంది. సాగరసంగమంలో కథానాయకుడు కథని మింగేసాడు!

    రిప్లయితొలగించండి
  8. నేను నాస్నేహితులతో తరచుగా మాట్లాడే అంశమిది. మీపోస్టు చదువుతుంటే కొద్దిగా అశ్చర్యం, ఆనందం కలిగింది.

    నాటకీయత శిఖరాగ్రానికి తీసుకెళ్లడంలో విశ్వనాధ్ మిగతావాళ్లలో ప్రత్యేకం. కానీ ఆయనెంత కష్టమైన సబ్జెక్టిచ్చినా ఆలవోకగా రాసిపడేసే జంధ్యాల ఒకవరంలా దొరికాడు.

    రిప్లయితొలగించండి
  9. ఎందుకో మొన్నే ఎ రెండు సినిమాలు youtubeలో పెట్టుకుని మరీ చూసాను.ఇవ్వాళా మీ తప చదువుతున్న.nice post

    రిప్లయితొలగించండి
  10. అర్జంటుగా రెండు సినిమాలని మరోసారి చూడాలనిపించేలా రాశారు...చూస్తాను కూడా.

    రిప్లయితొలగించండి
  11. రెండు సన్నివేశాలగురించీ చాలాబాగా రాశారు మురళి గారు, ముఖ్యంగా మీరు చివరిలో చెప్పినట్లు మౌనానికి ప్రాముఖ్యతనిచ్చి నేపద్యసంగీతం తో ఎలివేట్ చేయడం అద్భుతం.

    రిప్లయితొలగించండి
  12. @వాసు: నిజమేనండీ.. కానైతే 'సాగర సంగమం-నేపధ్య సంగీతం' అని ఓ టపా రాసే ఆలోచన ఉంది.. చూడాలి ఎప్పటికి అవుతుందో :-) ..ధన్యవాదాలు..
    @నిషిగంధ: అవునండీ... ఈ రెండు సన్నివేశాలనే కాదు, మొత్తం మీద రెండు సినిమాల్లోనూ సంభాషణలు తక్కువే... ధన్యవాదాలు..
    @బిందు: అవునండీ... తర్వాతి సన్నివేశం లో బాలూ (కమల్) తన చేతిని అడ్డు పెట్టడం పదేపదే చూశాను, వీసీఆర్ రోజుల్లో :-) ... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @గౌరి @రవి @కామేశ్వర రావు భైరవభట్ల: 'సాగర సంగమం' లో మాధవి పెళ్లి సన్నివేశాన్ని నేను యేరీతిగా అర్ధం చేసుకున్నానో కొంచం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మాధవి సంప్రదాయాలని గౌరవించే, స్వతంత్ర ఆలోచనలు ఉన్న అమ్మాయి. డేన్స్ ఫెస్టివల్ లో బాలూ ప్రోగ్రాం ఏర్పాటు చేయించడాన్ని గురించి ఏ సంకోచమూ లేకుండా తండ్రితో మాట్లాడ గలిగిన ఆమె, అతన్నే పెళ్లి చేసుకుంటాను అని స్థిరంగా చెప్పగలదు. కానీ ఆపని చేయలేదు. బాలూ తనని ప్రేమిస్తున్నానని చెప్పిన వెంటనే ఆమె ఆ ప్రేమకి అవునని చెప్పలేదు, ఆలోచనలో పడింది. సందేహాలని వదులుకుని - అదే సమయంలో అతని బాధ చూడలేక (బీచ్ లో నృత్యం) - అవునని చెప్పేందుకు సిద్ధ పడింది. అప్పుడే భర్త కనిపించడంతో తత్తర పడింది. బాలూ తో గుడికి వెళ్ళినప్పుడు, అతను చెప్పిన మాటలకి పూర్తిగా కన్విన్స్ కాగలిగింది కాబట్టే, గులాబీని తీసి తన పెళ్లి ఆల్బం మీద ఉంచింది. సంభాషణలు తక్కువగా ఉండడం వల్ల, కొంత స్పష్టత లోపించి ఉంటుంది బహుశా. ఇక బాలూది పాసివ్ పాత్ర. విలువల్ని పాటించే పాత్ర (డ్యాన్స్ మాస్టర్ దగ్గర ఉద్యోగం మానేయడం). అతను ఆమెని వదులుకో గలగడంలో ఆశ్చర్యం లేదు. దర్శకుడి ఉద్దేశ్యం ఇదే అయి ఉండక పోవచ్చు కానీ, నాకు ఇలా అర్ధమయ్యిందండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. @శ్రీనివాస్ పప్పు: నిజమండీ... 'సప్తపది' ఎన్నిసార్లు చూసినా నాకూ విసుగు రాదు.. ఇంట్లో విసుక్కుంటారు కానీ :( ... ధన్యవాదాలు..
    @సుబ్రహ్మణ్య చైతన్య: విశ్వనాధ్-జంధ్యాల ఓ అద్భుతమైన కాంబినేషన్ అండీ... మళ్ళీ మళ్ళీ చూడదగ్గ సినిమాలు ఇచ్చారు.. ధన్యవాదాలు..
    @స్వాతి: ధన్యవాదాలండీ...

    రిప్లయితొలగించండి
  15. @నరేందర్ జవ్వాజి: చూడండి.. చూడండి.. నేనూ చూడాలి మళ్ళీ :-) ..ధన్యవాదాలు..
    @వేణూ శ్రీకాంత్: అవునండీ... దర్శకుడితో పాటు రచయితకీ క్రెడిట్ ఉంది కదా... ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  16. //ఆ క్షణంలో బాలూని చూసిన ప్రేక్షకులకి అతని మీద జాలీ, బాధా, కోపమూ ఏకకాలంలో కలుగుతాయి.//
    గౌరవం కూడా.
    ఆ సన్నివేశం గుర్తొస్తే ఇళయరాజా ఆ ఇద్దరి అనుబంధానికి ఇచ్చిన సిగ్నేచర్ ట్యూన్ నా మనసులో మార్మ్రోగుతుంది.ఆ సినిమా ఇష్టపడేవారెవరికైనా అది గుర్తుండే ఉంటుందనుకుంటా.

    రిప్లయితొలగించండి
  17. //కమలహాసన్ ఒక్కమాటతో ఆమెను కన్విన్స్ చేసి, తన దారిని తను వెళ్ళిపోయి ఉండవచ్చు. సముద్రం ఒడ్డున డిస్కషన్స్, ఆమె నీకు దక్కాలి, కాదు నీకు, అతను ఫుటోలు తీసుకోవడం ఇదంతా 'ప్రేమ ' ను గ్లోరిఫై చేయడానికి చేసిన వృథా ప్రయాసలా ఉంది. //
    రవి గారూ
    సలా ఏ ప్రేమికుడు వెళ్ళిపోలేడు. అది గ్లోరిఫై చెయ్యడం కాదు. వాస్తవం.

    రిప్లయితొలగించండి
  18. @పక్కింటబ్బాయి: అవునండీ... ఒక ట్యూన్ తో సినిమా తాలూకు మూడ్ క్రియేట్ చేయడం ఇళయరాజా స్పెషాలిటీ.. 'సితార' లో కూడా ఇలాగే...... ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి