మంగళవారం, మార్చి 13, 2012

పాకుడురాళ్ళు

సినిమా.. ఓ రంగుల ప్రపంచం. తమని తాము వెండి తెర మీద చూసుకోవాలన్నది లక్షలాదిమంది కనే కల. కానీ ఆ కల నెరవేరేది ఏ కొద్ది మందికో మాత్రమే. పేరు ప్రఖ్యాతులు, వద్దన్నా వచ్చి పడే డబ్బు, సంఘంలో గౌరవ మర్యాదలు, పలుకుబడి.. వీటన్నింటినీ తెచ్చిపెట్టగల శక్తి సినిమా అవకాశానికి ఉంది. అందుకే, సినిమాలన్నా, సినిమా వాళ్ళన్నా ఆసక్తి చూపించని వాళ్ళు అరుదు. ఇప్పుడంటే గాసిప్ వెబ్సైట్ల పుణ్యమా అంటూ సినిమా వాళ్ళ జీవితాలు తెరిచిన పుస్తకాలు అయిపోయాయి కానీ, ఓ నలభై-యాభై ఏళ్ళ క్రితం అంతా రహస్యమే.. తెర వెనుక జరిగేదేదీ తెరమీద సినిమా చూసే ప్రేక్షకుడికి తెలిసేది కాదు.

అలాంటి సమయంలో, సినిమా రంగంలో తెర వెనుక జరిగే రాజకీయాలనీ, ఎత్తులనీ, పై ఎత్తులనీ తమ పట్టు నిలుపుకోవడం కోసం రకరకాల వ్యక్తులు చేసే ప్రయత్నాలనీ నవలా రూపంలో అక్షరబద్ధం చేశారు రచయిత రావూరి భరద్వాజ. 'పాకుడురాళ్ళు' నవల, కేవలం 'మంజరి' గా మారిన మంగమ్మ కథ మాత్రమే కాదు, తెలుగులో సినిమా నిర్మాణం ఊపందుకున్న రోజుల్లో ఆ పరిశ్రమలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిదీ కూడా. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ కూడా, అవసరార్ధపు స్నేహాలు నటించే ఇద్దరు అగ్ర హీరోలు, అగ్ర నాయికగా ఎదిగాక, అగ్ర హీరోలతో నటించనని ప్రకటించి కొత్త నాయకులని పరిచయం చేసే నాయిక, సినిమా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి పబ్బం గడుపుకునే జర్నలిస్టూ.... ఇలా ఎందరెందరిదో కథ ఇది.

కథా స్థలం గుంటూరు సమీపంలో ఓ పల్లెటూరు. కథా కాలం పద్య నాటకాలు అంతరించి, సాంఘిక నాటకాలు అంతగా ఊపందుకోని రోజులు. నాటకాలంటే ఆసక్తి ఉన్న మాధవరావు, రామచంద్రం కలిసి 'నవ్యాంధ్ర కళామండలి' ప్రారంభించి సాంఘిక నాటకాలు ప్రదర్శించాలి అనుకుంటారు. వాళ్ళ నాటకాల్లో స్త్రీ పాత్రలు ధరించడం కోసం వస్తుంది పదిహేనేళ్ళ మంగమ్మ. బళ్ళారి రాఘవ ట్రూపులో పనిచేశానని చెప్పుకునే నాగమణి పోషణలో ఉంటుంది మంగమ్మ. అప్పటికే మంగమ్మ మీద సంపాదన ప్రారంభించిన నాగమణి, నాటకాల్లో అయితే ఎక్కువ డబ్బు రాబట్టుకోవచ్చునని ఈ మార్గం ఎంచుకుంటుంది. మాధవరావు-రామచంద్రం తర్ఫీదులో మంచి నటిగా పేరు తెచ్చుకుంటుంది మంగమ్మ. కళామండలి కి మంచి పేరు రావడంతో, నాగమణి కి కొంత మొత్తం చెల్లించి మంగమ్మని చెర విడిపిస్తారు మిత్రులిద్దరూ.

కొంతకాలానికి కళామండలి మూతపడే పరిస్థితి వస్తుంది. మంగమ్మ, నాగమణి 'కంపెనీ' కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా మద్రాసు నుంచి వచ్చిన పాత మిత్రుడు చలపతి తనో సినిమా తీస్తున్నాననీ, మంగమ్మ అందులో నాయిక అనీ చెప్పి ఆమెని మద్రాసు తీసుకెడతాడు. చలపతి సినిమా తీయకపోయినా, మంగమ్మకి వేషాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తాడు. స్వతహాగా తెలివైనదీ, మగవాళ్ళని కాచి వడపోసినదీ అయిన మంగమ్మ సైతం -మొదట్లో ఆసక్తి చూపకపోయినా, సినిమా హీరోయిన్ల వైభవం, ఐశ్వర్యం చూశాక తనుకూడా హీరోయిన్ కావాల్సిందే అని నిర్ణయించుకుని తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఈ క్రమంలో, ఓ సిద్ధాంతి సూచన మేరకి తన పేరు మంజరి గా మార్చుకుంటుంది. వేషాలు రానప్పుడూ, చివరివరకూ వచ్చి జారిపోయినప్పుడూ మంజరి నిర్ణయం మరింత పదునెక్కుతూ ఉంటుంది.

మెల్లగా అవకాశాలు సంపాదించుకుని, నాయికగా పేరు తెచ్చుకుని తక్కువ కాలంలోనే అగ్రశ్రేణి నాయిక అవుతుంది మంజరి. అనుకున్నది సాధించాక ప్రపంచాన్నిలెక్కచెయ్యదు మంజరి. చలపతిని కేవలం ఓ సెక్రటరీగా మాత్రమే చూస్తుంది. నిర్మాతలని అక్షరాలా ఆడిస్తుంది. అయితే, తనని తీర్చిదిద్దిన మాధవరావు-రామచంద్రం మీద, కష్టకాలంలో తనని ఆదుకున్న వాళ్ళమీదా అంతులేని కృతజ్ఞత చూపుతుంది మంజరి. నవల పూర్తి చేసి పక్కన పెట్టినా, మంజరి ఓ పట్టాన ఆలోచనల నుంచి పక్కకి వెళ్ళకపోడానికి కారణం రచయిత ఆ పాత్రని చిత్రించిన తీరు. కథ పాకాన పడేసరికి, మంజరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా "ఈమె దీనిని ఏరకంగా ఎదుర్కొంటుంది?" అన్న ఉత్కంఠ, పేజీలు చకచకా కదిలేలా చేస్తుంది. పాఠకులని ఎక్కడా నిరాశ పరచదు మంజరి.

అగ్రహీరోలతో కయ్యం పెట్టుకుని, దానివల్ల తనకి పోటీగా మరో నాయిక తయారవుతున్నప్పుడు కయ్యాన్ని నెయ్యంగా మార్చుకున్నా, తనని సినిమా నుంచి తీసేయాలని ప్రయత్నించిన నిర్మాతకి ఊహించని విధంగా షాక్ ఇచ్చినా మంజరికి మంజరే సాటి అనిపించక మానదు. గుర్రాప్పందాల మీద లక్షలు నష్టపోయినా కొంచం కూడా బాధ పడదు కానీ, ఎవరన్నా డొనేషన్ అంటూ వస్తే రెండో ఆలోచన లేకుండా తిప్పి పంపేసి మళ్ళీ రావొద్దని కచ్చితంగా చెప్పేస్తుంది. తెలుగులో అగ్రస్థానంలో ఉండగానే, హిందీ అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెడుతుంది మంజరి. ఇందుకోసం తన కాంటాక్ట్స్ ని తెలివిగా వాడుకుంటుంది. అంతేనా? భారదేశం తరపున సాంస్కృతిక రాయబారిగా అమెరికా వెళ్ళిన తొలి తెలుగు నటి మంజరి. అక్కడ మార్లిన్ మన్రో ని కలుసుకున్న మంజరి, సిని నాయికలందరి జీవితాలూ ఒకేలా ఉంటాయన్న సత్యాన్ని తెలుసుకుంటుంది.

మంజరి తర్వాత ప్రాధాన్యత ఉన్న మరో నాయిక కళ్యాణి. సీనియర్ హీరోయిన్. మంజరి అంటే చాలా ప్రేమ కళ్యాణికి. సొంత చెల్లెలికన్నా ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది. ఆద్యంతం ఆసక్తిగా అనిపించే మరో పాత్ర చలపతి. అవ్వడానికి చలపతి 'కింగ్ మేకర్' అయినా, మంజరి తనని నిర్లక్ష్యం చేసినప్పుడు సైతం ఆమెని వెన్నంటే ఉంటాడు. మంజరితో జీవితం పంచుకోవాలన్న ఆలోచన కానీ, ఆమె సంపాదన సొంతం చేసుకోవాలన్న ఆలోచన కానీ చలపతికి ఉన్నట్టు కనిపించదు. ఆత్మాభిమానం విషయంలో రాజీ పడని, ఆ విషయం బయట పడనివ్వని, చలపతి ఓ చిత్రమైన పాత్ర అనిపించక మానదు. నవల ఆసాంతమూ ఎంతో ఆసక్తిగా తీర్చిదిద్దిన భరద్వాజ ముగింపు విషయంలో నిరాశ పరిచారు నన్ను. 'ఈ తరహా కథలకి ఇలాంటి ముగింపే ఉండాలి' అన్నట్టుగా ముగించారు మంజరి కథని. (విశాలాంధ్ర ప్రచురణ, పేజీలు 506, వెల రూ. 200,
ఏవీకెఎఫ్ లోనూ లభ్యం).

18 కామెంట్‌లు:

  1. మంచి నవలని..చాలా చక్కగా పరిచయం చేసారు..మురళీ గారు. అందరు తప్పకుండా చదవాల్సిన నవల ఇది.
    పై పై కి ఎగబ్రాకలేక జారి పడే.. వారి కథ లు కి ఈ నవల చక్కని తార్కాణం.

    రిప్లయితొలగించండి
  2. ఎప్పటిలాగే పరిచయం చక్కగా చిక్కగా (అంత పెద్ద కథని ఇంత చిన్న వ్యాసం లోకి .. ) ఉంది ..

    కథ చదువుతున్నప్పుడే ఇదేదో బరువైన పుస్తకం అనుకున్నా .. పేజీలు: 502 అని కనపడగానే నిజమని తెలుసుకున్నా .



    హడావుడి గా రాసినట్టున్నారు ఒకటి రెండు అచ్చుతప్పులు కనపడ్డాయి ..
    ఇది భలే ఉంది ..
    " కష్టకాలంలో తనని ఆడుకున్న వాళ్ళమీదా అంతులేని కృతజ్ఞత చూపుతుంది మంజరి. "

    రిప్లయితొలగించండి
  3. మరో ఆసక్తికరమైన సమీక్ష! వెంటనే కొని చదవాలనిపించేలా రాసారు. ముగింపు మరీ సినిమాటిక్ గా ఉందా ఏవిటీ? :)

    రిప్లయితొలగించండి
  4. చాల ఏళ్ల క్రితమే .ఈ పుస్తకం, కొని చదివి, అందరికి ఇచ్చి, చదివించి, ఇది ఎవరి జీవితం అయి ఉంటుంది? అని తర్జన భర్జనలు చేసిన జ్ఞాపకం రేపింది, మీ పరిచయం. రావూరి భరద్వాజ గారి మగ్నుం ఒపుస్ ఇది. ఇది ఒక్కటే ,నాకు తెలిసి ఆయన నవల, మిగిలనవి కథలు అయి ఉండొచ్చు..పేరు లోనే పాకుడు రాళ్ళు..అంటే, ముగింపు అర్ధం అయిపోతుంది, పైకే ఎగబాకి, చివరాఖరికి, ఎలా జారి పోతారో? అందులో ఆ రోజుల్లో, ఇంత ముందు చూపు లేదు ,ఇప్పుడు కొంత నయం..వెనక వేసుకుంటున్నారు, ఇది ఒక వృత్తీ లాగ తీసుకుంటున్నారు.
    అవును, ఇది ఒక భారీ నవలే, మీరు చక్కగా ,ఉద్యోగం చేస్తూ, కూడా, ఇలాంటి నవలలు చదవ డానికి సమయం తీసుకున్తున్నారంటే హాట్స్ ఆఫ్..
    బుచ్చిబాబు, చివరికి మిగిలేది? చదివారా?
    ఉప్పల లక్ష్మణ రావు గారి..అతడు- ఆమె..
    ఇవి తప్పక చదవ వలసిన రచనలు, మన జీవితం లో..
    వసంతం.

    రిప్లయితొలగించండి
  5. ఈ మధ్యనే చదివానండీ. నా బ్లాగులో రాసాను కూడా. కరడుగట్టిన వాస్తవం కళ్ళ ముందు నిలిపారు భరద్వాజ గారు. చదువుతూ ఎన్నిసార్లు కళ్ళనీళ్ళు పెట్టుకున్నానో, ఎన్నిసార్లు హృదయం బరువెక్కిపోయిందో తెలీదు. మంజరి అంటే మాత్రం మంచి అభిమానం ఏర్పడింది. ఆ స్థైర్యం, ఆ ధైర్యం...భలే!

    నాకెందుకో డర్టీ పిక్చరు సినిమా గుర్తొస్తూ ఉంది. ఈ నవల ఆధారంగానే ఆ సినిమా తీసారా ఏమిటి అనిపించింది అక్కడక్కడా.

    ఈ నవల తో రావూరి వారి శైలి నచ్చి "కాదంబరి" కొన్నాను మొన్ననే. ఇంకా మొదలెట్టలేదు.

    రిప్లయితొలగించండి
  6. ఈ నవల చేతిలో చాలాకాలంగానే ఉన్నది గానీ ఎందుకో చదవలేదు.
    సినిమా పరిశ్రమ నేపథ్యంగా హాలీవుడ్ సినిమాలు చాలానే వచ్చాయి. తమాషాగా తొలితరం సినిమాల కాలాన్ని నెమరువేసుకుంటూ ఇటీవల రెందు సినిమాలు వచ్చాయి - The Artist, Hugo.
    రెండూ కూడా వాస్తవిక మూల్యాంకనం చెయ్యడానికి బదులు నాస్టాల్జియాకే పెద్దపీట వేశాయి.

    రిప్లయితొలగించండి
  7. మీ బ్లాగ్ చాలా బాగుంది మురళి గారు.A very good database on Telugu Literature...Keep posting..:-)

    రిప్లయితొలగించండి
  8. రావూరి భరద్వాజ్ గారు అందులో కొన్ని పాత్రలను నిజజీవితం లో కూడా చూడటం సంభవించింది.
    అందుకే ముగింపు అలా ఇచ్చారు.
    అది నిరశాజనకమైనా అదే సత్యం లోకం దృష్టి లో
    ఒక జీవితపు విలువను భరద్వాజ గారు తనదైన పంథా లో రాసిన నవల "పాకుడు రాళ్ళు"
    మీ సమీక్ష బాగుంది.

    రిప్లయితొలగించండి
  9. మురళిగారు....కొంచెం నెమ్మదిగా మీ టపాలన్నీ పూర్తి చెయ్యాలి:) :) మీకూ, మీ కుటుంబసభ్యులకూ నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  10. @వనజ వనమాలి; ధన్యవాదాలండీ..
    @వాసు: థాంక్స్ అండీ.. మీ వ్యాఖ్య చూశాక సరి చేశాను..
    @కొత్తావకాయ: ఒకరకంగా చెప్పాలంటే 'సహజంగా' ఉంది అనాలండీ :-) ..అయినా చదవబోతున్నారుగా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @వసంతం: నిజమేనండీ.. అయితే, ఇప్పటికీ మోసపోతున్న వాళ్ళు ఉన్నారుగా.. చదవడం మొదలు పెట్టాక, ఇక ఆపబుద్ధి కాలేదు నాకు.. 'చివరకు మిగిలేది' నాకు ఇష్టమైన పుస్తకాలలో ఒకటండీ.. ధన్యవాదాలు.
    @ఆ.సౌమ్య: మంజరి పాత్రే ఈ నవలకి బలం అండీ.. ధన్యవాదాలు.
    @నారాయణస్వామి: అలా చూసినప్పుడు, ఈ నవల వాస్తవానికి (చాలా) దగ్గరగా అని చెప్పొచ్చండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @A Homemaker's Utopia: ధన్యవాదాలండీ..
    @చైతన్య దీపిక: నవల ఎత్తుగడ, నడకని బట్టి నేను ముగింపు వేరే విధంగా ఊహించానండీ.. ధన్యవాదాలు..
    @పరిమళం: చాలా రోజుల తర్వాత!! నేనూ మీ టపాలు చదవాలండోయ్.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @chicha.in : ధన్యవాదాలండీ..
    @స్వోత్కర్ష: వచ్చేశానండీ :-) ..ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  14. మీ సమీక్ష హుందాగా అందంగా క్లుప్తంగా 500 పుటలని ఒక్క పుటలో చదువరులకి అందించింది. రావూరి వారికి, అందులోనూ ఈ పుస్తకానికి జ్ఞాన పీథ రావటం తెలుగు వారందరికి ముదావహం. మీరు ఇంకొంచెం ఎక్కువ గర్వ పడచ్చు. పాకుడు రాళ్లు పేరు వినటమే తప్ప ఇంట్లో ఉండీ పుస్తకం చేత పట్టలేదు. వార్త వచ్చిన తర్వాతే మీ బ్లాగ్ చదవటం తటస్థించింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది అని తెలియచేయడానికి సంతోషం..జ్ఞానపీఠ పొందిన మూడవ తెలుగు రచయిత..

    రిప్లయితొలగించండి
  16. @యెమ్మెల్ శాస్త్రి: తప్పక చదవండి... చూడ్డానికి పెద్ద పుస్తకం అనిపించినా, ఆపకుండా చదివిస్తుంది... ధన్యవాదాలు..

    @శివరామ ప్రసాద్: అవునండీ మొదటిది కావ్యం, రెండోది కవితా సంపుటం.. ఇది నవల!! ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  17. Sri sri bharadwaja garu really you are proved life is challenge.we are taking the inspiration from you sir.

    రిప్లయితొలగించండి