గురువారం, మార్చి 01, 2012

జెయింట్ వీల్

రొమాన్సు రాయడంలో తెలుగు కథకులు ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. మధ్యతరగతి 'ఇల్లాలి ముచ్చట్ల'ని వారం వారం వరుసతప్పకుండా రాస్తున్నది ఓ మగవాడన్న సందేహం ఆంధ్రదేశంలో పాఠకులెవరికీ ఈషన్మాత్రమన్నా కలిగించని రచయిత పురాణం సుబ్రహ్మణ్య శర్మ. ఈయన రచనల్లో రొమాన్సుని పాఠకులు తమ ఊహాశక్తి మేరకి ఆస్వాదించ వచ్చు అనడానికి సీతమ్మ చేత చెప్పించిన ముచ్చట్లే సాక్షి. శర్మ గారి కథల దగ్గరికి వస్తే, 'జెయింట్ వీల్' అనే ఒక్క కథ చాలు, కొత్త దంపతుల చిలిపి తగువులనీ, స్వీట్ నతింగ్స్ నీ ఎంత అందంగా అక్షరాల్లో పొదగచ్చో చెప్పడానికి.

బెజవాడ నగరంలో ఏటా జరిగే ఎగ్జిబిషన్లో కొత్తగా దంపతులైన సూర్యం, సుబ్బులు చేసిన హడావిడే 'జెయింట్ వీల్' కథ. నిజానికి హడావిడి అంతా సుబ్బులుదే. ఎందుకంటే, సూర్యం బొత్తిగా తల్లిచాటు బిడ్డ. తండ్రి యెడల విపరీతమైన భయభక్తులు ఉన్నవాడూను. భార్యని ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళే ముందు కూడా, "అమ్మా, తలకి నూనె రాయవే' అని అడిగి, చెంపల మీదకి కారేలా నూనె రాయించుకునే శుద్ధ బుద్ధిమంతుడు లేదా మొద్దావతారం మన కథానాయకుడు. కిసుక్కున నవ్వి అటు భర్తకీ, ఇటు అత్తగారికీ ఏక కాలంలో కోపం తెప్పించగల గడుసుతనం సుబ్బులు సొంతం.

కొత్త కోడలి ముందు కొడుకు పరువు పోకూడదని, ఆ తల్లి ఓ పది రూపాయలు తెచ్చి కొడుక్కి ఇస్తుంది, ఎగ్జిబిషన్లో కావలసినవి కొనుక్కొమ్మని. ఇల్లు దాటి వీధిలో అడుగు పెట్టగానే మొదలవుతాయి, సుబ్బులు కోరికలు, అలకలు, డిమాండ్లూను. నాలుగడుగులేస్తే ఎగ్జిబిషనే కదా, నడిచి వెళ్ళిపోదాం అంటాడు సూర్యం. ససేమిరా కుదరదు, రిక్షా ఎక్కాల్సిందే అంటుంది సుబ్బులు. రిక్షా టాపు వేసేయాలంటాడు సూర్యం, తీసేయమంటుంది సుబ్బులు. ఇక ఎగ్జిబిషన్ ప్రాంగణంలోకి అడుగుపెట్టాక సుబ్బులు ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు.

ఆడవాళ్ళ క్యూలోకి వెళ్లి ఇట్టే టిక్కట్లు తెచ్చేస్తుందా, లోపలి అడుగు పెట్టాక సూర్యం ఎలా ఉన్నాడో గమనించకుండా వంటింటి సామాన్లు, రొట్టెల మిషను, చెంచాలు, గరిటలు, ఉల్లిపాయలు, నిమ్మకాయలు తరిగే మిషను - ఇవన్నీ చూపిస్తున్న వాడితో హస్కు వేసి డిమానిస్ట్రేషన్ చేయించి, 'భలే భలే' అని చప్పట్లు కొట్టి ఆనందిస్తుంది. చిన్న చిన్న వస్తువులు బేరమాడి 'ఇవి కొందామండీ' అని గోముగా అడిగితే, 'మళ్ళీ వచ్చేపుడు కొందాంలే' అని చేయి పుచ్చుకుని ఇవతలికి లాగేస్తాడు సూర్యం.

ఫ్యాబ్రిక్ స్టాల్లోనూ అదే తంతు జరిగాక, సుబ్బులుని బులిపించడానికి 'ఎందుకు దండగ, నేను హైదరాబాద్ నుంచి తెస్తానుగా. అక్కడివి చాలా చవక' అని నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. ఇక ఇది పనికాదని, ఫ్రీగా చూపించే ఫ్యామిలీ ప్లానింగ్ డాక్యుమెంటరీ, ప్రభుత్వ స్టాళ్లు తిప్పుతాడు కాళ్ళు నొప్పులు పుట్టేవరకూ. ఆమె పీచు మిఠాయి తిందామని సరదా పడితే ఇంట్లో అమ్మ చేసిన గారెలు ఉన్నాయనీ, మిరపకాయ బజ్జీలు తిందామని ముచ్చట పడితే వెధవ నూనె మంచిది కాదనీ సూర్యం అందుకునే సరికి, ఇక లాభం లేదని తనే రంగంలోకి దిగుతుంది సుబ్బులు.

పీచు మిఠాయి, బజ్జీలు మొదలు రుమాళ్ళు, పూసల దండలు, రింగులు, వంటింటి పరికరాల వరకూ తను కొనదల్చుకున్న సమస్తమూ కొనేస్తుంది సుబ్బులు. ఇద్దరూ చెరుకురసం తాగేశాక, "జాయింట్ వీల్ ఎక్కుదాం రండి సరదాగా" అన్న సుబ్బులు మాటలు విని కంగు తింటాడు సూర్యం. "నాకు భయం" అనడానికి సిగ్గుపడి, "ఎందుకూ దండగ, చిన్నపిల్లల్లా" అంటాడు కానీ, అప్పటికే టిక్కట్లు తెచ్చేస్తుంది సుబ్బులు. అక్కడ కనిపించిన ఓ బుష్ షర్టు కుర్రాడితో సుబ్బులు కబుర్లు మొదలెట్టగానే, సూర్యం బుర్రలో జెయింట్ వీల్ తిరగడం మొదలవుతుంది. "నేరకపోయి దీంతో.. ఇది సిసింద్రీ అని తెలీక ఎగ్జిబిషన్ కి వచ్చాన్రా భగవంతుడా" అనుకుంటూ ఉండగానే వాళ్ళు ఎక్కిన జెయింట్ వీల్ తిరగడం మొదలవుతుంది.

జెయింట్ వీల్ మీద కళ్ళు తిరిగి పడిపోయిన సూర్యాన్ని రిక్షాలో ఇంటికి చేరుస్తుంది సుబ్బులు, బుష్ షర్టు కుర్రాడి సాయంతో. గదిలో పందిరి మంచం మీద సూర్యం "శోషోచ్చిన శేషశాయిలా" పడుండగానే, అత్తగారికి రొట్లొత్తుకునే మిషను, నిమ్మకాయ పిండేది తదితరాలు, మావగారికి నాప్కిన్స్, చుట్టలు పెట్టుకునే పెట్టి ప్రెజెంట్ చేసేస్తుంది సుబ్బులు. స్పృహలోకొచ్చిన సూర్యానికి కలిగిన సవాలక్ష సందేహాలకి,సుబ్బులిచ్చిన సమాధానాలే ఈ చిన్న కథ ముగింపు. ముందే చెప్పినట్టుగా, రచయిత రొమాన్సుని రాయడానికన్నా, పాఠకుల ఊహకే ఎక్కువగా వదిలారు. ('తెలుగుకథకి జేజే!' సంకలనంలో చదవొచ్చీ కథని..)

10 కామెంట్‌లు:

  1. సుబ్బులు నాకు తెగ నచ్చేసిందండోయ్ . చూస్తుంటే సూర్యం మరీ అంత అమాయకుడల్లేలేదు. ఉండండి అదేదో కథ చదివి తేలుస్తాను

    రిప్లయితొలగించండి
  2. లలిత గారి మాటే నాదీను. ఎప్పటిలాగే మంచి సమీక్ష.

    రిప్లయితొలగించండి
  3. చదవాలనిపించేలా, చదివించేలా రాశారు

    రిప్లయితొలగించండి
  4. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి రచనల మీద రాసిన మీ టపా బాగుంది మాస్టారు ...

    రిప్లయితొలగించండి
  5. సంతోషం. శ్రీపాద కథ గూడు మారిన కొత్తరికం లో కూడా పాతకాలపు యువదంపతుల సరసాలు, విలాసాలు ముగ్ధ మనోహరంగా ఉంటాయి.

    రిప్లయితొలగించండి
  6. @లలిత: ఏం తేల్చారో చెప్పారు కాదింతకీ.. ధన్యవాదాలండీ..

    @కొత్తావకాయ: ధన్యవాదాలండీ..

    @స్వోత్కర్ష: మీ (కలం) పేరు బాగుందండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. @శశికళ: thank you very much..

    @చైతన్య దీపిక: ధన్యవాదాలండీ..

    @నారాయణ స్వామి: అవునండీ.. నాకూ ఇష్టమైన కథ అది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. ఈ కథ పురాణం సుబ్రహ్మణ్యశాస్త్రి కథలనే సంకలనంలో చదివాను. మీ రికమెండేషన్లు బావుంటాయి. తెలుగు కథకి జేజే సంకలనంలోనే ఉండే బాపు "మబ్బూ-వానా-మల్లెవాసన" అన్న కథ కూడా ఇదేమాదిరిగా కొత్తదంపతుల విరహాలు, సరాగాలూ, ఊహలతో చాలా బావుంటుంది.

    రిప్లయితొలగించండి
  9. @పక్కింటబ్బాయి: అవునండోయ్.. నిజవే.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి