ఆదివారం, డిసెంబర్ 04, 2011

సుందరానికి పాతికేళ్ళు

సుందరం... తెలుగు తెర మీద ఓ నవ్వుల సంతకం... చేతిలో విద్య ఉన్నా దానిని ఉపయోగించని బద్ధకం అతని సొంతం. పావలాకాసంత పుట్టుమచ్చతో ఉండే పద్మినీ జాతి స్త్రీ దొరికితే చాలు, దశ తిరిగిపోతుందంటే నమ్మేసే అమాయకత్వమూ అతనికే సొంతం. చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు నమ్మేసి, సదరు స్త్రీకోసం జరిపే వెతుకులాటలో అష్టకష్టాలు ఎదురైనా, చివరికి ప్రాణాల మీదకి వచ్చినా వెనుదీయని మూర్ఖత్వంలాంటి మొండితనం అచ్చంగా సుందరానికి మాత్రమే సొంతం. అంతేకాదు, కబుర్లతో ఆడపిల్లల్ని బుట్టలో పడేయగలిగే ప్రావీణ్యమూ, ప్రాణభయంతో గజగజలాడే పిరికితనమూ కూడా సుందరానివే. అలాంటి సుందరం పుట్టి ఇవాల్టికి పాతికేళ్ళు!!


'మంచుపల్లకీ' తో మొదలు పెట్టి, 'సితార' 'అన్వేషణ' మీదుగా ప్రయాణించి 'ప్రేమించు-పెళ్ళాడు' తీసేనాటికి కళాత్మక దర్శకుడిగా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు వంశీ. 'ప్రేమించు-పెళ్ళాడు' పర్లేదనిపించినా, తర్వాత వచ్చిన 'ఆలాపన' ఘోర పరాజయం పాలవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రూటు మార్చి కేవలం హాస్యాన్ని మాత్రమే నమ్ముకుని, రాజేంద్రప్రసాద్ హీరోగా వంశీ తీసిన లో-బడ్జెట్ సినిమా 'లేడీస్ టైలర్' ...కథానాయకుడు సుందరం. కోనసీమలో గోదారి ఒడ్డున ఓ పల్లెటూళ్ళో పెంకుటింటి ఎత్తరుగుల మీద కుట్టు మిషన్ పెట్టుకున్న సుందరానిది జాకెట్లు కుట్టడంలో అందెవేసిన చెయ్యి.

అయితే ఏం లాభం? కష్టపడడానికి ఏమాత్రం ఇష్ట పడడు సుందరం. అసిస్టెంట్ సీతారాముడూ (శుభలేఖ సుధాకర్), ఊరూరూ తిరిగి జాకెట్ ముక్కలు అమ్ముకునే బట్టల సత్యం (మల్లికార్జున రావు) ఎంత మొత్తుకున్నా తన విద్య ఉపయోగించడు సరికదా, తనకి అదృష్టం వచ్చి పడుతుందనే నమ్మకంతో రోజులు గడిపేస్తూ ఉంటాడు. టైటిల్స్ పడుతుండగానే నేపధ్యంలో వినిపించే 'సూర్యుడు సూదులెట్టి పొడుస్తున్నాడు లేద్దూ.. ' పాట ద్వారా సుందరం స్వభావాన్ని పటం కట్టేస్తాడు దర్శకుడు. సినిమా కథలో పడగానే ఆ ఊరికి వచ్చిన ఓ జ్యోతిష్యుడు (రాళ్ళపల్లి), కుడి తొడమీద పావలా కాసంత పుట్టుమచ్చ ఉన్న పద్మినీజాతి స్త్రీని పెళ్ళి చేసుకుంటే సుందరానికి రాజయోగం పడుతుందని నమ్మబలుకుతాడు.

పద్మినీజాతి స్త్రీ వేట మొదలు పెట్టిన సుందరానికి ఉన్న ఒకే ఒక్క ఇబ్బంది వెంకటరత్నం (ప్రదీప్ శక్తి). ఆడపిల్లలతో ఎవరన్నా అసభ్యంగా ప్రవర్తిస్తే వాళ్ళని చంపడానికి కూడా వెనకాడడు. అలాంటి ఓ కేసులోనే జైల్లో ఉన్న వెంకటరత్నం మూడు నెలల్లో విడుదలవుతాడు. అతగాడు వచ్చేలోగానే సుందరానికి పద్మినీజాతి స్త్రీ దొరకాలి. ఆమెని వెతికి పట్టుకోడానికి సుందరం పడే తిప్పలు, అందులోనుంచి పుట్టే హాస్యమే తర్వాతి రెండుగంటల సినిమా. వంశీ మార్కు హడావిడి ముగింపుతో శుభం కార్డు పడుతుంది. వంశీ మిగిలిన సినిమాల్లా కాకుండా, కుటుంబంతో కలిసి చూడలేని సినిమా ఇది.

సుందరం పాత్రలో రాజేంద్రప్రసాద్ అలవోకగా ఒదిగిపోయాడు. ఇక మల్లికార్జునరావుకైతే 'బట్టల సత్యం' పేరు జీవితాంతమూ కొనసాగింది. అర్చన, సంధ్య, దీపలతో పాటుగా వై.విజయ కూడా రాజేంద్రప్రసాద్ సరసన ఓ నాయిక ఈ సినిమాలో!! వంశీ-భరణి కలిసి స్క్రిప్ట్ రాయగా, సంభాషణలని భరణి సమకూర్చారు. చివరినిమిషంలో వాటికి తన మార్కు మార్పు చేర్పులు చేశారు వంశీ. నాయికల్లో అర్చనకి ఎక్కువ మార్కులు పడ్డాయి. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి హీరో సంగీతమే. ఇళయరాజా స్వరాలు ఆంధ్ర దేశాన్ని ఎంతగా ఊపేశాయంటే, ఊరూరా మారుమోగాయి ఈ పాటలు. ఇప్పటికీ ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటాయి. రెప్పపాటులో పదులకొద్దీ ఫ్రేములు మారే చిత్రీకరణ సైతం గుర్తుండిపోతుంది.

శృతి మించని శృంగారాన్ని, హాస్యంతో రంగరించి వంశీ చేసిన ఈ వెండి తెర ప్రయోగం నిర్మాతలకి కాసులు కురిపించింది. హాస్య దర్శకుడిగా వంశీ మీద చెరగని ముద్ర వేసింది. అంతేకాదు, బూతు సినిమా దర్శకుడన్న పేరునీ తెచ్చిపెట్టింది. "నా జీవితంలోనూ, నా రచనలలోనూ ఎక్కడా హాస్యం లేదు.. జీవిక కోసం ఒక వృత్తిని అనుకున్నాక, అందులో కొనసాగడానికి ఇష్టంలేకపోయినా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అలా చేసిందే 'లేడీస్ టైలర్' సినిమా" అని చాలాసార్లే చెప్పారు వంశీ. ఇది వంశీ ఇష్టపడి తీసింది కాకపోయినా, మనసు పెట్టి తీసిన సినిమా అని తన సినిమాలు అన్నీ చూసిన వాళ్లకి ఇట్టే అర్ధమవుతుంది.

నేటివిటీ పట్ల వంశీకి ఉన్న మక్కువ ఎంతటిదో ఈ సినిమా చూసిన వాళ్ళకి వేరే చెప్పక్కర్లేదు. ఇళ్ళు, వీధులు మాత్రమే కాదు, కథా స్థలంలో వినిపించే నుడికారాలూ, కనిపించే ఆప్యాయతలూ కూడా సునిశితంగా తెరకెక్కించారు. సుందరం ఎక్కడా హీరో అనిపించడు. మన ఊరి టైలర్ లాగానే అనిపిస్తాడు. అలాగే, వెంకటరత్నంతో సహా ఏ పాత్రా అసహజం అనిపించకపోవడం ఈ సినిమా ప్రత్యేకత. అందుకే కావొచ్చు, చూసిన ప్రతిసారీ సినిమాలో లీనమైపోతాం. సుందరం మాటాడే 'జ' భాష, హిందీలా ఏమాత్రమూ వినిపించని హిందీ, అతగాడి వెంటపడే అమ్మాయిలు, సుందరం రాజైతే తను సేనాపతి అయిపోయి, బట్టలమ్మేసుకోవాలని కలలుకనే సత్యం...ఇలా సినిమా అంతా పొరుగింటి కథలాగే అనిపిస్తుంది. బహుశా అదే ఈ సినిమా విజయ రహస్యం.

 
విషాదం, సంఘర్షణ నుంచే హాస్యం పుడుతుందని చార్లీ చాప్లిన్ మొదలు చాలామందే చెప్పారు. 'లేడీస్ టైలర్' రూపకల్పన వెనుక కూడా అలాంటి విషాదం, సంఘర్షణ ఉన్నాయి. ఈ మధ్యనే ప్రచురించిన 'మా దిగువ గోదారి కథలు' సంకలనంలోని 'బేబీ.. ఓ మాసిపోని జ్ఞాపకం' కథలో ఆ సంఘర్షణని రేఖామాత్రంగా ప్రస్తావించారు వంశీ. ఐదేళ్ళ క్రితం రాజ్పల్ యాదవ్ కథానాయకుడిగా హిందీలోకి రీమేక్ అయిన ఈ సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచనలో వంశీ ఉన్నట్టుగా భోగట్టా. మొదట రవితేజతోనూ, తర్వాత అల్లరి నరేష్ తోనూ అనుకున్న 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' ప్రాజెక్ట్ లో హీరోగా ప్రస్తుతం సునీల్ పేరు వినిపిస్తోంది. రాబోయే ఆ సినిమా మరో పాతికేళ్ళ తర్వాత కూడా తల్చుకునేటంతటిది కావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...

17 కామెంట్‌లు:

  1. బావుంది.. పాత సినిమా మీద కొత్త రివ్యూ.

    సినిమా చూడలేదు. చూసే అవకాశం వస్తే తప్పక చూస్తాను.

    రిప్లయితొలగించండి
  2. చాన్నాళ్ళకి మంచి టపాతో కనిపించారు.

    "నేను బాగా చదువుకుని ఈ మూఢనమ్మకాలని ఖండిస్తూ ఓ పుస్తకం రాస్తాను. కుడి కన్నదురుతోంది..సత్యం!" :)

    రిప్లయితొలగించండి
  3. వంశీని తల్చుకుంటే నాకూ గంగవెర్రులెత్తేస్తుంది. లేడీస్ టైలర్ సినిమా మరో పాతికేళ్లైనాకా కూడా అదరగొట్టేస్తుంది.

    రిప్లయితొలగించండి
  4. ఈ సినిమా గురించి ఏం చెప్పాలన్నా మాటలు చాలవు.వావ్ టు వంశీగారు & సుందరం.

    రిప్లయితొలగించండి
  5. ... అంటే చాన్నాళ్ళకి కనిపించారు. మంచి టపా! అని అన్నమాట. :)

    రిప్లయితొలగించండి
  6. రాబోయే ఆ సినిమా మరో పాతికేళ్ళ తర్వాత కూడా తల్చుకునేటంతటిది కావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...

    i too wish the same

    రిప్లయితొలగించండి
  7. "శృతి మించని శృంగారాన్ని, హాస్యంతో రంగరించి వంశీ చేసిన ఈ వెండి తెర ప్రయోగం ....బూతు సినిమా దర్శకుడన్న పేరునీ తెచ్చిపెట్టింది"
    నాకు మటుక్కు పాటలు ఇష్టం. సినిమా పెద్ద చెప్పుకోదగ్గ సినిమా అనిపించదు. ఇక్కడ ఈ సినిమా అభిమానులున్నారు కాబట్టి ఇంత కంటే ఏమీ అనలేకపోతున్నా.

    రిప్లయితొలగించండి
  8. హ్మ్ శ్రుతి మించలేదు అనిపించడానికి కారణం మీ అభిమానం మాత్రమేనండీ :-) కుటుంబంతో కలిసి చూడలేమని మీరే ఇంకోచోట ఒప్పేసుకున్నారు కూడా కదా :-)))
    కొత్త సినిమా హిట్ అవ్వాలని నాకూ ఉంది కానీ వంశీగారి కొత్త సినిమాలు, తెలుగు చిత్రాలలో శృంగారానికి మారిన హద్దులూ తలచుకుంటే వికటిస్తుందేమో అని కొంచెం భయమేస్తూనే ఉంది :-(

    రిప్లయితొలగించండి
  9. మంచి టపా రాసారు. వంశీ గారి చిత్రాలోన్ని ఇళయరాజా గారి పాటలు ఇప్పటికీ ఎన్నిసార్లు విన్నా ఇష్టంగానే వుంటాయి.

    రిప్లయితొలగించండి
  10. ఎన్నాళ్ళో వేచిన ఉదయం.... అసలు ఈ సినిమాని ఏ ప్రత్యేక సమయంలో సమీక్షించడానికి అలా అట్టేపెట్టేసుకున్నారో అనుకుంటాను ఎప్పుడూ... మొత్తానికి ఇప్పుడర్ధమైంది :)))

    ఇహపోతే సినిమా విషయానికొస్తే ఇంచుమించు వాసు/వేణూ శ్రీకాంత్ గార్ల అభిప్రాయమే నాది కూడాను :-) నాకు సినిమా పాటలు నచ్చుతాయి.. నేపధ్యం నచ్చింది (అంటే మీ గోదారి అన్నమాట).. ఇక కధ అప్పట్లో కొంచెం వెరైటీగా అనిపించింది.. నాకైతే ఇంతకంటే ఎక్కువ ఎటాచ్‌మెంట్ లేదు ఈ సినిమాతో :-)

    ప్చ్, 'బేబీ'ని ప్రస్తావించేశారూ... :(((

    రిప్లయితొలగించండి
  11. ఇది అసలు సిసలైన వంశీ మార్కు చిత్రం ఇళయరాజా సంగీతం అద్బుతం
    "ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉన్నావు"
    "గోపి లోల నీ పాల పడ్డానురా.."
    "పోరాపాటిది..గ్రహపాటిది .."
    అన్నీ సూపర్ హిట్ పాటలే
    అలాగే హరి అనుమోలు గారి సినిమాటోగ్రఫి కూడా ఈ చిత్రానికి హైలెట్.
    ముఖ్యంగా వంశీ గారి డైరెక్షన్
    హీరో అమ్మాయిలకు గౌన్స్ కుట్టే సీన్, ఫోటో తీయడానికి ఒక ఒక
    శవాలకు ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్ ని పట్టుకొచ్చే సన్నివేశం,
    అబ్బ ..ఒక్కటేమిటి ఎన్నెన్నో..
    ఈ లేడీస్ టైలర్ ఎవర్ గ్రీన్ కామెడి చిత్రం తెలుగు సినిమాలలో ఇది కొంతవరకు బూతు సినిమా గా చూసే జనాలకు కనిపించినా అది వంశీ గారి దర్శకత్వ ప్రతిభే.పైగా అతను ఈ సినిమాకు అందిపుచ్చుకున్న నేపధ్య సంగీతం కూడా అతని ప్రతిభకు తగ్గట్టే ఉంది.

    రిప్లయితొలగించండి
  12. @గీతిక: చూడండి.. అద్భుతం కాదు కానీ, బోర్ కొట్టని సినిమా.. ధన్యవాదాలు.
    @శంకర్ ఎస్: :-) :-) జధజన్యజవాజదాజలు..
    @కొత్తావకాయ: భలే గుర్తుచేశారుగా!!.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  13. @పక్కింటబ్బాయి: నిజం కదూ! ధన్యవాదాలండీ..
    @బాలు: అవునండీ.. ధన్యవాదాల్.
    @కొత్తావకాయ: నేనిలాగే అర్ధం చేసుకున్నాను కానండీ, ఈ వ్యాఖ్య చూశాక ఆ వ్యాఖ్యకి రెండో అర్ధం గోచరించింది :-) :-)

    రిప్లయితొలగించండి
  14. @బొల్లోజు బాబా: ధన్యవాదాలండీ..
    @వాసు: పర్లేదండీ.. అనొచ్చు.. దేనిదారి దానిదే.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: ఆ భయం నాకూ లేకపోలేదండీ.. కానైతే ఆశించడం తప్పుకాదు కదా అనీ.... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. @తొలకరి: అవునండీ.. పాటలు నేనూ తరచూ వింటూ ఉంటాను.. ధన్యవాదాలు.
    @నిషిగంధ: బేబీని ప్రస్తావించ కుండా ఈటపా అసంపూర్ణం కదండీ.. అందుకన్నమాట!! ధన్యవాదాలు.
    @చైతన్య దీపిక: ఈ సినిమాకి సంగీతమే సగం బలమండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి