మంగళవారం, నవంబర్ 22, 2011

శ్రీ'బాపు'రాజ్యం

'జగదానంద కారకా.. జయ జానకీ ప్రాణ నాయకా.. శుభ స్వాగతం..' పాట చెవుల్లో మారుమోగుతోంది. అణువణువునా భారీతనం ఉట్టిపడే అందమైన వర్ణ చిత్రాలు కన్ను మూసినా, తెరిచినా కట్టెదుట ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. నార చీరెలు ధరించిన నయనతార సీత రూపంలో పదే పదే గుర్తుకొస్తోంది. మూడుగంటల పాటు ఏకాగ్రచిత్తంతో 'శ్రీరామరాజ్యం' సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వచ్చాక నా పరిస్థితి ఇది.

చాలామంది లాగానే నేను కూడా ఈ సినిమాని గురించి ఎలాంటి అంచనాలూ పెట్టుకోలేదు. ఎందుకంటే, రౌద్ర రసాభినయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న బాలకృష్ణ శ్రీరాముడుగా, నయనతారగా మారిన డయానా మరియం కురియన్ సీతా మహాసాధ్విగానూ కనిపించబోతూ, 'రాధాగోపాళం' 'సుందరకాండ' అనే రెండు నిరాశాపూరిత సినిమాల తర్వాత బాపూ-రమణలు తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు అవ్వడం వల్ల కావొచ్చు నేనీ సినిమా కోసం ఎదురు చూడలేదు. కానైతే విడుదలైన తొలిరోజున వినిపించిన 'హిట్' టాక్ విని మాత్రం చాలా సంతోష పడ్డాను.

అందరికీ తెలిసిన కథే అయినా చెప్పిన విధానం బాగుంది. మూడు గంటల సినిమాలో 'తరువాతి సన్నివేశం ఏమిటో' అనే కుతూహలం ఎక్కడా కలగకపోయినా, 'ఆ రాబోయే సన్నివేశం ఏవిధంగా తెరమీద కనిపిస్తుందో' అన్న ఆసక్తి ఏమాత్రమూ సడలలేదు. బహుశా, ఇదే ఈ సినిమా విజయ రహస్యం కావొచ్చు. అలనాటి 'లవకుశ' అడుగడుగునా గుర్తొస్తూనే ఉంది. గుర్తు రాకుండా చేయాలనే ప్రయత్నం ఏమాత్రమూ చేయకపోవడం బాగా నచ్చింది.

రావణ సంహారం పూర్తిచేసి సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సహితుడై అయోధ్యకి తిరిగి వచ్చిన శ్రీరాముడు పట్టాభిషిక్తుడు కావడంతో సినిమా మొదలై, కుశలవుల పట్టాభిషేకంతో సమాప్తమయ్యింది. నిర్మాణ వ్యయానికి వెరవకుండా (సుమారు ఇరవై ఏడు కోట్లని వినికిడి) అత్యంత భారీగా నిర్మించిన ఈ సినిమాలో ఆ భారీ తనం ప్రతి ఫ్రేములోనూ కనిపించింది. సెట్టింగుల మొదలు, గ్రాఫిక్స్ వరకూ అన్నీ కథలో దాదాపుగా ఇమిడిపోయాయి.

దర్శక రచయితలు బాపూ-రమణలకి శ్రీరాముడి మీద ఉన్న భక్తి, ప్రేమల గురించి ఇవాళ కొత్తగా చెప్పుకోనక్కరలేదు. ఆ భక్తీ, ప్రేమా సినిమా అంతటా కనిపించాయి. సన్నివేశాల కూర్పు మొదలు, సంభాషణల వరకూ ఎక్కడా - సాధారణంగా బాపూ రమణల సినిమాల్లో ఎక్కడో అక్కడ కనిపించే - నాటకీయత లేదా 'అతి' కనిపించలేదు. కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు మనసుని తాకిన ఆర్ధ్రత కళ్ళని పలకరించింది.

చిత్రీకరణలో బాపూ మార్కు ఆసాంతమూ కనిపించిన ఈ సినిమాలో నటీనటుల ప్రస్తావన వచ్చినప్పుడు మొదట చెప్పాల్సింది నయనతార గురించే. ఈమెని వెండితెర మీద చూడడం ఇదే మొదటిసారి నాకు. 'అంజలీదేవి, జయప్రదా మెప్పించిన సీత పాత్రలో నయనతార?' అన్న భావన సినిమా చూడని క్రితం వరకూ గుచ్చిన మాట నిజమే కానీ, చూసిన తర్వాత మటుమాయమయ్యింది. సీత పాత్రని మలిచిన తీరుని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆమె ఆత్మాభిమానాన్ని చిత్రించిన తీరు గుర్తుండి పోతుంది.

శ్రీరాముడి పాత్రని పూర్తి స్థాయిలో మెప్పించడానికి బాలకృష్ణకి వయసు సహకరించలేదన్న వ్యాఖ్యలు వినిపించాయి. కానీ, ఈ సినిమాలో రాముడు కళ్యాణ రాముడు కాదు. పట్టాభిషిక్తుడైన చక్రవర్తి. ఊహించినంత ఇబ్బంది ఎదురవ్వలేదు కానీ, శరీరాకృతిని తగుమాత్రంగా మార్చుకుని ఉంటే పాత్రకి నిండుదనం వచ్చేది కదా అనిపించింది. నటనతో పాటు సంభాషణలు పలికిన తీరు కూడా ప్రత్యేకంగా అనిపించింది. 'లవకుశ' ని చాలాసార్లే గుర్తు చేసింది.

మరో ముఖ్యమైన, కథకి మూలస్థంభమైన పాత్ర వాల్మీకి. అక్కినేని పోషించిన ఈ పాత్రలో సాత్వికత కనిపించలేదు ఎందుకో. దాదాపు అన్ని సన్నివేశాల్లోనూ వాల్మీకి ప్రశాంతంగా కాక అసహనంగానే కనిపించాడు. సంభాషణలు పలికిన తీరూ అలాగే ఉంది. కుశలవుల నుంచి కూడా నేను కొంచం ఎక్కువే ఆశించినట్టు ఉన్నాను. అయితే, లక్ష్మణుడిగా శ్రీకాంత్ మెప్పించాడు. కే.ఆర్. విజయ మొదలు రోజా వరకూ ఎందరూ నటులు సహాయ పాత్రల్లో మెరిశారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, గ్రాఫిక్స్ ని బాపూ ఉపయోగించుకున్న తీరు అబ్బుర పరిచింది. మహళ్ళూ, రాచ వీధులే కాదు అడవులూ, పశు పక్ష్యాదులని సైతం గ్రాఫిక్స్ లో సృష్టించారు. అయితే ఎక్కడా కూడా ఈ గ్రాఫిక్స్ నటీనటుల్ని తోసిరాజనకపోవడం వెనుక ఉన్నది మాత్రం దర్శకుడి కృషే. చాలా వరకూ కంటికింపు గానే ఉన్నప్పటికీ, అక్కడక్కడా ఈ రంగుల కలగలపు కళ్ళని కూసింత ఇబ్బంది పెట్టింది.

నేను మరికొంచం ఎక్కువ ఆశించిన మరో విభాగం సంగీతం. బాలేదని అనలేను కానీ, మరింత బాగుండ వచ్చు అనిపించిందని చెప్పకుండా ఉండలేను. ఒక్క పద్యమూ లేకపోవడం నిరాశ పరిచింది. మరీ సమాస పూరితాలు కాకపోయినా, సంభాషణల్లాగే సరళమైన పదాల కూర్పుతో కాసిన్ని పద్యాలు ఉంటే నిండుదనం వచ్చేది అనిపించింది.

మొత్తంగా చూసినప్పుడు మాత్రం మెచ్చి తీరాల్సిన ప్రయత్నం. తెలుగు సినిమా దారీ తెన్నూ తెలియకుండా సాగుతున్న తరుణంలో రాముడి కథని ఎంచుకుని, కన్నుల పండువైన సినిమాని అందించిన నిర్మాత యలమంచిలి సాయిబాబుని ప్రత్యేకంగా అభినందించాలి. చెప్పాల్సిన విధంగా చెబితే ఎంత పాత కథతో సినిమా తీసినా జనం ఆదరిస్తారని మరోమారు నిరూపించిన సినిమా 'శ్రీరామరాజ్యం.' థియేటర్లో మరోసారన్నా చూడాలి

17 వ్యాఖ్యలు:

కృష్ణప్రియ చెప్పారు...

మీ రివ్యూ చదవాలని ఎదురు చూస్తున్నాను. చాలా బాగుంది. నయనతార గురించి ఎంతమంది చెప్పినా, చూస్తే కానీ నమ్మలేనేమో ..

చూసి వచ్చి కామెంట్ రాస్తాను మళ్లీ..మీ అందరి బ్లాగుల్లో

Vasu చెప్పారు...

" సంగీతం బాలేదని అనలేను కానీ, మరింత బాగుండ వచ్చు అనిపించిందని చెప్పకుండా ఉండలేను. ఒక్క పద్యమూ లేకపోవడం నిరాశ పరిచింది. మరీ సమాస పూరితాలు కాకపోయినా, సంభాషణల్లాగే సరళమైన పదాల కూర్పుతో కాసిన్ని పద్యాలు ఉంటే నిండుదనం వచ్చేది అనిపించింది."

nenu kooodaa ditto ditto:)

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

రివ్యూ బాగుందండీ.. balanced గా బాగా రాశారు. చేసిన చిన్న చిన్న మార్పు్లు, చేర్చిన పిట్టకథలు స్క్రీన్ ప్లే కి వన్నె తెచ్చాయి. మొదటి సారి చూసినపుడు మరో ప్రపంచంలో లీనమైపోయాను. మరోసారి చూడాలి.

.శ్రీ. చెప్పారు...

సినిమా బానే ఉందాండి!? చూద్దామా.. వద్దా.. అని తటపటాయిస్తున్నాను..మీ టపా కొంచం ధైర్యం ఇచ్చింది.

కొత్తావకాయ చెప్పారు...

సంగీతం విషయంలో నేను నిరాశ చెందడం న్యాయమైనదేనన్నమాట. నేను పద్యాలు కోరుకోలేదు కానీ పాటలు మాత్రం ఇంకా బాగుండచ్చు. రివ్యూ బాగుంది మురళి గారూ!

సరైన నటుల ఎంపిక, భారీ సెట్లు, అందమైన ఫ్రేములు.. వెరసి ఈ గొప్ప దృశ్య కావ్యం!!

SHANKAR.S చెప్పారు...

ఇది నిజంగా శ్రీ బాపు రాజ్యమే నండీ. చక్కని సమీక్ష.
"ఒక్క పద్యమూ లేకపోవడం నిరాశ పరిచింది."
నాకూ ఇదే అనిపించింది. చివర్లో "లేరు కుశలవుల సాటి" అంటూ ఆ పిల్లలు మొదలు పెడితే ఆనాటి లవకుశ లో ఆ పాట ఉంటుందేమో అనుకున్నా. మరి కట్ చేశారో లేక అంతవరకే ఉందో తెలీదు. (ఉంటే బావుండేది)

ఇంత చక్కని సమీక్షలో హనుమంతుడి పాత్ర పోషించిన బాల నటుడి గురించి ప్రస్తావన లేకపోవడం వెలితిగా ఉంది. వీలయితే (తన నటన ప్రస్తావనార్హమైనది అని మీకు అనిపిస్తేనే సుమా) ఓ రెండు ముక్కలు చేరుద్దురూ.

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

హ్మ్..మురళి గారూ, పౌరాణికాలు కరువైన కాలమని సినిమాకి వెళ్ళి అరగంటలో లేచొచ్చేసాము :( అస్సలు బాగో లేదా అంటే చెప్పలేను కానీ రసరమ్య రామాయణమనిపించలేదు.

Truth Seeker చెప్పారు...

మురళి గారు,
బాపు - రమణ గారి సినిమా,అదీ పౌరాణికం అంటే చూడాలనిపిస్తుంది. కానీ మన తెలుగు నట భీబత్స ,భయంకర్ ను మూడు గంటలు భరించడం అంటే కష్టమేమో.

శశి కళ చెప్పారు...

chakkagaa cvraasaaru.yemaina bapu
cinimaa choodakunda undalemu

'Padmarpita' చెప్పారు...

ఏమో నాకు అందరూ చెబుతున్నంత గొప్పగాలేదేమో అనిపించిందండి.

చైతన్య దీపిక చెప్పారు...

బాగా రాసారు రివ్యూ ..కానీ పాత "లవకుశ " తో ఒక సరి పోల్చి చూసుకుంటే కొంతవరకు ఇంకా చిత్రం నాకు కృత్రిమంగానే ఉన్నట్లే అనిపించింది.పాత్రధారుల యొక్క కష్టం తెర పై కనిపిస్తున్నా వారు నటనలో జీవించ లేదనే చెప్పాలి..కానీ ఒక మంచి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని మనం అభివర్ణించవచ్చు.

Godavari చెప్పారు...

Mastaru,

okka vishayam , nenu UK untanu. mee review chadivaka eppude deppudu INDIA velli cinema chuddama ani undi. forunately i will be coming in this mnth .. very good review..

మురళి చెప్పారు...

@కృష్ణ ప్రియ: ధన్యవాదాలండీ.. ఎదురు చూసి మరీ చదివినందుకు. ఇంతకీ చూశారా??
@వాసు: హమ్మయ్య.. నాకు తోడు అయితే.. ..ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: నేనూ ఇంకోసారి చూడాలని అనుకుంటున్నానండీ.. కొంచం రష్ తగ్గాక.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@శ్రీ: పర్లేదండీ, చూసేయొచ్చు.. ధన్యవాదాలు.
@కొత్తావకాయ: పౌరాణికానికి పద్యమే అందం కదండీ.. అందుకని ఆశించాను.. ధన్యవాదాలు.
@శంకర్. ఎస్: కట్ చేయలేదండీ.. పద్యం లేదక్కడ.. బాల నటుడి నటనకి వంక పెట్టలేం.. కానీ, నేనెందుకో కనెక్ట్ కాలేక పోయాను..ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@భాస్కర రామిరెడ్డి: కాలం మారినప్పుడు మార్పులు తప్పవు కదండీ.. 'లవకుశ' తో పోల్చుకోకుండా ఉంటే పర్లేదు.. కానైతే, ఆ సినిమాని మళ్ళీ మళ్ళీ చూసిన మన బోటి వాళ్లకి ఎంతో కొంత అసంతృప్తి తప్పదు.. ధన్యవాదాలు.
@ట్రూత్ సీకర్: లేదండీ.. చూడొచ్చు.. ధన్యవాదాలు.
@శశికళ: ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@పద్మార్పిత: నావరకు నేనైతే ఎలాంటి అంచనాలూ లేకుండా చూశానండీ.. ధన్యవాదాలు.
@చైతన్య దీపిక: అవునండీ, పోల్చినప్పుడు అసంతృప్తి తప్పదు.. పోలిక రావడమూ అనివార్యం.. ధన్యవాదాలు.
@గోదావరి: రాగానే చూడండి అయితే.. ధన్యవాదాలు.

Godavari చెప్పారు...

Happy new year mastaru. i m back in UK. CINEMA CHUSANU SIR. CHALA CHALA BAVUNDI.. MEE REVIEW CHADIVI VELLANEMO INKAA BAVUNDI. SERIOUSLY I MEAN IT.. MEE UTTARANDRA MUCCHATLU KOODA IPPUDE CHADIVA .. CHALA BAVUNNAIYE.. NENU RAJAM LO KONTHA KAALAM UNNA.. SO ANDUVULLA KONNI PLACES CHUSA..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి