బుధవారం, సెప్టెంబర్ 07, 2011

మిరపకాయ బజ్జీ

ఉదయాన్నే అల్పాహారం.. మధ్యాహ్నం సుష్టుగా భోజనం.. అదయ్యాక మళ్ళీ రాత్రెప్పుడో రెండోపూట భోజనం. మరి ఈ మధ్యలో ఉదయం అల్పాహారం లాగానే తినడానికి ఏదన్నా ఉండాలి కదా. ఈవినింగ్ స్నాక్స్ అని ముద్దుగా పిల్చుకోడానికి రకరకాల వంటకాలున్నాయ్. నాకు తెలిసి తెలుగువారందరి తొలి ఎంపిక మిరపకాయ బజ్జీ. వేడివేడిగా కొంచం కమ్మగా మరికొంచం ఖారంగా నోరూరించే బజ్జీలు కనిపిస్తే తినకుండా ఉండగలమా?

మిరపకాయ బజ్జీని చూడగానే 'ఈనాటి ఈబంధమేనాటిదో..' అని పాడేసుకుంటాను నేను. అంత అనుబంధం ఉంది నాకీ బజ్జీతో. నేను మా ఊరి ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు, మా బడి పక్కనే ప్రసాదంగారి పాక హోటలుండేది. ఉదయం పూట ఇడ్డెన్లూ, మినప రొట్లూ, సర్వకాల సర్వావస్థల్లోనూ టీ, కాఫీలూ అమ్మేవాళ్ళక్కడ. మధ్యాహ్నం బళ్ళో మేం లెక్కలు చేసుకుంటుండగానే బజ్జీలు వేగుతున్న వాసన ముక్కుకి తగిలి నోట్లో నీళ్లూరేవి.

ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఐదేళ్ళ పాటు కేవలం ఆ వాసన పీల్చి సంతృప్తి పడ్డాను నేను. నాదగ్గర డబ్బులుండేవి. ఇంట్లో డిబ్బీలో కూడా డబ్బులుండేవి నాకు. కానీ ఏం లాభం, బయట ఏమీ కొనుక్కోరాదని ఇంట్లో ఆర్డర్. తెగించి కొనుక్కున్నా, ఐదో నిమిషంలో ఆ విషయం ఇంట్లో తెలిసిపోతుంది. ఇంట్లో అమ్మ అప్పుడప్పుడూ బజ్జీలేసేది. ఎందుకో గానీ ప్రసాదంగారి బజ్జీల్లో కనిపించే సొగసు వీటికి ఉండేది కాదు. అందని బజ్జీలదే అందం.

తినగలిగినన్ని బజ్జీలని ఇష్టంగా తిన్నది కాలేజీ రోజుల్లో. కాలేజీ దగ్గర ఓ సాయిబుగారి బజ్జీల కొట్టు ఉండేది. ఆయన బంధువెవరో వేగిస్తూ ఉంటే, ఈయన చకచకా ఒక్కో బజ్జీనీ నిలువుగా చీరి, కారం కలిపిన ఉల్లిపాయ ముక్కలు కూరి, పైన నిమ్మరసం పిండి, అందంగా ఓ కాగితంలో పెట్టి మాకు అందించేసే వాడు. చురుకైన ఆయన వేళ్ళ కదలికలు చూసి "మన సాయిబుగారి చేత డిసెక్షన్ చేయించాలి," అని ముచ్చట పడేవారు బైపీసీ మిత్రులు.

లెక్చరర్లందరూ మా బుర్రల్లో దూరి మరీ పాఠాలు చెప్పెసేవాళ్ళేమో, క్లాసులయ్యేసరికి కడుపు ఖాళీ అయిపోయేది. అందరం కలిసి సాయిబు గారిమీడకి దండయాత్ర. ఎప్పుడన్నా తొలి వాయి నాలుగు బజ్జీలూ ఖాళీ చేసేశాక, వేగుతున్న బజ్జీలవైపు చూస్తూ అప్రయత్నంగా జేబు తడుముకుంటే "మీరు తినండీ.. మేం ఉన్నాం కదా" అని బుజ్జో, ఫణో అన్నప్పుడు, బజ్జీ కారంగా లేకపోయినా సరే, అదేంటో కళ్ళలో నీళ్ళు తిరిగేవి. (హైస్కూల్లో ఏరా, ఒరే అనుకున్నా, కాలేజీకోచ్చేసరికి కొత్త ఫ్రెండ్స్ ని మీరనే అనేవాళ్ళం. లెక్చరర్లు కూడా మమ్మల్ని 'మీరు' అని మాట్లాడుతుంటే ఒక్కసారిగా పెద్దరికం ఆవహించేది మమ్మల్ని!)

కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు, ఆ ఆఫీసు దగ్గరే ఓ బజ్జీల బండి ఉండేది. ఓ సాయంత్రం సన్నగా చినుకులు పడుతుండగా, ఇంటికెళ్లబోతూ "బజ్జీలు తిందామాండీ?" అనడిగా కొలీగుని. "బజ్జీలు కొనుక్కుని తినగలిగేంత జీతాలా మనవి?" అనగానే నాకు నోట మాట పెగల్లేదు. వాళ్ళాయనకి మనసులోనే దండం పెట్టేసుకున్నాను. ఆవిడ దృష్టిలో "బజ్జీలు కొనుక్కోగలిగేంత" సంపాదన వచ్చేసరికి, తినే తీరిక లేక, తినాలనే ఆలోచన కూడా వచ్చేది కాదు. అప్పుడప్పుడూ ఎవరన్నా గుర్తు చేసినప్పుడు హడావిడిగా ఒకటో, రెండో తినడం.

రాన్రాను ఆ ఆనందం కూడా లేకుండా పోయింది. కారానికో ఏమో కానీ బజ్జీ తినగానే కడుపు మండుతుంటే ఎసిడిటీ ఏమోనని అనుమానించడం, డాక్టరిచ్చే సుదీర్ఘ ఉపన్యాసాలు వినడం వల్ల, సరిగ్గా వేడి వేడి బజ్జీని కొరికే వేళ అవి గుర్తు రావడం.. ఇలా బజ్జీ అంటే ఇష్టం బదులుగా భయం మొదలవుతోందేమో అనిపిస్తోంది అప్పుడప్పుడూ.. 'భూమి గుండ్రంగా ఉంటుంది' అనే మాట చాలా సార్లు విన్నాను నేను. మిరపకాయ బజ్జీకి అన్వయించుకుంటే నిజమే అనిపిస్తోంది.. ఎదురుగా బజ్జీలు నోరూరిస్తున్నా తినలేకపోవడం, చిన్నప్పుడూ, ఇప్పుడూ కూడా...

39 కామెంట్‌లు:

  1. మీరు అసాధ్యులు. నోరూరిపోతోంది. ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చేసా ఊహల్లోనే! తిన్నట్టు డాక్టరుకీ, డాక్టరు వద్దన్నాడని మిరపకాయ బజ్జీకి తెలియనివ్వకుండా లాగించెయ్యడమే!

    రిప్లయితొలగించండి
  2. ప్చ్..పాపం మీరు.

    నాకయితే మిరపకాయ బజ్జీలు తినని బ్రతుకూ ఓ బ్రతుకేనా అనిపిస్తుంది.

    అప్పటికి..ఇప్పటికీ నేను బయట తినే ఏకైక పదార్థం మిరపకాయ బజ్జీ.దాన్ని మాత్రం వదిలి పెట్టను.ఏంటో ఇంట్లో అచ్చు బయట వేసినట్టే వేసినా ఆ రుచి రాదు.

    ఎన్ని ఊర్లలో తిన్నా మా బాపట్ల మిరపకాయ బజ్జీల రుచే వేరు..కావాలంటే కొత్తపాళీ గారిని..ఇందు గారిని అడగండి.

    రిప్లయితొలగించండి
  3. ఈ తరం జనాలంతా చాటు మరిగారుగానీ మిరపకాయ బజ్జీయే అసలు సిసలైన ఈవెనింగు స్నాకు.
    విజయవాడ సీతారాంపురం దగ్గర ఏలూర్రోడ్డు మీద కనకదుర్గాటాకీసు సందుకి ఎదురుగా ఒక రేకుల షెడ్డులో బజ్జీల దుకాణం ఉండేది. మధ్యాన్నం మూడింటినించీ మొదలు పెట్టేవారు. మిరపకాయ బజ్జీలు, పునుగులు - ఈ రెండే. పునుగుల వాయ తేలే పది నిమిషాల్లోనే నాలుగు వాయల బజ్జీలకి సరిపడా ఎడ్వాన్సు బుకింగులైపోయేవి. కనకదుర్గాలో ఇంకా కొత్త సినిమాలాడుతున్న రోజుల్లో సినిమా టిక్కెట్లు దొరికాయిగానీ ఆట మొదలయ్యే లోగా బజ్జీలు దొరుకుతాయో లేదోనని ఆందోళన పడేవారు. రూపాయికి పది వచ్చేవి నా చిన్నతనంలో. నేను విజయవాడ వదిలే సమయానికి బజ్జీ ఒక రూపాయి అయింది. బజ్జీని కొయ్యడం, ఉల్లిపాయ దట్టించడం, ఇంకేవో కూరడం - ఇలాంటివేవీ లేవు. నేరుగా ఆ బజ్జీ తినడమే - అంతే. 2002లో విజయవాడ వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో వీరిగురించి వాకబు చేశానుకానీ ఎక్కడా ఆచూకీ తెలియలేదు.
    మళ్ళా బాపట్లలో బజ్జీల్ని బాగా ఎంజాయ్ చేశాము. ఏజీ కాలేజి లేడీస్ హాస్టలు గేటుదగ్గర ఒక బండి ఉండేది (సిసిముగారు వింటున్నారా?). వాళ్ళు చిన్న మిరపకాయలతో వేసే వాళ్ళు. కోసి, ఉల్లిపాయ దట్టించి, నిమ్మకాయ పింది ఇచ్చేవాళ్ళు. ఇవి కూడా భలే రుచిగా ఉండేవి. ఇప్పుడు ఎక్కడన్నా జిహ్వ చంపుకోలేక రుచి చూసినా అటువంటి రుచి మాత్రం మళ్ళీ అనుభవానికి రాలేదు.

    రిప్లయితొలగించండి
  4. మిరపకాయ బజ్జీలు ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండీ! నేను సంజీవరెడ్డి నగరులో ఉండేటపుడు మా ఫ్రెండ్ ఎర్రమంజిల్ నుండి వచ్చేవాడు నాతో కలిసి బజ్జీలు తినడానికి. ఆరోజులే వేరు! మీరు అపుడపుడూ తింటూ ఉండండి, పరవాలేదు!

    రిప్లయితొలగించండి
  5. ఇది చాలా అన్యాయం, డాక్టర్ వద్దంటే మిరపకాయ బజ్జీలు మానేస్తామా ?
    ఇంకో అన్యాయం బెజవాడ బజ్జీల బండ్ల మీద పరిశోధనా వ్యాసం రాసి పుటోలు కూడా ఎత్తిపెట్టు కున్నా.
    ఈలోపు మీరు రాసేసారు. ఏం చేసుకోను ? నాగార్జున యూనివెర్సిటీ కి దాఖలు చేసుకుంటాను.
    మీ వ్యాసం భలే వేడిగా అప్పుడే బాండీ లోంచి తీసి నూనె కారిపోవటానికి చిల్లుల మూకుడు లో పెట్టిన మిరపకాయ బజ్జీలంత కమ్మగా కనువిందు గా ఉంది.

    రిప్లయితొలగించండి
  6. మిరపకాయ బజ్జీలని తలుచుకుంటేనే నోరూరిపోతుంది. అంతే చక్కగా మీ టపాలో వివరించారు. ఇవి మీ ఇంట్లో చేసినవా?అయినా మీకిదేం భావ్యం కాదు. ఇలా నోరూరిస్తూ వివరించే బదులు మాకు కూడా వేడి వేడిగా కొన్ని పంపచ్చుగా!!!!!!

    రిప్లయితొలగించండి
  7. స్స్స్స్ మిరపకాయ బజ్జీ . . . అబ్బ నోరూరిపోతోంది . కానీ ఏమి లాభం తినలేను . తింటే డాక్టర్ తో చివాట్లు తినాలి .ఎంతైనా మిరపకాయ బజ్జీ రూటే వేరు :)

    రిప్లయితొలగించండి
  8. భలేవారే మురళీ గారు.డాక్టర్ బాబు ఏదో అన్నాడని మనం మానేస్తామా?

    సిగరెట్లు కాలిస్తే చస్తావురా అన్నాడు 12 ఏళ్ల క్రితం గుండె కోసినవాడు. నేను మానలేదు ఇంకా చావనూ లేదు. .... దహా

    అల్లాగని మరీ ఎక్కువ తినద్దు కానీ మిరప కాయ బజ్జి తినడం మానవద్దు అని సలహా ఇచ్చుచున్న వాడను.

    రిప్లయితొలగించండి
  9. మిరపకాయ బజ్జీ అనగానే నాకు నా ఫ్రెండ్ గుర్తుకు వస్తుందండి. గుంటూరు ఆరు పద్దెనిమిదిలో బండి మీద వేసే బజ్జీలు ఇంటికి తెచ్చి ఆవకాయలో నంచి మరీ తినేది తను. అసలు మా ఇంటికి బజ్జీల కోసమే వచ్చేదేమో అని నా డౌట్. మధురమైన కాలేజీ రోజులు, అల్లర్లు గుంటూరు మిరపకాయ బజ్జీలు గుర్తు తెచ్చారు.
    కొత్తపాళీ గారు, సి.సి.మువ్వ గారిలా నేనూ బాపట్ల బజ్జీలు తిన్నాకానీ బాపట్ల అంటే సుగంధపాలు, పాలకోవాలు, ఉప్పు కలిపి ఇసకలో వేయించిన వేరు శనగపప్పులు, వేయించిన జీడిపప్పు పలుకులు ఇవే ఎక్కువ గుర్తుకు వస్తాయి.

    బజ్జీ లాంటీ మహత్తరమైన టాపిక్ మీద మీరు చాలా చిన్న పోస్ట్ తో సరిపెట్టారే, మేము పొడిగిస్తాము లేండి.

    రిప్లయితొలగించండి
  10. నిన్ననే వాన పడుతూంటే చాలా రోజులు అయ్యిందని మిరపకాయ బజ్జీలు చేసుకుని తిన్నాను . ఆఫీసు నుంచి రాగానే ఆ పనిలో మునిగి మా వంట సంగతి మర్చిపోయి తీరిగ్గా కూర్చుని మా బాపట్ల మిరపకాయ బజ్జీ రుచి రానే రాదే అని బాధపడ్డాను. తిన్న తృప్తి ఇవాళ మీ టపా చదివాక కలిగింది . థాంక్స్.

    రిప్లయితొలగించండి
  11. పాత రోజులు గుర్తుకు తెచ్చారు. కాలేజి రోజుల్లో సాయంత్రాలు ఫ్రెండ్స్ తో కలిసి బండి దగ్గర నిలబడి తిన్న అ రుచే వేరు. శెనగ పిండి తో ఇప్పుడు తినాలంటే భయమేస్తుంది. అయిన నోరు ఊరుకోదు కదా, ఈ మధ్య దానికి విరుగుడు కనిపెట్టం, గోధుమ పిండి తో ట్రై చేశాం.. రుచి బానే ఉంది సో ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడే భయం లేకుండా లాగించేయ్యోచ్చు అనిపినిచింది.

    రిప్లయితొలగించండి
  12. అబ్బ... నోట్లో లాలాజలం ధారాపాతంగా కారిపోతుంది ;)
    బజ్జీలంటే అంతిష్టం నాకు. మీ వర్ణనంటే ఇంకా ఇష్టం:)) ఏదైనా కన్నులకు కట్టినట్లు రాయడంలో మీకు మీరే సాటి. మొన్న కొత్తావకాయ గారి టపాకి నోరూరిపోయింది. ఇప్పుడు మీ టపా. నాకు యమ అర్జెంటుగా బజ్జీ తినెయ్యాలని ఉంది...

    రిప్లయితొలగించండి
  13. ఓహ్ మంచి ఫేవరేట్ పోస్ట్...

    బజ్జీల్లో ఏముందని ఇంతమంది ఇలా నిలబడి అంత అపురూపంగా తింటారు అనుకునేదాన్ని పెళ్ళికాకముందు.
    ఇప్పుడు మాత్రం మిరపకాయ బజ్జీలు తినడమే కాదు చెయ్యడమూ ఇష్టమే. అవుంటే ఈయన ఇకాపూటకి భోజనం బదులు కూడా అవే తింటారు.

    @కొత్తపాళీ గారూ.. చిన్నప్పుడెప్పుడో చూశాను ఆ బజ్జీల బండిని. కానీ రుచి చూసే అదృష్టం దొరకలేదు. ఇప్పుడా బజ్జీల బండే కాదూ కనకదుర్గా టాకీసు, విజయా టాకీసు... ఏవీ లేవు.

    రిప్లయితొలగించండి
  14. baapatla bajji taste inka ekkadaa raadu..clock tower daggara sughandapu paalu,anjaneya swami temple daggara pallilu,court daggara puchha kaayalu...aa baapatla life a veru.....

    రిప్లయితొలగించండి
  15. అబ్బబ్బబ్బబ్బ.... ఏం పోస్టు వేసారు మురళిగారు. నోట్లోంచి లాలాజలం వరదగోదారిలా పారుతుంది. ఎవరక్కడ....యమార్జెంటుగా ఓ ప్లేట్ బజ్జీ పార్శిల్‌ల్‌ల్‌ల్‌ల్‌

    రిప్లయితొలగించండి
  16. నాగార్జున హాయి గా హైదరాబాద్ లో ఉండి మళ్ళీ పార్సిల్ అంటారా :) ఫోటో, పోస్టు భేలే ఉన్నాయి మురళి గారు ;)))

    రిప్లయితొలగించండి
  17. అబ్బా!సాయంత్రమే బజ్జీలు వేడి వేడివి ఉల్లినిమ్మ కలిపినవి దారిలో వస్తూతిన్నాను..ఇవి నా ఆల్టైం ఫేవరేట్ .ఇపుడు చుస్తే మీ టపా బజ్జిల మీద ,బాగుంది .

    రిప్లయితొలగించండి
  18. ప్రసాదంగారు, సాయిబుగారు, గోదావరి, కాకినాడ, బెజవాడ, హైదరాబాద్ సంజీవరెడ్డినగర్, బాపట్ల, గుంటూరు ఆరు పద్దెనిమిది - ఏ బండి బజ్జీయైనా మా గుంటూరు డొంకరోడ్డు మిరపకాయ బజ్జీ (అలియాస్ గుంటూరు బాంబు) ముందు బలాదురే! ఆ విషయం ఔట్లుక్, హిందుస్థాన్ టైంస్‌వంటివారు కూడ ఒప్పుకున్నారు. http://jb-jeevanayanam.blogspot.com/2010/09/blog-post.html :-)

    ఆత్రేయగారు, ఏమి సంకోచించకుండా రాసేయండి. ఎందుకంటే మురళిగారికంటే ముందు నేను రాసేశాగా బజ్జీలగురించి! :-)

    మురళిగారు, నాక్కూడ అభిమానమైన మిరపకాయ బజ్జీలగురించి మధురంగా (కారంగా) రాసినందుకు సంతోషం.

    రిప్లయితొలగించండి
  19. కొత్తపాలీ గారూ..విన్నా..విన్నా.

    అసలు బజ్జీలనగానే చూడండి బాపట్ల వాళ్లు ఎంత మంది వచ్చేసారో!

    రిప్లయితొలగించండి
  20. @కొత్తావకాయ: అనుకోండి.. వాళ్ళిద్దరినీ కన్విన్స్ చేసినా నా కడుపు ని కన్విన్స్ చేయలేక పోతున్నా మరి.. దీనికీ ఏదన్నా మార్గం చెప్పరూ :)) ..ధన్యవాదాలు.
    @సిరిసిరిమువ్వ: అబ్బే.. మొత్తానికి మానేశానని అపార్ధం చేసుకోకండి.. ఇదివరకట్లా వాయలకి వాయలూ తినలేక పోతున్నా :( ..ప్రళయం వచ్చినా మిరపకాయ్ బజ్జీ కొరకకుండా ఉండగలమా చెప్పండి? ..ధన్యవాదాలు.
    @కృష్ణ: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  21. @కొత్తపాళీ: మీరు చెప్పిన దాన్ని బట్టి చూసినప్పుడు, ఈ ఉల్లి నిమ్మరసం అన్నది మా గోదావరి జిల్లాల్లోనే మొదలయ్యిందేమో అని అనుమానంగా ఉందండీ.. ఈ విషయంలో ఓ పరిశోధన జరగాలి.. ఒక్కొక్కళ్ళ చేతి మహిమండీ.. ఊహించని రుచి వచ్చేస్తూ ఉంటుంది.. ధన్యవాదాలు.
    @శ్రీ: :-) ధన్యవాదాలండీ..
    @కృష్ణప్రియ: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  22. @శ్రీ: మొత్తానికి వదిలెయ్యలేదు శ్రీ గారూ.. కాకపొతే గతంలోలాగా తినలేక పోతున్నా :( ధన్యవాదాలు.
    @ఆత్రేయ: ఓ కాపీ బ్లాగులో కూడా పెట్టేయండి ఆత్రేయ గారూ.. ఆ స్ఫూర్తి తో ఎవరైనా మా గోదారి బజ్జీల గురించి కూడా చెయ్యి చేసుకోక పోరు :-) :-) ..ధన్యవాదాలు.
    @రసజ్ఞ: గూగులమ్మ ఇచ్చిన ఫోటో అండీ.. అదీ విషయం.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. @మాలాకుమార్: ముందు బజ్జీ తినేసి, తర్వాత తిట్లు తిందాం లే అనిపిస్తూ ఉంటుందండీ ఒక్కోసారి :)) ధన్యవాదాలు.
    @బులుసు సుబ్రహ్మణ్యం: వహ్వా.. అలా ఉండాలండీ బులుసు గారూ.. మ. హా. కాకపొతే భారీ ఎత్తున చెయ్యలేక పోతున్నానే అన్న చింతొకటి వేధిస్తోంది :( ..ధన్యవాదాలు.
    @మైత్రేయి: తప్పకుండా పొడిగించండి.. అసలు గొలుసు టపాలు రావాలి.. బజ్జీకీ జై.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  24. @తొలకరి: ఇంకో బాపట్ల!! కొత్తపాళీ గారూ, మువ్వగారూ పండుగ చేసేసుకుంటున్నారు అందుకే!! ..ధన్యవాదాలండీ..
    @భాను: మీరెన్ని చెప్పండి.. ఏదో సరిపెట్టుకోడమే కానీ, శనగ పిండి రుచి మరి దేనికీ రాదు.. ఫిల్టర్ కాఫీ రుచి ఇన్స్టంట్ కాఫీ కి వస్తుందా చెప్పండి?? ..ధన్యవాదాలు.
    @మనసు పలికే: మరింకెందుకు ఆలస్యం.. చేసేయండి :)).. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. @గీతిక: అవునండీ.. మిరపకాయ బజ్జీలంటూ ఉన్నాక, మళ్ళీ అన్నమూ, కూరా ఇవన్నీ ఎందుకు చెప్పండి? మంచి ఫిలాసఫీనే.. ధన్యవాదాలు.
    @గోదావరి: ధన్యవాదాలండీ..
    @మిత్ర: మీ వ్యాఖ్యలు చూస్తుంటే పనికట్టుకునైనా ఓసారి బాపట్ల వెళ్లి ఆ బజ్జీలు అవీ తిని రావాలని ఉందండీ.. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  26. @నాగార్జున: వచ్చిందా అండీ పార్సిల్? :-) ధన్యవాదాలు
    @శ్రావ్య వట్టికూటి: అబ్బే, ఆయన హోటల్ కి ఆర్డర్ చేశారండీ, ఇంటికి పంపమని.. అదీ సంగతి :)) అంతే కదా నాగార్జున గారు?? ..ధన్యవాదాలు.
    @మనసు పలికే: ఆర్డర్ ఇవ్వడానికా అండీ?? :)))

    రిప్లయితొలగించండి
  27. @చిన్ని: గోదారి జిల్లా బజ్జీలా అండీ? ఆ రుచే వేరు కదూ :)) ..ధన్యవాదాలు.
    @జేబీ: అయ్యబాబోయ్.. మా గోదారాళ్ళు ఇలాంటి విషయాల్లో వెనకపడి పోయారు.. మేమూ ఎవరన్నా పేపర్ వాళ్లనో, టీవీ వాళ్లనో సంప్రదించాలి :)) ..ధన్యవాదాలు.
    @సిరిసిరిమువ్వ: మరేనండీ మువ్వగారూ.. అసలు నాక్కూడా బాపట్ల ప్రయాణం కట్టేయాలనిపిస్తోంది, ఈ వ్యాఖ్యలు చూస్తుంటే :))

    రిప్లయితొలగించండి
  28. అసలు మిరపకాయ బజ్జి తినని తెలుగోడు ఉంటాడా అని?

    మా ఊళ్ళో మిరపకాయలోని గింజలు తీసేసి కొంచెం వాము మసాలా కూరి ఆపైన ఉల్లిముక్కలు, నిమ్మరసం వేసి ఇచ్చేవాళ్ళు. ఇవైతే ఎన్నైనా తినచ్చు.

    రిప్లయితొలగించండి
  29. మురళీ గారు, నేనైతె మంచి మిరపకాయ బజ్జీలు దొరుకుతాయి అంటే ఎంత దూరమయినా నడచి వెల్లి తినేవాన్ని. దిల్సుఖ్నగర్ నుండి కొత్తపేట పెట్రొల్ బంక్ వరకు నా ఫ్రెండ్స్ ను నడిపించి తీసుకెల్లెవాన్ని ఎందుకంటె అక్కడ మంచి ఫ్రెష్ బజ్జీలు దొరుకుతాయి. ఇప్పటికి మా ఫ్రెండ్స్ బజ్జీలు తిందామంటె భయపదతారు నడవడానికి.

    రిప్లయితొలగించండి
  30. అబ్బే ఛి..మా కృష్ణా జిల్లా బజ్జీల గురించి నే చెప్పేది గోదారి బజ్జీలు హస్సలు బాగోవు :)

    రిప్లయితొలగించండి
  31. @శిశిర: :-) ధన్యవాదాలండీ..
    @బోనగిరి; అలాంటి బజ్జీలు నేనూ తిన్నానండీ.. మీరు చెప్పింది నిజం.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  32. @శ్రీకర్ బాబు: ఈ నడక పద్ధతేదో బాగుందండీ.. ఒక వేళ బజ్జీ వల్ల ఏదన్నా అనారోగ్యం అనుకున్నా, నడక ఆరోగ్యదాయిని కదా.. ధన్యవాదాలు.
    @చిన్ని: :-) :-)

    రిప్లయితొలగించండి
  33. adrushta vantulu. hayiga andhra lo mirchi bajjilu lagnichestunnaru. ikkada maku indore lo appudappu ilanti telugu blagoolu chadivi nisptruha vadaladam tappa bajjeelu tine adrustam matram ledu. eppudo okasari maa aavida try chesindi. entayina road meeda bandi lo tinnanta taste radu kada. chinnappudu
    podili , ongole lo taruvata hyd lo tinevallam. btw hyd ecil x rd - as rao nagar water tank daggara oka manch bandi vuntundi. maanchi taste ga chestadu. repu june vaste oka pattu pattali. chooddam . dhanyavadalu mee bajjeeela kaburlaku.

    రిప్లయితొలగించండి