బుధవారం, సెప్టెంబర్ 29, 2010

విశాలనేత్రాలు

కాంచీ రాజ్యంలోని నిచుళాపురం పట్టణంలో వృద్ధ వేశ్య శృంగారమంజరి చిన్న కూతురు హేమసుందరి గొప్ప అందగత్తె. ఆమెవి చెంపకి చారెడు కళ్ళు. ఓనాడు దేవాలయంలో హేమసుందరి నాట్యం చేస్తూ ఉండగా ఆమె విశాలనేత్రాలని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు రంగనాయకుడు, ఓ మామూలు రైతు చిన్న కొడుకు. అతని స్పురద్రూపం, సాము గరిడీల్లో అతని ప్రతిభ, మీదు మిక్కిలి అతడు తనపై చూపించే గాఢమైన ప్రేమ హేమసుందరిని అతనితో ప్రేమలో పడేలా చేస్తాయి.

పట్టణ ప్రముఖుడు తిరుమల రెడ్డి శృంగారమంజరి పెద్ద కుమార్తె మాణిక్యవల్లిని ఆదరిస్తూ ఉంటాడు. నానాటికీ పెరుగుతున్న హేమసుందరి సౌందర్యం అతనిలో కొత్త ఆలోచనలు రేపుతుంది. ఒకనాటి రాత్రి తిరుమల రెడ్డి పై దాడిచేసి, అతని కాలు విరిచి, బంగారు నగలు సంగ్రహించి హేమసుందరితో కలిసి పొరుగునే ఉన్న పాండ్యరాజ్య ముఖ్య పట్టణం శ్రీరంగానికి పారిపోతాడు రంగనాయకుడు. వారిద్దరూ తమ పేర్లని హేమాంబా ధనుర్దాసులుగా మార్చుకుని భార్యాభర్తలుగా చెలామణి అవుతూ కొత్తజీవితం ప్రారంభిస్తారు.

హేమని తనకి దక్కేలా చేస్తే శ్రీరంగేశునికి హేమసుందరి నేత్రాలని పోలిన పైడి కనుదోయి, స్వర్ణ తిలకం సమర్పించుకుంటానని విచిత్రమైన మొక్కు మొక్కుకున్న రంగనాయకుడు, దానిని తీర్చుకుని తిరిగి వస్తుండగా రామాజున మఠాధీశుడు రామానుజ యతి తన శిష్యులతో నగర సంచారం చేస్తూ ఎదురు పడతాడు. పండుటాకులా ఉన్న ఆ వృద్ధ యతి ముఖంలో చూడగానే ఆకర్షించేవి విశాలమైన నేత్రాలు. తొలిచూపులోనే యతికి రంగనాయకుడి మీద తెలియని వాత్సల్యం ఏర్పడుతుంది.

యతి సమక్షంలో శ్రీరంగేశుని దర్శించుకున్న రంగనాయకుడికి కోటికొక్కరికి మాత్రమే కలిగే మహద్భాగ్యం - శ్రీరంగశాయి నిజ నేత్ర దర్శనం - దొరుకుతుంది. ఆ విశాల నేత్రాలని దర్శించిన క్షణం రంగనాయకుడి జీవితం మరో అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. హేమసుందరి, రామానుజ యతి, శ్రీరంగనాధ స్వామి వారల 'విశాల నేత్రాలు' అతిసామాన్యుడైన రంగనాయకుడి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయన్నదే నలభైనాలుగేళ్ళ క్రితం పిలకా గణపతి శాస్త్రి రాసిన నవల 'విశాల నేత్రాలు' కథాంశం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమతి అందుకున్నదీ నవల.

రాజభవంతిని తలపించే శృంగారమంజరి భవంతిలోకి ఒక అర్ధరాత్రి వేళ కావలి వాళ్ళ కళ్లుగప్పి, దేహానికి మసిపూసుకుని రంగనాయకుడు ప్రవేశించడంతో కథ ప్రారంభమవుతుంది. చకచకా మలుపులు తిరుగుతూ హేమసుందరి, రంగానాయకుడూ శ్రీరంగం చేరెంతవరకూ అత్యంత వేగంగా సాగే కథనం, అక్కడినుంచి కూసింత మందగిస్తుంది. కథానాయకుడు తొలి లక్ష్యాన్ని చేరుకోవడం, ఆ తర్వాతి లక్ష్యం ఏమిటన్నది పాఠకులకి తెలియకపోవడం ఇందుకు కారణాలని చెప్పాలి.

కాంచీ రాజ్య పాలన, క్రమశిక్షణ, శాంతిభద్రతలపై పాలకుల ప్రత్యేక శ్రద్ధ వంటి విషయాలతో పాటు, కుమార్తెల ద్వారా వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశించే వృద్ధ వేశ్య శృంగారమంజరి, తన చెల్లెలే తనకి పోటీ వస్తోందని భయపడే మాణిక్యవల్లి పాత్రలు ప్రధమార్ధాన్ని ఆసక్తిగా చదివిస్తాయి. రెండోసగంలో శ్రీరంగేశుడి మీద భక్తి, రామానుజ యతి మీద గౌరవం చూపిస్తూనే, రంగనాయకుడు వ్యసనాలకి బానిసవ్వడం, నేరం చేయడానికి వెనుకాడకపోవడం కథని మలుపులు తిప్పుతాయి.

రంగనాయకుడి మీద యతి చూపే అభిమానం, ఆశ్రమంలో మిగిలిన శిష్యులకి కంటగింపు కావడం, ఓ దశలో యతి ఆశ్రమం విడిచిపెట్టడానికి సిద్ధపడడం కథని ముగింపు వైపు నడుపుతాయి. సంస్కృతాంధ్రాలు క్షుణ్ణంగా చదివిన పిలకా గణపతి శాస్త్రి, ఈ నవల కోసం 'లైఫ్ ఆఫ్ రామానుజ' గ్రంధం తో పాటు, ఎన్నో సంస్కృత గ్రంధాలని రిఫర్ చేశానని ముందుమాటలో చెప్పారు. నవలలో పాత్రలు, సంఘటనా స్థలాలు, ప్రకృతి వర్ణనలని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీటికారణంగా కథని ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది పఠితలకి.

చాలా ఏళ్ళ క్రితం చదివిన ఈ పుస్తకం, "ఇక దొరకదేమో" అనుకుంటున్న తరుణంలో పుస్తకాల షాపులో కనిపించేసరికి నాక్కలిగిన ఆనందం వర్ణనాతీతం. సినిమాగా తీయడానికి వందశాతం సరిపోయే ఈ కథని అలనాటి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు స్క్రిప్టు గా మలుచుకున్నారు కానీ సినిమా చేయలేకపోయారు. ఇదే కథ హక్కులు తీసుకుని స్క్రిప్టు రాయించుకున్న నటుడు కృష్ణంరాజు ఎప్పటికైనా ప్రభాస్ కథానాయకుడిగా సినిమా తీస్తానని ప్రకటిస్తున్నారు. హేమసుందరి ఎవరో మరి?? రెండువందల పేజీల ఈ నవలని ఎమెస్కో ప్రచురించింది. వెల రూ. 70. 'విశాల నేత్రాలు' గురించి బ్లాగ్మిత్రులు తృష్ణ గారి టపా ఇక్కడ.

11 కామెంట్‌లు:

  1. ఎంతో నచ్చిన ఆ కథను ఒక్క టపాలో కుదించలేక మూడు భాగాలుగా రాసాను. లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. మురళి గారు, చాలా మంచి నవలని పరిచయం చేశారు.నేను చదవాల్సిన జాబితా పెరిగిపొతోంది. ఈ నవల బెంగళూరులో దొరికితే బాగుండు.
    :)

    రిప్లయితొలగించండి
  3. ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట చదివాను ఈ బుక్.బహుశా ఇంటర్లోనో,టెంత్ లోనో. ఇన్నాళ్ళకి భలే దొరికిందే మీకు.

    రిప్లయితొలగించండి
  4. అవునండీ ఇంతకుముందు త్రుష్ణగారి గారి బ్లాగ్ లో చదివాను....ప్రభాస్ హీరోగా అన్నది కొత్త విషయం..హేమసుందరిగా అప్పటివాళ్ళుఐతే శ్రీదేవి , భానుప్రియ , శోభన సూటయ్యేవారు .ప్చ్...ఇప్పుడెవరో మరి!

    రిప్లయితొలగించండి
  5. ఈ నవల దొరుకుతోందా..? నేను ఎన్నిసార్లు విశాలాంధ్రలో అడిగినా లేదు అనే సమాధానం.. ఇంకోసారి అడిగి చూడాలి...

    రిప్లయితొలగించండి
  6. మంచి పుస్తకం గుర్తు చేసారు , ఎప్పుడో చిన్నప్పుడు తెలుగు వాచకం లో పాఠం గా ఉండేది. మీ పోస్ట్ చదివిన దగ్గరనుంచి ఎప్పుడూ విశాలాంధ్ర మీద పడదామా అని ఉంది

    ధహ్యవాదములు

    రిప్లయితొలగించండి
  7. @తృష్ణ: ధన్యవాదాలండీ..
    @స్నిగ్ధ: ఎమెస్కో వాళ్ళు ఈ మధ్యనే కొత్త ప్రింట్ వేశారండీ.. పుస్తక ప్రదర్శనలో దొరకవచ్చు.. ధన్యవాదాలు.
    @సునీత: అంతా ఎమెస్కో వాళ్ళ పుణ్యం అండీ.. గణపతి శాస్త్రి గారి వర్క్స్ అన్నీ వేస్తున్నట్టున్నారు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. @పరిమళం: నేనూ ఆలోచించానండీ.. మరీ వంద శాతం కాకపోయినా, శ్రియ కొంచం పర్వాలేదనిపిస్తోంది.. ధన్యవాదాలు.
    @మేధ: మొన్ననే వచ్చిందండీ, తాజాగా.. ఈసారి అడగండి, ఇస్తారు.. ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: మీరు తలచుకుంటే అదెంత పని చెప్పండి? ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. @వాసు: ప్రస్తుతానికి ఆన్లైన్ లో లేదండీ.. ఏవీకెఎఫ్ ద్వారా అమ్ముతున్నట్టున్నారు.. ధన్యవాదాలు.
    @ఆత్రేయ: ఆలస్యం అమృతం విషం అన్నారండీ.. త్వరపడండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి