"దేవుడా దేవుడా గాట్టి వర్షం కురిపించు.." పొద్దు పొద్దున్నే నిద్ర లేవగానే ఆకాశంలో మబ్బులు కనిపిస్తే నేను దేవుణ్ణి కోరుకునే చిన్న కోరిక ఇది. బాగా వర్షం వస్తే బడికి వెళ్ళక్కర్లేదు కదా మరి. మా బళ్ళో ఉండే రెండు గదుల్లోనూ ఒకటి బంగాళా పెంకులది, రెండోది తాటాకుతో కప్పింది. వానొచ్చిందంటే నీళ్లన్నీ మామీదే. అందుకని పెద్ద వర్షమొస్తే బడికి సెలవన్న మాట. అసలు బళ్ళో కూర్చోడం మాటెలా ఉన్నా, మేష్టార్లు బడికి రావాలన్నా వీలు పడదు. బురద రోడ్ల మీద సైకిలు దొర్లించుకుంటూ రావడం చాలా కష్టం మరి.
బడికి సెలవిచ్చేస్తే ఎంచక్కా ఎంత బాగుంటుందో. మామూలుగా ఆదివారం నాడు సెలవిస్తారనుకో. అయినా కానీ ఇలా మధ్య మధ్యలో సెలవులోస్తే భలేగా ఉంటుంది. మనం చద్దన్నం తినేసి బడికి బయలుదేరే లోపే ఎవరో ఒకరు "ఇవాళ బళ్ళేదు" అని చెప్పేస్తారు కదా. అప్పుడు పుస్తకాల సంచీని అమ్మకీ, నాన్నకీ కనిపించకుండా దాచేయాలి. ఎదురుకుండా సంచీ కనిపిస్తుంటే "చదువుకో" అని ప్రాణాలు తోడెయ్యరూ, అందుకన్న మాట. పాఠాలన్నీ వచ్చేశాయ్ అన్నా వినిపించుకోకుండా, "మళ్ళీ చదువుకో" అనో "ఎక్కాలు నేర్చుకో" అనో ఆర్డర్లేస్తారు.
బయట బాగా వర్షం పడుతోందనుకో, మూల గదిలోకి వెళ్లి కిటికీ దగ్గరకి తలొచ్చేలా పెద్ద మంచం మీద పడుకోవాలి. అప్పుడైతే వర్షం ఎలా కురుస్తోందో బాగా చూడొచ్చు. ఒక్కోసారి ఊరంతా చీకటిగా అయిపోయి, ఉరుములూ అవీ వస్తూ, లావు లావు ధారలుగా వర్షం కురుస్తుంది చూడు, అలాంటప్పుడైతే భయమేస్తుంది కానీ, మామూలు వర్షమైతేనా ఎంతసేపైనా అలా చూస్తూ ఉండిపోవచ్చు. మధ్య మధ్యలో వచ్చే మెరుపులు భలేగా ఉంటాయి. చూరు మీద నుంచి నీళ్ళు ధారలు ధారలుగా పడ్డప్పుడు కింద నేలంతా చిల్లులు పడి చిన్న చిన్న చెరువుల్లా అయిపోతుంది. అప్పుడు కనక వర్షం తగ్గిందంటే ఆ నీళ్ళలో పడవలు ఆడుకోవచ్చు.
చెరువంటే గుర్తొచ్చింది. వీధి గదిలో కూర్చున్నామంటే చెరువు మీద వర్షం కురవడం చూడొచ్చు. అసలే చెరువు నిండా నీళ్ళా? ఆ నీళ్ళలో మళ్ళీ బోల్డు బోల్డు నీళ్లన్న మాట. ఒక్కోసారి చెరువు పొంగిపోతుందేమో అని భయమేస్తుంది కానీ, అలా వర్షం కురవడం మాత్రం ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది. చెరువవతల అందరివీ తాటాకిళ్ళే కదా. ఎంత వర్షం వచ్చినా వంట చేసుకోడం మానెయ్యరు కదా. అప్పుడు వాళ్ళిళ్ళలోనుంచి వచ్చే పొగల్ని పరాగ్గా చూశామంటే ఇళ్ళు తగలబడి పోతున్నాయేమో అని ఖంగారు పడిపోతాం. బాగా దూరంగా చూస్తే అక్కడ వర్షం కూడా మంచులాగే కనిపిస్తుంది.
తాటాకు గొడుగులేసుకుని రోడ్ల మీద తిరిగే జనం రోడ్డుని బురద బురదగా చేసేస్తారు. గొడుగులు లేనివాళ్ళు తువ్వాళ్ళు నెత్తిమీద కప్పుకుని పరిగెట్టడం. పాపం ఎంత పరిగెత్తినా గట్టిగా వానొస్తే తడిసిపోవాల్సిందే. అలా తడిస్తే జొరాలొస్తాయిట, అందుకే మన్ని తిరగనివ్వరు. అదే పప్పుచారునీ, గోపాల్రావునీ అయితే వాళ్లిళ్ళలో ఏమీ అనరు. అందుకే వాళ్ళు అలా తడుస్తూనే ఉంటారు. వానొచ్చిందంటే చెర్లో తిరిగే నీరుకట్లూ, బురదపాములూ మన వీధిలోకి వచ్చేస్తాయి. కర్రుంది కదా అని వాటిని చంపెయ్యకూడదు. తాచుపామైతేనే చంపాలి. కానీ హమ్మో.. తాచుపాముని చంపడం అంత సులువేంటి? నాన్నైతే ఒక్క దెబ్బకి చంపేస్తారనుకో.
కాకపొతే ఈ బుడత పాముల్ని చూసి 'పాము' 'పాము' అని అరిచి కాసేపు బామ్మని ఖంగారు పెట్టొచ్చు. ఎంత చద్దన్నం తిని ఊరికే కూర్చున్నా టయానికి ఆకలెయ్యక మానదు కదా. అలా అని "తినడానికి ఏవన్నా పెట్టు" అని అమ్మని పీక్కు తినకూడదు. తనకి చెయ్యి ఖాళీ అయ్యాక తనే పెడుతుంది. పొద్దున్నైతే ఒకటే హడావిడిగా ఉంటుంది కానీ, మధ్యాన్నం బోజనాలైపోయాక అమ్మక్కొంచం ఖాళీ దొరుకుతుంది కదా.. అప్పుడు ఏ వేరుశనగ గుళ్ళో వేయించి పెడుతుంది. కొంచం బెల్లమ్ముక్క కూడా తనే ఇస్తుందిలే, మళ్ళీ పైత్యం చేయకుండా.
బామ్మైతే వర్షం వచ్చినప్పుడల్లా తన చిన్నప్పటి ఫ్రెండ్సులకి ఎవరెవరికి వర్షాల్లో ఏమేం దొరికాయో కథలు కథలుగా చెప్పేస్తుంది. వర్షం తగ్గిపోయాక బురదగా ఉంటుంది కదా. బామ్మ ఫ్రెండ్సులు ఆ బురదలో కర్రతో తవ్వే ఆట ఆడుతుంటే ఒకళ్ళకి గొలుసూ, మరొకళ్ళకి ఉంగరమూ (రెండూ నిజం బంగారమే) దొరికాయిట. వాళ్లకి అదృష్టం ఉందిట. నేను వెతుకుదామనుకున్నా తను పడనివ్వలేదు. ఎప్పుడూ ఉండే గొడవే జొరం వస్తుందని. అయినా ఎవరూ చూడకుండా నేను వెతికాననుకో. కానీ నాకు అదృష్టం లేదు.
మామూలప్పుడైతే అన్నం వేడి వేడిగా ఉంటే అస్సలు తినలేమా.. అదే వర్షం వచ్చినప్పుడైతే వేడన్నం ఊదుకుంటూ తింటే ఉంటుందీ.. అదే రాత్రప్పుడైతే పెరుగన్నం అవుతుండగానే నిద్ర ముంచుకొచ్చేస్తుంది. కడుపులో వేడి వేడిగా ఉంటుంది కదా మరి. అప్పుడు నిండా రగ్గు కప్పేసుకుని గాట్టిగా కళ్ళు మూసేసుకుంటే వర్షం చప్పుడు వినిపించీ వినిపించీ అలా అలా నిద్రలోకెళ్లిపోతాం. తెల్లారిందంటే మళ్ళీ బళ్ళోకెళ్ళాల్సిందే. ఎంత మనం రోజూ దండం పెట్టుకుంటే మాత్రం, వానదేవుడు మనూళ్ళోనే రోజూ వర్షం కురిపించెయ్యడు కదా. మిగిలిన ఊళ్లలో కూడా మనలాంటి పిల్లలుంటారు కదా మరి.
too good!
రిప్లయితొలగించండిచాలా బాగున్నాయండి మీ జ్ఞాపకాలు నేనూ చిన్నప్పుడు ఇలా నే చూసేవాడిని కిటికీ పక్కన కూర్చుని బయట పడే వర్షాన్ని చూస్తూ స్కూల్ లో వచ్చే నోటీసు కోసం చూసే వాళ్ళం ....ఒక్కో సారి మా కల ఫలించి " భారీ వర్షాల కారణం గా ఈ రోజు రెండు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమె బడి జరుగుతుంది అన్న వార్త వచ్చేది ఆ తర్వాత సెలవన్న మాట :-)
రిప్లయితొలగించండిచాలా బాగుందండి .వర్షా కాలంలో మాకూ చిన్నప్పుడు బాగా వర్షం వస్తే సెలవు ఇచ్చేసేవారు.చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చింది మీ పోస్ట్..
రిప్లయితొలగించండిపిల్లలందరికీ ఒకటే కోరిక స్కూల్ లేకపోతె బాగుండునని .అదీ వర్షం వస్తే ఇంకా బాగుంటుంది .మా బాబు కుడా అంతే మబ్బెసిందా , వర్షం వస్తాదా లేదా,అని అస్తమానూచూసుకుంటూ ఉంటాడు.స్కూల్ లేదని అంటే ఆ ఆనందం పట్టలేము...
ఈమద్యన పిల్లలు చదువులపై మమకారం మరీ పెంచుకున్నట్టున్నారు.
రిప్లయితొలగించండిమనఫ్లాష్బాక్లో: ఓసారి మీరన్నట్టె ఓగుడిసెలోంచి పొగుస్తుంటే ఇల్లు తగలబడిపోతూంది అనరిచా. చూసినోళ్ళెవరు పట్టించుకోలా. మనకు సాహసబాలుర పాఠం గుర్తొచ్చేసి లోపలున్నోళ్ళనికాపాడదామని ఇంట్లోకి వెళ్తే ... అదన్నమాట:)
నీ ప్రేమను వర్షించవా నీలిమేఘమా అని 'నీ రాక కోసం' ఎదురుచూసి చూసి విరహ వేదన అనుభవించినా, ఎదురు చూడగా చూడగా ఎట్టకేలకు మేఘం మనసు కరిగింది, వర్షం కురిసింది 'వానొచ్చింది' అని సంబరపడ్డా, ఇప్పుడు 'ముసిరేసింది' అని బాల్య స్మ్రుతుల తీపి జ్ఞాపకాల ఉయ్యాల లూగినా అది మీకే చెల్లింది మురళి గారు. ఒక్క వానలో జీవితానుభవాలన్నీ కలబోసేసారు.
రిప్లయితొలగించండిబావుంది. చూరు నుంచి వాన నీళ్ళు జారుతున్న ఫొటో మరింత అందాన్ని ఇచ్చింది.
రిప్లయితొలగించండిహ్హహ్హహ్హ.వానావానావల్లప్పా...వర్షం పడ్డా బలవంతంగా స్కూల్ కి పంపిస్తే బురదకాళ్ళతో బెంచీలన్నీ బురద చేసేసేవాళ్ళం,అప్పుడు చచ్చినట్టు ఇంటికిపంపించాల్సిందే.
రిప్లయితొలగించండి"బయట బాగా వర్షం పడుతోందనుకో,మూల గదిలోకి వెళ్లి కిటికీ దగ్గరకి తలొచ్చేలా పెద్ద మంచం మీద పడుకోవాలి.అప్పుడైతే వర్షం ఎలా కురుస్తోందో బాగా చూడొచ్చు".సేం టు సేం.
"మనం చద్దన్నం తినేసి బడికి బయలుదేరే లోపే ఎవరో ఒకరు "ఇవాళ బళ్ళేదు" అని చెప్పేస్తారు కదా" చాలా రోజుల తర్వాత చద్దన్నం గుర్తుచేసారు భలే రుచిగాఉందిలెండి.
తాటాకు గొడుగులు(గోనెసంచులు కూడా వేసుకునేవారు కదా),పాకల్లోంచి పొగలు,వానపాములూ,కాగితం పడవలు(కత్తి పడవలు కూడానండోయ్).
"ఎంత మనం రోజూ దండం పెట్టుకుంటే మాత్రం,వానదేవుడు మనూళ్ళోనే రోజూ వర్షం కురిపించెయ్యడు కదా.మిగిలిన ఊళ్లలో కూడా మనలాంటి పిల్లలుంటారు కదా మరి" మరే నిజమేనండోయ్.
మీరు రాసే జ్ఞాపకాల టపాల వల్ల ముసురుకున్న జ్ఞాపకాలలో నుండి బయటకు రావడానికి చాలా సమయం పడుతూందండి. :)
రిప్లయితొలగించండిఈ పని వత్తిడులు అన్నిటికీ దూరంగా ఊరికి పారిపోయి వర్షం లో తడవాలని ఉంది. అదీ టైం మషీన్ లో ఒక ౧౫ - ౨౦ ఏళ్ళు వెనక్కి.
రిప్లయితొలగించండిఅది కుదరదు. కానీ మీ టపా ఇంచు మించు ఆ అనుభూతిని కలిగించింది.
మీకు బోలెడు థాంక్స్లు .
రోజూ మీ బ్లాగ్ అమృత గుళిక ల్లాటి టపాలను ప్రసాదిస్తోంది. ఇది మాత్రం ఆపకండి.
వాసు
మురళి గారూ ! వర్షం చూస్తూ బాగా ఎంజాయ్ చేసేవారన్నమాట!నేనుతడవటం అమ్మరెండు మొట్టికాయలువేసి గోరువెచ్చటి నీళ్ళలో ఉప్పువేసి స్నానం చేయించడం...నాన్నగారు రాగానే నామీద చాడీలు చెప్పటం..నాన్నగారేమో రివర్స్ లో తలస్నానం చేయించావా...సాంబ్రాణి వెయ్యకపోయావా అని అమ్మనే చివాట్లుపెట్టడం...అన్నీ గుర్తొచ్చేశాయండీ!కాని అప్పటికీ ,ఇప్పటికీ ఉరుములంటే మాత్రం చచ్చేభయం! ఉరుముల్లేని వానకురవాలని దండంపెట్టుకోనేదాన్ని :) ఇప్పటికీ ఉరిమితే చాలు తలుపులన్నీ బిగించేసుకొని కృష్ణ,అర్జున ,పార్ధ ,కిరీటి విజయా అంటూ చిన్నప్పుడు అమ్మమ్మచెప్పినట్టూ అనేసుకుంటూ ఉంటాను :) :)
రిప్లయితొలగించండిbeautiful...
రిప్లయితొలగించండితొలకరి చినుకులా ..బాగుందండి మీ జ్ఞాపకం !!
రిప్లయితొలగించండివృధ్ధాప్యపు త్రవ్వకాల్లో
రిప్లయితొలగించండిబయల్పడ్డ యౌవనపు
అనుభవాల శిధిలాలు
పదిలంగా భద్రపరచబడ్డ
మ్యూజియం ఈ హృదయం.
పాత రోజులు గుర్తుకుతెచ్చారు
http://vennelalu.blogspot.com
chala chala chala bagundhandi
రిప్లయితొలగించండి@ శ్రీకాంత్ గారూ wowwwww!
రిప్లయితొలగించండిChala navvochindhi....
రిప్లయితొలగించండిchala navvochindhi....
రిప్లయితొలగించండిvarsham vochina rojulloki vellipoya..chaduvuthooo
మీ చిన్నప్పటి జ్ఞాపకాలతో మమ్మల్నీ చిరుజల్లుల్లో తడిపేశారు! :) :)
రిప్లయితొలగించండి@హరే కృష్ణ: Thank you..
రిప్లయితొలగించండి@పరుచూరి వంశీకృష్ణ: మాకు 'కంటిన్యూ' అని ఉండేదండీ, హైస్కూల్లో.. ఆరు పీరియడ్లు వరుసగా పాఠం చెప్పేసి ఆ తర్వాత వదిలేసే వాళ్ళు. వర్షం బాగా ఉంటె ఐదు పీరియడ్లకే ఇళ్ళకి వెళ్లి పొమ్మనే వాళ్ళు.. ఆ రోజులు రమ్మన్నా రావండీ.. ధన్యవాదాలు.
@రాధిక (నాని): నా చిన్నప్పుడైతే ఎవరికైనా దేశ నాయకుడికి ఆరోగ్యం బాలేదని రేడియోలో చెప్పగానే ఎదురు చూద్దాం మొదలు పెట్టే వాడినండీ, సెలవు కోసం.. ధన్యవాదాలు.
@సుబ్రహ్మణ్య చైతన్య: సహస బాలుడికీ జై.. ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@జయ: యెంత నిశితంగా చదువుతున్నారండీ, నా టపాలన్నీ.. నా ఆనందాన్ని వర్ణించలేను... ధన్యవాదాలండీ..
@శ్రీనివాస్: ఫోటో గూగులమ్మ పుణ్యం అండీ.. ధన్యవాదాలు.
@శ్రీనివాస్ పప్పు: అవునండోయ్. గోనె సంచుల మాట మర్చిపోయాను.. భలే గుర్తు చేశారు.. బెంచీల చిట్కా ఇంత ఆలస్యంగానా చెప్పడం?? :-) ..ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@శిశిర: రాస్తున్న నాదీ అదే పరిస్థితండీ.. ధన్యవాదాలు..
@వాసు: ధన్యవాదాలండీ..
@పరిమళం: మరీ పెద్ద పెద్ద ఉరుములకి భయపడేవాడిని కానీ, చిన్నవి సరదాగానే ఉండేవండీ నాకు.. పైగా ఉరుములతో పాటు మెరుపులు వస్తాయి కదా.. ఎక్కడికో వెళ్ళిపోయాను కదా :-) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@శేఖర్ పెద్దగోపు: మీరు కూడా ఇంగ్లీష్ లోనా? షేక్స్పియర్స్ ని గుర్తు చేసుకుని "యూ టూ, బ్రూటస్" అనేయాల్సి వస్తుందండీ నేను :-) మీ అచ్చ తెలుగు వ్యాఖ్యలు అలవాటైపోయి.. అంతకన్నా మరేం లేదు.. ..ధన్యవాదాలండీ..
@తువ్వాయి: చక్కని పోలిక.. ధన్యవాదాలండీ..
@శ్రీకాంత్: వావ్... యెంత బాగా చెప్పారండి!! ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@స్ఫూర్తి: ధన్యవాదాలండీ..
@చందు: ధన్యవాదాలండీ..
@మధురవాణి: ఎన్నాళ్ళకెన్నాళ్ళకు?? ...సాదర స్వాగతం మరియు ధన్యవాదాలండీ..
థాంక్స్ మురళీ గారు, పరిమళహారికీ థాంక్స్
రిప్లయితొలగించండిhttp://srikanthkakara.blogspot.com
mee gnyapakalu chaduvuthunte BUDUGU gurthuvacchindandi... inka inka ilantivi rayandi... Bagunnayi
రిప్లయితొలగించండి