మంగళవారం, ఫిబ్రవరి 16, 2010

నాయికలు-పద్మావతి

పద్మావతి నాకు చాలా చిత్రంగా పరిచయమయ్యింది. నాకు చిన్నప్పుడే పుస్తకాలు చదవడం అలవాటవ్వడం అమ్మకి సంతోషం కలిగించింది. అప్పట్లో అమ్మ నాకు ఒకే ఒక్క నిబంధన పెట్టింది. "పెద్దాడివి అయ్యే వరకూ చలం పుస్తకాలు చదవకు. అవి తప్ప ఇంకేం చదివినా నీ ఇష్టం" అని. వద్దన్నపని చెయ్యాలనే మానవ సహజమైన కుతూహలం వల్ల చలం అనే ఆయన రాసిన పుస్తకాలు ఎక్కడైనా కనిపిస్తాయా అని వెతికాను కానీ, ఎక్కడా దొరకలేదు.

నేనప్పుడు నాలుగో తరగతో, ఐదో తరగతో. రోజూ లాగే ఉదయం బడికి వెళ్ళడానికి తయారవుతూ రేడియో వింటున్నా. "ఇప్పుడు నవలా పరిచయ కార్యక్రమం.. ఈ వారం నవల 'దైవమిచ్చిన భార్య,' రచన గుడిపాటి వెంకటా చలం..." ఒక్కసారిగా చెవులు రిక్కించాను. ప్రతి అక్షరం శ్రద్ధగా విన్నాను. ఎంతగా అంటే ఇప్పటికీ ఈ నవల చదువుతున్న ప్రతిసారీ రేడియోలో వచ్చిన కార్యక్రమం నా చెవుల్లో వినిపిస్తూ ఉంటుంది. ఈ నవలలో నాయికే పద్మావతి, ఓ జమీందారు గారి అమ్మాయి.

పద్మావతి పక్కింటి అబ్బాయి రాధాకృష్ణ. పూర్వాచారాలని పాటించే కుటుంబం అతనిది. పద్మావతి కుటుంబం కొంచం ఆదర్శ భావాలున్నది. సెలవుల్లో తన అన్నలిద్దరితో పల్లెటూరికి వచ్చిన పద్మావతికి రాధాకృష్ణతో స్నేహం కుదురుతుంది. మొదట అతని ఆహార్యాన్ని చూసి పట్నం పిల్లలు ముగ్గురూ ఆటపట్టించినా, త్వరలోనే పిల్లలు నలుగురూ స్నేహితులవుతారు. ముఖ్యంగా పద్మావతి-రాధాకృష్ణ ల మధ్య స్నేహం బలపడుతుంది.

ఆ సెలవుల్లోనే పద్మావతి కి 'న్యాయమూర్తి' తో పెళ్ళవుతుంది. పెళ్లవ్వగానే పై చదువులకి ఇంగ్లండు వెళ్తాడు న్యాయమూర్తి. మధ్యలో కొంత ఎడబాటు తర్వాత, యుక్త వయస్కులయ్యాక మళ్ళీ కలుసుకుంటారు పద్మావతి-రాధాకృష్ణ. చిన్నప్పటి ఆటపాటల్ని గుర్తు చేసుకుంటారు ఇద్దరూ. స్నేహం ప్రేమగా మారి, ఒకరిపై మరొకరికి మోహం పుట్టడానికి కారణం అవుతుంది. ఓ వెన్నెల రాత్రి వాళ్ళిద్దరూ ఏకమవుతారు.

ఓ పక్క న్యాయమూర్తి తో కాపురం చేస్తూనే, రాధాకృష్ణ తో స్నేహాన్ని కొనసాగిస్తుంది పద్మావతి. ఆమెని ఎప్పటికీ తనతో వచ్చేయమని కోరతాడు రాధాకృష్ణ. "నువ్వు నాతో ఉంటే చాలు.. ఇంకేమీ అక్కర్లేదు" అంటాడు. "ఎందుకు అక్కరలేక పోవాలి? నాకోసం నువ్వు అన్నీ ఎందుకు వదులుకోవాలి? నీకు ఇదా ప్రేమ చేసే ఉపకారం? నిన్ను కలుసుకోడమంటే నాకెంతో ఇష్టం. నీ దగ్గర్నించి వెళ్ళిపోయి, నిన్ను కొన్నాళ్ళు చూడకుండా ఉండడం మరీ ఇష్టం! మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మరీ బాగుంటుందిగా" అంటుంది పద్మావతి.

ఒక రోజు పద్మావతి-రాధాకృష్ణ న్యాయమూర్తి కంట పడతారు. పద్మావతిని వదులుకోడానికి సిద్ధ పడడు న్యాయమూర్తి. ఆమె రాధాకృష్ణతో కలవడానికి వీల్లేదంటాడు. న్యాయమూర్తిని వదిలేసి తనతో వచ్చేయమంటాడు రాధాకృష్ణ. తమ ఇద్దరిలో ఎవరు కావాలో నిర్ణయించుకోమంటాడు. "ఇద్దరిలో ఎవరినో ఏరుకోడం ఏమిటి? ఎందుకు యేరుకోవాలి? ఎవరో ఒకరు ఉండి తీరాలా ఏమిటి నాకు మొగనాధుడు? మీ ఇద్దరూ ఎందుకిలా బొమిక ముక్క కోసం కుక్కల్లాగా పోట్లాడుతారు? ఇది నా ఇల్లు. నేనిక్కడ ఉంటాను," అంటుంది స్థిరంగా.

ఈపోరులో న్యాయమూర్తే గెలుస్తాడు. పద్మావతికీ, రాధాకృష్ణకీ ఎడబాటు తప్పదు. అది ఒప్పందం, పద్మావతి అంగీకరించిన ఒప్పందం. రాధాకృష్ణ కి శకుంతలతో వివాహం జరగడం, అతను దేశాంతరం వెళ్ళడం, తిరిగి వచ్చి ఓ పత్రిక నడపడం, ఇద్దరు పిల్లల్ని కనడం...మరో పక్క పద్మావతికి ఇద్దరు పిల్లలు కలగడం జరిగాక, వాళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారు యాదృచ్చికంగా. పెద్ద గాలి దుమారం లేస్తుంది పద్మావతి ఇంట్లో. రాధాకృష్ణ మీద ప్రేమ అంతకంతకూ పెరుగుతుంది పద్మావతికి, మరో పక్క రాధాకృష్ణ పరిస్థితి కూడా అదే.

తనతో వచ్చెయ్యమని మరోసారి ప్రతిపాదిస్తాడు రాధాకృష్ణ, ఈసారి కొంచం బలహీనంగా. తన భార్య, ఇద్దరు పిల్లలూ గుర్తొచ్చారు మరి. న్యాయమూర్తి ఆగ్రహంతో రగిలి, రాధాకృష్ణ ని కోర్టుకి ఈడ్చేందుకు నిర్ణయించుకుంటాడు. శకుంతల నలిగిపోతుంది, ఈ గొడవల్లో. ఈ ప్రేమకథకి పద్మావతి ఇచ్చిన (చలం ఇచ్చిన) ముగింపు తెలుసుకోవాలంటే 96 పేజీల 'దైవమిచ్చిన భార్య' నవల చదవాల్సిందే. (అరుణా పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ. వెల రూ.30, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

12 కామెంట్‌లు:

  1. బలే రాసేరు మురళి పరిచయం, ఎవరబ్బా పద్మావతి అనుకుంటూ వచ్చా చలం కధానాయిక అనుకోలేదు.. ఆ తలపు రాలేదు ఎందుకో. నాకు అంత గా అర్ధం కాలేదు ఈ పుస్తకం మొదటి సారి చదివినప్పుడు ఎందుకలా ఎందుకలా అని ఒక కోటి సార్లు అనుకున్నా.. నెమ్మది గా జీవితం రక రకా ల పార్శ్వాలు చూపించటం మొదలెట్టేక జీవితాన్ని మనుష్యుల ను చూసేకొద్ది అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించాక చదివితే బలె జాలి, దిగులు వేసింది ఆ అమ్మాయి మీద. అందుకే చిన్నతనం లో చదవ వద్దు అన్నారేమో మీ అమ్మ గారు.. ఆఖరి సారి కు ముందు రాధ, పద్మావతి కలుసుకున్నప్పుడు పేజీలు చదివి నేనైతే ఏడ్చేసా వాళ్ళ సంఘర్షణ తలచుకుని. జీవితం లో అనేక రకాల కోణాలను చాలా వైవిధ్యం తో చూపించగలరు చలం..

    రిప్లయితొలగించండి
  2. నేను చాల సార్లు చదివాను సరిగ్గా అర్ధం కాక మరీ నాలుగో తరగతిలో కాదులెండి -:) ఈ పుస్తకం కాలేజిలో క్లాసు రూం వెనుక బెంచిల్లో కూర్చుని మరీ చదివాం .సో 'పద్మావతి ' కూడా మరో నాయకి అన్నమాట !

    రిప్లయితొలగించండి
  3. బాగుందండీ. ఇలాంటి పద్మావతులను అర్ధం చేసుకోవడం కాస్త కష్టమైన పనే. చలంగారి కథానాయికలే అంత లెండి.

    రిప్లయితొలగించండి
  4. మురళి గారు, ఈ సంఘర్షణ ముగింపు ఏమైఉండొచ్చు. వీలైతె చదువుతాను. బహుశా, చివరికి శకుంతల కోసం పద్మావతి త్యాగం చేస్తుందేమో!

    రిప్లయితొలగించండి
  5. మురళిగారు చాలా బాగు౦దిపద్మవతి కధ.నేను చదవల్సిన లిస్ట్ పెరిపోతు౦ది మీ వల్లన.
    బ్లాగ్ న్యూ లుక్ బాగు౦ది..

    రిప్లయితొలగించండి
  6. సిలబస్ ఇంత ఫాస్ట్ గా కవర్ చేస్తే ఎలా మాష్టారూ..? వేగంగా చదవగలిగే పిల్లలూ వుంటారు, చదవలేని పిల్లలూ వుంటారు. కాస్త నెమ్మదిగా చెప్పరూ..!!

    రిప్లయితొలగించండి
  7. @భావన: టపా కోసం మొన్న మళ్ళీ చదువుతున్నప్పుడు మాత్రం మీరే గుర్తొచ్చారండీ.. మీరైతే ఎలా రాస్తారో అని చాలాసార్లు అనుకున్నా.. ధన్యవాదాలు.
    @చిన్ని: నా అభిమాన నాయికల్లో పద్మావతి కూడా ఒకరండీ.. బాగున్నాయి మీ కాలేజీ జ్ఞాపకాలు. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: అలా జనరలైజ్ చేసేస్తే చలం అభిమానులకి కోపం వస్తుందేమోనండీ... ఆమె చుట్టూ ఉన్న పరిస్థితులని చాలా చక్కగా వర్ణించారు చలం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. @జయ: ఊహాతీతమైన ముగింపు కాదండీ.. కానీ, ముగింపు కన్నా సంఘర్షణ కోసం చదవాలి ఈ పుస్తకాన్ని. ధన్యవాదాలు.
    @సుభద్ర: ఇండియా వచ్చినప్పుడు షాపింగ్ చేసే ఉంటారు కదండీ.. కొత్త టెంప్లేట్ పర్లేదంటారు ఐతే.. ధన్యవాదాలు.
    @ప్రణీత స్వాతి: 'క్రాప్ హాలిడే' లాగా కొన్నాళ్ళు పుస్తకాల గురించి రాయడం ఆపేయమంటారా ఐతే? :):) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. ఈ పుస్తకం నాదగ్గర ఉందండీ ...చదివినప్పుడు నాకుకలిగిన ఫీలింగ్ నేను చెప్పటం కంటే భావన గారి కామెంట్ చూశారుగా అంతకంటే ఏమీ చెప్పలేను. కాని ఆ టైటిల్ మాత్రమే కధకి అంతందంగా అమరుతుందేమో అనిపిస్తుంది .మీ పరిచయంతో మళ్ళీ మరోసారి చదవటం మొదలుపెట్టా :)

    రిప్లయితొలగించండి
  10. @పరిమళం: చలం పుస్తకాల్లో నేను కొంచం తరచుగా చదివే వాటిలో ఈ పుస్తకం కూడా ఒకటండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. మీ 'నాయికలు ' సిరీస్ ని ఇప్పుడే వరసపెట్టి అన్నీ చదివానండి. మీరు పాత్రలను, పుస్తకాన్ని పరిచయం చేసే తీరు అద్భుతంగా ఉంది. మీ నాయికలులో నాకు ఐదుగురు మాత్రమే పరిచయం. ఇంకో ఇద్దరి గురించి సినిమాల వల్ల చూచాయగా తెలుసు.
    మిగత అందరినీ త్వరలో కలుసుకోగలనని అనుకుంటున్నా. మీరు అంత బాగా వారి గురించి చెప్పాక కూడా కలుసుకోకపోతే ఎలా?
    అందరిలో నాకు ఎక్కువగా నచ్చింది మటుకు యండమూరి వారి మందాకిని.

    రిప్లయితొలగించండి
  12. మీ టపా చూడంగానే, నా స్నేహితుని దగ్గర ఈ పుస్తకం ఉందని తెలిసి, వెంటనే సంపాదించి ఆపకుండా ఏకబిగిని చివరి దాక చదివానండి. కాని చూస్తే చివర ఉన్న పేజీలు గల్లంతయ్యాయని తెలిసింది.
    పద్మ రాధ దగ్గరకు వచ్చి, 'ఈ సమస్యకు పరిష్కారం ఆలొచించాను' అన్న చోట ఆగిపోయా. అది ఏంటో, ఏం జరిగిందో కొద్దిగా చెప్పి పుణ్యం కట్టుకోరూ?

    అడగరానిదే అడుగుతున్నానేమో కాని ఉత్సుకతను తట్టుకోవడం కష్టంగా ఉంది.
    :-( :-(

    రిప్లయితొలగించండి