శనివారం, మార్చి 07, 2009

నాయికలు-రాజేశ్వరి

కొన్ని తరాల తెలుగు పాఠకులను ఉలికిపాటుకి గురిచేసిన పేరు రాజేశ్వరి. 'చలం' గా ప్రసిద్ధుడైన గుడిపాటి వెంకటాచలం ఎనభైరెండేళ్ళ క్రితం రాసిన 'మైదానం' నవల్లో నాయిక రాజేశ్వరి. స్త్రీని వంటింటికి మాత్రమే పరిమితం చేసిన సమాజంలో తనకి నచ్చిన జీవితం కోసం అమీరు తో గడప దాటిన రాజేశ్వరి జీవితం ఆ తర్వాత ఎన్ని మలుపులు తిరిగిందన్నదే 'మైదానం' నవల. ఈ పుస్తకాన్ని గురించి మొదట తెలుసుకున్నది అమ్మ ద్వారా.. తను ఎంత కష్టపడి దీనిని సంపాదించి చదివిందో కథలు కథలుగా చెప్పి 'పెద్దయ్యాక చదువు' అని చెప్పింది. నవల చదవడానికి చాలా కాలం ముందే ఈ పుస్తకం పై వచ్చిన ఎన్నో సమీక్షలు, విమర్శలు చదివి ఉండడం తో 'మైదానం' అనగానే నిఘంటువు సైజు లో ఉండే పుస్తకం అనుకున్నాను.

ఓ సహోద్యోగిని దగ్గర మొదటి సారి ఈ పుస్తకాన్ని చూశాను. మొత్తం తొంభై పేజీలు. చాలా ఆశ్చర్యపోయాను.. ఇంత చిన్న పుస్తకం గురించి ఇంత సాహిత్యం వచ్చిందా అని. ఆవిడ దగ్గర పుస్తకం తీసుకుని త్వరత్వరగా చదివేశాను. రాజేశ్వరి అమీరు తో వెళ్ళిపోవడం వరకు ఏమీ అనిపించలేదు.. తెలిసిన కథే కాబట్టి. కానీ ఆమెకి మీరాతో పరిచయం, తదనంతర పరిణామాలు చాలా కొత్తగా అనిపించాయి. సహోద్యిగినికి చలం అంటే అభిమానం కాదు, ఆరాధన.. ఆవిడతో పుస్తకాన్ని గురించి ఎక్కువగా చర్చించే అవకాశం దొరకలేదు. 'మగ వాళ్లకి ఈ పుస్తకం అర్ధం కాదు' అని చర్చను ముగించేశారావిడ.

ఆ తర్వాత 'మైదానం' చాలాసార్లు చదివాను. చాలా మందితో ఈ పుస్తకం గురించి మాట్లాడాను. చదివిన ప్రతిసారీ రాజేశ్వరి కొత్తగా పరిచయం అయ్యేది. సనాతన భావాలున్న ఓ బ్రాహ్మణ ప్లీడర్ భార్య రాజేశ్వరి. భార్య తనని కావలించుకున్నది ప్రేమతోనో, భయంతోనో అర్ధం చేసుకోలేని ఆ ప్లీడర్ తో జీవితం ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వడు ఆమెకి. సరిగ్గా అప్పుడే ఆమెకి అమీరు పరిచయమౌతాడు. గొప్ప సౌందర్యవతి ఐన రాజేశ్వరిని అతడు తొలిచూపులోనే మోహిస్తాడు (నాకెందుకో అతను ప్రేమించాడు అనిపించలేదు) . భర్త కన్నుగప్పి అతనితో శారీరక సంబంధం కొనసాగించలేని రాజేశ్వరి అమీరు తో కలిసి నైజాముకి వెళ్ళిపోతుంది. 'దీనినే మర్యాదస్తులు లేచిపోవడం అంటారు' అని తనే చెబుతుంది.

రాజేశ్వరి పోలీసు జీపులో వెళ్తూ తన కథ చెబుతూ ఉంటుంది..కథంతా ఆమె గొంతుతోనే వినిపిస్తుంది. అమీరు, రాజేశ్వరి నిజాము ప్రాంతం లో ఓ ఊరికి దూరంగా ఓ పెద్ద మైదానం అంచున ఉన్న ఓ గుడిసెలో జీవితం ప్రారంభిస్తారు. ఇద్దరికీ రోజులు చాలా సంతోషంగా గడుస్తూ ఉంటాయి. అమీరు మొరటుదనాన్ని సైతం ప్రేమించే రాజేశ్వరి, అతను మరో అమ్మాయి మీద మనసు పడ్డాడన్న విషయం గ్రహించి ఆమెని ఒప్పించి వారిద్దరిని కలుపుతుంది. ఐతే త్వరలోనే అతనికి ఆమె మీద మొహం మొత్తడంతో మళ్ళీ రాజేశ్వరి తో కలుస్తాడు. రాజేశ్వరి గర్భం దాలుస్తుంది. అమీరుకి అది ఇష్టం ఉండదు. గర్భం కోసం రాజేశ్వరి పట్టుపట్టడం తో మీరా అనే కుర్రాడిని ఆమెకి సాయం ఉంచి ఊరు విడిచి వెళ్ళిపోతాడు అమీరు, 'ఆరు నెలల తర్వాత వస్తా'నని చెప్పి.

మీరా సాహచర్యం ఉన్నప్పటికీ అమీరు మీద బెంగ పెట్టుకున్న రాజేశ్వరి గర్భ విచ్చిత్తికి అంగీకరిస్తుంది. అమీరు తిరిగి వస్తాడు. రాజేశ్వరి-మీరా ల మధ్య ప్రారంభమైన బంధాన్ని అంగీకరించలేక పోతాడు అమీరు. రాజేశ్వరి అటు అమీరుని, ఇటు మీరాని కూడా కాదనలేని పరిస్థితిలో ఉంటుంది. మీరా ని హత్యచేయడానికి సిద్ధ పడ్డ అమీరు, రాజేశ్వరి కోసం కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. మీరాయే హత్య చేశాడని భావించిన పోలీసులు అతన్ని అరెస్టు చేయబోతుంటే, హత్యా నేరాన్ని రాజేశ్వరి తనమీద వేసుకోవడం నవల ముగింపు. అమీరుకి, మీరాకి ఒకే విధమైన ప్రేమని పంచిన రాజేశ్వరి, వారినుంచి అదే ప్రేమని తిరిగి పొందింది.

స్త్రీ మనసుని, ఇష్టాలను పట్టించుకోని సమాజం అన్నా, సంప్రదాయాలన్నా అసహ్యం రాజేశ్వరికి. దానిని ప్రతి అక్షరంలోనూ వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఆమె మేనమామ పాత్రని సమాజానికి ప్రతీకగా ఉపయోగించుకునాడు రచయిత. అతను వచ్చి 'తిరిగి వచ్చెయ్య' మన్నప్పుడు ససేమిరా అంటుంది రాజేశ్వరి. ఐతే, అమీరు తనని విడిచి వెళ్ళగానే భవిష్యత్తు గురించి భయపడి, ఇంటికి తిరిగి వెళ్ళిపోదామా అనుకుంటుంది. అమీరు-మీరా ల మధ్య ఘర్షణ ఆమెని కలచివేస్తుంది. మొదట నాకు ఈ నవల ముగింపు నచ్చలేదు. సనాతన వాదులని సంతృప్తి పరచడం కోసమే రాజేశ్వరిని జైలుకి పంపారని అనిపించింది. ఈ పుస్తకం ద్వారా ఏం చెప్పదల్చుకున్నారు అని కూడా అనిపించేది. పుస్తకాలని అవి రాసిన కాల మాన పరిస్థితుల ఆధారంగా అర్ధం చేసుకోవాలన్న విషయం అప్పట్లో అర్ధం కాలేదు.

9 కామెంట్‌లు:

  1. 1. పుస్తకాన్ని గురించి మీ అభిప్రాయాలేమిటో ఇంకా చర్చించి ఉంటే బాగుండేది.
    2. పుస్తకాలని అవి రాసిన కాలమాన పరిస్థితుల ఆధారంగా అర్ధం చేసుకోవడం.. స్త్రీల విషయంలో .. చలం మైదానం రాసిన సమయానికీ ఇప్పటికీ పెద్దగా తేడా లేదని గమనించగలరు.

    రిప్లయితొలగించండి
  2. అసలు ఎప్పటికీ ఒక శేషప్రశ్నలా మిగిలిపోయే నవల మైదానం."ప్రేమ(మోహం, లేదా ఆకర్షణ)ఎప్పుడూ ఒకేలా, ఒకరి మీదే ఉండదు. మారుతుంది" అని చెప్పడమే నవల ఉద్దేశం.(నా ప్రకారం).

    చలం స్త్రీ శరీరాన్ని అర్థం చేసుకున్నంతగా మనసుని అర్థం చేసుకోలేదన్న (చలామణిలో ఉన్న )వాదనతో నేను ఏకీభవిస్తాను. ఇతర సంప్రదాయ రచయితలు, రచయిత్రుల ప్రకారం స్త్రీలు భర్తల కోసమో,కుటుంబం కోసమో ప్రియులను, ప్రేమను త్యాగం చేస్తే, చలం నవలల్లో ప్రియుల కోసం భర్తల్ని(మైదానం), కుటుంబాలను త్యాగం చేస్తారు. అంటే స్త్రీ ఎవరి కోసమో ఒకరి కోసం త్యాగాలు చేస్తూనే ఉండన్నమాట.

    కస్తూరి మురళీకృష్న గారి నవల అసిధారలో లలిత ఇలా అంటుంది."చలం దృష్టి పురుష దృష్టి, భౌతికి దృష్టి. ఎంతసేపూ స్త్రీ శరీర సౌఖ్యం గురించి తపించి పోవడం తప్ప మనసుని గురించిన ఆలోచన కనిపించదు. తనపై శ్రద్ధ చూపించిన ప్రతి పురుషుడికీ స్త్రీ తనను అర్పించుకోవాలని,స్త్రీని పొందడంలో ఎటువంటి అడ్డంకులు , బంధాలు అవరోధం కాకూడదని భావించే పురుషుల మనసులోని భావానికి రూపకల్పనే రాజేశ్వరి......" చలంలోని భావుకుడిని, సున్నిత స్వభావాన్ని పక్కనపెట్టి ఒక్క సారి దీని గురించి దీర్ఘంగా ఆలోచించి చూడండి.

    ఎనిమిది దశాబ్దాల క్రితం రాజేశ్వరి వంటి నాయిక పాత్రను సృష్టించడమే పెద్ద సాహసం. నవల్లో ఉన్న పరిస్థితులు అప్పటికి సమాజంలో లేవు కూడా!రాజేశ్వరి సాంఘిక స్థాయి(ఎగువ మధ్యతరగతికి చెందిన బ్రాహ్మణ గృహిణి) ప్రకారం ఇప్పటికీ లేవు.

    పట్టించుకోని భర్త మీద కోపంతో అమీరుతో వెళ్ళిపోయిన రాజేశ్వరికి తనకేం కావాలో తనకే తెలియదు అని నవల్లో చాలా సార్లు అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  3. మురళిగారు ,చలం రాజేశ్వరి ద్వారా ఒక స్త్రీ "ప్రేమ" ఎలా ఉంటాదో తెలియ చేయడానికి ప్రయత్నించారు.,తనకు ఉన్న సుఖమైన జీవితం {సంఘం అభిప్రాయం ,నాది కాదు }వదులుకుని ఒక ముస్లిం వ్యక్తి తో వెళ్ళిపోయింది ,ఎంతో ధైర్యం తో ,నిజాయితీ తో ఐన వారందరినీ కాదనుకుని .తనను ఏ భంధము ఆపలేదంటే , ప్రేమ రాహిత్యం స్పష్టంగా కనబడుతోంది. ఇక్కడ అమీర్ ది మొహం అన్నారు ,కాని నాకు ఆవిధంగా కనపడలేదు,ఐతే కావచ్చు,కాని రాజేశ్వరి ని ఆమె ఇంట్లోనే కలిసే అవకాశం,ఉన్నపుడు ,అతను ఆమెను వెంట తీసుకోని వెళ్ళడు కదా! అంత రిస్క్ తీసుకోడు కదా! రాజేశ్వరి అతన్ని పిచ్హిగా ప్రేమించింది ,,కాబట్టి అతని సంతోషం కోసం ,ఆతన మొహపడిన స్త్రీ ని కలిపింది ,.,,ఇక్కడ ఆమె ఏమి చేసిన అమీర్ కోసం కనబడటది ,నాకు అర్దమైంది మాత్రం ,చలం గారు 'స్త్రీ" హృదయం లోకి ప్రవేశించి మరి రాస్తారనిపిస్తుంది.
    ఏమైనా మీరు మైదానం పయ్ మీ విశ్లేషణ ఇంకా ఉంటె బాగుండేది.


    మురళిగారు ,చలం రాజేశ్వరి ద్వారా ఒక స్త్రీ "ప్రేమ" ఎలా ఉంటాదో తెలియ చేయడానికి ప్రయత్నించారు.,తనకు ఉన్న సుఖమైన జీవితం {సంఘం అభిప్రాయం ,నాది కాదు }వదులుకుని ఒక ముస్లిం వ్యక్తి తో వెళ్ళిపోయింది ,ఎంతో ధైర్యం తో ,నిజాయితీ తో ఐన వారందరినీ కాదనుకుని .తనను ఏ భంధము ఆపలేదంటే , ప్రేమ రాహిత్యం స్పష్టంగా కనబడుతోంది. ఇక్కడ అమీర్ ది మొహం అన్నారు ,కాని నాకు ఆవిధంగా కనపడలేదు,ఐతే కావచ్చు,కాని రాజేశ్వరి ని ఆమె ఇంట్లోనే కలిసే అవకాశం,ఉన్నపుడు ,అతను ఆమెను వెంట తీసుకోని వెళ్ళడు కదా! అంత రిస్క్ తీసుకోడు కదా! రాజేశ్వరి అతన్ని పిచ్హిగా ప్రేమించింది ,,కాబట్టి అతని సంతోషం కోసం ,ఆతన మొహపడిన స్త్రీ ని కలిపింది ,.,,ఇక్కడ ఆమె ఏమి చేసిన అమీర్ కోసం కనబడటది ,నాకు అర్దమైంది మాత్రం ,చలం గారు 'స్త్రీ" హృదయం లోకి ప్రవేశించి మరి రాస్తారనిపిస్తుంది.
    ఏమైనా మీరు మైదానం పయ్ మీ విశ్లేషణ ఇంకా ఉంటె బాగుండేది.

    రిప్లయితొలగించండి
  4. ఒక్క చిన్న క్లారిఫికేషన్! "నవల్లో ఉన్న పరిస్థితులు అప్పటికి సమాజంలో లేవు" అని రాశాను. పరిస్థితులంటే 'లాయరుగా పని చేస్తోన్న భర్తను వదిలి ఒక బ్రాహ్మణ గృహిణి ఒక ముస్లిమ్ యువకుడితో వెళ్ళిపోవడం ' వంటి పరిస్థితులు అవి. అంతే కానీ స్త్రీల జీవన స్థితిగతులు కావు.

    రిప్లయితొలగించండి
  5. @సుజాత గారు ,అలా లేవని మీరు కచితంగా ఎలా చెప్పగలరు? అలా వున్నాయి ,,కాని సంఘం ఆమోదం లేదు ,నాటి కుల,వర్ణ ,మత వ్యవస్థ లో విరుద్ధంగ జరిగిన వివాహల వల్ల,సంఘ బహిష్కరణ, వారి కి పుట్టిన సంతానాన్ని "సంకర జాతి "గ పరిగణించేవారు ,,నేటి వ్యవస్థ లో అవకాశంబట్టి తండ్రి ,లేదా తల్లి వ్యవస్థ లో ఇమిడిపోతున్నారు.చలం గారి సమకాలినుల్లో జరిగిన సంఘటనలు చాల వున్నాయి.

    రిప్లయితొలగించండి
  6. మురళి గారు ,అమీర్ కు రాజేశ్వరి మీద ఉన్నది మోహమే అని నేనూ ఏకీభవిస్తాను . ఐతే ఆమె అతనిపై తనకున్నది ప్రేమగా భ్రమించి ఉండొచ్చు .కాకపొతే స్త్రీ సహజమైన కరుణ ఆమెలో ఉంది .కనుకే అమీర్ని అతడిష్ట పడిన అమ్మాయికి వదిలేయగలిగింది .అలాగే మీరాని కాదనలేక పోయింది .ఐతే అమీర్ ఇద్దర్నిష్ట పడ్డానికి ....ఆమె ఇద్దర్ని ప్రేమించడానికీ తేడా అమీర్ ది తాత్కాలికమైన మోహమైతే ....ఆమె మీరాని కాదనలేక పోవడానికి కారణం స్త్రీ సహజమైన కరుణ అనిపిస్తుంది .అమీర్ చివరికి రియలైజ్ అయ్యాడా .......ఒకవేళ అయినా ఏమి ఉపయోగం ?మీరాది ఆకర్షణే కావచ్చు ...కానీ అమీర్ లా ఆమెని అసహ్యించుకోలేదు ....కష్ట సమయంలో వదిలి వెళ్ళలేదు .ఏది ఏమైనా పాత్రలను విశ్లేషించాలనుకోవడం సాహసమే ....

    రిప్లయితొలగించండి
  7. @కొత్తపాళీ, సుజాత, చిన్ని, పరిమళం: ధన్యవాదాలు.. రాజేశ్వరి చివరకి ఏం సాధించింది అన్న దగ్గర నా ఆలోచనలు ఆగిపోతూ ఉంటాయి. తను బయటికి వెళ్ళింది ఏదో సాధిద్దామని కాదుకదా.. తనకు నచ్చినట్టుగా జీవించాలనుకుంది, జీవించింది..

    రిప్లయితొలగించండి
  8. మురళీ గారు మంచి మెదడుకు మేత మొదలు పెట్టేరు. మోహానికి ప్రేమ కు తేడా చాలా చిన్న గీత మోహం లేని ప్రెమ ను ప్లాటోనిక్ ప్రేమ అంటారు చలం.. అటువంటి ప్రేమ మీద ఆయనకు సదాభిప్రాయం కూడా వున్నట్లు అనిపించదు మరి.. ప్రేమ లేని మొహం వుంటుందేమో కాని అమీర్ కు అటువంటిది కాదు అనుకుంటున్నాను నేను.. ఏక్కడ ఐనా ఎటువంటి సంబంధం లో ఐనా ఆడది అణిచివేత కు గురిచేయ బడుతుంది ఒక్కోసారి విచిత్రం ఏమిటి అంటే అణిచివేయబడిన ఆడవాళ్ళకే అర్ధం కానంత మాయాజాలం లో పడిపోతారు అది పెళ్ళి అనే బంధం కానీయండి.. ప్రేమ అనే బంధం కానీయండి.. మీ సహోద్యాయని కొంచం మార్చాలి ఆమె మాటను మొగవాళ్ళకు అనకూడదు... చాలామందికి ఈ పుస్తకం అర్ధం కాదు అని ముగించవలసింది :-) చలం మొగ వాడే కదా.. ఆయనను అర్ధం చేసుకున్న అనేకమంది మొగవాళ్ళూ వున్నరు కదా నిజానికి చాలా మంది ఆడ వాళ్ళే ఆయనను అర్ధం చేసుకోలేదేమో అనిపిస్తుంది నాకు మొగ వాళ్ళు కొంచెం మంది అర్ధం చేసుకుంటారు కాని వాళ్ళకు అంగికరించటం భయం ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళకు తెలుసు కాబట్టీ.. :-)
    ఇంక సాధించటం దగ్గరకు వస్తే రాజేశ్వరి జీవితాన్ని సాధించింది.. మీరు చెప్పింది నిజం తనకు నచ్చినట్లు జీవిద్దాము అనుకుంది జీవించింది... జీవితానికి అర్ధం జీవించటమే కదా. చిన్ని చెప్పిన వాటన్నిటితో నేను ఏకీభవిస్తున్నాను.

    రిప్లయితొలగించండి