హండే రాజుల పాలనా కాలాన్ని కళ్లముందుంచిన 'శప్తభూమి' తరువాత, బండి నారాయణ స్వామి నుంచి వచ్చిన మరో చారిత్రక కల్పన 'కడపటి యుద్ధం' నవల. హంపీ విజయనగరం రాజధానిగా పాలన సాగించిన విజయనగర రాజుల్లో చిట్టచివరి బలమైన రాజు, శ్రీకృష్ణ దేవరాయలుకి స్వయానా అల్లుడు అయిన అళియ రామరాజు కాలానికి పాఠకుల్ని అదాటున తీసుకుపోయే బృహన్నవల ఇది. అంతేకాదు, విజయనగర చరిత్రకి దాదాపుగా చరమగీతం రాసిన 'రక్కసి తంగడి' యుద్ధం ఈ నవలలో ముగింపు సన్నివేశం. తుళువ వంశీయుడు, శ్రీకృష్ణ దేవరాయలుకి బంధువు అయిన సదాశివ రాయలని పేరుకి మాత్రం సింహాసనం మీద కూర్చోబెట్టి, పాలనా వ్యవహారాన్నీ తనే చక్కబెడుతూ, రాయల విధానాలనే అనుసరిస్తూ తనని తాను 'అళియరామ రాయలు' ని పిలిపించుకోవాలని ఉబలాటపడే రాజు కాని రాజు కథ ఇది.
చారిత్రక నగరం హంపీ ఎలా శిధిలమయ్యింది? చరిత్ర చెబుతున్న కారణం, రక్కసి తంగడి యుద్ధంలో అళియ రామరాజు మరణానంతరం పంచ పాదుషాలు, వారి తాలూకు సైన్యాలు జరిపిన దమనకాండ వల్ల అని. అయితే, హంపీ పతనానికి కారణం కేవలం వైష్ణవులు-శైవులూ తమలో తాము కలహించుకుని, ఆలయాలని, ఇతర నిర్మాణాలని ధ్వంసం చేసుకోవడమే తప్ప, పాదుషాలు ఏ పాపమూ ఎరుగరు అని చెప్పే కథలున్నాయి. వాటిని బలంగా నమ్మే వారూ (ముఖ్యంగా హంపిని కళ్ళతో చూడని వారు) ఉన్నారు. బండి నారాయణ స్వామి కథల్ని కాక, చరిత్రని ప్రామాణికంగా తీసుకున్నారు. అయితే, అళియ రామరాజుకి పంచ పాదుషాల వల్ల కన్నా, రహస్యంగా వాళ్లకి సహకరించి, యుద్ధభూమిలో సొంత సైన్యానికి వెన్నుపోటు పొడిచిన హంపీకి చెందిన ముస్లిం సైనికుల వల్లనే ఎక్కువగా నష్టం జరిగిందని ప్రతిపాదించారు.
ఇంతకీ పంచ పాదుషాలు ఏకమై అళియ రామరాజుపై యుద్ధం ఎందుకు ప్రకటించారు? నిజానికి వీరిలో ఇద్దరు పాదుషాలు అళియరామకి పుత్ర సమానులు. మిగిలిన వారికీ అవసరమైనప్పుడు సహాయం చేశాడే తప్ప, కత్తిదూయలేదు. పైగా, పాదుషాల మధ్య వచ్చే తగువులని పరిష్కరించే మధ్యవర్తిత్వం కూడా అనేకమార్లు నెరపాడు. శతృత్వం మొదలవ్వడానికి నవలా రచయిత ప్రతిపాదించిన కారణాలు రెండు: అళియరామ పెద్దరికాన్ని ఎందుకు భరించాలన్న ప్రశ్న పాదుషాలలో మొలకెత్తడం మొదటిదైతే, హిందూ రాజ్యం విజయనగరాన్ని స్వాధీనం చేసుకుంటే ఇస్లాం మత విస్తరణకి అడ్డు ఉండదన్న ఆలోచన రెండవది. మత విస్తరణకి రాజ్యమా, లేక రాజ్య విస్తరణకి మతమా? మహాభారతంలో ద్రౌపది సంధించిన ప్రసిద్ధమైన ప్రశ్న 'తానోడి నన్నోడెనా, నన్నోడి తానోడెనా?' ని గుర్తు తెచ్చే సందర్భం.
'కడపటి యుద్ధం' నవలలో కథానాయకుడు రెండుకత్తుల హంసణ్ణ. 'శప్తభూమి' కథానాయకుడు బిల్లే ఎల్లప్పకీ, ఈ హంసణ్ణకీ చాలా పోలికలున్నాయి. హంసణ్ణ తండ్రి ఉత్తణ్ణ హంపీ నగరంలో చర్మకారుడు. జంతుచర్మాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే శ్రీవైష్ణవాన్ని త్రికరణశుద్ధిగా పాటించే దాసరి (మహాభారతంలో ధర్మవ్యాధుణ్ణి గుర్తు చేసే పాత్ర). చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న హంసణ్ణ మేనత్త దగ్గర పెరుగుతాడు. తండ్రికి కొడుకు మీద ప్రేమ వున్నా, శ్రద్ధ లేనట్టే. యుక్త వయస్కుడైన హంసణ్ణ, అంతఃపురం నుంచి పారిపోయిన -- అళియ రామరాజుకి ప్రియమైన -- తెల్లమచ్చల నల్ల ఏనుగుని అడవిలో కనుగొనడం ద్వారా అళియకి దగ్గరై, యుద్ధ విద్యలు నేర్చుకుని, దుర్గాధిపతిగా ఎదుగుతాడు. ఇంట్లో అతడి విజయాన్ని అభినందించే వాళ్ళు లేరు. తాను ప్రేమించిన కన్యని పెళ్లాడడానికి ఈ హోదా ఏమాత్రమూ అక్కరకు రాలేదు, కులమే అడ్డంకి.
గోల్కొండ కోటలో అంతః కలహాల కారణంగా ఆశ్రయం ఇవ్వమని అళియ రామరాజుని అర్ధిస్తాడు బాలుడైన ఇబ్రహీం. హంపీలోనే ఎదిగి, యువకుడయ్యాక దేవదాసి శ్రీవల్లి కూతురు భాగీరధితో ప్రేమలో పడతాడు. గోల్కొండ రాజకీయ పరిస్థితులు మారడంతో, తన కోటకి చేరి పాదుషాగా పట్టాభిషిక్తుడవుతాడు. భాగీరధిని మర్చిపోకుండా, ఆమె కోసం పల్లకీని పంపి పట్టపు రాణిని చేసుకుంటాడు. హంపిని మర్చిపోడు, అక్కడి సైన్యంలో రహమాన్ లాంటి మెరికలని గుర్తించి, తగిన పదవులతో గోల్కొండకి సగౌరవంగా ఆహ్వానిస్తాడు. అళియ రామరాజునూ మర్చిపోలేదు, మిగిలిన నలుగురు పాదుషాలనీ ఏకం చేసి, పంచ పాదుషాలకి నాయకత్వం వహించి, అదను చూసి విజయనగరంపైకి దండెత్తుతాడు. చక్రపొంగలితో మొదలయ్యే ఇబ్రహీం-భాగీరధిల పరిచయం, ప్రేమగా మారి, ఆమె పేరిట 'భాగీరధీ నగరం' నిర్మించడం వరకు ఎదిగిన తీరుని, ఈ క్రమంలో-- మరీ ముఖ్యంగా గోల్కొండ సైన్యాలు హంపిపై దండయాత్రకి బయలుదేరినప్పుడు -- భాగీరధి అంతః సంఘర్షణని ప్రత్యేకంగా చిత్రించారు రచయిత.
ఇది కేవలం రాజుల కథ కాదు. రాజుల కథ రాయడం మాత్రమే తన ఉద్దేశం కాదని 'శప్తభూమి' తోనే నిరూపించారు నారాయణ స్వామి. ఇది కూడా రాజ్యం కథే. విజయనగర సామ్రాజ్యంలో వివిధ వర్గాల ప్రజల కథ. అధికారాన్నీ, యవ్వనాన్నీ తనివితీరా అనుభవించే తెలుగుల మాధవుడి కథ. ఉదయాన్నే తన గుడిసె ఎదుట వ్యాయాయం చేసుకుని, అంతఃపురంలో బెత్తంధారిణి ఉద్యోగానికి గుర్రంపై బయలుదేరే చినపోతి కథ. వేశ్య రత్నమాలని మనసారా ప్రేమించిన వ్యాపారి టిట్టిభ శెట్టి కథ (కాళ్ళకూరి 'చింతామణి' ని జ్ఞాపకం చేసింది). కులవృత్తిని కొనసాగించే దేవదాసీ పండితురాలు శ్రీవల్లి, ఇష్టపూర్వకంగా వేశ్యావృత్తిని చేపట్టిన రంజని, మహిళా కరణం విద్యావతి, క్షురకుడిగానే కాక, శస్త్రచికిత్స నిపుణుడిగానూ పేరు తెచ్చుకున్న కొండోజు... ఒకటా, రెండా, రచయిత ఇచ్చిన జాబితాలోనే అరవై ఆరు పాత్రలున్నాయి. ప్రతి పాత్రనీ గుర్తుపెట్టుకునే విధంగా తీర్చి దిద్దే నైపుణ్యం ఈ రచయిత సొంతం. ఒక్క ఇలావతి పాత్ర ముగింపు మాత్రం నిరాశ పరిచింది.
'అన్నపు రాశులు ఒకచోట.. ఆకలి మంటలు ఒకచోట' అన్న ప్రజాకవి కాళోజీ నారాయణరావు మాట, ఈ కాలానికే కాదు ఆ కాలానికీ సరిపోతుంది. సిరులు పొంగిన విజయనగరంలోనే, బాకీ చెల్లు వేయలేక బానిసగా మారి, అటుపై ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కొండమీద రాయుడు కథ, ఆ కాలం నాటి పేద రైతుల జీవితాలకి ఒక ఉదాహరణ. అతడి కుటుంబం విచ్చిన్నమైన తీరుని నవలలో చదువుతుంటే, ఏ కాలమూ కూడా ఎల్లరకూ స్వర్ణయుగం కాదన్న సత్యం మరోసారి తలపుకొస్తుంది. ఇదే నవల, దేవదాసీల స్నానపు గదుల నుంచి సుగంధ భరితమైన మురుగు నీరు వారి పెరళ్ళలోని పూల మొక్కల్లోకి ప్రవహించడం, ఆ మొక్కల మధ్య ఏపుగా ఎదిగిన తాడి చెట్టు తాలూకు ఆకులతో కూర్చిన తాళ పత్రాలు 'కళాపూర్ణోదయం' కావ్యకర్త పింగళి సూరన ఇంటికి చేరడాన్ని విశదంగా చిత్రిస్తుంది!! దేవదాసీలు, భోగపత్నులు, వేశ్యల స్థాయీ భేదాల వర్ణన సరేసరి.
కొన్ని కులాలకి చెందిన పాత్రలని గురించి రాసేప్పుడు నారాయణస్వామి కలం కాస్తంత అదుపు తప్పడాన్ని 'శప్తభూమి' లో గమనించ వచ్చు. కొన్ని పాత్రల్ని చిత్రించడంలో రచయిత 'కసి' నవలని నిశితంగా చదివిన పాఠకుల దృష్టిని దాటిపోదు. 'కడపటి యుద్ధం' దగ్గరకు వచ్చేసరికి, రచయిత ఆ కసిని దాచుకునే ప్రయత్నం ఏమాత్రమూ చెయ్యలేదు. రెండు మూడు కులాల నుంచి వచ్చే ప్రతి పాత్రా దుర్మార్గంగానే ప్రవర్తించడం, వాటి ప్రవర్తన అన్ని విధాలుగా తీసికట్టుగా ఉడడం, ఈ నవలని మామూలుగా చదువుకుంటూ వెళ్ళినప్పుడు కూడా పాఠకులు గమనిస్తారు. ఒకే ధర్మాన్ని ఆచరించే పాత్రల్లో కూడా, రచయిత ఇష్టపడని కులాలకి చెందిన పాత్రలు దుర్మార్గంగా వ్యవహరించగా, మిగిలినవి ధర్మబద్ధంగా నడుచుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, నవల కొన్ని పేజీలు తిరిగేసరికి ఒక పాత్ర కులాన్ని బట్టి ఆ పాత్ర ఎలా ప్రవర్తించబోతోందన్న అంచనా వచ్చేస్తుంది.
గతానుభవాల దృష్ట్యా, బీభత్సరస ప్రధానమైన నవల చదవడానికి సిద్ధపడిపోయాను. నారాయణస్వామి ఇటీవలి నవలల్లో హింస పాళ్ళు ఎక్కువే. పైగా, ఈ నవల పేరులోనే యుద్ధం వుంది. హింస, నెత్తురు లేవని కాదు, కానీ ప్రతీ హింసాత్మక సన్నివేశానికీ కరుణ రస ప్రధానమైన ముగింపు ఇవ్వడంతో బీభత్సం పాళ్ళు తక్కువే అనిపించింది. చివరి పేజీల్లో యుద్ధ సన్నివేశాలు నెత్తురోడుతూ ఉంటాయని మానసికంగా సిద్ధ పడడం వల్ల కాబోలు, అక్కడ కూడా హింస మరీ అతిగా అనిపించలేదు. నారాయణస్వామి తన ధోరణికి భిన్నంగా హింసని తగ్గించారా? లేక, ఆ మోతాదుకి నేను అలవాటు పడిపోయానా??తెల్లమచ్చల నల్ల ఏనుగుని మొదటి నుంచీ ఇష్టపడడం వల్ల, నవల పూర్తి చేశాక కూడా ఆ ఏనుగు బాగా వెంటాడింది నన్ను. క్లుప్తంగానే రాసినా, గోవా ఇంక్విజిషన్, అక్కడినుంచి 'సిఫిలిస్' వ్యాధి హంపీకి వ్యాపించిన విధమూ కూడా అలా ముద్ర పడిపోయాయి.
విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఒక వేగు, గోల్కొండ నుంచి ఒక రహస్య వర్తమానాన్ని తీసుకురావడంతో నవల ప్రారంభమవుతుంది. గుర్రంపై ప్రయాణిస్తూన్న ఆ వేగు, హంపీ సరిహద్దు నుంచి, రాజధానిలో ప్రవేశించడం, అంతఃపురాన్ని చేరుకోవడం, అళియ రామరాజుని దర్శించడం వరకూ అతడితోనే కలిసి ప్రయాణిస్తారు పాఠకులు. అక్కడి నుంచి వేగు అదృశ్యమైపోతాడు. పాఠకులు కథతో ముందుకు సాగిపోతారు. నవల ముగింపులో జరిగే యుద్ధంలో అళియ రామరాజు ఓటమికి కారణాలని తరచి చూస్తే, వేగుల వైఫల్యమూ ఒకటి. పంచ పాదుషాల ఎత్తుగడలని గురించి వేగుల నుంచి వర్తమానం ఉంటుంది. కానీ, సొంత సైన్యం నుంచి జరగబోయే వెన్నుపోటుని గురించి ఏమాత్రమూ ఉప్పందదు. వెన్నుపోటుని వేగులు కూడా పసిగట్ట లేరన్న సూచన ఏదో ఉన్నట్టుంది.
దాదాపు ఆరొందల పేజీల నిడివి ఉన్న ఈ నవల, నాటి విజయనగరం, గోల్కొండ రాజ్యాల పాలననీ, ప్రజల జీవనాన్నీ, కళాసంస్కృతులనీ, ఆచరించిన మతధర్మాలనీ నిశితంగా చిత్రించింది. 'హిస్టారికల్ ఫిక్షన్' లోనే చరిత్ర, కల్పన రెండూ ఉన్నాయి. ఏది చరిత్ర, ఏది కల్పన అన్నది పాఠకుల అవగాహనకి, అనుభవానికి, చరిత్ర పరిజ్ఞానానికి సంబంధించిన విషయం. 'ఇలా కూడా జరిగి ఉండవచ్చు' అనే అంచనాని ప్రతి చారిత్రక నవలా ఇచ్చినట్టే, ఈ 'కడపటి యుద్ధం' కూడా ఇస్తుంది. రచయిత చేసిన రాక్షస పరిశోధన, నవల రాయడానికి చేసిన కృషి, అనేకానేక పాత్రల్ని సృష్టించి, ఒక్కో పాత్రనీ వాటివైన ముగింపుకి తీసుకెళ్లిన తీరు, మరీ ముఖ్యంగా రచయితతో అంగీకరించినప్పుడు, విభేదించినప్పుడూ కూడా ఆపకుండా చదివించే శైలీ ఈ నవల ప్రత్యేకతలు. ఈ నవల చదవడం ఒక అనుభవం. రచయిత స్వయంగా రాసుకున్న వెనుకమాటతో పాటు, ఆచార్య కొలకలూరి ఇనాక్, గోరటి వెంకన్నల అభిప్రాయాలనీ చివర్లో పొందుపరిచారు.
('కడపటి యుద్ధం' నవల, రచన బండి నారాయణ స్వామి, అజు పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు 628, వెల రూ. 699, అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ, అమెజాన్ లోనూ లభిస్తోంది)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి