బుధవారం, జులై 19, 2023

శ్రీరమణ ...

సుమారు పాతికేళ్ల క్రితం మాట. ఒక సాహిత్య సభ జరగాల్సి ఉంది, అప్పటికే గంటకి పైగా ఆలస్యం. ఉన్న కొద్దిమంది ప్రేక్షక శ్రోతలూ కాస్త అసహనంగా ఉన్నారు. ఇంతలో చిన్నపాటి కలకలం, "శ్రీరమణ గారొస్తున్నారు.." అంటూ. నేనేమో 'ద్వారానికి తారా మణిహారం' లాగా గుమ్మం దగ్గర నిలబడి మిత్రులతో కబుర్లు చెబుతున్నాను. పరిస్థితిని బట్టి లోపలికో, బయటికో వెళ్లేందుకు వీలుగా. లోపలికి వెళ్ళబోతున్న శ్రీరమణ నా పక్కనే ఆగారు. అవి 'మిథునం' రోజులు. అంటే, 'మిథునం' కథా సంకలనం విడుదలై ఎక్కువమంది మెప్పు పొందిన రోజులు. 'మిథునం' కథకైతే కల్ట్ స్టేటస్ వచ్చేస్తూ ఉన్న కాలం. "ఈయన శ్రీరమణ గారు, మిథునం, తెలుసుకదా.." ఓ మిత్రుడు నన్నాయనకి పరిచయం చేసేశాడు. వేదిక మీద ఔత్సాహిక గాయని పాట పాడుతోంది. శ్రీరమణ అక్కడే ఆగిపోయారు. అలాంటి అనూహ్య పరిస్థితిలో ఆయనతో చిరు సంభాషణ సాగింది.

"మీ స్వస్థలం ఎక్కడండీ? 'షోడా నాయుడు' లో మగ్గాల వర్ణన చదివి, ఏ ఊరు అయి ఉంటుందా అని ఆలోచించాను" చాలా కేజువల్ గా అడిగాను. "తెనాలి దగ్గర అండీ.. ఆ మగ్గాలూ అవీ నా చిన్నప్పుడు, ఇప్పుడు ఉన్నట్టు లేవు" అంతే కేజువల్ జవాబు. "ఆ కథ ముగింపు చాలా ప్రత్యేకం.. మొత్తం కథ ఒక ఎత్తైతే, ముగింపు ఒక్కటీ ఓ ఎత్తు.." అంతకు ముందే చదివి ఉన్నానేమో, నాకు కథలన్నీ బాగానే గుర్తున్నాయి. "థాంక్యూ" క్లుప్తంగా వచ్చింది జవాబు. సన్నగా, ఆయనే ఒక కాలమ్ లో వరవరరావుని వర్ణించినట్టు 'పంట్లాము తొడుక్కున్న కృపాచార్యుడిలా' అనిపించారు శ్రీరమణ. "ధనలక్ష్మిలో భాష.. అసలు ఎలా పట్టుబడిందా అనిపించింది చదువుతుంటే. కథకుడి భాష వేరు, ధనమ్మ, రామాంజనేయులు భాష వేరు.. పై పెంకు మరియు కోడిపిల్ల..." చెబుతుండగానే నవ్వొచ్చింది నాకూ, శ్రద్ధగా వింటున్న ఆయనకీ కూడా. "తెలిసిన వాళ్లేనండి .. నాకు తెలిసిన మనుషులే అందరూ." గాయని పాట కొనసాగుతోంది.

"బంగారు మురుగులో కొన్నిచోట్ల నన్ను నేను చూసుకున్నాను.. బామ్మ మరీ ఐడియలిస్టిక్ గా అనిపించింది కొన్నిచోట్ల.." నా అనుభవం కొద్దీ అన్నమాట. "లేదండీ, ఉన్నారు అలాంటి వాళ్ళు.." మళ్ళీ క్లుప్తమైన జవాబు. "ఆయన్ని అందరూ 'మిథునం' శ్రీరమణ అంటారు, మీరసలు ఆ కథ మాటే ఎత్తడం లేదు?" ఆయన పక్కనున్నాయన ప్రశ్నించాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన జయప్రభ ('పైటను  తగలెయ్యాలి' ఫేమ్ ఫెమినిస్టు కవయిత్రి) "ఏంటి రమణా? ఆడవాళ్లు అంటే ఎంతసేపూ వండి పెట్టడమేనా? ఆ బుచ్చిలక్ష్మికి వేరే పని లేదా?" అంటూ ప్రశ్నలు కురిపిస్తూ ఆయన్ని లోపలికి తీసుకు (లాక్కు)పోయారు. నేను నిలబడిపోయాను. అది మొదలు, శ్రీరమణ పుస్తకం ఎప్పుడు చదివినా, ఈ సన్నివేశం మొత్తం నిన్ననే జరిగినంత తాజాగా గుర్తొస్తూ ఉంటుంది. వాక్యం మీద అద్భుతమైన అదుపు ఉన్న కొద్దిమంది తెలుగు రచయితల్లో శ్రీరమణ ఒకరు. పొదుపైన వాక్యాలతో విస్తారమైన (నిడివి పరంగా) కథలు రాసిన శ్రీరమణ ఇక లేరన్న వార్త తెలియగానే ఇదిగో మళ్ళీ ఇంకోసారి గుర్తొచ్చింది నాటి చిరు సంభాషణ.


పేరడీ మొదలు ముందుమాట మీదుగా ఎలిజీ వరకూ ఏం రాసినా ప్రతి ప్రక్రియ మీదా తనదైన ముద్ర వేశారు శ్రీరమణ. 'పాషాణ పాక ప్రభువు' విశ్వనాథ శైలిని అనుకరించడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. వ్యంగ్యంతో సహా ఏరసాన్ని ఎక్కడ ఏమోతాదులో వాడాలో బాగా తెలిసిన రచయిత అవ్వడం వల్ల రచనలన్నీ బాగా పండాయి. కొన్ని కాలమ్స్, కథల్ని మరిపిస్తాయి. చాలా కథలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. నవలలు మరికాస్త బావుండొచ్చు అనిపించినా బొత్తిగా తీసేసేవి కాదు. ఇతరుల రచనలకి ఆయన రాసిన ముందుమాటలు రెండు రకాలు. రచనని ఇష్టపడి మనస్ఫూర్తిగా రాసినవి, మొహమాటానికి బలవంతంగా రాసినవి. చదువుతూనే అవి ఏ కోవకి చెందుతాయో ఇట్టే పోల్చుకోవచ్చు. చదివినంతలో ఓ రెండు బలవంతపు ముందుమాటలు ఎప్పుడు తల్చుకున్నా నవ్వు తెప్పిస్తాయి. ఈ రెండూ కాకుండా మూడోరకం 'నాస్తికానికి ముందుమాట', నరిశెట్టి ఇన్నయ్యగారు ప్రచురించని ముందుమాట దానికదే సాటి.

నివాళి వ్యాసాలదీ ఇదే తీరు. చాలావరకు మనస్ఫూర్తిగా రాసినవే. పోయిన వాళ్ళ సుగుణాలతో పాటు, వాళ్ళతో తన అనుబంధాన్ని తల్చుకుంటూ రాసిన విలువైన నివాళులవి. కొన్ని మాత్రం పూర్తిగా భిన్నం. పోయినవాళ్ళు కనుక బతికితే, ఆ నివాళి చదవగానే గుండాగి చచ్చిపోతారేమో అనిపించేలాంటివి. పెంకితనంగా రాసినవి.  రానురానూ ఈ ధోరణి బాగా పెరిగింది కూడా, బొత్తిగా ఎవరినీ క్షమించలేదు. ఎవరైనా ఓ రచయిత రచనలు అన్నీనో, ఎక్కువగానో చదవడం వల్ల జరిగేది ఏంటంటే ఆ రచయిత మనకి బాగా తెలిసిన వ్యక్తి అయిపోతారు. కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి ఏం రాస్తారో ఊహించ గలుగుతాం, ఎదురు చూస్తాం కూడా. శ్రీరమణ వీక్లీ కాలమ్స్ విషయంలో నా అనుభవం ఇదే. 'సాక్షి' నాటికి ఆయన కాలమ్ ఏ విషయం మీద మొదలు, ఎలా ఉండబోతోంది వరకూ ఓ అంచనా ఉండేది. చాలాసార్లు అది నిజమయ్యేది కూడా. కీలకమైన రాజకీయ సందర్భాలని వ్యంగ్యాత్మకంగా రికార్డు చేశారు.

'చిలకల పందిరి' ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆర్టిస్టు మోహన్ తో కలిసి శ్రీరమణ చేసిన ఈ జుగల్బందీ అంటే నాకు మాత్రమే కాదు, శ్రీరమణకి, మోహన్ కీ కూడా ప్రత్యేకమైన ఇష్టం. అల్లదిగో ఆ పుస్తకం వచ్చేస్తోంది అంటూ చివరివరకూ ఊరిస్తూనే వచ్చారు శ్రీరమణ. అదొక్కటే కాదు, 'దేవుడు మేలు చేస్తే..' అంటూ ఆయన విప్పిన జాబితాలో నుంచి ఇంకా రావాల్సిన పుస్తకాలున్నాయి. ఇప్పుడు వాటి బాధ్యతని ఎవరు చూస్తారో మరి. వంకమామిడి రాధాకృష్ణగా ఓ ఇంట్లోనూ, కామరాజు రామారావు గా మరో ఇంట్లోనూ పెరిగి, తనకంటూ 'శ్రీరమణ' అనే పేరు పెట్టుకుని రచయితగా ఎదిగి, రాయాల్సినన్ని కథలూ, వ్యాసాలూ రాయకుండానే వెళ్లిపోయారు. 'రాయాల్సినన్ని' కి ప్రాతిపదిక ఏమిటంటే ఆయనకున్న విషయ పరిజ్ఞానం, విస్తృతమైన పఠనానుభవం, తనదైన రచనా శైలీను. రాసిన పుస్తకాలన్నిటినీ వెలుగులోకి తీసుకురావడమే శ్రీరమణకి ఇవ్వగలిగే ఘనమైన నివాళి.

10 కామెంట్‌లు:

  1. శ్రీరమణ అనే హెడ్డింగ్ చూడగానే అనుకున్నా ఇది దేనికో సంకేతమని. బెదురుతూ చదువుతున్నా. మనసులో మెదులుతున్నది మూడవ పేరాలో నిజమైంది. బాధ వేసింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వార్త తెలియగానే బాధగా అనిపించిందండీ.. కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్నారని తెలుసు, కానీ వెళ్ళిపోతారని అనుకోలేం కదా..

      తొలగించండి
  2. విభిన్నమైన రచయిత 🙏.
    శ్రీరమణ గారికి తగినంత పేరు రాలేదేమో అని నాకనిపిస్తుంటుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'మిథునం' కథ విషయంలో బోల్డంత రచ్చ మాత్రం జరిగిందండీ.. పేరంటే ఒకటి గుర్తొచ్చింది. చాన్నాళ్ళ క్రితం మిత్రులైన ఓ ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారికి 'మిథునం' సంపుటి బహూకరిస్తే, ఆయన చదివి 'ముళ్ళపూడి వెంకటరమణ బాగా రాశారు' అన్నారు. ఇద్దరూ వేరువేరు అని వివరించి చెప్పాల్సి వచ్చింది ఓపికగా.. బహుమతులు, సత్కారాలతో వచ్చే 'పేరు' వేరే కదండీ, అందరికీ రాదు కదా..

      తొలగించండి
  3. మిథునం ఎంత బావుంటుందో బంగారు మురుగు అంత కన్నా మనసుని తది చేసి వెళ్తుంది. ధనలక్ష్మి గడుసుతనం ఆ కాలం ఐనా ఈ కాలం ఐనా అమ్మాయిలందరికీ మార్గ దర్శియే. మహా రచయితకి బహు చక్కని నివాళి. వాణీ జయరాం గారికోసం మాత్రం మీ నుండి నివాళి వస్తుందని చాలా ఎదురు చూసా మురళి గారు 🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వాణి జయరాం వెళ్ళిపోయినప్పుడు ఆ వారమంతా నేను యాత్రలో ఉన్నానండీ, తిరిగొచ్చాక వెంటనే వీలు పడలేదు.. నాకు ఇష్టమైన గాయని, నాలుగు మాటలు రాయాలనే ఉంది.. చూడాలండీ..

      తొలగించండి
  4. ఏదో ఒక వార పత్రికలో కాలం రాయటానికి ఒప్పుకొని , ప్రతివారం సమయానికి రచన అందించాల్సిన ఆ వత్తిడిలో కథలకు సంబంధించిన చాలా ఆలోచనల్ని ఆ కాలం లో వాడేసారట. లేకుంటే ఇంకెన్ని మంచి కథలు వచ్చుండేవో?

    బంగారు మురుగు కథయితే మొట్టమొదటి సారి చదివినప్పుడు చాలా రోజులపాటు ఆ ట్రాన్స్ లోనే ఉండిపోయాను. ఇప్పటివరకు ఎన్నిసార్లు చదివానో లెక్కేలేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అలాంటి ట్రాన్స్ నాకు షోడా నాయుడు ఇచ్చాడండీ.. శ్రీరమణ రాసి, ఇంకా పుస్తకాలుగా రావాల్సినవి కూడా చాలా ఉన్నాయి.. ఎప్పుడు వస్తాయో.. ధన్యవాదాలండీ..

      తొలగించండి