మంగళవారం, జనవరి 24, 2023

పద్నాలుగు ...

గట్టి పట్టుదలతో ఏడాదిని మొదలుపెట్టి, కొన్నాళ్ళపాటు ఆ పట్టుదలని కొనసాగించి, నెమ్మది నెమ్మదిగా జారిపోవడం అన్నది బ్లాగింగ్ విషయంలో అనుభవం అయ్యింది గడిచిన ఏడాది కాలంలో. మళ్ళీ ఇప్పుడిప్పుడే 'బ్యాక్ ఆన్ ట్రాక్' అనుకోగలిగే పరిస్థితులు కనిపిస్తూ ఉండడం సంతోషదాయకం. బ్లాగరుగా పద్నాలుగేళ్ళ పూర్తి చేసుకుని పదిహేనో ఏట అడుగు పెట్టబోతున్న సమయంలో చేసుకుంటున్న స్వీయ విశ్లేషణ ఇది. ఎప్పటిలాగే రాయాలనుకున్నవన్నీ రాయలేకపోవడం, చదవల్సినవి చదువకుండా పెండింగ్ పెట్టడమే గడిచిన ఏడాదీ జరిగింది. మునుపటితో పోలిస్తే చాన్నాళ్ల తర్వాత రాశి కాస్త కనిపిస్తూ ఉండడం వల్లనేమో ఈసారి సింహావలోకనంలో హింస పాళ్ళు కనిపించడం లేదు నాకు. 

కరోనా భయాల నుంచి అందరూ నెమ్మది నెమ్మదిగా కోలుకుంటున్నట్టే ఉంది పరిస్థితి. ఇదిగో వేరియంట్ అదిగో వేవ్ అనే వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నా పరిస్థితులు చక్కబడడం తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ఊళ్లు తిరిగే వాళ్ళకి కాస్త వెసులుబాటుగా ఉంటుంది. ఆందోళనల నుంచి ఉపశమనం దొరికితే వ్యాపకాల వైపుకి దృష్టి మళ్లుతుంది. గతేడాదితో చాలామంది టూర్లు పోస్టుపోన్ చేసుకున్నాం అని చెప్పిన వాళ్ళే. కరోనా వల్ల జరిగిన మెలేమైనా ఉందా అంటే ఓటీటీ ప్లాట్ ఫారాలు మరింత దగ్గరయ్యాయి. పరభాషా సినిమాలని పరికించే వీలు దొరికింది. బాగుంటుంది అనిపిస్తే తప్ప సినిమా కోసం థియేటర్ కి వెళ్లాల్సిన అగత్యమూ తప్పింది. మలయాళం, మరాఠీ భాషల్లో వస్తున్న సినిమాలు మిగిలిన వాటికన్నా ప్రత్యేకంగా ఉండి ఆకర్షిస్తున్నాయి. 

Google Image

గమనించిన సంగతేమిటంటే తెలుగు సినిమా వాళ్ళు నటీనటుల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. అటు మలయాళీలు కానీ ఇటు మరాఠీలు కానీ నటులకు వెచ్చించే దానికి సరిసమానంగా కథ, సంగీతం కోసం వెచ్చిస్తారు. మొత్తంగా చూసినా వాళ్ళ సినిమాల బడ్జెట్ మన వాటిలో నాలుగో వంతు కూడా ఉండదు. ఖర్చు నేలమీద ఉండడం వల్లనేమో కథలూ నేలమీదే నడుస్తాయి. ఫోటోగ్రఫీలో మలయాళీలని (లొకేషన్లు వాళ్ళకి భలే ప్లస్ పాయింట్), నేపధ్య సంగీతంలో మరాఠీలనీ కొట్టేవాళ్ళు లేరు అనిపించింది కొన్ని సినిమాలు చూశాక. అసలు మరాఠీలు ఇంత ప్రోగ్రెసివ్ అని వాళ్ళ సినిమాల వల్లే తెలిసింది.  సినిమాలు చూడ్డం బాగానే ఉంది కానీ, ఇవి కాస్తా చదువు, రాత టైంని తినేస్తున్నాయి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని హిందీ సామెత ఉంది కదా. 

థియేటర్ కి వెళ్లి చూసినవి రెండే సినిమాలు. 'సీతారామం' మొదటిది, కన్నడ 'కాంతార' రెండోది. 'కాంతార' ఎక్కువగా నచ్చింది, పల్లెటూరి మట్టివాసన ప్రభావం కాబోలు. పుస్తకాల్లో కూడా కన్నడ నుంచి అనువాదం అయి వస్తున్న కథలు, నవలలు భలే ప్రత్యేకంగా ఉంటున్నాయి. 'తూఫాన్ మెయిల్' సంపుటిలో కథలు చాలారోజులు వెంటాడాయి. అన్నట్టు ఈ బ్లాగు వెయ్యిపోస్టుల మైలు రాయిని దాటింది గతేడాదిలోనే. ఆ సందర్భం కోసం 'వేయిపడగలు' మళ్ళీ చదవడం, అనుకోకుండా ఆ వెంటనే 'వేయిపడగలు నేడు చదివితే' అనే వ్యాసాల సంపుటి చదవడం తటస్థించాయి. విశ్వనాథ నవలల్లో 'ఏకవీర' ఎక్కువ ఇష్టం నాకు. కానీ, 'వేయి పడగలు' ని ప్రస్తావించకుండా తెలుగు సాహిత్యం అసంపూర్ణం అనిపించే స్థాయిని సాధించుకున్నది. ఈసారి చదివినప్పుడు నాకు ధర్మారావు మీద ఫిర్యాదుల సంఖ్య కాస్త తగ్గింది. 

వాళ్ళ సినిమాల ద్వారా మన కుటుంబ సభ్యులుగా మారిపోయిన కృష్ణంరాజు, కృష్ణ, సత్యనారాయణ కొద్దిరోజుల తేడాలో వెళ్లిపోయారు. ముగ్గురూ దాదాపు నిండు జీవితం గడిపిన వాళ్లే. ఫిర్యాదులు లేకుండా (అవార్డులు రాలేదు వగయిరా) బతికేసిన వాళ్ళే. ముగ్గురూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన వాళ్ళే అయినా, కృష్ణంరాజుని పెద్దపదవులు వరించాయి - అదికూడా పెద్దగా కృషి లేకుండా. 'ప్రాప్తం' అనేది ఇలాంటి విషయాల్లో పనిచేస్తుందేమో. ఎలాంటి పరిష్కారమూ లేకుండా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. శ్రీలంక ఆర్ధిక సంక్షోభానికి ఇంకా ఇదమిద్ధమైన పరిష్కారం ఏదీ దొరికినట్టు లేదు. ఆ ప్రకారంగా కాలచక్రం గిర్రున తిరిగింది. సగటున వారానికో పోస్టుని ఈ బ్లాగు నమోదు చేసింది. ఈ అంకెని కాస్త పెంచాలని ఎప్పటిలాగే ఇప్పుడూ అనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన ఈ సందర్భంలో మీ అందరికీ థాంక్స్ చెప్పకుండా ఈ టపాని ముగించేదెలా... 

14 కామెంట్‌లు:

  1. మీ బ్లాగ్ పధ్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు 👏💐.
    ఇలాగే మరెన్నో యేళ్ళు నిరాటకంగా సాగిపోవాలని మా ఆకాంక్ష 👍.

    అవునండి మలయాళం, మరాఠీ భాషా చిత్రాలు విభిన్నంగా ఆసక్తికరంగా ఉంటున్నాయి. మోహన్ అగాషే, ఇటీవలే కాలం చేసిన విక్రమ్ గోఖలే మరాఠీ నటుల్లో పేరెన్నిక గలవారు.

    ఈ మధ్య మరణించిన తెలుగు సీనియర్ నటుల్లో చలపతిరావు పేరు మరచినట్లున్నారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చలపతి రావు..నిజమేనండి, మర్చిపోయాను.. ఆయన తెరమీద కనిపించగానే 'రేప్ సీన్' ఉంటుందని టక్కున ఊహించే వాళ్ళం.
      మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు..

      తొలగించండి
  2. అభినందనలు మురళి గారు. నెమలి కన్ను బ్లాగులో పుస్తకాలు సినిమాల పై మంచి విశ్లేషణలు ఇలాగే కొనసాగించండి.💐

    రిప్లయితొలగించండి
  3. Great. 14 years of continuous blogging is not a small thing. I congratulate you for this amazing feat.

    రిప్లయితొలగించండి
  4. మురళి గారు, నెమలికన్ను కి పద్నాల్గవ పుట్టినరోజు శుభాకాంక్షలు.తొలితరం బ్లాగర్లలో ఇంకా చురుకుగా రాస్తున్న అతి కొద్దిమందిలో మీరు మేటిగా నిలిచినందుకు చాలా సంతోషం. నెమలికన్ను మరిన్ని హంగులద్దుకుంటూ ఇలానే చదువరులను మురిపింప చేయాలని మనసారా ఆకాంక్షిస్తూ నేను-లక్ష్మి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎన్నాళ్ళకండీ!! మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి.. మీరంతా ఇంకా బ్లాగులు చూస్తున్నారని తెలియడం ఉత్సాహంగా అనిపిస్తోంది.. ధన్యవాదాలండీ.. 

      తొలగించండి
  5. ఈ బ్లాగర్ లైబ్రేరియన్ అయి ఉంటారు అని అనుకుంటూ ఉంటాను. విశ్లేషకులు గానే ఉండకుండా మరిన్ని స్వీయ రచనలు చేయాలని కోరుకుంటూ 14 వ బ్లాగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు 💐

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. స్వీయరచనలు.. నిజమేనండీ రాయాలనుకుంటున్నవి ఉన్నాయి.. ఎప్పటికి రాస్తానో మరి.. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.. 

      తొలగించండి
  6. బ్లాగర్ గా 13 సం పూర్తి చేసుకున్నారా 14 పూర్తి చేసుకున్నారా ?

    రిప్లయితొలగించండి