మంగళవారం, జనవరి 10, 2023

వాళ్ళు పాడిన భూపాలరాగం

ఆధునిక తెలుగు సాహిత్యంలో 'కాలాతీత వ్యక్తులు' నవలది ఓ ప్రత్యేక స్థానం. ఈ నవల రాయడం కోసమే జన్మించారా అనిపించేలా రచయిత్రి డాక్టర్ పి. శ్రీదేవి పిన్నవయసు లోనే మరణించారు. 'కాలాతీత వ్యక్తులు' మినహా ఆమె రచనలు మరేవీ ప్రింట్ లో అందుబాటులో లేకపోవడం వల్ల కావొచ్చు, ఆమె ఆ ఒక్క రచనే చేశారన్న ప్రచారం చాలాకాలంగా సాగుతోంది. ఆ ప్రచారానికి తెరదించుతూ, శ్రీదేవి రాసిన పన్నెండు కథల సంకలనాన్ని 'వాళ్ళు పాడిన భూపాలరాగం' పేరుతో ప్రచురించారు శీలా సుభద్రాదేవి. కథల్ని సేకరించి, సంకలనానికి సంపాదకత్వం వహించడం మాత్రమే కాదు, ఈ పన్నెండుతో పాటు శ్రీదేవి రాసిన కథలు మరో ఎనిమిది వరకూ ఉండవచ్చుననీ, వాటిని సేకరించే ప్రయత్నంలో ఉన్నాననీ చెప్పారు తన ముందుమాటలో. 

ఈ కథలన్నీ 1955-60 మధ్య కాలంలో రాయబడ్డాయి. అప్పటికి రచయిత్రి వయసు 26-31 సంవత్సరాలు. ఒకట్రెండు మినహా మిగిలిన కథలన్నీ చక్కని శిల్పంతో ఆసాంతమూ ఆపకుండా చదివించేలా ఉండడం రచయిత్రి ప్రతిభే. దేశానికి స్వతంత్రం వచ్చిన తొలి దశాబ్దంలో తెలుగుదేశపు మధ్య తరగతి జీవితాల ఆశలు, ఆకాంక్షలు ప్రధానంగా కనిపిస్తాయి ఈ కథల్లో. రచయిత్రి డాక్టరుగా విధులు నిర్వహించి, కేన్సరు బారిన పడి పోరాడి ఓడారు. ఈ ప్రభావం కథలమీద ఉంది. ఆస్పత్రులు, కేన్సరు కథల్లో కనిపించాయి. కొన్ని కథల్లో పాత్రల మీద 'కాలాతీత వ్యక్తులు' నవల్లో పాత్రల ప్రభావమూ కనిపించింది. బలమైన స్త్రీపాత్రలతో పాటు దీటైన పురుష పాత్రల్నీ చిత్రించడం వల్ల ఏ కథా ఏకపక్షంగా అనిపించలేదు. సన్నివేశ కల్పనలో నాటకీయత - ఆ కాలాన్నీ, రచయిత్రి అనుభవాన్నీ దృష్టిలో ఉంచుకున్నప్పుడు సబబే అనిపిస్తుంది. 

సంకలనానికి శీర్షికగా ఉంచిన 'వాళ్ళు పాడిన భూపాలరాగం' కథలో కథానాయకుడు స్కూలు ఫైనలు పాసవ్వగానే, అతని తండ్రికి పై చదువులు చదివించే స్తోమతు ఉన్నా ఉద్యోగానికి పట్నం పంపడాన్ని మరికాస్త జస్టిఫై చేసి ఉండాల్సింది అనిపించే కథ. సజీవ పాత్రలు, సహజ సన్నివేశాలు ఈ కథకి ప్రధాన బలం. ఆ వెంటనే గుర్తుండే మరో కథ 'చక్రనేమి క్రమాన'. ముందుమాటలో సుభద్రాదేవి గారు చెప్పినట్టుగా చిన్న సస్పెన్సుని చివరివరకూ కొనసాగించిన కథ. (అయితే ఆ సస్పెన్సుని సుభద్ర గారు విప్పి చెప్పేశారు, ముందుమాటని చివర్లో చదవడం మంచిది). మానవ మనస్తత్వాన్ని ఆధారంగా చేసుకుని రాసిన 'ఉరుములూ మెరుపులూ' ఆపకుండా చదివించడమే కాదు, పదికాలాలు గుర్తుండి పోతుంది,  ముఖ్యమైన మలుపుని మరికాస్త బలంగా చిత్రించాల్సింది అనిపించినప్పటికీ. 

మధ్యతరగతి ఆదర్శాల సంఘర్షణ 'కళ్యాణ కింకిణి.' కథ నడపడంలో రచయిత్రి చూపిన యుక్తి ఆశ్చర్య పరుస్తుంది. పాత్రలన్నీ మనకి బాగా తెలిసినవేమో అనిపించే కథ 'తిరగేసి తొడుక్కున్న ఆదర్శం' కాగా చతురస్ర ప్రేమకథ 'రేవతి స్వయంవరం'. తర్వాతి కాలంలో ముగ్గురు నలుగురు స్నేహితులు ఒకే అమ్మాయిని ప్రేమించే ఇతివృత్తంతో వచ్చిన సినిమాలకి మూలం బహుశా ఈ కథనేమో అనిపించింది. రాధ అనే బలమైన పాత్ర చుట్టూ అల్లిన కథ 'స్వరూపంలో రూపం'. రాధ ముందు మిగిలిన పాత్రలన్నీ చిన్నబోయాయి. రచయిత్రి స్వానుభవం కావచ్చునని బలంగా అనిపించే కథ 'అర్ధంకాని ఒక అనుభవం'. నాటి గ్రామ రాజకీయాలని పరిచయం చేస్తుందీ కథ. 

ఎండకాసి హఠాత్తుగా వర్షం రావడం కొన్ని కథల్లో కనిపించినా  (రచయిత్రి స్వస్థలం అనకాపల్లి, చదువు సాగింది విశాఖలో) ఆ వాతావరణాన్ని చక్కగా వాడుకుంటూ రాసిన కథ 'వర్షం వెలిసేసరికి...' చివర్లో నాయిక, నాయకుడి పాదాల మీద పడడం సుభద్రాదేవి గారికి నచ్చలేదు. నాకైతే రచయిత్రి మీద అప్పటి సినిమాల ప్రభావమేమో అనిపించింది. శిల్పపరంగా శ్రీదేవి చేసిన మరో ప్రయోగం 'శ్రావణ భాద్రపదాలు'. కథలో ఓ పక్క శ్రావణ మాసపు మబ్బులు, మరోపక్క మల్లెపూలూను. డాక్టరుగా పనిచేస్తున్నప్పుడు విన్న విషయాలని ఆధారంగా చేసుకుని రాసినట్టు అనిపించే కథ 'మెత్తని శిక్ష'. ఇప్పటి డాక్టర్లకి కనీసం ఈ విషయాలు ఆలోచించే తీరుబాటు ఉంటుందని అనుకోలేం. 

సంపుటిలో తొలి కథ 'కల తెచ్చిన రూపాయలు' నిరాశ పరిచింది. పొగచూరిన ఇంట్లో చిరుగుల చొక్కా పరంధామయ్యని చూసి నీరసం వచ్చింది. తర్వాతి కథలన్నీ బాగున్నా, ఈ కథని తొలికథగా ఉంచడం అంత మంచి నిర్ణయం కాదేమో అనిపించింది. 'అనల్ప' ద్వారా మార్కెట్లోకి వచ్చిన ఈ 201 పేజీల పుస్తకం వెల రూ. 250 (ఈ సంస్థ వారి చాలా పుస్తకాల్లాగే, ఈ పుస్తకానికీ వెల ఎక్కువే అనిపించింది, ముఖ్యంగా ముద్రణ నాణ్యత పరంగా చూసినప్పుడు). కథల్ని సంకలనం చేసిన సుభద్రాదేవి గారి కృషిని ప్రత్యేకంగా అభినందించాలి. కథల్ని ఉన్నవి ఉన్నట్టు ప్రచురించారో, 'సంపాదకత్వం' అని వేశారు కాబట్టి ఏమన్నా ఎడిట్ చేశారో తెలియదు. మొత్తంమీద, మిగిలిన ఎనిమిది కథల కోసం ఎదురు చూసేలా చేసిన పుస్తకం ఇది. 

4 కామెంట్‌లు:

 1. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాలాతీత వ్యక్తులు నవలను మెచ్చుకున్నాడు అంటే బాగుంటుందేమో అని ఈ నవల అతి కష్టం మీద చదివాను. ఏమీ బాగోలేదు. Unnecessarily overrated. ఒక విధంగా టీవీలలో వచ్చే అర్థం పర్థం లేని డైలీ సీరియల్ లాగా అనిపించింది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. త్రివిక్రమ్ మెచ్చుకున్నాడా? ఈ నవల్లో ఏదో ఒక పాయింట్ ని రాబోయే తన సినిమాల్లో చూడచ్చేమో అయితే.. 'చివరకు మిగిలేది' గురించి కూడా మిత్రులు కొందరు ఇలాగే స్పందిస్తారండీ, ఎవరి అభిరుచి వాళ్ళది కదా.. ధన్యవాదాలు.. 

   తొలగించండి
 2. మీ పరిచయం బాగుంది. పుస్తకం చదవాలని కొంతకాలంగా అనుకుంటున్నాను. ఇపుడు మీ పోస్ట్ చూశాక ఇక ఇపుడు చదువుతున్నది అవగానే చదవాలి అనుకుంటున్నా.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చదవండి.. రచయిత్రి లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ మారుతూ ఉండడాన్ని గమనించడం బాగుంది నాకైతే.. కథలు మీకు నచ్చే అవకాశం ఉంది.. ధన్యవాదాలు..

   తొలగించండి