సోమవారం, జనవరి 24, 2022

టీనేజీ

మనుషులకైతే చాలా అయోమయాన్ని కలిగించే సందర్భం. ఏవేవో చేసేయాలనే ఉత్సాహం, ముందు వెనకలు తెలియని ఆవేశం, కొంచం అమాయకత్వం, మరికాస్త మూర్ఖత్వం, అన్ని విషయాల గురించీ బోల్డంత స్పష్టత ఉందనుకునే అస్పష్టత, అన్నింటినీ మించి ఎదుటి వాళ్ళకి ఏమీ తెలీదేమో అనిపించే అజ్ఞానం.. ప్రత్యేకంగా చెప్పాలా, ఇవన్నీ టీనేజీ లక్షణాలని? పదమూడో పుట్టినరోజనేసరికి వస్త్రధారణ మొదలు, సెలెబ్రేషన్స్ వరకూ అప్పటివరకూ లేని ఎన్నో మార్పులు చోటు చేసేసుకుంటాయి. ముందే చెప్పినట్టుగా ఇవన్నీ మనుషుల విషయంలో. మరి బ్లాగుకి? టీనేజీలో అడుగు పెట్టింది 'నెమలికన్ను' బ్లాగే తప్ప, రాసే నేను కాదు కాబట్టి తేడాలేవీ ఉండవన్నమాట!! 

కొన్నేళ్లుగా బ్లాగు రాతలు పెద్దగా లేకపోయినా, ఏడాదికోసారి ఇదిగో ఇలా చేసుకునే సింహావలోకనం మాత్రం భలేగా అనిపిస్తోంది. మొదట్లో అయితే రాయలేకపోతున్నామే అని సిగ్గూ, మొహమాటం లాంటివి అడ్డం పడి, ఈ ఏడాది అలా జరక్కూడదు లాంటి నిర్ణయాలు బలంగా తీసేసుకునేలా చేసేవి. అయితే, రానురానూ ఈ రాయకపోవడం కూడా అలవాటైపోయింది. కాబట్టి, చట్టంలాగే మనం కూడా మన పని మనం చేసుకుంటూ పోవడమే. తలంటు స్నానాలూ , కొత్త బట్టలూ లాంటివి పక్కన పెట్టి కాస్త డిఫరెంట్ గా ఆలోచిద్దామని కూర్చుంటే, అప్పట్లో ఉన్న బ్లాగుల్లో ఇప్పటికీ నడుస్తున్నవెన్ని? అనే ప్రశ్న వచ్చింది. రాశి తక్కువే కానీ, వాసిలో మంచి టపాలే అప్పుడప్పుడన్నా పలకరిస్తూ ఉండడం సంతోషాన్నిచ్చే సంగతి. 

గతకొన్నేళ్ళుగా అప్పుడప్పుడూనూ, గతేడాదిగా కొంచం తరచుగానూ నాకెదురైన ఓ సమస్యని మీతో పంచుకోవాలనిపిస్తోంది. ఈ బ్లాగులో వచ్చే పుస్తక పరిచయాలు చదివిన వారిలో కొందరు, ఆయా పుస్తకాల పీడీఎఫ్ కాపీలు తమకి షేర్ చేయమని అభ్యర్థిస్తూ మెయిల్స్ రాస్తున్నారు. ఈమధ్య కాలంలో ఇది కొంచం పెరిగి పెద్దదై, తమకోసం నా దగ్గర ఉన్న పుస్తకాలని స్కాన్ చేసి పంపాల్సిందిగా డిమాండు కూడా చేస్తున్నారు. బ్లాగు పాఠకులుగా తమకా అధికారం ఉందని కొందరు అనుకుంటూ ఉండడం నన్నిప్పుడు ఆశ్చర్య పరచడం కూడా మానేసింది. నేను కాస్త ఓపికగా ఆయా పుస్తకాలు వెతికి, కాపీలు దొరికే చోటు వివరాలన్నీ మెయిల్ పంపినా అడిగిన వారు తృప్తి చెందడం లేదు. "వీటి బదులు, పుస్తకం స్కాన్ చేసి పంపేయండి" అని సలహా ఇస్తున్నారు నాకు. "పరిచయం రాస్తున్నందుకు మీకు కాంప్లిమెంటరీ కాపీలు వస్తాయి కదా?" తరహా ప్రశ్నలూ పలకరిస్తున్నాయి. 

నాకు పుస్తకాలు కొని చదవడమే అలవాటు. ఎవరికైనా బహుమతి ఇవ్వాలన్నా ఫిజికల్ కాపీలనే కొని ఇస్తాను. ఉచితంగా పుస్తకాలంటే - నా స్నేహితుల దగ్గర నుంచి బహుమతిగా వచ్చినవే తప్ప ఇంకెక్కడినుంచీ కాదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, స్కానింగ్, పీడీఎఫ్ కాపీల సర్క్యులేషన్ కి నేను బద్ధ వ్యతిరేకిని. రచయితలు, పబ్లిషర్ల మీద నాకున్న గౌరవం ఇందుకు ఒక కారణం. మిగిలిన కారణాలు ఇక్కడ అప్రస్తుతం. పుస్తకాలు ప్రచురించుకున్న కొందరు రచయితలు నాకు కాంప్లిమెంటరీ కాపీ పంపుతానని మెయిల్ రాసిన సందర్భాలున్నాయి. ఆ మెయిల్స్ ని నేను నా బ్లాగుకి దక్కిన గౌరవంగా భావించి, ఆయా పుస్తకాలని కూడా కొనే చదివాను. కాబట్టి, నాదగ్గర ఒక్కో పుస్తకమూ ఒకటికి మించి కాపీలు పోగుపడి ఉంటాయని అనుకోవద్దు. 

అచ్చయిన కొంత కాలానికి పుస్తకాలు ప్రింట్ లో దొరక్కపోవడం అనే సమస్య ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఎప్పటినుంచో ఉన్నదే. దీనికి పరిష్కారం స్కానింగ్ కాపీల సర్క్యులేషన్ ఎంతమాత్రమూ కాదు. పైగా, రచయిత జీవించి ఉండగానే, మరో ప్రింట్ తెచ్చే ఏర్పాట్లు చేసుకుంటూండగానే, ఓరిమి పట్టలేకపోవడం మెచ్చే సంగతి కాదు. కొన్ని క్లాసిక్స్ ఎలాగో ఆన్లైన్ ఆర్కీవ్స్లో భద్రపరచబడి ఉన్నాయి. అందరికీ ఉచితంగా దొరుకుతున్నాయి.  పబ్లిక్ లైబ్రరీలు, పాత పుస్తకాల షాపులు లాంటి చోట్లు ఉండనే ఉన్నాయి. రచయితో, పబ్లిషరో వ్యయ ప్రయాసలకోర్చి వేసుకున్న పుస్తకాన్ని, నేను ఓ కాపీ కొన్నాననే హక్కుతో స్కాన్ చేసి సర్క్యులేట్ చేయలేను. ఆ పుస్తకం మీకెంత ప్రియమైనదైనా కావొచ్చు, ఎంతో అవసరమైనదైనా కావొచ్చు. దానిని పొందే మార్గం 'నేను' కాదు. 

సరే, గడిచిన ఏడాది తాలూకు రాతకోతల లెక్కలోసారి చూస్తే, రాసినవి ముచ్చంగా ముప్ఫయి పోస్టులు. చదివిందీ, చూసిందీ (సినిమాలు) కూడా తక్కువే. 'కరోనా ఎత్తుకుపోయిన ఇంకో సంవత్సరం' అనిపిస్తోంది వెనక్కి తిరిగి చూసుకుంటే. సగం చదివినవి, మొదలు పెట్టాల్సినవి ఇంకా అలా ఉండగానే, బెజోస్ గారి మనిషి కొత్త పార్సిల్ తెస్తున్నాడంటూ సందేశం వచ్చింది. ముందుగా సగంలో ఉన్నవాటిని పూర్తి చేయాలా? వాటినలా ఉంచి కొత్తవి అందుకోవాలా? అన్నది శ్రీశ్రీ కి తెలియని సంధ్యా సమస్య. ఇక, ఈ టీనేజర్ ప్రయాణం ఎలాఉండబోతోందన్న ప్రశ్నకి కాలమే జవాబు చెప్పాలి.. 

5 కామెంట్‌లు:

  1. టీనేజ్ లో అడుగు పెట్టిన మీ బ్లాగుకు అభినందనలు 💐.
    భవిష్యత్తులో కూడా మరింత సంతృప్తికరంగా వర్ధిల్లడానికై శుభాకాంక్షలు.

    పుస్తకాల సంగతికొస్తే … పుస్తకాన్ని ఉచితంగా ఇచ్చినా కూడా ఆ రచయితకు ఎంతోకొంత పారితోషికం పంపించడం సముచితమైన పద్ధతి అని పెద్దలు అంటుంటారు. డిజిటల్ విజృంభణ మొదలైన తరువాత ఆ పట్టింపులను పాటిస్తున్నట్లు కనబడడం లేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమేనండీ, పైగా స్కాన్ చేస్తే తప్పేవిటన్న వాదనలు కూడా.. ..ధన్యవాదాలు.. 

      తొలగించండి
  2. పుట్టిన రోజు శుభాకాంక్షలు మీ బ్లాగ్ కి..

    మీ బ్లాగ్ టీనేజ్ లో అడుగుపెట్టిన సందర్బంగా మీ బాల్య జ్ఞాపకాలు సిరీస్ కి సీక్వెన్సు ఎక్సపెక్ట్ చేస్తున్నాం నెమలికన్ను గారు..

    hope u dont disappoint us...

    రిప్లయితొలగించండి