కథనం మీద శ్రద్ధ చూపించే రచయిత ఏ ఇతివృత్తాన్ని తీసుకుని కథ రాసినా చివరి వరకూ ఆపకుండా చదువుతారు పాఠకులు. పర్యావరణవేత్త, కవి, నవలా రచయితా కూడా అయిన కథకుడు తల్లావఝుల పతంజలి శాస్త్రికి పాఠకులని అక్షరాల వెంబడి పరిగెత్తించడం ఎలాగో బాగా తెలుసు. అలాగే, ఎక్కడ వాళ్ళని ఆపి ఆలోచించుకోనివ్వాలో కూడా తెలుసు. ఆయన ఏం రాసినా అందులో చదివించే గుణం పుష్కలంగా ఉంటుందన్నది నిర్వివాదం. పన్నెండు కథలతో ఆయన వెలువరించిన కథా సంపుటి 'నలుపెరుపు.' పాఠకుల వయసు, పఠనానుభవంతో సంబంధం లేకుండా వాళ్ళని వేలుపట్టి అదాటున కథలోకి తీసుకెళ్ళిపోయి, కథా స్థలంలో పాత్రల మధ్యన కూర్చోపెట్టి జరుగుతున్న కథకి వాళ్ళని సాక్షీభూతుల్ని చేయడం ఎలాగో ఆయనకి బాగా తెలుసు.
సంకలనంలో మొదటి కథ 'జై' స్వాతంత్రోద్యమ కాలంనాటిది. సీతానగరం పక్కనున్న ఓ పల్లెటూళ్ళో మలేరియా వల్ల జనం ప్రాణాలు పోతుంటే, వాళ్ళని చూసి, పరిసరాల పరిశుభ్రత గురించి వివరించి చెప్పడానికి మహాత్మాగాంధీ ఆ ఊరిలో పర్యటించడమే కథ. ఆ ఊరి బడిలో మేష్టారు నరసింహమూర్తికి తప్ప మిగిలిన ఎవరికీ గాంధీ ఎవరో తెలీదు. ఆయన ఎందుకు గొప్పవాడో అంతకన్నా తెలీదు. "అంటే ఆయనగారికి బోయినాలూ గట్టా ... ఆరు బేమర్లా అండీ? కోణ్ణీ గట్టా కొయ్యమంటే తప్పదనుకోండి. అంటే తెలవక అడుగుతున్నానండి, ఆయ." గాంధీజీ వస్తున్న వార్త తెలిసి చాలా హడావిడి చేసిన నరసింహ మూర్తి మేష్టారు ఊరిని ఉన్నంతలో శుభ్రం చేయించడం మొదలు, పిల్లలకి 'గాంధీజీకి జై' నినాదాన్ని, స్త్రీలకి 'రఘుపతి రాఘవ రాజారామ్' పాటని నేర్పించడం వరకూ అనేక పనులు మీద వేసుకుని ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారు. గాంధీ పర్యటన ప్రహసనంగా ముగిసిన వైనాన్ని చిత్రిస్తుందీ కథ.
తనకిష్టమైన పర్యావరణం ఇతివృత్తంగా రాసిన కథలు మూడు. వీటిలో 'కాసులోడు' ప్రత్యేక ఆర్ధిక మండళ్ల కోసం చేసే భూసేకరణ గురించి చెబితే, 'జోగిపంతులు తిరిగి రాలేదు' కథలో ఉత్పత్తి పెంచే వ్యవసాయ విధానాల పట్ల నిరసన కనిపిస్తుంది. 'కాసులోడు' సగం చదివేసారికే ముగింపు గురించి ఓ అంచనా వచ్చినా, కథని ఆ ముగింపుకి ఎలా తీసుకెళ్తారన్న కుతూహలం ఆపకుండా చదివిస్తుంది. 'జోగిపంతులు..' కథలో ఎన్ని విషయాలు చర్చించారంటే..లెక్క పెట్టే ప్రయత్నం చేసినప్పుడల్లా ఇంకో కొత్త కోణం కనిపిస్తూ ఉంటుంది. కాస్త మేజిక్ రియలిజం ఛాయలు కనిపిస్తాయి ఈ కథలో. ఇక 'ఈ చెట్టు తప్ప' కథ ఒక యాభై-అరవై ఏళ్లలో ఓ చిన్న పట్టణం పెద్ద నగరంగా మారిన క్రమాన్ని మాత్రమే కాక, అక్కడ కనుమరుగైపోయింది పచ్చదనాన్ని గురించి ఉపన్యాస ధోరణిలో కాక కథనంలో నేర్పుగా చెప్పడం వల్ల, ఆగి ఆలోచింపజేస్తుంది పాఠకుల్ని.
సాఫ్ట్వేర్ జీవితాలు ఇతివృత్తంగా రాసిన కథలు రెండు. 'ఆర్వీ చారి కరెంటు బిల్లు,' 'అయాం సారీ మూర్తి గారూ.' ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో, చాలా పెద్ద పొజిషన్లో ఉన్న ఆర్వీ చారికి కరెంటు బిల్లు ఎంత వస్తోందో చూసుకునే తీరిక ఉండదు. గత నాలుగు నెలలుగా అతనికి ఎక్కువ బిల్లు వస్తోంది. అతను కట్టిన అదనపు బిల్లు మొత్తం అపార్ట్మెంట్ వాచ్మన్ అలీ (కౌంటర్ కి వెళ్లి ఈ బిల్లులు కట్టేది ఇతనే) మూడు నెలల జీతానికి సమానం. అలీ చెప్పిన ఈ సంగతి సూదిలా గుచ్చుకుంటుంది చారిని. అతనేమీ పుట్టు ధనవంతుడు కాదు. తండ్రి సుబ్బాచారి పల్లెటూళ్ళో బంగారప్పని చేసేవాడు. పెరట్లో పండించిన ఆకుకూరల్తోనే పొదుపుగా వంట కానిచ్చేసేది తల్లి. ఆర్వీ చారి వైభవాన్ని వాళ్లిద్దరూ కూడా చూడకుండానే లోకం విడిచి వెళ్లిపోయారు. అలీ గుచ్చిన సూది, ఆర్వీ చారి ఆలోచనల్లో ఎలాంటి మార్పు తెచ్చిందో చెబుతుందీ కథ. 'అయామ్ సారీ... ' ఐస్క్రీం పార్లర్లో జరిగిన ఓ సాఫ్ట్వేర్ జంట పెళ్లిచూపుల కథ.
రాజకీయాలని ఇతివృత్తంగా తీసుకుని రాసిన కథలు 'సింవ్వాసెలం గోరి గేదె' 'కపి జాతకం 1' కపి జాతకం 2.' వీటిలో 'సింవ్వాసెలం గోరి గేదె' ' కథలో సమస్య నేను దగ్గరనుంచి చూసినా కావడం వల్ల కొంచం ఎక్కువగా కనెక్ట్ అయ్యాను. ఇలాంటి 'గేదె' బాధితులు మా ఊళ్లోనూ ఉన్నారు. కానీ, ఈ కథకి రచయిత ఇచ్చిన ముగింపుని మాత్రం అస్సలు ఊహించలేం. బౌద్ధ జాతక కథలని, వర్తమాన రాజకీయాలతో ముడిపెట్టి కథలు చెప్పడం పతంజలి శాస్త్రి మొదలు పెట్టిన ప్రయోగం. బహుశా, ఈ సిరీస్లో వచ్చిన తొలి రెండు కథలూ 'కపి జాతకం' అయి ఉండొచ్చు. నిజానికి ఈ తరహా కథలు రాసి 'రాజకీయ పంచతంత్ర కథలు' తరహాలో ఓసంపుటిగా ప్రచురిస్తే బాగుండుననిపించింది చదువుతున్నంతసేపూ. పేరుకి తగ్గట్టే కోతుల బెడద, వాటికి 'రాజకీయ' పరిష్కారాలూ, ఆ క్రమంలో తెరవెనుక జరిగే రాజకీయాలూ.. వీటన్నింటినీ వ్యంగ్యంగా చెప్పారీ కథల్లో.
వేటికవే ప్రత్యేకం అనిపించే మూడు కథలు 'నలుపెరుపు' 'నెమలికన్ను' 'గారడీ.' పుస్తకానికి మకుటంగా ఉంచిన 'నలుపెరుపు' ని ఓ పనిమనిషి-యజమానురాలి మధ్య జరిగే కథ అనడం కన్నా, పనిమనిషి సోలిలోక్వీ అనడం సబబు. ఇద్దరి జీవితాల మధ్య ఉన్న కాంట్రాస్ట్ ని చిన్న చిన్న సన్నివేశాల్లోనూ, మాటల్లోనూ చిత్రించారు రచయిత. అల్లరి అనేది బాల్యంలో ఒక భాగం కావడం ఎంత ముఖ్యమో 'నెమలికన్ను' చెబితే, జీవితంతో రాజీ పడిన ఖాదర్ సాహెబు తీసుకున్న ఓ నిర్ణయాన్ని చెప్పే కథ 'గారడీ.' ముందుగానే చెప్పినట్టు ఆపకుండా చదివించే గుణం పుష్కలంగా ఉన్న కథలివి. 'వడ్ల చిలకలు' లాంటి కథా సంపుటాలు, 'దేవర కోటేశు,' 'గేదెమీద పిట్ట' లాంటి నవలికలూ ప్రచురించిన పతంజలి శాస్త్రి మరిన్ని రచనలు చేయాల్సిన అవసరం ఉంది. ('నలుపెరుపు,' చినుకు ప్రచురణలు (అచ్చుతప్పులు అక్కడక్కడా కొంచం ఎక్కువ ఇబ్బంది పెట్టాయి), పేజీలు 104, వెల రూ. 120).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి