బుధవారం, ఫిబ్రవరి 05, 2020

కాశ్మీరు లోయలో ...

"గూటి పడవల్లోన చాటుగా కలిశాక
నీటికైనా వేడి పుట్టాలిలే..." 

హీరో హీరోయిన్లు కాశ్మీర్లో ఓ డ్యూయెట్ పాడుకోవాలి, ఇదీ సందర్భం. కాశ్మీరు అనే మాటొక్కటీ చాలదూ, వేటూరిలాంటి కవికి? అలవోకగా ఓ శృంగార ప్రధాన గీతాన్ని రాసిచ్చేశారు, 'పసివాడి ప్రాణం' (1987) సినిమా కోసం. నాయికా నాయకుల (విజయశాంతి, చిరంజీవి) ఇమేజీకి తగిన విధంగా, సంగీత దర్శకుడు (చక్రవర్తి) ఇచ్చిన జానపద బాణీకి అనువుగా, ప్రేక్షకుల నోళ్ళలో నాలుగు కాలాలపాటు నానేలాగా, అదే సమయంలో సాహిత్యాన్ని గురించి పట్టించుకునే వాళ్ళని గిలిగింతలు పెట్టేలా రాయడం అనే అష్టావధానాన్ని అతి గడుసుగా నిర్వహించేశారు. 

"కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో
ఓ సందమావ.. ఓ సందమావ.. 
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమావ.. ఓ సందమావ.." 

నాయకుడు నాయికని కాశ్మీరు లోయలో కన్యాకుమారి అంటుంటే, నాయికేమో అతన్ని కన్నె ఈడు మంచులో కరిగే సూరీడు అంటోంది. మామూలుగా అయితే సూరీడు ధాటికి మంచు కరగాలి. కానీ ప్రేమలో ఉన్నవాళ్ళ ఉత్ప్రేక్షలకి లోటేముంది.  పల్లవిలో తొలిసగం అందరూ సులువుగా పాడుకునేలా ఉంటే, రెండోసగం సాహిత్యం మీద దృష్టి పెట్టినవాళ్ళకి విందుభోజనం పెట్టేస్తుంది. 

"పొగరాని కుంపట్లు రగిలించినాదే.. 
పొగరెక్కి చలిగాణ్ణి తగిలేసినాడే.. 
చెమ్మాచెక్క.. చేత చిక్క.. 
మంచమల్లె మారిపోయె మంచు కొండలు.. 
మంచిరోజు మార్చమంది మల్లె దండలు.."

ఆ కన్యాకుమారి అంత చల్లని కాశ్మీరంలో 'పొగరాని కుంపట్లు' రగిలించిందని అతను ముచ్చట పడుతున్నాడు. ఆ ముచ్చటని అర్ధం చేసుకోవాలంటే మనం అలా కాకతీయుల కాలానికి వెళ్లిరావాలి. 

"మాఘ మాసంబు పులివలె మసలుచుండ 
పచ్చడం బమ్ముకొన్నాడు పసరమునకు; 
ముదిత చన్నులు పొగలేని ముర్మురములు; 
చలికి నొఱిగాయ కేలండు సైరికుండు?" 

అంటాడు క్రీడాభిరామకర్త. (ఈ 'క్రీడాభిరామం' రాసింది వినుకొండ వల్లభామాత్యుడనీ, మహాకవి శ్రీనాధుడనీ రెండు వాదనలున్నాయి. ఆ కావ్యం రాసింది ఎవరైనా పొగలేని ముర్మురములని సినిమా పాటలోకి లాక్కొచ్చింది మాత్రం సినీరంగ శ్రీనాధుడే! అర్ధవివరణ కోసం దాశరథి కృష్ణమాచార్య ఆత్మకథ 'యాత్రాస్మృతి' లో 'ముర్మురాలు' అనే అధ్యాయం చూడొచ్చు.)


మనం మళ్ళీ పల్లవిలోకి వచ్చేస్తే, 'పొగరెక్కి చలిగాణ్ణి తగిలేసినాడే' అంటోందామె! అతని పొగరు వెనుక ధీమా ఆమే కదా. అంత మహోన్నతమైన మంచుకొండలూ మంచంలా మారిపోయాయనడం కవిగారి చమత్కృతి. 'మంచిరోజు మార్చమంది మల్లె దండలు' అనడం ద్వారా వాళ్లిద్దరూ పెళ్ళికి ముందే విహార యాత్రకి వచ్చారని చెప్పకనే చెప్పారు. ఇక, తొలి చరణానికి వస్తే.. 

"తేనీటి వాగుల్లో తెడ్డేసుకో.. పూలారబోసేటి ఒడ్డందుకో.. 
శృంగార వీధుల్లో చిందేసుకో.. మందార బుగ్గల్ని చిదిమేసుకో.. 
సూరీడుతో ఈడు చలికాచుకో.. పొద్దారిపోయాక పొద చేరుకో.. 
గుండెలోనే పాగా గుట్టుగా వేశాక గుత్తమైన సోకు నీదే కదా.. "

పాటని మొదలు పెట్టిన కాశ్మీరుని పల్లవికి సరిపెట్టి ఊరుకోకుండా చరణాల్లోకీ తీసుకొచ్చారు. మంచుకొండలు తర్వాత మనకి గుర్తొచ్చేవి తేనీరు, గులాబీ పూలు. 'కోటలో పాగా వెయ్యడం' అనే నానుడి గుండెలో పాగా వేయడంగా మారింది, అదికూడా గుట్టుగా. 

"తస్సా చెక్క..  ఆకు వక్క.. 
ఇచ్చుకోక ముందే ముట్టె తాంబూలము.. 
పెళ్ళి కాక ముందే జరిగె పేరంటము... "

తస్సాదియ్యా, తస్సాచెక్కా ఈ రెండూ గ్రామీణుల భాషలో సర్వసాధారణాలు. ఆకు, వక్క ఇచ్చిపుచ్చుకోక ముందే (తాంబూలాలు మార్చుకోడం/ఎంగేజ్మెంట్) తాంబూలం అందేసిందట. పెళ్ళికి ముందే పేరంటం జరిగిపోవడంతో వింతేముంది? రెండో చరణంలో ఆ జంట చేత ఏమేం చేయించారో చూద్దాం: 

"సింధూర రాగాలు చిత్రించుకో.. అందాల గంధాల హాయందుకో.. 
పన్నీటి తానాలు ఆడేసుకో.. పరువాలు నా కంట ఆరేసుకో.. 
కాశ్మీరు చిలకమ్మ కసి చూసుకో.. చిలక పచ్చ రైక బిగి చూసుకో.. 
గూటి పడవల్లోన చాటుగా కలిశాక నీటికైనా వేడి పుట్టాలిలే.. "

హిందూస్తానీ రాగాల్లో 'సింధూర రాగం' ఒకటి. రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లా ఉండాలి కాబట్టి, కాశ్మీరులో హిందూస్తానీ రాగం పాడుకోమంటోంది నాయిక ('చిత్రించు' కి ఉన్న నానార్ధాల్లో 'అలరించు' ఒకటి). దాల్ సరస్సులో నౌకా విహారం చేయాలంటే మామూలు పడవలో కుదరదు, గూటి పడవ ఉండాల్సిందే. ఆ జంట చాటు సరసానికి నీటికి కూడా వేడి పుడుతుందట. ముందుగానే చెప్పుకున్నట్టుగా, టాప్ స్టార్ల ఇమేజీకి తగ్గట్టుగా ఉండాలి కదా పాట. 

"పూత మొగ్గ.. లేత బుగ్గ.. 
సొట్టబడ్డ చోట పెట్టు నీ ముద్దులు.. 
సొంతమైన చోట లేవు ఏ హద్దులు..." 

ముగింపు వాక్యాలని గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు కదా. గానం విషయానికి వస్తే, ఎక్స్ప్రెషన్స్ పలికించే విషయంలో జానకితో మరో మారు పోటీ పడే ప్రయత్నం చేశాడు బాలూ. మంచుకొండలు నేపథ్యంలో, సంగీతానికి, సాహిత్యానికి తగ్గట్టుగా ఆహ్లాదకరంగా చిత్రించారు దర్శకుడు ఏ. కోదండరామి రెడ్డి.  గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా విజయంలో ఈ పాటకీ స్థానం ఉంది.

8 కామెంట్‌లు:

  1. అద్భుతమైన అన్వయమండీ! 'పొగరాని ఊకపొట్టు' తో పోలిక హాలునిది. (తిరుమల రామచంద్ర ప్రాచీనాంధ్రగాథల్లో పడుచుభార్యని నమ్ముకుని చలికాలంలో పచ్చడం అమ్మేసి ఎద్దుని కొన్న రైతు కథ కూడా ఉన్నట్టుంది.) హాలుని శాలివాహన సప్తశతిని నూనూగు మీసాల నూత్నయౌవనమున తెనిగించానని శ్రీనాథుడు చెప్పుకున్నాడు కదా. అట్నుంచి సినీరంగ శ్రీనాథుడి కలంలో పలికిందన్నమాట! అక్షరాలా రెండువేల సంవత్సరాల క్రితపు పోలిక ఇది!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ వ్యాఖ్య చూశాక 'ప్రాచీనాంధ్ర గాథలు' గుర్తొచ్చిందండీ. నాకెందుకో 'క్రీడాభిరామం'  బాగా గుర్తుండిపోయింది, శ్రీనాధుడే రాసి ఉంటాడనే ఓ నమ్మకంతో పాటు. అన్నట్టు, మీరు కోట్ చేసిన శ్రీనాధుడి మాటలు చూడగానే 'మేరీ సాప్నోంకి రాణీ...'  బాణీకి వేటూరి రాసిన పాట తాలూకు సాకీ గుర్తొచ్చేసింది :) ..ధన్యవాదాలు. 

      తొలగించండి
  2. చాలా చాలా బావుందండీ. కచ్చితంగా సినిమా పాటల సాహిత్యానికి కూడా వివరణలు రాసుకోవాల్సొన్డే. పొగరాని కుంపట్లు మాట తేగానే నాక్కూడా హాలుడే గుర్తొచ్చాడు, ఇధమిద్ధంగా గుర్తు లేదు.
    సింధూర రాగం అంటే ఎరుపు రంగు అనేది ఒక అన్వయం కావచ్చు. నీలీల పాడేదా దేవా పాటకి ఒక చిన్న ట్రిబ్యూటీ కావచ్చు.
    చాలా బావుంది. నెనర్లు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'సింధూర రాగం' విషయంలో ఏకీభవిస్తున్నానండీ. కాశ్మీరు కాబట్టి, హిందుస్తానీ ప్రస్తావన అయి ఉండొచ్చని కేవలం నా అనుకోలు. కుంకుమపూలు కూడా అయి ఉండొచ్చు అనిపిస్తోంది మీ వ్యాఖ్య చూశాక. వేటూరి పాటలకి వివరణలు రాసుకున్నా చెప్పాల్సిన విషయాలెన్నో మిగిలిపోతాయి అన్నదానికి మీ వ్యాఖ్యే సాక్ష్యం :) ..ధన్యవాదాలు. 

      తొలగించండి
  3. ఈ పాటమాత్రం ఆ "పొగరాని కుంపట్లు" అన్నమాటకోసమే వింటుంటానండీ

    రిప్లయితొలగించండి
  4. అబ్బా ఎంత బాగా రాశారు మురళి గారూ.. ఇక మీదట ఈ పాట మరింత కొత్తగా వినపడుతుంది... సింధూర రాగాలకు మీ వివరణ కొత్తపాళీ గారి వివరణ రెండూ బావున్నాయి. వేటూరి గారి పాటకి ఎన్ని అర్థాలైనా చెప్పుకోవచ్చేమో కదా..

    ఈ పాట చిత్రలహరి లో వచ్చే రోజుల్లో నాకు ఆ మంచుకొండలు, విజయశాంతి, చిరంజీవిల స్టెప్పులు చూడడమే సరిపోయేది, సాహిత్యం గురించి ఆలోచనే ఉండేది కాదులెండి. కాకపోతే అప్పట్లో హీరోయిన్ని పొగ రా’ణి’ అని ఎందుకు అన్నారా అని అనుకునే వాడ్ని :-) తర్వాతెపుడో వాక్మన్ చేతికి వచ్చాక శ్రద్ధగా విన్నప్పుడు కానీ ’పొగరాని కుంపట్ల’ సంగతి వెలగలేదు :-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'పొగరాణి' హహ్హా.. గుర్తు చేసుకుని మరీ నవ్వుకున్నానండి ఈ అన్వయానికి :)) 
      యూట్యూబ్ లో చాలాసార్లు వీడియో చూసినా, నాకూ చిత్రలహరి లో బ్లాకండ్ వైట్ పాట విజువల్సే మొదట గుర్తొస్తాయి, ఈ పాటని తలచుకోగానే. వేటూరి పాటలకి అర్ధాలంటే, మన శక్తి మేరకి చెప్పుకోవచ్చండీ. ధన్యవాదాలు. 

      తొలగించండి