గురువారం, సెప్టెంబర్ 26, 2019

ఇల్లేరమ్మ - సోమరాజు సుశీల

దాదాపు పాతికేళ్ల క్రితం మాట.. ఇంటికొచ్చిన బంధువొకరు తను  ప్రయాణంలో చదువుకోడానికి కొనుక్కున్న వారపత్రికని వెళ్తూ వెళ్తూ మా ఇంట్లో వదిలేసి వెళ్లారు. కాలక్షేపానికి నేనా పుస్తకం తిరగేస్తూ ఓ చోట ఆగిపోయాను. 'మేమందరం ఇంకో ఊరికి.. ఏలూరికి' పేరుతో ఓ చిన్న కథ. చదవడం మొదలెట్టగానే చిన్నప్పుడు నేనాలోచించినట్టే ఆలోచించే పాత్ర పరిచయం అయ్యింది. పోస్టుమాన్ టెలిగ్రామ్ తెస్తే ఎవరో చచ్చిపోయిన వార్త పట్టుకొచ్చాడని అనేసుకోడం మొదలు, సినిమాల్లో కుటుంబం అంతా కలిసి పాడుకునే పాటని ఇంట్లో అందరూ గుర్తుపెట్టుకుంటే, ఒకవేళ ఎప్పుడైనా విడిపోయినా మళ్ళీ కలవడానికి పనికొస్తుందన్న ఆలోచన వరకూ.. ఆ కథ అలా గుర్తుండిపోయింది. ఆ పాత్ర పేరు ఇల్లేరమ్మ. సృష్టికర్త డాక్టర్ సోమరాజు సుశీల. 

కొన్నేళ్లు గడిచాక 'ఇల్లేరమ్మ కతలు ఆవిష్కరణ' అంటూ పేపర్లో వార్త. ఆవిష్కరించిన బాపూ రమణలు రచయిత్రి సోమరాజు సుశీలని అభినందించారని చదవగానే 'మేమందరం ఇంకో ఊరికి..' చటుక్కున గుర్తొచ్చింది. వెంటనే పుస్తకం కొని 'గణేశా ఈశా' మొదలు 'అయితే నా రెండెకరాలూ గోవిందేనా' వరకూ పుస్తకంలో ఉన్న కథలన్నీ మళ్ళీ మళ్ళీ చదివేశాను, దాదాపు నోటికొచ్చేసేలా. చదివేశాను అనడం అతిశయోక్తి,  ఆ కథలు చదివించేశాయి అనడం నిజం. ఒక్క ఆలోచనలే కాదు, ఇంటి వాతారణం మొదలు, పాటించే ఆచారాలు, బంధువులు, గృహ రాజకీయాలు.. వీటన్నింటిలో పోలికలు కనిపించడం  వల్లనేమో ఇంటిల్లిపాదీ ఆ పుస్తకాన్ని 'సొంతం' చేసేసుకున్నాం. అద్దిల్లు వెతుక్కోడం మొదలు, పాలు పొంగేప్పుడు 'పొంగిపోతున్నాయీ' అనకూడదు అనడం వరకు  ఎన్ని విషయాలు నేర్పిందో ఇల్లేరమ్మ. 

కేవలం సరదా కబుర్లే కాదు, 'మిథునం' లో  బుచ్చిలక్ష్మి చెప్పినట్టు 'బరువు తగ్గించే మాటలు' ఎన్నో చెప్పింది ఇల్లేరమ్మ. 'పెరట్లో జామచెట్టు ఉన్నవాళ్ళకి ఉయ్యాలూగొచ్చని తెలీదు. తెలిసిన వాళ్లకి జామచెట్టు ఉండదు'  ఎంతగొప్ప జీవితసత్యం! చెప్పుకుంటూ వెళ్తే ఇలాంటివి ఎన్నో. బంధుమిత్రుల్లో చదివే అలవాటున్న వాళ్లందరికీ 'ఇల్లేరమ్మ కతలు' కాపీలు పంచడం అనే కార్యక్రమం కొనసాగుతూ ఉండగానే, ' దీపశిఖ' కధాసంపుటి మార్కెట్లోకి వచ్చింది. ఈలోగానే 'చిన్న పరిశ్రమలు - పెద్ద కథలు' చదవడం పూర్తయ్యింది. చెప్పకపోడమేం, ఈ రెండు పుస్తకాలూ కూడా 'ఇల్లేరమ్మ కతలు' ముందు తేలిపోయినట్టు అనిపించాయి. తర్వాత వచ్చిన 'ముగ్గురు కొలంబస్ లు' ట్రావెలాగ్లు ఇలా కూడా రాయొచ్చు అని నిరూపించిన పుస్తకం. 

కొందరు రచయితలు కొన్ని పాత్రలు సృష్టించడానికే పుడతారేమో.. గురజాడ 'మధురవాణి,' ముళ్ళపూడి 'బుడుగు,' పతంజలి 'వీరబొబ్బిలి' ఇలా జాబితా వేస్తే డాక్టర్ సోమరాజు సుశీల 'ఇల్లేరమ్మ' ని చేర్చి తీరాలి. రాశిగా చూస్తే ఆధ్యాత్మిక రచనలతో కలిపి సుశీల పుస్తకాలు రెండు పుంజీలకి మించకపోవచ్చు. కానీ వాసిలో ఎంచితీరాల్సినవి. ఐ డ్రీమ్స్ వాళ్ళ 'అక్షర యాత్ర'  సిరీస్ లో డాక్టర్ సి. మృణాళిని, డాక్టర్ సుశీలని ఇంటర్యూ చేసినప్పుడు 'ఐ డ్రీమ్స్ వాళ్ళు చేస్తున్న మంచిపనుల్లో ఇదొకటి' అనిపించింది నాకు. మృణాళిని ఇంటర్యూ నిర్వహణని గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు కానీ, నవ్వుతూ, నవ్విస్తూనే తాను చెప్పదల్చిన విషయాలని చాలా స్పష్టంగా చెప్పారు సుశీల. 


ఇంటర్యూ వచ్చిన కొన్నాళ్ళకి ఇల్లేరమ్మని ముఖాముఖీ కలుసుకునే అవకాశం వచ్చింది, అదికూడా చాలా యాదృచ్చికంగా. 'ఇల్లేరమ్మ కతలు' గురించి ఎన్నో ప్రశ్నలు అడిగినా, ఆమె తను చెప్పదల్చుకున్న విషయాలు మాత్రమే చెప్పారు. "మీ హిందీ మేస్టార్ని కల్లో చంపేయడం గురించి చెప్పండి" అని ఎన్ని సార్లు అడిగినా ఇంకేదో చెప్పి మాట దాటేశారు తప్ప, అసలు విషయం మాత్రం చెప్పలేదు. 'జామచెట్టు ఉయ్యాల' ని ప్రస్తావిస్తే,  సువర్ణ అకాల మరణాన్ని తల్చుకుని బాధపడ్డారు. 'హరేరామ' తాతగారి గురించి, 'పుంగోణం' గురించి, 'చంద్రరావు' గురించీ బోల్డన్ని కబుర్లు చెప్పారు. గొప్ప  రచయితలతో సన్నిహితంగా మసిలినా వాళ్ళ పుస్తకాలేవీ చదవలేదని, ఆ విషయం ఆయా రచయితలకి కూడా తెలుసనీ చెప్పారు. 

ఆవిడ మాటలు వింటున్నంతసేపూ రచన  అన్నది ఆవిడకి సహజాతం అనిపించింది. ఆవిడ మాటలన్నీ ఆవిడ కథల్లో వాక్యాల్లాగే ఉన్నాయి. ఏ  విషయాన్ని గురించైనా ఆవిడ చెప్పే పధ్ధతి కథ చెప్పినట్టే ఉంటుంది. చిన్న సంఘటనకి కూడా బోల్డంత హాస్యాన్ని, వ్యంగ్యాన్ని రంగరించి చెప్పడం ఆవిడకి వెన్నతో పెట్టిన విద్య అని అర్ధమయ్యింది. చాలామంది రచయితలు వాళ్ళ రచనల్లో దొరకరు. రచయితలకీ, రచనల్లో పాత్రలకే పోలికే ఉండదు. కానీ, సోమరాజు సుశీల ఇందుకు మినహాయింపు. తను నవ్వుతూ, చుట్టూ ఉన్నవాళ్ళని నవ్వించడం, ఆ నవ్వుల మధ్యలో అనేక జీవితసత్యాలని అలవోకగా చెప్పడం ఆవిడ తన రచనల్లో రాయడం మాత్రమే కాదు, ఆచరించీ చూపించారు.  నొప్పించక, తానొవ్వక ఉంటూనే తప్పించుకోకుండా నిలబడడం ఆమె ప్రత్యేకత. ఆమె ఇకలేరన్న వార్త వినగానే మొదటగా అనిపించిన మాట 'హంసలా ఆర్నెల్లు...' ఎలా బతకాలో చూపించి వెళ్ళిపోయిన డాక్టర్ సోమరాజు సుశీల ఆత్మకి తప్పక శాంతి కలుగుతుంది. 


10 కామెంట్‌లు:

  1. తెలుగు భాష ఇంకోసారి చచ్చిపోయిందా మురళి గారు. ఇల్లేరమ్మ మన తరాల మధ్య తరగతి అమ్మాయిల బ్రాండ్ అంబాసడర్. కొంచం అమాయకత్వం, కొంచం జాణతనం, కష్టాన్ని కష్టం అనుకోకుండా సుఖాన్ని వెతుక్కునే తెలివితేటలు, మరెవరు కట్టబెడతారు తెలుగు పిల్లకి మామిడి పిందెల పట్టు లంగా. కష్టం వచ్చినా, కన్నీరొచ్చినా చదువుకునే భగవద్గీత ఇల్లేరమ్మ కథలు. అందరి మనసుల్లో పీఠం వేసుకుని దర్జాగా నిష్క్రమించిన ఇల్లేరమ్మకి అశృభరిత నివాళులు

    రిప్లయితొలగించండి
  2. ఓ వారం క్రితం మీ గూటికి వచ్చి నిరాశగా వెళ్ళిపోయాక నిన్న మళ్ళీ వచ్చాను. రెండు వ్యాసాలున్నాయని ఆనందంగా చదువుకున్నాను. నదీగీతాల స్పెషలిష్టుడి తర్వాత ఇల్లేరమ్మ గురించీ చదివాను. ఎందుకు ఎలా ఏం జరిగిందో తెలీదు కానీ మీ ఆఖరి వాక్యాలు మెదడులోకి ఎక్కలేదు. సుశీల గారు ఇక లేరు అన్న మాట ఇప్పటికీ ఇంకడం లేదు. ఈ ఉదయం పత్రికలో చదివాక... నిన్న మురళిగారు రాయడం కాకతాళీయమే అనుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ చదివే వరకూ... 😥😥😥...

    రిప్లయితొలగించండి
  3. ఇల్లేరమ్మ ప్రతి ఇంటిని తనదిగా చేసుకుని మన మధ్యే ఉందండి. మా అమ్మాయిని చిన్నప్పుడు ఇల్లేరమ్మ అని పిలుచుకునే వాళ్ళం. మాలాంటి వారు ఇంకెందరో. ఓ బుడుగు...ఓ సీగాన పెసూనాంబ, ఓ ఇల్లేరమ్మ మనమెంత అదృష్టానికి నోచుకున్నామో కదా అనిపిస్తుంది.

    మీ నివాళి చక్కగా ఉంది.

    రిప్లయితొలగించండి
  4. Aavida interview lo cheppina konni suchanalu neti taram ammailu try cheyali
    1.sapadana swatantram me Kadu tana jeetham karchu petite swatantram
    2.manam attagari vaipu relationship konasagalante mana prayatnam kavali .atu vaipu nunchui vachina rakapaoina it doesn't matter.not only in this but where ever it is required
    3.adavaru inti nirmanam lo bhartha sampadana Ela vadaru porvam ippudu elamarindhi

    రిప్లయితొలగించండి
  5. @లక్ష్మి: అవునండీ, ఇల్లేరమ్మ చిరంజీవి.. ధన్యవాదాలు. @పురాణపండ ఫణి: నమ్మడానికి నాక్కూడా సమయం పట్టిందండీ. ఇద్దరు, ముగ్గురు మిత్రులు కన్ఫర్మ్ చేశాక అప్పుడు జీర్ణించుకోడం మొదలు పెట్టాను. .ధన్యవాదాలు @కొత్తపాళీ: ధన్యవాదాలండీ.. 

    రిప్లయితొలగించండి
  6. @సిరిసిరిమువ్వ: మనం బజ్జులో మాట్లాడుకున్నాం కదండీ, ఇల్లేరమ్మ కతల గురించి, ఆ కబుర్లన్నీ గుర్తొచ్చాయి.. ధన్యవాదాలు. @శ్రీనిధి: అవునండీ.. ధన్యవాదాలు. @స్వాతి: ఆవిడ రచనలు చదివిన వాళ్ళు అభిమానులు కాకుండా ఉండడం అసాధ్యం అండీ.. ధన్యవాదాలు. 

    రిప్లయితొలగించండి
  7. మొట్టమొదట ఆవిడ లేరన్న వార్త చూడగానే మీరే గుర్తొచ్చారు, ఎందుకంటే నాకు ఇల్లేరమ్మ రచనలని పరిచయం చేసింది మీరే కాబట్టి. ఈ మధ్య బ్లాగులు తరచూ చూడకపోవడంతో(చూసినప్పుడు మీ పోస్టు కనపడకపోవడంతో) మీరు రాయలేదేమిటబ్బా అనుకున్నాను. మీ వల్లే ఆవిడ గురించి తెలుసుకుని ఆవిడని ఈ ఏడాది ఏప్రిల్లో కలిసాను.చక్కగా ఆదరించి(ఇంటిల్లిపాదీ కూడా) కడుపారా భోజనం పెట్టి,బోలెడు కబుర్లు చెప్పి పంపించారు. మళ్ళీ డిశంబరులో కలుస్తా అన్నాను కానీ ఇంతలోనే.. యధావిధిగా మీ నివాళి ఇల్లేరమ్మ గులాబీ రంగు (మామిడిపిందెలున్నది)పట్టు పరికిణి కట్టుకున్నంత అందంగా ఉంది. మీరు చెప్పిన ప్రతీ మాటా అక్షర సత్యం.ఇల్లేరమ్మతో ఆవిడ చిరస్థాయిని పొందారు.

    రిప్లయితొలగించండి