బుధవారం, సెప్టెంబర్ 25, 2019

ఓడను జరిపే ...

"తరాలు మారే జతలే, స్వరాలు పాడే కథలో..
సగాలై పోయే మనువే, సృజించే మూడో తనువే.."


సినీరంగ శ్రీనాధుడు వేటూరి సుందర రామ్మూర్తికి సద్గురు త్యాగరాజస్వామి మీద ఉన్న గౌరవం తెలిసిందే. అనేక త్యాగరాజ కృతుల్ని తన పాటల్లో సందర్భానికి అనుగుణంగా ఉపయోగించుకున్నారు వేటూరి.  కొత్తగా పెళ్ళైన ఓ యువజంట సల్లాపాలనూ, ఆ ఇద్దరు, ముగ్గురవుతున్న సంతోషాన్నీ వర్ణించే క్రమంలో వచ్చే పాటకి పల్లవిగా త్యాగరాజ విరచిత 'నౌకా చరిత్రము' లో ఓ కృతిని ఎంచుకోవడం, ఇటు సందర్భానికి అటు కృతికీ కూడా అతికినట్టు చరణాలు రాయడం ఈ పాటలో విశేషం. 

'సీతారామయ్యగారి మనవరాలు' సినిమా అనూహ్య విజయం సాధించడంతో మరికొందరులు నిర్మాతలు ఆ తరహా సినిమాల నిర్మాణం మీద దృష్టి సారించారు. ఆ సినిమా  ప్రధాన తారాగణం నాగేశ్వరరావు, మీనాలతో పాటుగా దర్శకుడు క్రాంతికుమార్ తో 'రాజేశ్వరి కళ్యాణం' చిత్రాన్ని నిర్మించారు నటుడు, నిర్మాత మురళీమోహన్. సంగీత ప్రధానంగా సాగే ఈ సినిమాలో త్యాగరాజ కృతుల్ని సందర్భానుసారంగా ఉపయోగించుకున్నారు. 

ఇప్పుడు చెప్పుకుంటున్న పాట కథని ముందుకు తీసుకెళ్లే సందర్భ గీతం, రెండు జంటలు పాడుకునే యుగళగీతం కూడాను. వృద్ధ జంట మాస్టారు, సీత (నాగేశ్వరరావు, వాణిశ్రీ), యువజంట శంకరం, రాజేశ్వరి (సురేష్, మీనా) లపై ఈ గీతాన్ని చిత్రించారు క్రాంతికుమార్. 

కథ ప్రకారం, మాస్టారు, సీత శాస్త్రీయ సంగీతాభిమానులు. సంతానం లేని ఆ జంటకి రాజేశ్వరి అంటే అభిమానం. ఆమె సవతి తల్లి (జయచిత్ర)ని ఎదిరించి మరీ రాజేశ్వరి ప్రేమించిన యువకుడితో ఆమె పెళ్లి జరిపిస్తారు. పెళ్లి తర్వాత ఆ జంటని తమతోపాటే ఉండిపొమ్మంటారు. వడియాలుపెట్టుకుంటూ సీత తీసే కూనిరాగంతో పాట ఆరంభమవుతుంది. 

"ఓడను జరిపే ముచ్చట కనరే వనితలారా నేడూ..
ఆడువారు యమునకాడ కృష్ణుని కూడి
ఆడుచు పాడుచు అందరు చూడగా.."

ఇది యధాతధంగా 'నౌకా చరిత్రము' నుంచి తీసుకున్నదే. త్యాగరాజు రచించిన రెండు సంగీత నాటకాల్లో 'నౌకా చరిత్రము' ఒకటి (రెండోది 'ప్రహ్లాద భక్తి విజయం' ). బాలకృష్ణుడి లీలల్ని వర్ణించే ఈ నాటకాన్ని తర్వాతి కాలంలో నృత్య నాటకంగానూ మార్చి ప్రదర్శనలు ఇచ్చారు/ఇస్తున్నారు శాస్త్రీయ నృత్య కళాకారులు. 

పల్లవి తర్వాత వచ్చే తొలిచరణంలో యువజంట ముద్దు ముచ్చట్లని చిత్రించారు దర్శకుడు. నది ఒడ్డున ఇంట్లో ఉండే జంటకి ఏకాంతం కావాలంటే పడవే శరణ్యం మరి. (చిత్రీకరణలో ఈ చరణానికి న్యాయం జరగలేదనిపిస్తుంది నాకు) 



"వలపుతడీ తిరణాలే పొంగిన యేటికి అందం..
కెరటాలకు వయ్యారం, కరిగే తీరం..
తిలకమిడే కిరణాలే.పొద్దుటి తూరుపుకందం..
చినదానికి సింగారం, సిగమందారం.. 

పదాల మీదే పడవ, పెదాలు కోరే గొడవ.. 
ఎదల్లో మోగే దరువే, కదంగా నావే నడవ..
ఇలా నీలాటిరేవులో..." 
 

నీలాటి రేవులో ముగిసిన చరణానికి, 'ఓడను జరిపే' పల్లవితో చక్కని లంకె. తొలిచరణంలో సాగిన ముద్దుముచ్చట్ల ఫలితం ఏమిటన్నది పల్లవి సాగుతుండగా తెరమీద కనిపిస్తుంది. తొలిసారి తల్లిదండ్రులు కాబోతున్న ఆనందంలో ఆ జంట పాడుకునే చరణం ఇలా సాగుతుంది: 

"చిలిపితడీ వెన్నెలలే గౌతమి కౌగిలికందం..
తొలిచూలుకు శ్రీకారం, నడకే భారం..
ఉలికిపడే ఊయలలే కన్నుల పాపలకందం..
నెలవంకల సీమంతం, ఒడిలో దీపం.. 

తరాలు మారే జతలే, స్వరాలు పాడే కథలో..
సగాలై పోయే మనువే, సృజించే మూడో తనువే..
త్యాగయ్య రామ లాలిలో..." 

త్యాగయ్య రామలాలితో ముగిసే ఈ చరణానికి కూడా పల్లవితో అందమైన లంకె కుదిరింది. రామలాలి వింటూ పెరిగే బాలకృష్ణుడి విలాసాలే కదా 'నౌకా చరిత్రము.'  కథలో సందర్భాన్ని, నౌకాచరిత్రపు నేపధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వింటూ ఉంటే, వినే ప్రతిసారీ మరింత సొగసుగా వినిపించే పాట ఇది. కీరవాణి సంగీత సారధ్యంలో కోరస్ తో కలిసి బాలూ, చిత్ర పాడారు. (చరణాల ప్రతిపదార్ధం ఇక్కడ చెప్పడం కంటే, ఎవరి ఊహా శక్తి మేరకు వారు అన్వయం చేసుకోడమే బావుంటుంది).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి