శుక్రవారం, మార్చి 03, 2017

నాయికలు-రత్నావళి

బతికి చెడిన జమీందారీ కుటుంబంలో పుట్టింది రత్నావళి. ఆ కుటుంబం అంతా విద్యావంతులే. ఆమెకూడా కొద్దిగా చదువుకుంది. డబ్బు కష్టాలకి తోడు, చిన్నప్పుడే తండ్రి చనిపోవడం మరో కష్టం ఆమెకి. బంధువులు ఆమె పెళ్లి బాధ్యతని తీసుకుని, నలభై ఐదేళ్ల సీతారామయ్యకి రెండో భార్యగా పదిహేనేళ్ల రత్నావళిని ప్రతిష్టాపురం పంపి, చేతులు దులుపుకున్నారు. సీతారామయ్య భార్య రత్నమ్మ కూతుర్ని, కొడుకుని కని, కూతురి పెళ్ళిచూసి, అనారోగ్యంతో కన్నుమూసింది. తల్లి మాణిక్యమ్మ, వితంతువై పుట్టింటికి తిరిగొచ్చిన చెల్లెలు సరస్వతి, పట్నంలో చదువుకుంటున్న తమ్ముడు రంగారావు బాధ్యతలు సీతారామయ్యవే. ఆ ఇంట అడుగుపెట్టిన రత్నావళి 'చెలియలికట్ట' ని దాటే పరిస్థితులని వివరంగా కళ్ళకి కట్టారు విశ్వనాథ సత్యనారాయణ.

అన్నగారి కష్టంతో బీఏ పూర్తి చేసి, ఎమ్మే ఎల్లెల్బీ చదువుతున్న రంగారావు అభ్యుదయవాది. వివాహం కారణంగా స్త్రీ స్వేచ్చకి భంగం కలుగుతోందని అతని నమ్మకం. రత్నావళికి సీతారామయ్య ఏమాత్రమూ సరిజోడు కాదని తీర్మానించుకున్న రంగారావు, ఆమెలో తిరుగుబాటు ధోరణిని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుని అభ్యుదయ సాహిత్యం చదివిస్తాడు. పట్నం నుంచి రంగారావు పుస్తకాలు పంపడం, వాటిని రత్నావళి చదువుతూ ఉండడం పట్ల ఆ ఇంట్లో ఎవరూ అభ్యంతర పెట్టరు. సీతారామయ్య వ్యవసాయమూ, కరణీకమూ నిర్వహిస్తూ నిత్యమూ ఎదురయ్యే ఆర్ధిక సమస్యల ఒడిదుడుకుల్లో తలమునకలయ్యే మనిషి.

మాణిక్యమ్మకి రత్నావళి మీద వల్లమాలిన ప్రేమ. కోడలిని కాలు కింద పెట్టనివ్వదు. సరస్వతివి స్వతంత్ర భావాలు. కుటుంబవ్యవస్థని గురించి బలమైన అభిప్రాయాలు ఉన్న స్త్రీ ఆమె. వదినెగారు ఇంటి పనుల్లో భాగం పంచుకోకపోవడం ఎంతమాత్రమూ సహించదు సరస్వతి. రంగారావుతో పుస్తకాల దగ్గర మొదలైన స్నేహం, రత్నావళికి అతనితో పక్క పంచుకోవడం వరకూ వెళ్తుంది. పెద్ద చదువులు చదువుతున్న రంగారావు ఆ సంబంధాన్ని 'స్త్రీ జనోద్ధరణ' గా భావిస్తాడు. పదిహేనేళ్ల రత్నావళి కొత్త రుచిని ఆస్వాదిస్తుంది. ఈ సంబంధాన్ని భరించలేని సీతారామయ్య, తమ్ముడికి ఆస్తిలో భాగం రాసిచ్చి, రత్నావళితో బంధాన్ని తెంపేసుకుని, వాళ్ళిద్దరినీ ఇంటినుంచి బయటికి పంపేస్తాడు.

పెళ్లినాడు సీతారామయ్య బహుమతిగా ఇచ్చిన బంగారు నగలను ఒంటి నిండా ధరించి, రంగారావుతో కలిసి చెన్నపట్నం ప్రయాణమవుతుంది రత్నావళి. తన స్నేహితులంతా అభ్యుదయ భావాలు కలవారనీ, ఆదర్శాలు పాటించే యువకులనీ, వారిలో తనకి నచ్చిన ఒక యువకుడిని రత్నావళి వివాహం చేసుకోవచ్చనీ ప్రతిపాదిస్తాడు రంగారావు. తాను రంగారావుని ప్రేమించినప్పటికీ, అతనికి తనపై ప్రేమలేదని తెలిశాక, అతని ప్రతిపాదనని అంగీకరిస్తుంది రత్నావళి. చేతిలో ఉన్న డబ్బు కరిగిపోతున్న కొద్దీ, అటు పట్నవాసం మీద మోజుతో పాటు ఇటు ఒకరిపై ఒకరికి ఆవరకూ ఉన్న మోజు కూడా కరిగిపోవడం ఆరంభిస్తుంది రత్నావళీ రంగారావులకి. అతడు చెప్పినట్టుగానే, రంగారావు స్నేహితులు ఆ ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారు. కొందరామెని వాంఛిస్తారు కూడా.. అయితే ఎవరూ వివాహ ప్రతిపాదన చేయరు.

రంగారావు మినహా మరెవరితోనూ శారీరక సంబంధాన్ని ఏర్పరుచుకోదు రత్నావళి. కాలం గడిచేకొద్దీ ఆమె ఆలోచనల్లో మార్పు వస్తుంది. గత వైవాహిక జీవితాన్ని, ప్రస్తుత జీవితాన్నీ పోల్చి చూసుకోవడం ఆరంభిస్తుంది. రంగారావు ఆమె మీద అధికారం చెలాయించినప్పుడల్లా గత, ప్రస్తుత జీవితాలని పోల్చుకుని తర్కించుకుంటూ ఉంటుంది. తన దృష్టిని వివాహం నుంచి, విద్య మీదకి మరల్చుకుని రంగారావు, అతని స్నేహితుల సాయంతో చదువుకుని, అధ్యాపక వృత్తి ఆరంభిస్తుంది. అప్పటికే, చదువు కొనసాగించే మార్గం లేని రంగారావు పత్రికా సంపాదకుడిగా ఉద్యోగంలో చేరతాడు. రత్నావళిని వాఛించి ఆమె తిరస్కారానికి గురైన రంగారావు స్నేహితులు వాళ్ళిద్దరి గురించీ దుష్ప్రచారం ఆరంభిస్తారు.

ఈ దశలో తనని పెళ్లిచేసుకోమని రత్నావళిని కోరతాడు రంగారావు. తానామెని ప్రేమిస్తున్నానని చెబుతాడు. అయితే, ఆ ప్రతిపాదనని తిరస్కరిస్తుంది రత్నావళి. రంగారావు పక్షవాతంతో మంచాన పడడంతో తన భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపిస్తుందామెకి. అతనికి బాగయ్యాక, 'తర్వాత ఏమిటి?' అన్న ప్రశ్న ఉదయిస్తుంది. కొంతకాలం సన్యాస జీవితం గడుపుతుంది. సరస్వతి కొడుకు నీలాంబరుడు చదువుకోసం పట్నం రావడం, ఇంటికి రాకపోకలు సాగించడం, అతనిలో సీతారామయ్య పోలికలు ప్రస్ఫుటంగా కనిపించడంతో తప్పు చేశానన్న భావన మరీ మరీ పెరిగిపోతుంది రత్నావళిలో. జీవితం మీద అనురాగాన్ని పూర్తిగా కోల్పోయిన రత్నావళి తన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఏం చేసిందన్నదే 1935 లో తొలిసారి ముద్రితమైన 'చెలియలికట్ట' ముగింపు.

పదిహేనేళ్ల గృహిణిగా పాఠకులకి పరిచయమై, తర్వాతి పదిహేనేళ్ల జీవితం అనేక మలుపులు తిరిగినప్పుడు ఎదుర్కొన్న సంఘర్షణ, తీసుకున్న నిర్ణయాలు.. ఇవన్నీ రత్నావళి పాత్ర మీద ఓ ప్రత్యేకమైన అభిప్రాయాన్ని ఏర్పరుస్తాయి. మొదట వయసుకన్నా తక్కువగా ఆలోచిస్తోందనిపించిన రత్నావళి, ఉన్నట్టుండి వయసుకి మించిన పరిణతిని ప్రదర్శించడం ఆరంభిస్తుంది. ఆమె నిదానం, నేర్పు, జీవితం పట్ల ఉన్న స్పష్టత, చక్కదిద్దుకునేందుకు చేసే ఆలోచనలు, ప్రయత్నాలు.. ఇవన్నీ రత్నావళిని ఓ ప్రత్యేకమైన పాత్రగా నిలుపుతాయి.

3 కామెంట్‌లు:

  1. మరీ ఇంత 'ప్లెయిన్ స్పీక్'లా చెప్తే ఎలాగండీ... :)

    రిప్లయితొలగించండి
  2. నవల ముగించేసరికి, 'మరిదికి లాంతరు వెలిగించి తెచ్చి, తొలగిపోయిన పిల్లేనా..' అనిపించిందండీ. మనలో మనమే రూపాంతరం చెందుతాం.. ప్రయాణంలో మలుపులు దాటాక, వెనక్కి తిరిగిచూసే అవకాశం కూడా ఉండదొక్కోసారి. రత్నావళీ అంతేనేమో కదా..

    రిప్లయితొలగించండి
  3. @పురాణపండ ఫణి: ముందుగా ధన్యవాదాలండీ.. వివరంగా జవాబు, అతిత్వరలో :)
    @కొత్తావకాయ: నిజమండీ.. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి