మంగళవారం, నవంబర్ 01, 2016

పింజారి

ఎమెస్కో ఆ మధ్యన ప్రచురించిన 'తెలుగువారి ప్రయాణాలు' పుస్తకం చదువుతూ రాసుకున్న 'చదవాల్సిన పుస్తకాల' జాబితాలో ఒకటి బుర్రకథ కళాకారుడు షేక్ నాజర్ ఆత్మకథ. ఎం. ఆదినారాయణ సంకలనం చేసిన 'తెలుగువారి ప్రయాణాలు' లో అనేక రంగాలకి చెందిన తెలుగు వారి ప్రయాణ విశేషాలను వారే రాసిన పుస్తకాల్లో నుంచి సేకరించి ప్రచురించారు. ప్రజానాట్యమండలి కళాకారుడైన నాజర్ అటు పోలీసులు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలనీ తప్పించుకుంటూ గుంటూరు జిల్లాలో రహస్య జీవితం గడిపిన రోజుల్లో చేసిన ప్రయాణాలని చదివానా పుస్తకంలో. మొన్ననే నాజర్ ఆత్మకథ 'పింజారి' దొరికింది.

ఇప్పుడు వినడానికి 'పింజారి' అనేది నిందావాచకంలా అనిపిస్తుంది. కానీ, దూదేకుల కుటుంబంలో పుట్టి పెరిగిన నాజర్ 'నేను పింజారిని' అని చాలా సందర్భాల్లోనే చెప్పుకున్నారు. తెలుగునాట బుర్రకథకి కొత్త ఒరవడిని పెట్టి, పేరు ప్రతిష్ఠలతో పాటు ప్రభుత్వం నుంచి పద్మ పురస్కారాన్నీ అందుకున్న నాజర్ జీవితానికి సంబంధించిన విహంగ వీక్షణం ఈ పుస్తకం. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి బుర్రకథలపై పీహెచ్డీ చేసిన అంగడాల వెంకటరమణ మూర్తి, తన పరిశోధనలో భాగంగా అనేక పర్యాయాలు నాజర్ ని కలిసినప్పుడు, ఆ కళాకారుడు తన గురించి పంచుకున్న విశేషాలని అక్షరబద్ధం చేసి 'పింజారి' పేరుతో ప్రచురించారు.

గుంటూరు జిల్లా పొన్నెకల్లులో నాజర్ పుట్టిపెరిగిన దూదేకుల వీధిలో పందిరి గుంజ కూడా పాటలు పాడుతుందిట. సంగీతంతో అంతగా మమేకమైన కుటుంబాలవి. నాజర్ కుటుంబం స్థానిక దేవాలయంలో అనువంశిక నాదస్వర కళాకారులు. అయితే, నాజర్ కి మాత్రం పుట్టుకతోనే విద్య పట్టుపడిపోలేదు. మొదట నాటకాల్లో బాల నటుడిగా నటించిన నాజర్ కి పాట బాగా పట్టుపడుతుందని గుర్తించిన వాడు హార్మోనిస్టు ఖాదర్. ఓ పక్క పేదరికం, మరోపక్క పిల్లవాడికి సంగీతం చెప్పించాలన్న ఆ కుటుంబ సభ్యుల తాపత్రయం.. తపన కొన్నాళ్ళు, పేదరికం కొన్నాళ్ళు గెలవడంతో కొంతమేరకు మాత్రమే సంగీతం నేర్చుకోగలిగారు నాజర్.


కుటుంబ పోషణ కోసం నటన, బుర్రకథలు, ఏమీ లేనప్పుడు టైలరింగ్ పనులతో ఎప్పుడూ క్షణం ఖాళీ లేకుండా గడుపుతున్న నాజర్ జీవితంలో పెద్ద మలుపు కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆకర్షితుడు కావడం. ప్రాణాలు పోయే పరిస్థితులు ఎదురుపడ్డా అతడు పార్టీని విడవకపోయినా, పార్టీనే రాజకీయ కారణాలతో కొన్నాళ్ల పాటు నాజర్ ని దూరం పెట్టింది! విద్య నేర్చుకున్న విధానం మొదలు సాటి కళాకారుల సహకారం, అప్పుడప్పుడూ వాళ్ళ కారణంగా ఎదుర్కొన్న సమస్యలు, పార్టీ రాజకీయాల కారణంగా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి రావడం, వెంట్రుక వాసిలో చావు నుంచి తప్పించుకోవడం.. ఇవన్నీ ఈ పుస్తకాన్ని ఆపకుండా చదివిస్తాయి. సినీ రంగ ప్రవేశం, కొన్ని అనుభవాల తర్వాత వెండితెర కన్నా స్టేజీ మీద బుర్రకథ చెప్పడానికే మొగ్గు చూపడం ఆసక్తికరమైన సంగతులు.

కళాకారుడిగా ఎత్తులకు ఎదుగుతున్న సమయంలో కుటుంబంలో వచ్చిన సమస్యలు.. వాటిని నాజర్ ఎదుర్కొన్న వైనాన్ని క్లుప్తంగా వివరించారు రచయిత. తెలుగు ప్రజలు గర్వించ దగ్గ కళాకారుడిగా ఎదిగిన నాజర్ కు అస్సలు లేనిది డబ్బు జాగ్రత్త. సొంత ఇల్లు కట్టుకోవడం, పిల్లలకి విద్య నేర్పించడం మినహా ఆస్థుల రూపంలో దాచింది ఏమీ లేదన్న సంగతి పెద్దగా ఆశ్చర్య పరచదు. కమ్యూనిస్టు పార్టీ కోసం కమిటెడ్ గా పనిచేసిన వాళ్ళెవరూ ఆస్థులు కూడబెట్టుకున్న దాఖలాలు లేవు మరి. నాజర్ బహుముఖీన వ్యక్తిత్వాన్ని పాఠకులకి పరిచయం చేయడంలో రచయిత కృతకృత్యులయ్యారు. పుస్తకం మొత్తం ఒక ఎత్తైతే, చివర్లో 'మా బాజీ' అంటూ నాజర్ భార్య ఆదంబీ రాసిన వ్యాసం ఒక్కటీ మరో ఎత్తు.

ఆదంబీ నాజర్ కి మూడో భార్య. మేనమామ కూతురు కాశింబీని పెళ్లిచేసుకున్న నాజర్, ఆమెకి  అనారోగ్యం చేయడంతో మరో పెళ్లి చేసుకుని, ఆమె అకాల మరణం పాలవ్వడంతో కాశింబీ చెల్లెలు ఆదంబీని పెళ్లిచేసుకున్నారు. చివరి వరకూ కాశింబీ నాజర్, ఆదంబీలతో కలిసే ఉన్నారు. "నా తొమ్మిదో ఏట ఒకసారి మా ఇంటికి అడుక్కునే సాధువు వొచ్చాడు. నా చెయ్యి చూసి, నీకు పండితుడు దొరుకుతాడు అని చెప్పాడు. అది విని మా అక్కలు దూదేకుల సాయిబుల్లో పండితుడెవడే అని నవ్వేవాళ్ళు" అంటూనే, ఒక్కో బుర్రకథ తయారు చేయడానికీ నాజర్ పడ్డ శ్రమనీ, సేకరించిన వివరాలనీ జ్ఞాపకం చేసుకుని, సాధువు మాట పొల్లుపోలేదంటారు ఆదంబీ.

పుస్తకం చదవడం పూర్తి చేసేశాక, 'యుగధర్మం' శీర్షికతో 'అరుణ' రాసిన నాలుగు మాటల్లో ఆకర్షించిన వాక్యాలివి: "పెద్దనగారు గండపెండేరం తొడిగించుకున్న కాలానికి పింజారీ ఊరవతల ఉన్నాడు. పింజారీ గండపెండేరం తొడిగించుకునే కాలానికి పెద్దనగారు పెద్దమనిషి అయి ఇవన్నీ తప్పురా అంటే - కాలం చిన్నబుచ్చుకోదా.." ఎనభై ఆరు పేజీల 'పింజారి' సారాంశాన్ని అరుణ ఒకే ఒక్క వాక్యంతో చెప్పేశారనిపించింది. మరుగున పడిపోతున్న కళల మీద, కళాకారుల మీదా ఆసక్తి ఉన్న వాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకమిది. విశాలాంధ్ర ప్రచురణ సంస్థ ప్రచురించిన ఈ పుస్తకం వెల రూ. 65. అన్ని పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతోంది.

3 కామెంట్‌లు:

  1. మహానుభావుడు, pioneer నాజర్. పుస్తక పరిచయం బాగుంది.
    'అరుణ ' గారు చెప్పారన్న ఈ క్రింది మాటల్లో పెద్దన గారి మీద విసురేమిటో బోధపడలేదు. ఇవన్నీ తప్పురా అని పెద్దన గారు అనుండేవారు అనే భావన ధ్వనిస్తోంది.
    < " "పెద్దనగారు గండపెండేరం తొడిగించుకున్న కాలానికి పింజారీ ఊరవతల ఉన్నాడు. పింజారీ గండపెండేరం తొడిగించుకునే కాలానికి పెద్దనగారు పెద్దమనిషి అయి ఇవన్నీ తప్పురా అంటే - కాలం చిన్నబుచ్చుకోదా.." "

    రిప్లయితొలగించండి
  2. మీ సమీక్ష బావుంది. నాకు కూడా అరుణ గారు అన్న మాటలు అర్థం కాలేదు.

    రిప్లయితొలగించండి

  3. @విన్నకోట నరసింహారావు, లలిత టీఎస్: గండపెండేరం గురించి వివరంగా చెప్పాలంటే నాజర్ జీవితంలో జరిగిన ఒక ముఖ్య సంఘటనని వివరంగా చెప్పాలండీ.. ఆ సంఘటనని మిగిలిన జీవిత విశేషాలతో కలిపి చదవడమే బాగుంటుందని ప్రస్తావించలేదు. పుస్తకం చదివితే మీ ప్రశ్నకి జవాబు దొరుకుతుంది.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి