ఆదివారం, మార్చి 20, 2016

రాజూ-పేద

మన 'రాముడు-భీముడు' 'గంగ-మంగ' లాంటి డబుల్ ఫోటో సినిమాలెన్నింటికో మూలమైన ఇంగ్లీష్ నవల 'ది ప్రిన్స్ అండ్ ది పాపర్.' సుప్రసిద్ధ వ్యంగ్య రచయిత మార్క్ ట్వేన్ 135 సంవత్సరాల క్రితం రాసిన ఈ నవలని సుమారు 65 ఏళ్ళ క్రితం 'రాజూ-పేద' పేరుతో తెలుగులోకి అనువదించారు నండూరి రామమోహన రావు. ట్వేన్ కల్పించిన ఈ చారిత్రక గాధ ఎనిమిదవ హెన్రీ కాలం నాటిది. (ఎనిమిదవ హెన్రీ 1509-47 మధ్య కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పాలించాడన్నది చరిత్ర).

హెన్రీ గారబ్బాయి ఎడ్వర్డు రాజకుమారుడు, లండన్ నగరపు మురికివాడ ఆఫాల్ కోర్టులో నివాసం ఉండే జాన్ కాంటీ కుమారుడు టాం కాంటీ అచ్చుగుద్దినట్టు ఒకేపోలికల్లో ఉంటారు. ఇద్దరూ ఒకే ఈడువాళ్ళు కూడా. అయితే, వాళ్ళిద్దరికీ ఒకళ్ళ సంగతులు మరొకరికి తెలిసే అవకాశం లేదు. ఎనిమిదవ హెన్రీ అనారోగ్యంతో తీసుకుంటూ ఉండడంతో ఏ క్షణంలో అయినా పాలనా పగ్గాలు అందుకోవలసిన అగత్యం ఎడ్వర్డుది. అందుకు తగ్గట్టే అతడు యుద్ధ విద్యలు మొదలు, రాజనీతి వరకూ అన్నింటిలోనూ శిక్షణ పొందుతూ ఉంటాడు.

ఇందుకు పూర్తిగా భిన్నమైన జీవితం టాం ది. భిక్షాటన చేసి పొట్ట పోసుకోవలసిన పరిస్థితి. పైగా, భిక్షాటన చట్టరీత్యా నేరం కాబట్టి ప్రభుత్వానికి దొరక్కుండా తప్పించుకుంటూ ఉండాలి. ఏ రోజన్నా డబ్బు తీసుకురాకపోతే ఇంట్లో బడితె పూజ తప్పదు. పొరుగునే ఉండే ఓ సన్యాసి దగ్గర రాయనూ, చదవనూ నేర్చుకుని దొరికిన కథల పుస్తకాలు చదివి ఆనందిస్తూ ఉంటాడు టాం. రాజుల కథలంటే ఆ పిల్లాడికి ఎంతో ఇష్టం. తను చదివిన కథలనే చిలువలు పలవలు చేసి తన స్నేహితులకి చెబుతూ ఉంటాడు ఎప్పుడూ. కుర్రాళ్ళు ఇద్దరికీ పదేళ్ళ వయసు వచ్చేవరకూ కథేమీ ఉండదు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది.


తండ్రి తనని కోప్పడడంతో ఓరోజు ఇల్లు వదిలిన టాం ఏదో ఆలోచనల్లో నడుచుకుంటూ నడుచుకుంటూ రాచ నగరుని చేరుకుంటాడు. గేటు దాటి లోపలి పోతోతున్న అతన్ని భటులు ఆపి ఇష్టానుసారంగా కొడుతూ ఉండడం ఎడ్వర్డు చూస్తాడు. తన ఈడు కుర్రవాడు అలా దెబ్బలు తింటూ ఉండడం భరించలేక భటుల్ని అడ్డుకుని, టాంని తన మందిరంలోకి తీసుకెళతాడు. అప్పుడు గ్రహిస్తారా ఇద్దరూ తమ పోలికలు ఒకేలా ఉన్న విషయాన్ని. టాం ని గురించి పూర్తిగా తెలుసుకున్న ఎడ్వర్డు, పోలికల్ని చాలా ముచ్చట పడి తన దుస్తులు టాంకి తొడికి, అతని పీలికలు తను ధరిస్తాడు.

ఆ పీలికలతో ఒకసారి బయటికి వెళ్లి రావాలన్న కోరిక కలుగుతుంది ఎడ్వర్డుకి. లోపలి వెళ్ళిన కుర్రాడు తిరిగి వచ్చాడనుకుని, ఎడ్వర్డుని చితకబాది, అతను చెప్పేది వినిపించుకోకుండా దూరంగా తరిమేస్తారు భటులు. చేసేది లేక టాం ఉండే ఆఫాల్ కోర్టుకి ప్రయాణం అవుతాడు. ఇంట్లో వాళ్ళతో తను ప్రిన్స్ ఎడ్వర్డునని చెబితే, పుస్తకాలు చదివి పిచ్చి ముదిరిపోయి తనే రాకుమారుణ్ణి అన్న భ్రమలో పడిపోయాడని భావిస్తారు కుటుంబ సభ్యులు. తల్లికి మాత్రం కించిత్తు సందేహం కలుగుతుంది. ఇక్కడినుంచి కథ ఉరుకులూ పరుగులూ పెడుతుంది.

చిత్రహింసలు పెట్టే తండ్రీ, బామ్మా.. వాళ్ళ హింసలు భరించలేకా, అలాగని యాచన చేయలేకా ఇబ్బంది పడే ఎడ్వర్డు. మరోపక్క అంతఃపురంలో అక్కడి మర్యాదలూ అవీ తెలియక సతమతమయ్యే టాం. 'నేను ఎడ్వర్డుని కాదు మొర్రో' అని టాం మొత్తుకున్నా ఎవరూ నమ్మరు సరికదా 'రాకుమారుడికి పిచ్చెక్కింది' అన్న వార్త క్షణాల్లో అంతఃపురం అంతా వ్యాపిస్తుంది. రాచరికపు మర్యాదలని చిత్రించడంలో వ్యంగ్యాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళారు మార్క్ ట్వేన్. హెన్రీ ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో ఎడ్వర్డుగా భావిస్తున్న టాంకి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించడంతో కథ పాకాన పడి అనేకానేక మలుపుల తర్వాత ముగింపుకి చేరుతుంది.

నండూరి రామమోహన రావు అనువాదం ఎక్కడా 'అనువాదం' అన్న భావన కలగనీయదు. భాష మీద అనువాదకుడికి ఉన్న పట్టు అడుగడుగునా అనుభవం అవుతూ ఉంటుంది పాఠకులకి. అనువాదంలో కూడా నేటివిటీని ఎలా చూపించవచ్చు అన్నదానికి ఈ నవల ఓ ఉదాహరణ. చదువుతున్నంతసేపూ లండన్ మన పక్క ఊరేనేమో అనిపించక మానదు. చాలామంది దీనిని పిల్లల నవల అంటారు. బహుశా, ట్వేన్ సంధించిన వ్యంగ్యోక్తుల్ని వాళ్ళు హాస్యంగా అపార్ధం చేసుకుని ఉంటారు. పిల్లల్ని ఆనంద పెట్టి, పెద్దవాళ్ళని ఆలోచింపజేసే నవల ఈ 'రాజూ-పేద.' (అభినందన పబ్లిషర్స్ ప్రచురణ, పేజీలు  231, వెల రూ. 75, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

4 వ్యాఖ్యలు:


 1. నండూరి రామ మోహన !
  మెండుగ వ్రాసెను నవలయు మేటిగ నిలచెన్ !
  గండడు పేదను రాజును
  నిండుగ నిలిపెను కథలన నీతిని జెప్పెన్

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఏంటండీ మురళి గారు, ఇలా పుస్తకాల మీద దండయాత్ర మొదలెట్టారు. మీరిలా రోజుకో పుస్తకం చొప్పున ఊది అవతల వేసేస్తే మాలాంటి అభాగ్యుల గతి ఏమిటంటారు :)

  మంచి మంచి పుస్తకాల గురించి మీరు మరింత హృద్యంగా పరిచయం చేస్తుంటే చాలా బాగుంది. మీ దున్న మీద పిట్ట వ్యాఖ్య అదరహో అదరహా... కోనసీమ వారనిపించుకున్నారు... చురుక్కుమనిపించే చమత్కారంతో

  మీరిలాగె బోల్డు పుస్తకాలు చదివి ఆ విసేషాలు మాతో పంచుకోవాలని ఆశిస్తూ

  ప్రత్యుత్తరంతొలగించు
 3. లక్ష్మి గారి కామెంట్... డిటో డిటో.. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. @జిలేబి: పద్యాలల్లడం నేర్చుకోవాలనిపించేస్తోదండీ.. ..ధన్యవాదాలు
  @లక్ష్మి: దండయాత్ర ఏమీ లేదండీ.. అనుకోకుండా కొంచం తీరుబాటు దొరికింది.. ఎప్పటినుంచో పెండింగ్ పెట్టి ఉంచిన పుస్తకాలు తిరగేస్తున్నాను.. అంతే.. ధన్యవాదాలండీ..
  @కొత్తావకాయ: జవాబు కూడా డిటో డిటో అండీ :) ..ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు