మంగళవారం, అక్టోబర్ 27, 2015

గుడి ఎనక నాసామి -2

(మొదటి భాగం తర్వాత...)

ఏటి సెయ్యటాకీ ఆలోసిన తెగట్లేదు నాకు. గాబరకి గొంతెండిపోతన్నట్టుగా ఉన్నాది. కున్నీల్లు తాగుదారనిపించేతలికి ఇయ్యాల సుక్కురోరవని గేపకవొచ్చింది. అమ్మోరమ్మకి కటికుపాసాల మొక్కు. తప్పితే ఇంకేటన్నా ఉన్నాదా?

మాయాయినికి పోన్జేత్తే పక్కన్టీవీ వోల్లున్నారని కూడా సూడకండా బూతుల్లంకించు కుంటాడు. పోనీ బిత్తిరి గాడికి సేద్దారంటే ఆన్నోట్లో నువ్వు గింజి నాన్దు. అంత కనాకట్టపు మనిసాడు. ఏదైతే, మావోడు బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నాడుగదా. పక్కనే టీవీ వోడున్నాడు. నా ఎదర టీవీ ఉన్నాది. అక్కడేటయ్యిందో ఆడు సూపింతవే తరవాయి, నాకు తెలిసి పోద్ది.

ఎడ్వడింగులయిపోయేయి గానీ టీవోడు ఇంకేయో వోర్తలు సూపింతన్నాడు. బిత్తిరిగోడు సరైనోడైతే నాకీ బాద లేకపోను. ఆన్ణాకు దూరపు సుట్టం. కొడుకొరస. ఈ సంగత్తెలిసే నేనాణ్ణి ఇంట్లోకి రానింతం మొదలెట్టేను. నన్ను సిన్నమ్మగోరూ అనీసి, బంగార్తల్లిని సెల్లెమ్మా అనీ పిలుత్తాడాడు. పెల్లికెదిగిన ఆడపిల్లని ఇంట్లో ఎట్టుకుని ఎవుణ్ణిబడితే ఆణ్ణి సనూగా తిరగనిత్తావేటి?

ఆడు డిపాటుమెంట్లో సేరిన కొత్తల్లో మాయాయిన ఆడితో ఎల్లాగుండేవోడో తెల్దుగానీ, ఏ మూర్తాన బిత్తిరిగోడు నాకు సుట్టవన్న సంగత్తెల్సిందో ఆ నాట్నించీ ఆడు మా మారాజుకి నీల్ల కన్నా పల్సనై పోయేడు. ఈయినగోర్ని అనుకోటం ఎందుకూ? ఆడూ తగ్గావోడే.

ఆర్నెల్ల కితం కామాల, ఓనాడు బిత్తిరోడు సొమ్మట్టుకొచ్చేడు. వొచ్చిన వొసూల్లో మాయాయినగోరి వోటా. ఈయనగోరిప్పుడు ఎస్సైగదా.. వోటాల పని కానిస్టీబుల్లు సూత్తారు. మాయాయిన మంచి కుసీ గా ఉంటం సూసి బిత్తిరోడికి దైర్నం సిక్కినట్టున్నాది.

"మనవిల్లాగ డబ్బుచ్చుకోటం తప్పుగాదా గురువు గారూ?" అని అడిగేసేడు. వొంటింట్లో ఉన్నాన్నేను.

"అయిపోయిందియ్యాల.. బిత్తిరోడి గూప్పగిలిపోతాదిప్పుడు" అనుకుంటన్నానో లేదో, నా పెనివిటి మొదలెట్టేడమ్మా ఉపన్యేసం. ఇనాలంతే..

"బాబొరే బిత్తిరీ.. నీ వొయిసెంతరా? నా సర్వీసంత ఉంటాదా? మీ సిన్నమ్మగోర్ని సేసుకునే నాటికి నేను కానిస్టీబు డూటీలో ఉండేవోన్ని. గవర్మెంటు అప్పుడే కొత్తగా సారా మీద ప్రొబేసనెట్టింది. అంటే ఏటన్న మాట? ఎక్కడా సారా అన్నది అమ్మరాదు. మనం ఎవరం? ప్రోబిసనోల్లం. పక్కన ఎక్సైజు కూడా ఉంటాదనుకో. మన డూటీ జెనాలకి సారా అన్నది దొరక్కండా సెయ్యటం. సెక్కింగులు, రెయిడింగులు.. అబ్బో.. పోలీసోడి కన్నా ప్రొబీసనోడే పవర్ఫుల్గుండేవోడు. ఎవడో మాటెందుకు, నాకే కొత్త పెల్లంతో కాపరం కన్నా డూటీ సెయిటంలోనే ఎక్కూ కిక్కుండేది. పేపరోల్లు గూడా సారా ఒక్కటే గాదు, అసలు మందన్నదే దొరక్కండా సేసెయ్యాలని ప్రెతి రోజూ పేజీలకి పేజీలు  రాసేవోల్లు.."  ఆలోసింతాక్కాబోలు ఆగేడు మావోడు.

బిత్తిరోడు ఇంకే ఎదవ ప్రెశ్నలూ అడక్కండా కాయమని అమ్మోరమ్మకి దండాలెట్టుకునే లోగానే, నా ప్రెత్యెక్స దైవం మల్లీ అందుకున్నాడు.

"కొన్నాల్లకా ముచ్చటా తీరింది. కంప్లీటు ప్రోబిసన్ అన్నారు. మన డిపాట్మెంటు పులైపోయింది. అబ్బబ్బ.. ఆరోజులు మల్లీ రావనుకో. కానేవయ్యింది? గవర్మెంటు మారింది. ప్రోబిసన్ మీద మాట మారిసింది. మొత్తం ప్రొబిసనన్నదే ఎత్తెయిటవే గాదు, మందమ్మటాకి టారిగెట్లేసింది. ఆ డూటీ మన డిపాట్మెంటుకపజెప్పింది. మంచీ సెడ్డా సెప్పాల్సిన పేపరోల్లేంజేసేరు? మాట మారిసేసి, గవర్మెంటు సేసిందే రైటని జై కొట్టేరు. అంటే ఏటన్న మాట? ఎవర్లాబం ఆల్లు సూసుకున్నారు. గవర్మెంటు ఏం సెబితే అది సెయ్యాల్సినోల్లం మనవనగా ఎంతరా? నీకంతగా డబ్బు సేదనుకో, నీ వోటా వొదిలేసుకో. అంతేగానొరే, ఇల్లాటి మాట్లు ఎవరి కాడా అనకు. ఉజ్జోగానికి అన్ఫిట్ అనెయ్ గల్రు. ఇప్పుణ్ణీ డూటీ ఏటన్నమాటా? మీ సిన్నమ్మగోర్నడిగి మనకో డబల్ స్ట్రాంగ్ టీ అట్టుకురా" అని పురమాయించేడు.

ఆ ముచ్చటల్లాగ తీరింది బిత్తిరిగోడికి. నాల్రోజుల్నాడు ఎస్సై గోరు ఇంట్లో లేకండా సూసి "సిన్నమ్మగారో" అంటా వొచ్చేడాడు.

"మా బతుకు మరీ కనాకట్టవై పోయిందమ్మా. ఎవురికి సెప్పుకోవాలో గూడా తెల్టంలేదు. ఇన్నాల్లూ మందు కొట్లోల్ల మీద, బార్లోల్ల మీద పెత్తనం సేసేంగదా. ఇంకా సేత్తానే ఉండాలిగూడా గదా.. గవర్మెంటిప్పుడు ఏం జేసిందో సూసేరా? మాసేతే దుకానవెట్టించి మందమ్మిత్తాదంట. ఏవంటే టారిగెట్లంట. కొట్లోల్ల కాడ మాకిలవుంటాదా? మమ్మల్నాల్లు సులకనగా సూత్తే మాకెంత కట్టంగుంటాది.." అంటా ఏడిసినంత పని సేసేడు.

మా మారాస్సెప్పినట్టుగా, ఉజ్జోగస్తుడంటే గవర్మెంటోడు ఏ డూటీ సెయ్యమంటే ఆ డూటీ సెయ్యాల్సిందే. ఏరే గచ్చంతరం లేదు.

బిత్తిరిగోడు సెప్పిందింటా వుంటే మూడోరాల్నాడు అమ్మోరమ్మతల్లి సెప్పిన మాట్లు గేపకానికొచ్చేయి. పక్కీదిలో ఒకల్లింటికొచ్చిన సుట్టాలావిడికి అమ్మోరమ్మ వొంటిమీదకొత్తాదని తెల్సి దర్సినానికెల్లేను. నా పున్యేనికి అమ్మ పలికింది.

"నువ్వు నా బక్తురాలివే.. నా బక్తుల్ని నేను కాసుకుంటానే.. అంతా మంచే జరుగుతాది నీకు.. సిన్న సిన్న సిక్కులు నీదారికడ్డం పడబోతన్నాయి.. జేగర్త.. నిన్ను కాయటాకి నేనున్నాను.. నీ జేగర్తలో నువ్వూ ఉండాల" అంజెప్పి, వొరసగా మూడు సుక్కురోరాలు ఉపాసాలు సెయ్యమని ఆజ్నేపించింది తల్లి. ఇయ్యాల మూడో వోరం. ఆయేల్నుంచీ మొదలయ్యింది బెదురు. ఏరోజేటవుతాదోనని ఒకిటే బెంగ.

అమ్మ.. ఇంచేపు కదలకండా టీవీ సూసినందుకు పలితం కనబడ్డాది. అడిగో మాయాయిన. పక్కన బిత్తిరిగోడు. గొట్టం మైకట్టుకుని టీవీ కుర్రోడు..

"ఇళ్ళ మధ్యలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు స్మితా. పవిత్రమైన దేవాలయం వెనుక మద్యం దుకాణం నిర్వహించడాన్ని వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. స్వయంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వారే ఈ షాపుని నిర్వహిస్తున్నారు స్మితా. అయితే, ఇక్కడ ఉన్న ఎక్సైజ్ ఎస్సై మాత్రం మనతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. పై అధికారుల ఆదేశం మేరకే షాపుని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.."

ఇదా ఇసయం.. తీరామోసి ఈల్ల సేత మందమ్మిత్తన్నాది అమ్మోరమ్మ గుడెనకాల. ఎప్పుడూ సూపర్నెంటు దొరగోరో, పెద్దొరగోరో కురిసీలో కూసుంటే, పేపరు పోటోలకి ఎనకొరసలో నిలబడే మాయాయిన, ఇయాల దరిజాగా కురిసీలో కూసుని కనబడ్డాడు టీవీలో. ఆడంగులంతా టీవీల్లో కనిపించేవొరుకూ అరిసేసి, బోజినాలకెల్లిపోతారు కామాల. 

మాయాయిన్ని కుంచేపు టీవీలో సూసుకుందారనుకున్నానో లేదో మల్లీ ఎడ్వడింగులు మొదలైపోయేయి. ఈ వోర్త మల్లీ సూపింతారో లేదో.

ఓయమ్మ ఏటిదీ? ఎడ్వడింగులయ్యేతలికి పుట్ల పుట్ల కింద జేరిపోయేరాడంగులు. బిత్తిరిగోడు కంగారుగా పోన్లు కలుపుతున్నాడు. మా మొగాయన టీవీవోల్లకేసి సూడకుండా పన్లో ఉన్నట్టుగా యాక్టింగు జేత్తన్నాడు.

ఆడోల్లని సూత్తాంటే నాగ్గాబర పెరిగిపోతన్నాది. అమ్మోరమ్మా.. ఉపాసంలో ఉన్నానమ్మా.. ఈ బక్తురాలిని పరిచ్చింతన్నావా తల్లే.. కూసున్న ఆడంగులు ఒక్కసారే పైకి లేసేరు.  నాకేదో కీడు తోత్తన్నాదమ్మోరమ్మా.. మాయాయిన్ని దాటుకుని కొట్లోకెల్లిపోయేరు. ఒక్కో సీసాకాయీ తీత్తన్నారు.. నేలకేసికొడతన్నారు.

యేటిది? లోపల్నించేటింత సంతోసం కలుగుతున్నాది. ఒక్కోసీసా పగుల్తా ఉంటే ఎన్నెన్నిగుర్తొత్తన్నాయి. నాన మంచోడే.. అమ్మ మంచిదే.. మందు సెడ్డది.. ఆంటీగారు మంచోలే..అంకులు గారు మంచోరే.. మందు సెడ్డది.. రావుడన్నయ్య మంచోడే.. వొరమ్మొదిని మంచిదే.. మందు సెడ్డది.. నేను మంచిదాన్నే.. మాయాయిన మంచోడే.. మందు సెడ్డది. సుట్టాలోల్లు.. తెలిసినోల్లు.. ఇంకా ఎంతమంది? ఏల కుటుంబాలా, లచ్చల కుటుంబాలా? ఎంతమంది పడ్డారు? పడతన్నారు? గవర్మెంటు ఇంకా ఇంకా తాగించమనే సెబుతాదిగానీ, వొద్దని సెప్పదు.. టారిగెట్లేత్తాది.. కొట్లేయించి అమ్మింతాది.. ఎవురూ మాటాడ్రు..

అమ్మోరమ్మ తల్లీ... ఈయాడోల్ల రూపంలో వొచ్చేవా అమ్మా.. ఇంతమంది కోసం గుడెనకాలికి  వొచ్చేవా తల్లీ.. ఆడంగుల్లారా.. కొట్టండి.. ఒక్కో సీసా కాయనీ నేలకేసి కొట్టండి.. అడ్డవొత్తే మాయాయిన్నైనా సరే కొట్టండి..

అదుగో.. బిత్తిరిగాడి పోనందుకుని పోలీసోల్లొచ్చేసేరు.. ఆడోల్లని లోపలేసేత్తారు. అయితే ఏటి.. మందునేంజెయ్యాలో అమ్మోరమ్మ సెప్పింది.. ఆడోల్లందరిసేతా సేయిత్తాది..సేయించు తల్లే.. సేయించమ్మా.. మూడు సుక్రోరాలు గాదు.. ఈ బక్తురాలు జీవితాంతం ప్రెతి సుక్రోరం కటికుపోసం సేత్తాది.. అమ్మోరమ్మ తల్లే.. దయుంచమ్మా.... కాపరాల్నిలబెట్టే సెక్తి నీకే ఉన్నాత్తల్లే.. నాకేటిది... సెలవలు కమ్ముతున్నాయి... కల్లు తిరూతున్నాయి... అ..మ్మా.. అ...మ్మో...ర...మ్మా.... 

 (అయిపోయింది)

18 కామెంట్‌లు:

  1. బ్రతుకులో వుండే irony ని అద్భుతంగా అక్షరాలా చూపించారు.
    గొప్పగా వుంది.
    శారద

    రిప్లయితొలగించండి
  2. మళ్ళీ చదువుకుంటే ఇంకా నచ్చేసిందండీ. కథని ఎలా నడిపిస్తే రక్తి కడుతుందో.. ఆ ఒడుపు మీ బలం.

    నాకు కథ కంటే, కథనంలో టెక్నిక్ బాగా నచ్చింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. నాదీ కొత్తావకాయ గారి మాటేనండీ మీ ప్రజంటేషన్ కేక :-)

    రిప్లయితొలగించండి
  4. భర్తని త్రాగమని ప్రోత్సహిస్తూ వేరొకరు సీసాలను బద్దలుగొడితే సంతోషించడమేమిటండీ ?అమ్మోరిని నమ్మడం తప్ప తానేమీ చేయదా ? అసలు తెలుగు చదివే వారే తక్కువ ఇక యాసలు చదివే ఓపిక ఎవ్వరికి ? మీకోసం కృష్ణవేణి వ్రాసుకున్నారు. మళ్ళీ అదే యాసతో చదవాలంటే బోర్ అనిపించింది. యువతరానికి నచ్చే విధంగా మళ్ళీ కొత్త కధతో వస్తారని ఆశిస్తూ...

    రిప్లయితొలగించండి

  5. @శారద: మీకెలా చెప్పాలో అర్ధం కావడం లేదు కానీ.. మెనీ మెనీ థాంక్స్ అండీ.. చాలా సంతోషాన్నిచ్చింది మీ స్పందన..
    @కొత్తావకాయ: 'సాధనమున పనులు సమకూరు ధరలోన' కదండీ.. కథ మీద మరింత దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తాను.. ధన్యవాదాలు..
    @లక్ష్మి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  6. @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..
    @నీహారిక: బోర్ కొట్టినా చివరికంటా చదివి మీ అభిప్రాయం పంచుకున్నందుకు చాలా థాంక్స్ అండీ.. (నేనైతే మధ్యలోనే వదిలేసే వాడినేమో) ..అవసరమైతే కొంత విరామం తీసుకునైనా సరే, మీ సూచనలని గురించి ఆలోచిస్తాను.. మరోమారు ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  7. కతలు సదుంకుని సంతోసపడ్డవే తప్ప నిజవైన కత యెన్నటికీ మారదనిపిచ్చి బాదే మరి....

    రిప్లయితొలగించండి
  8. మాండలికంలో కథలు రాయడంలో ఆరితేరి పోయారు మీరు.

    రిప్లయితొలగించండి
  9. @పురాణపండ ఫణి: మారుతుందేమో అన్న ఓ చిన్న ఆశ కూడానండీ.. (నేను అత్యాశావాదినంటారా?:)) ...ధన్యవాదాలు..
    @జ్యోతిర్మయి: మీ అందరి ప్రోత్సాహమూనండీ.. ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  10. మురళి గారూ,
    నీహారిక గారి కామెంట్ తో నేను ఎకీభవిన్చానండీ...
    ఎందుకంటే మీరు మామూలుగా రాస్తేనే బావుంటుంది. ఇంక మాండలికంలో రాస్తే నాకు తెగనచ్చి ముద్దొస్తుంది. మాండలికం లో మీకు ఎనలేని పట్టు ఉంది. మట్టి పరిమళం వేస్తుంది.
    ఇంకా కృష్ణవేణి ని మీరు మీ కోసం రాయలేదు. తెలుగు సాహిత్యం లో చిరస్తాయిగా నిలిచిపోతుంది. అది చదువుతుంటే నాకు పాకుడురాళ్ళు చదివినట్టే అనిపించింది అని నేనంటే మీరు పొగడ్త అనుకుంటే నేను హేల్ప్లేస్! కానీ అది నిజంగా నిజం.
    మీ నుండి ఇంకా మరిన్ని మాండలిక పోస్ట్స్ ఆశిస్తూ,
    మీ సాహితీ మిత్రుడు,
    -భాస్కర్.
    పీ.ఎస్.: మిమ్మల్ని చూడాలనీ, మీతో కరచాలనం చేయాలనీ ఎదురు చూస్తూ...

    రిప్లయితొలగించండి
  11. ఏ అవార్డు ఎవరికి ఎందుకిస్తున్నారో అర్ధమయి చావడం లేదు. పాకుడురాళ్ళు బాగోలేదు అంతా బూతు అని చదివినవాళ్ళు చెపుతున్నారు. ఎందుకయినా మంచిది మురళిగారూ మీకు వీలయితే పాకుడు రాళ్ళు గురించి వ్రాయండి !

    రిప్లయితొలగించండి
  12. @భాస్కర్: మీరు మెయిల్ పంపబోయి ఇక్కడ పోస్ట్ చేసినట్టున్నారండీ :) 'కృష్ణవేణి' గురించి, మీ అభిమానం అర్ధమయిందండీ.. నా స్పందన చెప్పడానికి మాటలు చాలడంలేదు, అంతే.. ధన్యవాదాలు..
    @నీహారిక: నాకు ఇష్టమైన నవలల్లో ఒకటండీ.. రాశాను బ్లాగులో..

    రిప్లయితొలగించండి
  13. మురళి గారు,
    మెయిల్ పంపబోయి ఏమీ కాదు. పోస్ట్ చేయాలనే రాసాను. కొన్ని తప్పులు దొర్లాయి. నీహారిక గారి వ్యాఖ్య తో ఏకీభవించను అని రాసాను. మాండలికం చదవడానికి ఇబ్బంది అని తను రాసినందుకు. అంతే. నామటుకు నాకు మీ మాండలిక రచనలు బాగా ఇంప్రెస్స్ చేస్తాయి. అలా అని నీహారిక గారి అభిప్రాయాన్ని నేనేం తప్పు పట్టడడం లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. 'కృష్ణవేణి' కూడా మీకోసం రాసుకున్నారు అంటే కూడా ఎందుకో బాగా అనిపించలేదు.
    నీహారిక గారిని నొప్పిస్తే సారీ...
    ఇంక నీహారిక గారు అన్నట్టు మీరు 'పాకుడురాళ్ళు' సమీక్ష రాసి బావోలేదన్న వాళ్ళ అభిప్రాయాన్ని మార్చరూ.. ప్లీజ్..
    మీ సాహితీ మిత్రుడు,
    -భాస్కర్.

    రిప్లయితొలగించండి
  14. @భాస్కర్: చాలారోజుల క్రితమే 'పాకుడు రాళ్ళు' గురించి రాశానండీ..లింక్ ఇస్తున్నాను.. బ్లాగు పోస్టుతో అభిప్రాయాలు మారిపోతాయని నేనైతే అనుకోడం లేదు మరి..
    @నీహారిక: ఇదిగోండి లింక్ http://nemalikannu.blogspot.in/2012/03/blog-post_13.html

    రిప్లయితొలగించండి
  15. చెప్పడానికేముందండీ వెన్నెల్లో గోదారీ, మీరు రాసే పోస్టులూ అంతే.

    రిప్లయితొలగించండి
  16. @శ్రీనివాస్ పప్పు: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి