శుక్రవారం, అక్టోబర్ 16, 2015

రుద్రమదేవి

కాలేజీ పిల్లల్ని గుంపులుగా చూసినప్పుడల్లా 'వీళ్ళలో చాలామందికి చరిత్ర తెలీదు కదా.. తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు కదా' అనిపిస్తూ ఉంటుంది. చరిత్ర తెలుసుకోక పోవడం వల్ల వాళ్లకి కలిగే నష్టం ఏమీ ఉండదు.. కేంపస్ ప్లేస్మెంట్లలో చరిత్ర గురించి ప్రశ్నలు ఉండవు కాబట్టి. "సోషల్ సైన్సెస్ వేస్టు, కంప్యూటర్ కోర్సులే ముద్దు" అని ఏలినవారే స్వయంగా చెప్పాక, పిల్లల్ని అనుకోవడం ఎందుకు? గడిచిన వారం రోజులుగా "రానా భలేగా చేశాడు.. అల్లు అర్జున్ అదుర్స్" తో పాటు "రుద్రమదేవిని నిజంగానే మగ పిల్లాడిలా పెంచారా?" అన్న ప్రశ్న అక్కడక్కడా కుర్రాళ్ళ నుంచి వినబడుతోంది. ఈ ఆసక్తికి కారణం గతవారం విడుదలైన 'రుద్రమదేవి' సినిమా.

పిల్లలకి చరిత్రని గురించి ఆసక్తిని పెంచే ఒక్కో మార్గమూ మూసుకుపోతున్న తరుణంలో శక్తివంతమైన సినిమా మాధ్యమం ఉపయోగించుకుని తనదైన శైలిలో ఓ ప్రయత్నం చేసిన దర్శక నిర్మాత గుణశేఖర్ కి ముందుగా అభినందనలు. కాకతీయుల చరిత్రని, మరీ ముఖ్యంగా రుద్రమదేవి చరిత్రని సినిమాటిక్ లిబర్టీ సహితంగా జనం ముందు పెట్టాడు గుణశేఖర్. నాయిక ప్రధానమైన భారీ బడ్జెట్ సినిమాని నిర్మించడానికి ఏ నిర్మాతా ముందుకు రాకపోతే, నిర్మాణ బాధ్యతల్ని సైతం తనే తలకెత్తుకున్నాడు. అడివి బాపిరాజు రాసిన 'గోన గన్నారెడ్డి' తో సహా, కాకతీయుల చరిత్రకి సంబంధించి ఎన్నో పుస్తకాలు చదివి స్క్రిప్టు రాసుకున్నాడు.

పుత్ర సంతానం లేని గణపతి దేవ చక్రవర్తి తన ప్రధమ పుత్రిక రుద్రమదేవి ని 'రుద్రదేవుడు' అనే పేరుతో రాజ్య ప్రజలకి పరిచయం చేసి, మగపిల్లాడిగానే పెంచి పట్టాభిషేకం చేయడం, శత్రురాజుల్నీ, ఎదురు తిరిగిన సామంతులనీ దనుమాడి కాకతీయ సామ్రాజ్యాన్ని రుద్రమ సుస్థిరం చేయడం అన్నది స్థూలంగా చరిత్ర. ఈ కృషిలో రుద్రమకి అండదండలు అందించిన వారు మంత్రి శివదేవయ్య దేశికులు, గజదొంగ గోనగన్నారెడ్డి. ఈ కథని నేరుగా చెప్పకుండా, ఇటలీ నుంచి ఆరంభించడం, విదేశీయుల చేత రుద్రమకి జేజేలు పలికించడం తెలివైన ఎత్తుగడ. రుద్రమ జననంతో ఆరంభమయ్యే ఫ్లాష్ బ్యాక్, శత్రురాజు, సామంతులపై ఆమె విజయంతో ముగుస్తుంది. అటుపై శుభం కార్డుకి బదులుగా 'ప్రతాప రుద్రుడు' కార్డు తెరపై ప్రత్యక్షమై, ప్రేక్షకులని హాలు ఖాళీ చేయమంటుంది.

కాకతీయ వీరనారి రుద్రమలో ఉన్న 'హీరోయిజం' ని తెరమీదకి అనువదించడంమీద దర్శకుడు పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టలేదనిపించింది. సినిమా పూర్తయ్యాక 'ఇంతకీ రుద్రమ ఏమేం చేసింది?' అన్న ప్రశ్నకి మరికొంచం గట్టి జవాబు వచ్చే వీలుంది. కానైతే, వచ్చే జవాబు ఏమంత సంతృప్తిగా అనిపించదు. కొన్ని సన్నివేశాల నిడివి తగ్గించి, మరికొన్నింటిని వాయిస్ ఓవర్ తో సరిపెట్టి, రుద్రమ మీద సన్నివేశాలని ఫోకస్ చేసి ఉంటే ఈ అసంతృప్తి ఉండేది కాదు. 'నదీ ప్రవాహాన్ని ఆపడం' అనే ముఖ్యమైన విషయాన్ని క్లుప్తంగా తేల్చేయడం, ప్రాకారాల నిర్మాణాన్ని మాటలతోనే పూర్తి చేసేయడం (ఈ సినిమా వరకూ ఈ ప్రాకారాలు రుద్రమ ప్రధాన విజయాల్లో ఒకటి) నిరాశ కలిగించే అంశాలు.


కాకతీయ సామ్రాజ్యం కథలో పాలకులకే తప్ప ప్రజలకి భాగం ఉన్నట్టు కనిపించలేదు. మహా సభలో అనుకూల, ప్రతికూల నినాదాలు చేసే ప్రజలు మాత్రమే కనిపిస్తారు. 'కాకతీయుల కాలంలో ప్రజా జీవితం' అన్న విషయాన్ని ఈసినిమా స్క్రిప్టు పూర్తిగా విస్మరించింది. ఆహార వ్యవహారాలు, కళా సంస్కృతులు ఇవేవీ కనిపించవు. అంతఃపురాన్ని దాటి కెమెరా బయటికి వచ్చిందే తక్కువ. చరిత్రలో కాకతీయ శిల్పానికి ప్రత్యేక స్థానం ఉంది. ఒక్క ఆలయ నిర్మాణమూ తెరకెక్కలేదు. వీరశైవ మతావలంబకులైన కాకతీయుల కాలంలోనే 'పేరిణి' తాండవ నృత్యం బహుళ ప్రచారంలోకి వచ్చిందంటారు. ఒక్క ఫ్రేములో కూడా ఆ నాట్యం కనిపించలేదు.

రాకుమార్తె అన్నాంబిక (సినిమాలో అనామిక)ని వ్యాంపు లా చిత్రించడం, ముమ్ముడమ్మ (సినిమాలో ముక్తాంబ) ని పాత్రౌచిత్యానికి తగని విధంగా 'బబ్లీ' గా చూపించడాన్ని పరిహరించి ఉంటే బాగుండుననిపించింది.  నటీనటుల విషయానికి వస్తే, గణపతి దేవుడిగా కృష్ణంరాజు కేవలం విగ్రహ పుష్టిగా మిగిలిపోయాడు. నటించడానికి అవకాశం ఉన్న సన్నివేశాల్లోకూడా నిర్లిప్తంగా ఎందుకుండి పోయాడో అర్ధం కాదు. శివదేవయ్యగా ప్రకాష్ రాజ్ తెలుగు వినడానికి చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది. 'శ' ని 'ష' అని పలికే ప్రకాష్ రాజ్ డైలాగుల నిండా అనేకానేక 'శ' లు ఉండడంతో అవి వినడానికి ఎంత సహనమూ సరిపోలేదు. ఒకానొక దశలో 'ఈ పాత్రకి వేరే ఎవరిచేతన్నా డబ్బింగ్ చెప్పిస్తే బాగుండేది' అనిపించింది.

రుద్రదేవుడు, రుద్రమదేవి పాత్రలని న్యాయం చేసే నటి ప్రస్తుత జనరేషన్లో అనుష్క ఒక్కర్తే. రెండు పాత్రలకీ న్యాయం చేసిన అనుష్క, రాచకన్య దుస్తుల్లో బాగా ఒళ్ళు చేసినట్టుగా కనిపించింది. కెమెరా లోపమో ఏమో తెలీదు. చాళుక్య వీరభద్రుడి పాత్రని రానా, గోన గన్నారెడ్డి పాత్రని అల్లు అర్జున్ అలవోకగా చేసేశారు. అల్లువారబ్బాయి ఇమేజిని దృష్టిలో పెట్టుకుని, గోన గన్నారెడ్డి పాత్రకి హీరోయిజాన్ని రెండింతలు చేశారు. ఈ రాయలసీమ రాకుమారుణ్ణి తెలంగాణా ఖాతాలోకి పంపడం వెనుక ఏదో అంతరార్ధం ఉండే ఉంటుంది. సాంకేతికంగా ఏమాత్రం బాగోనిది సంగీతం. ఇళయరాజా సంగీతం అంటే అస్సలు నమ్మబుద్ధి కావడంలేదు.

రుద్రమకి తను ఆడపిల్లని అని తెలిసే సన్నివేశం, అదే విషయం ముక్తాంబకి తెలుసునని రుద్రమకి తెలియడం.. చప్పట్లు కొట్టించే సన్నివేశాలు ఈ రెండూ. వీటితో పాటు మరో రెండు మూడు సన్నివేశాలు 'భలే' అనిపిస్తాయి. యుద్ధ సన్నివేశాలు చూస్తున్నంత సేపూ మంచి నేపధ్య సంగీతం జతకూడితే ఇంకెంత బాగుండేదో కదా అని మరీ మరీ అనిపించింది. భారీ బడ్జెట్ నీ, కంప్యూటర్ గ్రాఫిక్స్ నీ ఏ చందమామ కథ చెప్పడానికో కాక చరిత్రని చెప్పడానికి ఉపయోగించుకున్న గుణశేఖర్, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని ఉంటే మరింత గొప్ప చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి ఇచ్చినవాడై ఉండేవాడు. అలాగని, గుణశేఖర్ కృషిని తక్కువ చేయడానికి లేదు. ఎవరు చేయగలిగారు ఇన్నాళ్ళుగా? హౌస్ ఫుల్ అయిన థియేటర్ లో అన్ని వయసుల వాళ్ళూ ఉండడం, యువత ఎక్కువగా ఉండడం సంతోషంగా అనిపించింది.

చివరగా ఓ చిన్న పిడకల వేట: అతిథి పాత్రలతో కలిపి చిరంజీవి ఇప్పటివరకూ 149 సినిమాలు చేశాడనీ, రాబోయేది నూట యాభయ్యో సినిమా అవుతుందనీ, అది బ్రహ్మాండం బద్దలు కొడుతుందనీ బాగా ప్రచారం జరుగుతోంది. నిజానికి, 'రుద్రమదేవి' లో చిరంజీవి తెరమీద కనిపించలేదన్న మాటే కానీ, సినిమా ఆసాంతమూ 'వాయిస్ ఓవర్' రూపంలో స్వరం వినిపిస్తూనే ఉంది. ఈ వాయిస్ ఓవర్ అతిథి పాత్ర పాటి చేయదా? 'రుద్రమదేవి' నే చిరంజీవి నూట యాభయ్యో సినిమాగా లెక్కేయడానికి అభ్యంతరం ఏవిటో అర్ధం కావడం లేదు నాకు.

12 కామెంట్‌లు:

 1. ఏమో నాకైతే సినిమా పేరు గోన గన్నా రెడ్డి అని పెట్టి ఉంటే బాగుండేదేమో అనిపించింది. యుద్ధ సన్నివేశంలో మహదేవుణ్ణి చంపటం నాకు చేతకాక కాదు, ఏదో రుద్రమ దేవిని ఉద్ధరించటం కోసం అన్న భావం తో వినపడ్డ ఒక్క మాట కడివెడు పాలలో చిటికెడు ఉప్పుకల్లు చందంగా రుద్రమ చరిత్ర ఔచిత్యాన్నే దెబ్బతీసింది అనిపించింది. ఈ తరం సంగతి తెలియదు కానీ మన తరం వరకూ ఝాన్సీ లక్ష్మి, రుద్రమ దేవి ధీర వనితలు, వారికి కొందరు సహకారం అందించి ఉండవచ్చు గాక కానీ వారు ఎవరో జాలి దయల వల్ల ఆ పేరు తెచ్చుకున్నారు అనే అపోహలను నేటి తరం పిల్లల్లో కలిగించే ఇటువంటి చిత్రాలు రాకపోవటమే మంచిది. సినిమా కాబట్టి హంగులు అద్దాలి కానీ చరిత్రని వక్రీకరించకూడదు అని నా అభిప్రాయం. ఎవరి అభిమానులైన ఫీల్ ఐతే నేను ఏమీ చెయ్యలేను కానీ fact is fact

  రిప్లయితొలగించు
 2. ఏమిటో సినిమా చూడాలనిపించట్లేదండీ,మీ పోస్ట్ చూసాక మనసు పీకుతోంది,కింద లక్ష్మి గారి కామెంట్ చూసాక శంకిస్తోంది,ఇంతకీ 3డి లో చూసారా? 2డి లో చూసారా?

  రిప్లయితొలగించు
 3. @లక్ష్మి: మీతో వందశాతం ఏకీభవిస్తానండీ.. ఆ సీన్లో రుద్రమ-గన్నారెడ్డి లకి బదులుగా అనుష్క- అల్లు అర్జున్ లని దృష్టిలో పెట్టుకున్నాడు దర్శకుడు. ఈ సినిమా మన చరిత్రని తెలుసుకోవాలని ఆసక్తి కలిగించే సాధనం అవుతుందే తప్ప 'చరిత్ర' ఎంతమాత్రం కాదండీ.. 'రుద్రమ స్త్రీత్వం' దాటి దర్శకుడు ఆలోచించగలిగి ఉంటే కచ్చితంగా గొప్ప సినిమా అయి ఉండేది.. ఇది మాత్రం ఒక ప్రయత్నం అంతే.. ..ధన్యవాదాలు..
  @శ్రీనివాస్ పప్పు: నాలుగు కళ్ళతో త్రీడీ లో చూశానండీ.. నేనైతే చూడమనే చెబుతాను, ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా.. చేసిన ప్రయత్నాన్ని ఇంకొంచం సిన్సియర్ గా చేసి ఉంటే మనకో గొప్ప సినిమా మిగిలి ఉండేది.. ..ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు
 4. సినిమా బావుంది బాగాలేదు, అని ముద్ర వేసేస్తారు. ఆ పర్యవసానం ఆలోచించకుండా. మీ చక్కటి రివ్యూ చదివాక, మీలాంటి వారి సలహా తీసుకుంటే ఏ దర్శకుడైనా ఎంత గొప్ప సినిమా తీయగలరో అనిపించింది.

  రిప్లయితొలగించు
 5. @జ్యోతిర్మయి: ఇది వంట తిని రుచి చెప్పడం లాంటిదండీ, వంట చేయడంలో ఉండే సాధకబాధకాలు వేరు కదా.. మిగిలిన హంగుల మీద పెట్టిన దృష్టి కథ మీద పెట్టలేదు కదా అన్న బాధ, అంతేనండీ.. ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు
 6. @జ్యోతిర్మయి గారు,

  సినిమా తీసాక ఎట్లాంటి రివ్యూ అయినా వ్రాయవచ్చు :) పాపం తీసిన వాడికి కదా దాని సాధక బాధకాలు , బాదుళ్ళూ తెలుస్తాయి :) ఆ పై అన్ని రివ్యూ లు అయ్యాక వాళ్ళు సినిమా విడుదల చేయ్యా లనుకుంటే ఇక వాళ్ళు దుకాణం కట్టేయ్యాల్సిందే :) జేకే !

  చీర్స్
  జిలేబి

  రిప్లయితొలగించు
 7. నా వరకూ.. సినిమా చూసొచ్చాక పుస్తకం విలువ తెలిసొచ్చింది.

  రిప్లయితొలగించు
 8. @కొత్తావకాయ: కేవలం పుస్తకం ఒక్కదాన్నీ బేస్ చేసుకుని తీసినా మరింత బావుండేదండీ సినిమా.. ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు
 9. ఈ సినిమా చూసాక ఒక సినిమా విజయంలో దర్శకుడి పాత్ర ఏంటో తెలుస్తుంది. ఈ విషయంలో గుణశేఖర్ పూర్తిగా విఫలం అయ్యాడు. తను ఏమి చెప్పాలనుకున్నాడో అతనికే అర్థం కాలేదు. ఈ సినిమా 3D ఫార్మటులో తీయలనుకోవటం పెద్ద పొరపాటు. దానికి ఖర్చు విలువైన సమయం వృధా అయ్యింది. అలానే ఏ సన్నివేశాలని తెరకేక్కించాలి అనే విషయంలో కూడా మీరు చెప్పినట్టు విఫలం అయ్యాడు. యుద్ధ సన్నివేశాలు మరీ పేలవంగా ఉన్నాయి. బాహుబలి సినిమాలోని యుద్ధ సన్నివేశాలు చూసాక ఇవి ఎవరికీ పట్టవు. గోనగన్నారెడ్డి చిత్రణ ఒకటే సినిమాకి ప్రాణవాయువు అయ్యిందంటే దర్శకుడి, ఎడిటర్ ఎంతగా విఫలం అయ్యారు అర్థం చేసుకోవచ్చు. ఇదే సినిమా బాహుబలి ముందు వచ్చి ఉంటే ఫలితం ఇంకొంచెం మెరుగ్గా ఉండేది. తన స్వీయ నిర్మాణంలోనైన గుణశేఖర్ వళ్ళు దగ్గరపెట్టుకుని నిర్మాణ ఖర్చు అదుపులో ఉంచతాడెమో అనుకున్నా. కానీ అతను ఏమి మారలేదు.

  రిప్లయితొలగించు
 10. Asalu ee movie chusinantha sepu maa mother gurtu vastune vundi. Avida social teacher lendi. Naku ayte charitra ni tappu ga chitrikaristunnaru veella pytyam kakpote anipinchindi

  రిప్లయితొలగించు
 11. @అశోక్: త్రీడీ కన్నా ముందు స్క్రిప్టు పక్కాగా లేదు కదండీ.. నిజమే త్రీడీ వల్ల సినిమాకి ఒరిగింది పెద్దగా లేదు.. ఆ అట్రాక్షన్ కోసం కొంతమంది చూసి ఉంటారు తప్ప. స్క్రిప్టు పకడ్బందీగా ఉండుంటే అంత పెద్ద ప్రయత్నం చేసినందుకు ఓ 'గొప్ప సినిమా' మిగిలి ఉండేది. వృధా వ్యయం అవ్వడమే కాదు, ముఖ్యమైన సీన్లు తేలిపోయాయి కూడా.. ..ధన్యవాదాలు.
  @అద్వైత: దాన్నే సినిమాటిక్ లిబర్టీ అంటారండీ వాళ్ళు.. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని సబ్జక్ట్ కాబట్టి మంచి అవకాశం దొరికింది.. సద్వినియోగం చేసుకుని ఉంటే బాగుండేది.. పైగా, స్వీయ నిర్మాణం కాబట్టి 'ప్రొడ్యూసర్ ఏమంటాడో' అన్న ఇబ్బంది కూడా లేదు. గత జల సేతు బంధనం.. ..ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు