గురువారం, మే 07, 2015

రోడ్డెవరి సొత్తు?

"ఉండడానికి  ఇల్లు లేనంత మాత్రాన రోడ్డు మీదో ఫుట్పాత్ మీదో నిద్రపోవడమే? మాబాగా అయ్యింది వాళ్లకి. మధ్యలో మా హీరోనే అనవసరంగా కేసుల్లో ఇరికించారు. అలగావాళ్ళు ఎలా పోయినా ఎవరికీ నష్టంలేదు కానీ, మా హీరో జైలుకి వెళ్తే షూటింగ్ మధ్యలో ఉన్న సినిమాల మాటేవిటి? వాటిమీద పెట్టిన వందల కోట్ల పెట్టుబడుల మాటేవిటి?" బాలీవుడ్ సినిమా పరిశ్రమతో పాటు, సల్మాన్ ఖాన్ అనే వెండితెర కథానాయకుడి అభిమానులని వేధిస్తున్న ప్రశ్నలివి.

ఇప్పటికి పదమూడేళ్ళ క్రితం సదరు సల్మాన్ ఖాను ముంబాయి మహానగరంలో ఓ పంచనక్షత్రాల హోటల్ నుంచి అర్ధరాత్రి వేళ తన కారులో బయల్దేరి, మితిమీరిన వేగం కారణంగా స్టీరింగ్ మీద కంట్రోల్ కోల్పోయి కారుని రోడ్డు పక్కనే ఉన్న బేకరీలోకి మలుపు తిప్పినప్పుడు, బేకరీని ఆనుకుని ఉన్న పేవ్ మెంట్ మీద నిద్రపోతున్న ఐదుగురూ కారు కింద పడిపోయారు. ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడవగా, మిగిలిన నలుగురూ ప్రాణాలు మాత్రం దక్కించుకున్నారు. పదమూడేళ్ళ సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు సల్మాన్ ఖాన్ ని దోషిగా నిర్ధారించి ఐదేళ్ళు జైలుశిక్ష విధించింది.

కోర్టు తీర్పు తర్వాత బాలీవుడ్ చిత్రపరిశ్రమ అత్యంత సహజంగానే సల్మాన్ కి మద్దతు ప్రకటించింది. అక్కడితో ఆగకుండా, ఓ అడుగు ముందుకు వేసి రోడ్డు ఎవరి సొత్తూ కాదనీ, కుక్కలకి తప్ప మనుషులెవరికీ రోడ్డు మీద పడుకునే హక్కు లేదని తేల్చి చెప్పింది. సల్మాన్ అభిమానులు చాలామంది ఈ వాదనతో గొంతు కలిపి ఫుట్ పాత్ ని "వాళ్ళబ్బ సొత్తు" గా భావించుకుని యధేచ్చగా నిద్రపోయిన వాళ్ళని సోషల్ మీడియాలో శాపనార్ధాలు పెడుతున్నారు. వీళ్ళంతా ఉన్నతాదాయ లేదా మధ్యతరగతి భద్ర జీవులని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

అయ్యలారా, అమ్మలారా.. ఫుట్ పాత్ మీద నిద్రపోవడం అంటే ఇల్లు అనేది లేకపోవడం. ఇల్లంటే రెండు మూడు బెడ్రూములు, ఏసీ వగయిరా సౌకర్యాలున్నదే కాదు.. కనీసం తలదాచుకోడానికి పైకప్పుతో ఉన్న ఆరేడుగజాల స్థలం. ఆమాత్రం స్థలం లేనివాళ్ళు ఈ దేశంలో చాలామందే ఉన్నారు. హీరోల కార్లకి అడ్డం పడడం వాళ్ళ హాబీ కాదు. అందువల్ల వాళ్లకి పోయేదే తప్ప కలిసొచ్చేది ఏదీ ఉండదు. మీరు చెబుతున్నట్టుగా కుక్కలు మాత్రమే తిరగాల్సిన రోడ్లని బెడ్రూములుగా ఉపయోగించుకుంటున్నారంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆలోచించండి.

మీక్కొంచం కష్టమైన పనే కానీ, వాళ్ళెవరికీ ఇల్లు లేని పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా మీ విలువైన సమయాన్ని కొన్ని క్షణాలు వెచ్చించి ఆలోచించండి. ఉన్న ఊళ్ళో సంపాదన లేక, నగరంలో పని దొరుకుతుందని వచ్చారు వాళ్ళు. నగరంలో సంపాదన కూడా కనీసావసరాలు తీర్చుకోలేనిదిగా ఉంది వాళ్లకి. అందుకే, తలదాచుకుందుకు చోటు దొరక్క రోడ్డు మీద పడుకున్నారే తప్ప, హీరో గారి కారుకింద పడి వార్తలకెక్కుదామని కాదు. అతగాడి మీద వాళ్ళకేమీ పాతకక్షలూ లేవు. అది హీరోగారు ఒళ్ళు మరిచి కారు నడుపుకునే దోవ అనీ, సమయమనీ ముందుగా తెలిసుంటే వాళ్ళే జాగ్రత్త పడి ప్రాణం రక్షించుకునే వాళ్ళేమో. 

వెండితెర వేలుపులు చమటోడ్చి సంపాదిస్తున్నారు నిజమే. కానీ, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు సక్రమంగా చెల్లిస్తున్న వాళ్ళు ఎందరు? నలుపు తెలుపుల సంపాదనలో కనీసం తెల్లధనం మీద కూడా పన్ను చెల్లించకుండా కాలం గడిపేస్తున్న వాళ్ళు ఎందరు?? వీళ్ళే సక్రమంగా పన్నులు చెల్లిస్తే, అలగావాళ్ళ బతుకులు ఏమాత్రమన్నా బాగు పడేవేమో కదా. వాళ్ళిలా వేళాపాళా లేకుండా గొప్పవాళ్ళ కార్లకి అడ్డం పడేవాళ్ళు కాదేమో మరి. అయ్యా అభిమానులూ, అలగావాళ్ళని ఆడిపోసుకునే ముందు, సక్రమంగా పన్నులు కట్టమని మీ అభిమాన తారలకి చెప్పగలరేమో ప్రయత్నించండి.

జనం మీదకి కార్లు పోనిచ్చిన హీరోలకీ, కాల్పులు జరుపుతున్న పోలీసులకీ జేజేలు పలుకుతున్న భద్ర జీవులారా.. మీ ఆలోచనలు సరైనదోవలోనే వెళ్తున్నాయా అన్నది ఒక్కసారి సరిచూసుకోండి. భద్ర జీవితానికి వెలుపల ఉన్నవాళ్ళని మనుషులుగా చూసి, వాళ్ళ వైపునుంచి కనీసం ఆలోచించే ప్రయత్నం చేయండి. వాళ్ళూ 'మనుషులే' అన్నది మర్చిపోకండి. ఇంతకీ ఒకందుకు మాత్రం సదరు సల్మాన్ ఖానుని అభినందించక తప్పదు. క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగులో అడ్డగోలుగా దొరికిపోయిన ఆటగాళ్ళ మొదలు, దొరికిన పుస్తకాన్ని ఇష్టం వచ్చినట్టు "రివ్యూ" చేసేసే 'మేధావుల' వరకూ అవకాశం ఉన్నవాళ్ళు అందరూ అడ్డం పెట్టుకుంటున్న 'మైనారిటీ' కార్డుని అవకాశం ఉన్నా వాడుకోనందుకు సల్మాన్ ని మెచ్చుకోవాల్సిందే..

12 కామెంట్‌లు:

  1. నిన్న తీర్పు వచ్చిన తరువాత, కొందరి స్పందన చూస్తే సెలబిటీలు అనేవాళ్ళు ఎంత దుర్మార్గంగా మాట్లాడగలరో అర్ధం అయ్యింది....

    రిప్లయితొలగించండి
  2. ఆహారభయనిద్రామైధునాలు జీవులకు సహజాతాలు. అందుచేత నిద్రపోవటం అన్నది ప్రతిజీవికీ తప్పదు. ఇల్లున్నవాళ్ళు ఇళ్ళల్లో నిద్రపోవచ్చును. మరి ఇల్లు లేనివాళ్ళు కూడా ఎక్కడో అక్కడ పడి నిద్రపోతారు కాని అయ్యో మాకు ఇల్లు లేదే అని వేంఠనే చచ్చిపోరు ఎక్కడ పడితే అక్కడ పడుకోకూడదు కదా అన్న అజ్ఞానం వదిలి. ఏం చేస్తారు నిద్ర ముంచుకు వస్తుంది కదా జీవి అన్నాక. వందల వేల కోట్లు గడించిన వాళ్ళూ వందల వేల ఊళ్ళు పాలించిన వాళ్ళూ, వందల వేల నోళ్ళతో జయగీతికలు పాడించుకున్నవాళ్ళూ ఐనా సరే కాలగతి చెందకమానరు. కాబట్టి ఏదో మాకుంది కదా అన్న అహం దండగ. కారు క్రింద పడ్డవాళ్ళది తప్పు, అడ్డదిడ్డంగా తోలినా తిన్నగా పోని కారుది తప్పు, తనగొప్ప చూడకుండా శిక్షించటం తప్పూ లాంటీ తింగరమాటలు నవ్వు తెప్పిస్తాయి - ఆగ్రహం కూడా తెప్పిస్తాయి జాతికి. తస్మాత్ జాగ్రత.

    రిప్లయితొలగించండి
  3. కుక్క కూడా ఆకలితో చావకూడదని కోరుకున్నాడు స్వామి వివేకానందుడు. కుక్కలనైనా సరే అకారణంగా చంపే హక్కు లేదు. అభిమానానికి హద్దులు ఉండాలి. మానవత్వాన్ని మరచే దురభిమానం సరి కాదు. మీ స్పందన చక్కగా వ్రాశారు మురళి గారు.

    రిప్లయితొలగించండి
  4. Better to remain silent and be thought a fool than to speak out and remove all doubt అని ఓ ఆంగ్ల సామెత. మన సోకాల్డ్ సెలెబ్రిటీలు ఈ సామెతని ఎల్లవేళలా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. తెర మీద, రంగస్ధలం మీద కాస్త టాలెంట్ ఉన్న ప్రతివ్యక్తికీ పబ్లిక్ వ్యవహారాల్లో అంత మోతాదులోనూ విజ్ఞత కూడా ఉంటుందని అనుకోవడం మన తప్పే కదా.

    ఒక రోడ్ ప్రమాదం కేసుని తేల్చటానికి పదమూడు సంవత్సరాలు పట్టిందంటే సమాజం ఎంత ఇష్టారాజ్యంగా ఉందా అనిపిస్తోంది. అలాగే ఆ ప్రమాదం బారిన పడినవారు ఎంతోకొంత నష్టపరిహారానికి ఎందుకు నోచుకోలేదో తెలియదు.

    రిప్లయితొలగించండి
  5. రోడ్డులన్ని డబ్బున్న మారాజుల బాబుగార్లవి.
    మన దేశంలో బాగా డబ్బున్నవాళ్ళు ఏ నేరం చేసైనా తప్పించుకోవచ్చు. బాధితుల పేదరికం వీళ్ళకి వరం. ఇప్పటికీ ఇతనికి శిక్ష పడుతుందని నాకు నమ్మకం లేదు. ఈయనపై రాజస్థాన్‌లో కృష్ణజింకల కేసు కూడ ఉంది.
    దిల్లీలో గతంలో నందా కుటుంబం చేసిన ప్రమాదం కేసు ఏమయింది? సంజయ్ దత్ జైలుకి, ఇంటికి వెళ్ళి వస్తూనే ఉన్నాడు. ఇంకా ఎన్నో ఉదాహరణలు ఇవ్వచ్చు. ఇక రాజకీయ నాయకుల కేసులైతే, వాళ్ళు చచ్చేంత వరకు తెమలవు.

    రిప్లయితొలగించండి
  6. రోడ్డులు ఎవరి సొత్తు కాదని నీలిగే తిక్క వెధవలకు అర్ధం కాని విషయాలు ఇవి:

    1. చనిపోయిన వ్యక్తీ రోడ్డు మీద కాదు, ఫుట్పాత్ మీద పడుకున్నాడు
    2. రోడ్డులు ఎవరి సొత్తయినా ఫుట్పాత్ మాత్రం కార్ల సొత్తు కాదు
    3. కార్లను ఫుట్పాత్ మీద నడిపే లైసెన్సు ఎవరికీ లేదు

    రిప్లయితొలగించండి

  7. వాళ్ళు రోడ్డు మీద పడుక్కొనివుంటే అనుకోవచ్చును ,కాని పాపం పేవ్మెంట్ మీదకదా పండుకున్నారు.పేవ్ మెంట్ మీదపడుక్కోకూడదుకాని కార్లనిమాత్రం పేవ్ మెంట్ మీద జాలీగా తాగి నడపొచ్చునన్నమాట. !నగరాల్లో పాశ్చాత్యదేశాల్లో కూడా ఇళ్ళులేనివాళ్ళు ఉంటారు కాని వాళ్ళు నిద్రించడానికి night shelters అని ఉంటాయి.కాని ఏదేశంలోను కార్లను పేవ్ మెంట్ లమీద తోలడానికి ఒప్పుకోరు.

    రిప్లయితొలగించండి
  8. I was surprised when I read his stories of humanity in media like he donated this n that if such was he so kind hearted how could he do these accidents, killing deers etc. but i feel that showing these donations in past few years and gaining name as good human in court may be he reduced his jail term to 5 years .

    రిప్లయితొలగించండి
  9. కోర్టు అనవసరంగా మాట్లాడినవారిమీద కేసులు పెట్టిందిటందోయ్

    http://www.eenadu.net/hyderabad-news-inner.aspx?item=break161

    రిప్లయితొలగించండి
  10. @Admin: అవునండీ.. ఏం మాట్లాడినా చెల్లుతుంది అన్నట్టుగా ఉంది.. కోర్టు కేసులు.. చూశానండీ.. ఏం మాట్లాడాలి?? ..ధన్యవాదాలు.
    @శ్యామలీయం: నిజమండీ.. ..ధన్యవాదాలు
    @కొండలరావు: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  11. @విన్నకోట నరసింహారావు: ఇదే కేసులో బాధితులు సెలబ్రిటీలు అయి ఉంటే కచ్చితంగా కేసు మరో విధంగా ఉండేదండీ.. ధన్యవాదాలు.
    @బోనగిరి: అవునండీ.. జయలలితకి క్లీన్ చిట్ రావడం కొసమెరుపు.. ..ధన్యవాదాలు
    @జై గొట్టిముక్కల: ఆ మాత్రం ఆలోచించగలిగే వాళ్ళయితే ఇలా నోరు పారేసుకోరు కదండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  12. @కమనీయం: హీరోలకి ప్రత్యేక చట్టాలు చేయమంటారేమోనండీ అభిమానులు.. ..ధన్యవాదాలు
    @స్వాతి: నిజమేనండీ.. ధన్యవాదాలు..
    @శ్రీనివాస్: వీలు చూసుకుని చూస్తానండీ ఆ సినిమా..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి