శనివారం, ఏప్రిల్ 25, 2015

ఓకే బంగారం

పెళ్లి.. ఇద్దరు సరైన వ్యక్తుల మధ్య జరిగితే దాన్ని మించిన బంధం లేదు. అదే, ఆ ఇద్దరికీ సరిపడనట్టయితే అంతకు మించిన బంధనమూ లేదు. అదిగో, ఆ బంధనంలోనుంచి బయటపడ్డ ఓ దంపతుల కూతురు తార. తన ఏడేళ్ళ వయసులో, అప్పటికే ఎన్నో గొడవలు పడి, కేసులు పెట్టుకుని విడాకులు తీసుకోడానికి సిద్ధ పడ్డ తల్లిదండ్రులు 'మా ఇద్దరిలో నీకు ఎవరు కావాలి?' అని అడిగితే, "ఇద్దరూ వద్దు" అనుకుంది తార. అంతేకాదు, జీవితంలో పెళ్లి జోలికే వెళ్లకూడదని నిర్ణయించుకుంది. ప్యారిస్ లో పైచదువులు చదివి, తనకంటూ ఓ కెరీర్ ని నిర్మించుకునే ప్రయత్నంలో ఉన్న తారకి తారసపడ్డాడు ఆదిత్య.. ఆదిత్య కంఠమనేని.

ఈతరం కుర్రాళ్ళు చాలామందిలాగే స్వేచ్చా ప్రియుడు ఆదిత్య. బంధాలు బంధనాలే అనీ, పెళ్లి వల్ల ఇబ్బందులే తప్ప సంతోషం ఉండదనీ నమ్మినవాడు. జీవితాన్ని ఓ వీడియో గేమ్ లా చూసే ఆదిత్యకి, ముంబాయిలో ఓ గేమింగ్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరిన మొదటిరోజే కొంచం సినిమాటిక్ గా బాస్ ని ఒప్పించి ఓ 'దేశీ వీడియో గేమ్' తయారు చేసే ప్రాజెక్టు పని మొదలు పెట్టేస్తాడు. ఆర్నెల్లలో అతని ప్రాజెక్ట్ అప్రూవ్ అయితే, కంపెనీ అతన్ని యూఎస్ పంపిస్తుంది.. జీవితంలో ఎదగడానికి బిల్ గేట్స్ ని ఆదర్శంగా తీసుకున్న ఆదిత్య మధ్యతరగతి నుంచి వచ్చినవాడు. బ్యాంకు ఉద్యోగం చేసుకునే అన్నే అతనికి పెద్ద దిక్కు.

ముంబాయి మహానగరంలో కెరీర్ నిర్మించుకునే పనిలో తలమునకలైన తార, ఆదిత్య అనుకోకుండా కలుసుకుంటారు. తొందరలోనే వారి పరిచయం స్నేహంగా మారి, లివిన్ రిలేషన్షిప్ దిశగా ప్రయాణం చేస్తుంది. ఇద్దరికీ ఉన్న సమయం కేవలం ఆరునెలలు. తర్వాత ఎవరిదారి వాళ్ళది. ఇద్దరికీ పెళ్లి మీద మంచి అభిప్రాయం లేదు. పెళ్లిని గురించి వాళ్ళిద్దరిలోనూ పాతుకుపోయిన అభిప్రాయాలని వాళ్ళ లివిన్ రిలేషన్ షిప్, చుట్టూ ఉన్న మనుష్యులూ ఏమన్నా మార్చగలిగారా? ఈ ప్రశ్నకి సమాధానం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన తమిళ డబ్బింగ్ సినిమా 'ఓకే బంగారం.' గతవారం విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.


మణిరత్నం దర్శకత్వంలో యూత్ సినిమా అనగానే, 'సఖి' 'యువ' గుర్తురావడం అత్యంత సహజం. ఐదేళ్ళక్రితం, ఐశ్వర్య రాయ్-విక్రమ్ జంటగా వచ్చిన 'విలన్' దెబ్బనుంచి కోలుకున్నానన్న ధైర్యం కలగడంతో చూశానీ సినిమాని. ప్రేమకథలనీ, మరీ ముఖ్యంగా వాటిలో ఉండే సున్నితమైన భావోద్వేగాలనీ తెరకెక్కించడం లో మణిరత్నంది ఓ ప్రత్యేకమైన బాణీ. నిత్య మీనన్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ జంటగా తీసిన 'ఓకే బంగారం' ప్రేమకథా చిత్రంలో మణిరత్నం తనదైన మేజిక్ ని శ్రీకారం నుంచీ శుభం కార్డువరకూ తెరమీద చూపించి, ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు.

కథలోకి వస్తే, ఆదిత్య (దుల్కర్ సల్మాన్) బ్యాంకులో తన అన్నకి సీనియర్ అయిన గణపతి (ప్రకాష్ రాజ్) ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా దిగుతాడు. గణపతి, భవాని (లీలా శ్యాంసన్) లది ఆదర్శ దాంపత్యం. తార (నిత్య మీనన్) తో పరిచయం స్నేహంగా మారాక, ఆమెతో అహమ్మదాబాద్ వెళ్తాడు. ఇద్దరూ కలిసి అక్కడ ఓ రాత్రి గడిపిన తర్వాత, ఆర్నెల్ల పాటు లివిన్ రిలేషన్ లో ఉండాలని నిర్ణయించుకుంటారు. ఇద్దరూ కలిసి గణపతి ఇంట్లోనే ఉండేందుకు గణపతి-భవాని లని ఒప్పిస్తారు. చాలా ప్రాక్టికల్ గా మొదలైన వాళ్ళ లివిన్ రిలేషన్ ఎమోషనల్ టర్న్ తీసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ముగింపు ఊహించగలిగేదే అయినా ఎండ్ టైటిల్స్ పూర్తయ్యే వరకూ ప్రేక్షకుల్ని థియేటర్లో కట్టిపడేసిన మణిరత్నాన్ని అభినందించకుండా ఉండలేం.

నటీనటుల్లో దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ పోటీపడి నటించారు. నిత్యచేత మరీ ఎక్కువగా తింగరితనం చేయించలేదు. చాలా సినిమాల్లో తన పాత్రని కొంత లౌడ్ గా చేసే ప్రకాష్ రాజ్ గణపతి పాత్రని అండర్ ప్లే చేశాడు. ప్రకాష్ రాజ్ కి సమ ఉజ్జీగా నటించింది లీలా శ్యాంసన్. నిజంచెప్పాలంటే ఆమెకే ఓ మార్కు ఎక్కువ పడుతుంది కూడా. సాంకేతిక అంశాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది పీసీ శ్రీరాం ఫోటోగ్రఫీని. తక్కువ బడ్జెట్లో ఎక్కువ అందాన్ని చూపించడం, సెట్ ప్రాపర్టీస్ ని పూర్తిగా వినియోగించుకోవడం శ్రీరాంకి చాలా బాగా తెలుసు. రెహమాన్ నుంచి మరికొంచం ఎక్కువ ఆశించాను నేను, పాటలు.. నేపధ్య సంగీతం కూడా.

మారుతున్న కాలానికి అనుగుణంగా తనని తాను మలుచుకునే దర్శకుడు మణిరత్నం. నేటితరం అర్బన్ యువత పోకడల్ని చాలా బాగా పట్టుకున్నాడీ సినిమాలో. పెళ్లి అనేది ఓ 'బూచి' కాదని చెప్పే ప్రయత్నం చేశాడు. సినిమా చూసిన మిత్రులు కొందరు రెండో సగంలో ఎడిటింగ్ అవసరం అన్నారు కానీ, నాకలా అనిపించలేదు. మరీముఖ్యంగా టైం కౌంట్ డౌన్ మొదలయ్యాక వచ్చే సన్నివేశాలు వెన్ను నిటారుగా చేసి చూసేలా ఉన్నాయి. నాయిక పాత్ర చిత్రణ కన్విన్సింగ్ గా అనిపించింది. పెళ్లి నుంచి బయటపడిన ఆమె తల్లి వ్యాపార నిర్వహణలో తనని తాను బిజీగా ఉంచుకుంటే, తండ్రి ఓ ఆశ్రమంలో మనశ్శాంతి వెతుక్కుంటాడు. అలాగే, గణపతి దంపతులు కూడా కథలో అతికినట్టు కాక, సహజంగా ఇమిడిపోయారు. వైవిద్యభరితమైన సినిమాల్ని ఇష్టపడేవాళ్ళకి నచ్చే సినిమా ఇది.

7 కామెంట్‌లు:

  1. నాకు కూడా సినిమా బాగా నచ్చిందండి మురళి గారు!!.. మంచి పరిచయం.

    రిప్లయితొలగించండి
  2. మీరు నమ్మరు కానీ నేను మీ రివ్యూ కోసమే ఆసక్తిగా చూస్తున్నాను. మీరైతే ఎలా విశ్లేషిస్తారా అని!! ఇంకా సినిమా చూడలేదు కానీ చుట్టు పక్కల వాళ్ళ అభిప్రాయాలు విన్నాను ఈ సినిమా పై. చాలా బాగుంది మీ రివ్యూ.

    రిప్లయితొలగించండి
  3. మీ రివ్యూ చాలా బావుంది మురళి గారూ! మీ పోస్ట్స్ కోసం ఎంత ఆత్రుతతో, కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తామో...
    సినిమా వెంటనే చూసానండీ..! అభినందనలు!!
    -భాస్కర్ కూరపాటి.

    రిప్లయితొలగించండి
  4. @మురారి: మళ్ళీ చూడాలనిపించిందండీ నాకైతే.. వీలవ్వలేదు :( ..ధన్యవాదాలు..
    @శేఖర్ పెద్దగోపు: ఎందుకు నమ్మను చెప్పండి? :) చూశారా సినిమా? ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  5. @భాస్కర్: ధన్యవాదాలండీ
    @శ్రీ: తామిల్ తెరియాదు సామీ.. తెలుంగు.. తెలుంగు :) ..ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి