తెలుగు సినిమా పరిశ్రమలో అటు క్లాస్ పాటలనీ, ఇటు మాస్ గీతాలనీ ఏక కాలంలో
రాసి ఒప్పించిన ప్రజ్ఞాశాలిగా వేటూరి పేరు ఎలా అయితే సుప్రసిద్ధమో, ఈ రెండు
తరహా గీతాలకీ జనం మెచ్చే రీతిలో స్వరాలద్దిన సంగీత దర్శకుడు చక్రవర్తి
పేరూ అంతే ప్రసిద్ధం. ముప్ఫయ్యేళ్ళ కెరీర్ లో 960 సినిమాలకి సంగీతం
అందించడంతో పాటు సినిమాకి సంబంధించిన మరిన్ని కళల్లోనూ తనదైన ముద్రవేసిన
చక్రవర్తిని గురించి, కొత్తగా ఆరంభమైన సినీ వెబ్ పత్రిక Thinking Donkey
లో నేనురాసిన నాలుగు మాటలూ ఇక్కడ...
***
చిరంజీవి కథానాయకుడిగా ముప్ఫై రెండేళ్ళ
క్రితం విడుదలై సంచనలం సృష్టించిన సినిమా 'ఖైదీ.' ఈ సినిమా విజయంలో పాటలకీ
భాగం ఉంది. 'ఖైదీ' సినిమా అనగానే మొదట గుర్తొచ్చే పాట 'రగులుతోంది
మొగలిపొద,' రెండోది 'గోరింట పూసింది.. గోరింక కూసింది..' సినిమా పరిభాషలో
చెప్పాలంటే మొదటిది మాస్ గీతం, రెండోది క్లాస్ పాట. సినిమాలాగే ఈ రెండు
పాటలూ సూపర్ హిట్. వయోభేదం లేకుండా సంగీత ప్రియుల చెవుల్లో ఇప్పటికీ
మారుమోగుతూనే ఉంటాయి. ఈ రెండు పాటలనీ స్వరపరిచిన సంగీత దర్శకుడు చక్రవర్తి
స్వరరచనలో వైవిధ్యాన్ని గురించి చెప్పాలంటే ఇంతకుమించిన ఉదాహరణ అవసరం
లేదేమో.
పోటీకి మారుపేరైన సినిమా పరిశ్రమలో తన స్థానాన్ని
నిలబెట్టుకుంటూ ముప్ఫయ్యేళ్ళ కాలంలో 960 సినిమాలకి సంగీతం అందించడం అన్నది
ఆషామాషీ విషయం కాదు. సినీ సంగీతం మీద సంపూర్ణ అవగాహనతో పాటు, కాలానుగుణంగా
ప్రేక్షకుల అభిరుచుల్లో వస్తున్న మార్పులని గమనించుకుని, అందుకు తగ్గట్టుగా
తమని తాము మలచుకోగలిగే నిత్య కృషీవలురకు మాత్రమే సాధ్యపడుతుందిది.
నిర్మాతలు, దర్శకులు, హీరోలకి తగ్గట్టుగా, ప్రేక్షకులు మెచ్చేలా సంగీతం అందించి, సుదీర్ఘ కాలంపాటు తమదైన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్న
సంగీత దర్శకుల జాబితాలో చక్రవర్తికీ స్థానం ఉంది. రాజన్-నాగేంద్ర ల దగ్గర సినీ
సంగీతంలో మెళకువలు నేర్చుకున్న చక్రవర్తి దగ్గర కీరవాణి, రాజ్-కోటి,
వందేమాతరం శ్రీనివాస్, మాధవపెద్ది సురేష్, వాసూరావులు శిష్యరికం చేశారు.
చక్రవర్తి కుమారుడు 'శ్రీ' కొన్ని సినిమాలకి గుర్తుండిపోయే సంగీతాన్ని
అందించారు. తెలుగు సినిమా సంగీతం మీద తనదైన సంతకం చేసిన చక్రవర్తి 2002
ఫిబ్రవరి 3న తన 64వ ఏట కన్నుమూశారు. తెలుగు సినీ సంగీత చరిత్రలో చక్రవర్తి ఓ
అధ్యాయం అనడం అతిశయోక్తి కాదు.
Nice article. Are you sure that kamal did not dub for sagarasangamam?
రిప్లయితొలగించండి@rishi srinivas: of course, thank you..
రిప్లయితొలగించండి