శుక్రవారం, అక్టోబర్ 31, 2014

సిరికాకొలను చిన్నది

శ్రీకాకుళం ఓ అందమైన పల్లెటూరు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో ఉన్న ఈ గ్రామంలో ఉన్న ప్రధాన ఆకర్షణ అతి పురాతనమైన శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఆలయం. కళ్ళు చెదిరే శిల్ప సౌందర్యం ఈ ఆలయం ప్రత్యేకత. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు 'ఆముక్త మాల్యద' కావ్యాన్ని రచించింది ఈ ఆలయంలోనే అనే ప్రతీతి. ఈ ఆలయాన్ని గురించి ఎన్నో.. ఎన్నెన్నో కథలు. వాటిలో ఒకటి 'సిరికాకొలను చిన్నది.'

ఆంధ్ర మహావిష్ణువు ఆలయాన్ని ఆనుకుని ఉన్న సిరికాకొలనులో పుట్టిన ఒకానొక అందమైన పద్మం అలివేణి. ఆ వెలది ఆటవెలదే, కానీ 'వెల'ది కాదు. ఆటపాటల్లో మేటి అయిన పసిమి ప్రాయపు అలివేణి మనసు ఆంధ్ర మహావిష్ణువుకి అంకితం. ఆమె ఆటా, పాటా ఆ స్వామి సేవకి మాత్రమే. అటువంటి అలివేణిపై రాజోద్యోగి ఒకడు మనసు పడ్డాడు. కూతురి ద్వారా ధనార్జన చేయాలన్న ఆశచేత కన్నుమూసుకుపోయిన వేశ్యమాత రంగాజమ్మ అతనికి సహకరించింది. ఫలితంగా, అందమైన ఆ పద్మం వాడిపోయే పరిస్థితి వచ్చింది. తర్వాత ఏం జరిగిందన్నదే వేటూరి సుందర రామ్మూర్తి రాసిన సంగీత నాటిక 'సిరికాకొలను చిన్నది.'


నిత్య యవ్వనుడు వేటూరి తన ముప్ఫై మూడో ఏట రాసిన ఈ నాటిక, మరి నాలుగేళ్ల తర్వాత ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యింది. సినీ సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వర రావు స్వరపరిచిన ఈ నాటిక, తెలుగు వారి అదృష్టవశాన ప్రసారభారతి ఆర్కీవ్స్ నుంచి బయటపడి, వారి మార్కెటింగ్ విభాగం ద్వారా ఆడియో డిస్క్ రూపంలో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. సుమారు తొంభై నిమిషాల వ్యవధి ఉన్న సంగీత నాటకాన్ని తనికెళ్ళ భరణి పరిచయ వాక్యంతో మార్కెట్ చేస్తోంది ప్రసారభారతి. వేటూరి అభిమానులు కొందరు ఈ స్క్రిప్టుని పుస్తక రూపంలోనూ తీసుకువచ్చారు.

'మనుచరిత్ర' ని అల్లసాని పెద్దన నుంచి అంకితం అందుకున్న శ్రీకృష్ణదేవరాయలు, ఆ సంబరం తర్వాత అలివేణి నాట్యాన్ని తిలకించి, ఆమెని సత్కరించాలనే సంకల్పంతో 'ఆనెగొంది' స్థానాపతి మార్తాండ  శర్మని శ్రీకాకుళం సమీపంలోని దేవరకోట మండలాధిపతిగా బదిలీ చేసి, అలివేణిని ఆస్థాన నర్తకిగా నియమిస్తాడు. అలివేణి మీద మనసు పడతాడు మార్తాండ శర్మ. ఆస్థాన నర్తకికి రాయలు తరపున రాసి ఇవ్వవలసిన తూర్పు భూముల బదిలీ సమయంలో అలివేణి తల్లి రంగాజమ్మతో పరిచయం అవుతుంది శర్మకి. అప్పటికే కూతురి  విష్ణుభక్తిని చూసి విసిగిపోయిన రంగాజమ్మ, మార్తాండ శర్మ అలివేణికి దగ్గరయ్యే ఉపాయం చెబుతుంది.

రంగాజమ్మ సలహా ప్రకారం, ఆంధ్ర మహావిష్ణువు ఆలయంలో మూలవిరాట్టు శేషవస్త్రాన్ని, ఆభరణాలని ధరించి అలివేణి సరసకి చేరిన మార్తాండ శర్మ, తను సాక్షాత్తూ ఆమె సేవిస్తున్న భగవంతుడిని అని నమ్మిస్తాడు. ఇట్టే మాయలో పడిపోయిన అలివేణి, మార్తాండ శర్మకి తనని తాను అర్పించుకుంటుంది. మార్తాండ శర్మ ద్వారా అందే కానుకల మీద చిన్నచూపు మొదలవుతుంది రంగాజమ్మకి. తన కూతురి ద్వారా ఇంకా ఎక్కువ సొమ్ము సంపాదించవచ్చన్న ఆలోచన ఆమెది.

ఈ క్రమంలో, ప్రభువు సన్నిధిలో నాట్యం చేస్తూ కళ్ళుతిరిగి పడిపోయిన అలివేణి 'గర్భవతి' అని రాజవైద్యుడు తేల్చడంతో తీవ్రమైన వేదనలో మునిగిపోతాడు శ్రీకృష్ణదేవరాయలు. మార్తాండ శర్మని బదిలీ చేయడం వల్లే ఇదంతా జరిగిందన్న చింత మొదలవుతుంది. జరిగిన దానిలో రంగాజమ్మ పాత్ర కూడా ఉందన్నది విచారణలో తెలుస్తుంది. జరిగిన మోసం అలివేణి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించింది? రాయలు ఆమెకి న్యాయం చేయగలిగాడా? అన్నది ఆసక్తికరమైన ముగింపు.


సంగీత నాటిక అవ్వడం వల్ల, సంభాషణలు తక్కువగానూ, పాటలు ఎక్కువగానూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అలివేణి పాత్ర పోషించిన శ్రీరంగం గోపాలరత్నం గురించి. 'చినదానరా.. వలచిన దానరా..' అన్న జావళి అయినా, 'గోవర్దన గిరిధారీ..' అన్న భక్తిగీతమైనా మళ్ళీ మళ్ళీ వినాల్సిందే. ఇక సంభాషణల్లో అమాయకత్వం, భక్తిపారవశ్యం కలగలసి అలివేణి పాత్ర కళ్ళముందు కదలాడుతుంది. తర్వాత చెప్పుకోవాల్సింది రంగాజమ్మ పాత్ర పోషించిన పి. సీతరత్నమ్మని గురించి. ధనాశ మెండుగా ఉన్న వృద్ధ వేశ్యమాతకి తన గొంతుతో రూపు కట్టేశారు.

ఇక, వేటూరి ప్రతిభ ప్రతిక్షణం ప్రత్యక్షమవుతుంది. అలంకారాలని వాడుకున్న తీరు అద్భుతం. పదాలని విరిచి శ్లేషలతో సంభాషణలు నడిపారు. ఎంత చక్కని తెలుగసలు!! వినాలే తప్ప మాటల్లో చెప్పడం కష్టం. "రాయెక్కడైనా రాయలవుతుందా?" "దేవదాసీ అంటే గుడిసొత్తు మడిగట్టుకోమన్నారు కానీ, మడి కట్టుకు బతకమన్నారా?" లాంటి ప్రశ్నలు విన్నప్పుడు, వేటూరిలోని సంభాషణల రచయితను సినిమా రంగం ఎందుకు ఉపయోగించుకోలేకపోయిందో కదా అనిపించక మానదు. నాటితరం రేడియో శ్రోతలని మాత్రమే కాదు, నేటితరం సంగీత, సాహిత్యాభిమానులనీ అలరించే నాటిక ఇది. (ప్రసార భారతి మార్కెట్ చేస్తున్న ఆడియో డిస్క్ వెల రూ. 195).

7 కామెంట్‌లు:

  1. శ్రీకాకుళం, ఆంధ్రమహావిష్ణువు అనగానే, చిన్నప్పుడు బట్టీపెట్టిన కంఠస్థపద్యాలు గుర్తుకు వస్తాయి.

    "ఆలు నిర్వాహకురాలు భూదేవియై...... "
    "నాగలిరోకలన్నకు నిచ్చి, శాంఖాది..... "

    "చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్యభావ ......" వగైరా...

    చదువుకునే సమయంలో, నిద్ర వస్తుంటే, మా మిత్రులందరం గట్టిగా, పెద్దగా పోటీపడి పద్యాలు చదివేవాళ్ళం. దెబ్బతో నిద్దర మాయమయ్యేది. ఇది యాభై సంవత్సరాలక్రితం మాట.
    ఒకసారి శ్రీకాకుళం దేవాలయానికి వచ్చినప్పుడు, ఆగలేక ఒక పద్యం చదివి, అక్కడ పూజారిగారిని అడిగాను - ఈ శతకం ఎక్కడ దొరుకుతుంది అని. ఆయన వివరం చెప్పలేకపోయారు. ఈమధ్య కాలంలో విజయవాడలోని శివకామెశ్వరి గ్రంధమాల లో, ఏదో పుస్తకం కోసం వెళ్ళినప్పుడు, ఈ పుస్తకాల కట్టలు మొదట్లోనే కనబడ్డయి. ఆహా అనుకొని, వెంటనే ఒకటి తీసుకొన్నాను సంతోషంగా.

    బాపట్ల రామ పుల్లా రావు.
    విజయవాడ.

    రిప్లయితొలగించండి
  2. అప్పుడెప్పుడో తినాలనుకున్న గులాబి జామకాయని వర్ణించారు. :) వేటూరి అక్షరాల్లో సరిగమ ఈలలూ, సరసపు గాలులూ చదివే చాలా సంబరపడ్డాను. ఇక శ్రీరంగం గోపాలరత్నం గాత్రంలో వినడమంటే అనుభవేకవేద్యమేనేమో!

    "వేటూరిలోని సంభాషణల రచయితని సినిమా రంగం ఎందుకు ఉపయోగించుకోలేకపోయిందో కదా.." నిజమండీ. వినేలోగా మరోసారి పుస్తకం తిరగేయాలనిపిస్తోంది. మంచి పరిచయం.

    రిప్లయితొలగించండి
  3. @బాపట్ల రామ పుల్లారావు: మొత్తానికి కోరుకున్న పుస్తకాన్ని సాధించుకున్నారన్న మాట!! బావుందండీ.. మీ స్పందనని పంచుకున్నందుకు ధన్యవాదాలు.
    @కొత్తావకాయ: నాకైతే మొత్తం ఆడియోకి హైలైట్ ఆవిడ గాత్రమేనండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. చుట్టాల సురభి రంగాజమ్మగారిని ఇప్పుడే విన్నానండీ. కళ్ళకి కట్టడమన్నది చిన్నమాట! నాకు మాత్రం రంగాజీ హైలైట్ అనిపించింది. "కలికి చిలక కనిపించదేమే..!" :)

    వేటూరి ప్రాసక్రీడలు వినితీరాల్సిందే కదా అసలు!! రేడియో నాటికకు తగ్గట్టు చేసిన మార్పులుచేర్పులూ చూస్తే రజనీకాంతరావు గారి ప్రజ్ఞ తెలుస్తుంది.

    "కరమరుదా కనికరమరుదా.. కరివరద కావగ నన్ను వరమరుదా.." వేటూరి మాత్రమే రాయగలడేమో ఇలా!! "చినదానరా..", "రాయికాడే తల్లి..", "ఏమని పిలువను.." వేటికవే అసలు!! మీకు మరోసారి ధన్యవాదాలండీ. అన్నట్టు.. మల్లీశ్వరి గుర్తొచ్చింది చాలా సందర్భాల్లో.. :)

    రిప్లయితొలగించండి
  5. @కొత్తావకాయ: ప్రసార భారతి వారి ప్రభ ప్రవాసంలో కూడా వెలుగుతోందన్న మాట!! బావుందండీ..
    నిజం చెప్పాలంటే అలివేణి గొంతులో అక్కడక్కడా నాటకీయత వినిపించింది కానీ రంగాజమ్మ మాత్రం వంక పెట్టడానికి లేదు. 'మల్లీశ్వరి' గుర్తు రావడం సహజం అండీ.. రెండూ 'రాయలు' కథలే కదా.. జావళీలు, యక్షగానాలూ రెంటిలోనూ ఉన్నాయి.. మీ వ్యాఖ్య చదివాక, పుస్తకం చదవాలనిపిస్తోంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి