ఆదివారం, అక్టోబర్ 05, 2014

ఆర్తి

ఏడాదికి రెండే పండుగలు. అవిటి (రథోత్సవం), సంకురాత్తిరి. రెండు పండగలకీ ఆడపిల్లని పుట్టింటికి తీసుకెళ్లడం విధాయకం అంటుంది ఎర్రెమ్మ. కూతురు సన్నెమ్మని అదే ఊళ్ళో ఉండే బంగారమ్మ కొడుకు పైడయ్యకి ఇచ్చి పెళ్లి చేసింది నాలుగైదేళ్ళ క్రితం. పల్లెలో చేయడానికి పనిలేక, 'కళాసీ' పని వెతుక్కుంటూ పట్నం వెళ్ళిపోయాడు పైడయ్య. ఖర్చులు భరించలేక అక్కడ కాపురం పెట్టలేదు. ఎర్రెమ్మ మాత్రం సంప్రదాయం తప్పకుండా ఏటా రెండు పండగలకీ కూతుర్ని తీసుకెళ్ళి నెలేసి రోజులు ఉంచుకుని పంపుతోంది. ఇదిగో, ఈ తీసుకెళ్లడం దగ్గరే తగువు మొదలయ్యింది.

బంగారమ్మకి ముగ్గురు కొడుకులు. మూడోవాడు పైడయ్య. పెద్దకొడుకు నారాయుడు భార్య పిల్లల్ని కని కాలం చేసింది. రెండో కొడుకు కోటయ్య భార్య పురిటికి పుట్టింటికి వెళ్ళింది. బంగారమ్మకి చెయ్యి సాయం ఉండే కోడలు సన్నెమ్మ ఒక్కర్తే. అయినా కూడా, కోడలు అవిటికీ, సంకురాత్తిరికీ పుట్టింటికి వెళ్ళడం, వెళ్ళినప్పుడల్లా నెలేసి రోజులు ఉండిపోవడం అభ్యంతరం లేదు బంగారమ్మకి. ఆమె అభ్యంతరమల్లా ఒక్కటే, రెండు పండగలకీ కూడా ముందు రోజున పుట్టింటికి వెళ్లి పండగ అయ్యాక నెల్లాళ్ళూ ఉండి రమ్మంటుంది.

ప్రతిసారీ కూడా, నెల ముందు తీసుకెళ్ళి, పండగవుతూనే పంపేస్తుంది ఎర్రెమ్మ. పైగా, నాకూతుర్ని ఎప్పుడు తీసుకెళ్ళాలో  నాకొకరు చెప్పడవా? అంటుంది నోరుగల ఎర్రెమ్మ. చినికి చినికి గాలివానగా మారిన ఆ తగువు, పైడయ్య-సన్నెమ్మ యిడబావులు (విడాకులు) పెట్టుకోడానికి సిద్ధపడే దగ్గరికి వచ్చేసింది ఆ సంకురాత్తిరి పండుగనాటికి. రెండు కుటుంబాలూ రోడ్డున పడి కొట్టేసుకున్నాక, అసిర్నాయుడు గారి సమక్షానికి వెళ్ళింది తగువు. అసిర్నాయుడు ఆ తగువు ఎలా తీర్చాడు? పైడయ్య-సన్నెమ్మ కలిశారా లేదా అన్నదే తెలుగు సాహితీ లోకం కారా మేష్టారుగా పిలుచుకునే కాళీపట్నం రామారావు నాలుగున్నర దశాబ్దాల క్రితం రాసిన 'ఆర్తి' కథ.

సుందరపాలెం గ్రామంలో జరిగిన 'యజ్ఞం' మొదలు, స్వతంత్ర భారత దేశం మీద జరిగిన 'కుట్ర' వరకూ ఎన్నో ఇతివృత్తాలతో మళ్ళీ మళ్ళీ చదువుకునే కథలు రాసిన కారా మేష్టారు 'మానవ సంబంధాలు' ఇతివృత్తంగా రాసిన కథ 'ఆర్తి.' కథా స్థలం పూర్వపు గంజాం జిల్లా. అక్కడ మనుషుల్లాగే, ఆచారాలు కూడా ఒరియా తెలుగుల కలగాపులగంగా ఉంటాయి. అలాంటి ఊరు చివర ఉన్న పల్లెలో కూతవేటు దూరంలో ఉన్న రెండు కుటుంబాలు బంగారమ్మ, ఎర్రెమ్మలవి. కరువు బారిన పడిన పల్లెలో పండుగ కళ లేకపోయినా, సంక్రాంతికి పట్నం నుంచి ఇంటికొచ్చాడు పైడయ్య. ఎర్రెమ్మ వచ్చి అల్లుడిని పండక్కి పిలవడం కథా ప్రారంభం.

పండక్కి నెల్లాళ్ళ ముందే, సన్నెమ్మని పంపే విషయంలో వీరకత్తెలిద్దరూ జుట్టూ జుట్టూ పట్టేసుకోగా, అత్త మాట వినకుండా అమ్మ వెనుక పుట్టింటికి వెళ్ళిపోయింది సన్నెమ్మ. ఆ కోపం కడుపులో పెట్టేసుకుంది బంగారమ్మ. పండుగపూటా ఆడవాళ్ళిద్దరూ మళ్ళీ తలపడిపోయే పరిస్థితి వచ్చేయడంతో, తను రంగంలోకి దిగి సర్దిచెప్పాడు పైడయ్య పెద్దన్న నారాయుడు. ఇలా లాభం లేదనుకున్న పైడయ్య, సన్నెమ్మని ఒంటరిగా కలుసుకుని ఏం జరిగిందో అడుగుతాడు. తను ఏం చెయ్యాలో చెప్పమంటాడు. ఆ ప్రకారం నడుస్తానంటాడు. "ఇలాటివి ఆడమనిషిని నాన్సెప్పా రాదు. నాన్సెప్పినా ఆ సెప్పినట్టు నువ్ నడారాదు" అని తేల్చేస్తుంది సన్నెమ్మ.

మధ్యేమార్గంగా, ఆమెని మాపిటికి తవిటప్ప గారింటికి ఓపాలి రమ్మంటాడు పైడయ్య. అప్పుడు కూడా ఏమీ మాట్లాడదు ఆమె. పైడయ్య చెప్పినదాంట్లో న్యాయం కనిపిస్తుంది పక్కింటి నరసమ్మకి. సన్నెమ్మకి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తుంది. మొగుడు చెయ్యి దాటిపోకుండా కాసుకోవాలని జాగ్రత్తలు చెబుతుంది. చెవిన పెట్టదు సన్నెమ్మ. ఒళ్ళు ఎర పెట్టి మొగుణ్ణి తెచ్చుకోవడం తనకి చేతకాదని తెగేసి చెప్పేస్తుంది. ఇంటి పరిస్థితులూ, తన పరిస్థితులూ తర్కించుకునే పనిలో పడ్డ పైడయ్య పట్నం వెళ్లి తను సాధిస్తున్నది ఏమిటన్న ప్రశ్న దగ్గర ఆగిపోతాడు.

పండుగ రోజు రాత్రి ఒళ్ళు పట్టని కోపంతో బంగారమ్మ ఇంటి మీదకి యుద్ధానికి వెడుతుంది ఎర్రెమ్మ. అంతే కోపంతో ఉన్న పైడయ్య చిన్నన్న కోటయ్య ఆమె మీద చెయ్యి చేసుకోడమే కాదు, సన్నెమ్మని బెదిరించి తీసుకొచ్చి తమ్ముడికి అప్పగిస్తాడు.అదిగో, అప్పుడు న్యాయం చెప్పమంటూ అసిర్నాయుడు గుమ్మం తొక్కుతుంది ఎర్రెమ్మ. అసిరిబాబు తీర్పు ఏమిటన్నది కథలో చదవడమే బాగుంటుంది. (మనసు ఫౌండేషన్ ముద్రించి, ఎమెస్కో పునర్ముద్రించిన 'కాళీపట్నం రామారావు రచనలు' సంపుటంలో ఉందీ పాతిక పేజీల కథ).

3 వ్యాఖ్యలు:

  1. ఎంత ఓపికో మీకు....ఇంకా కధల గురించి అందంగా అభివర్ణిస్తూనే ఉన్నారు.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. మీ నాయికల్లో ఎర్రెమ్మని చేరిస్తే చదవాలనుంది. :) సమీక్ష చదివి, కథ చదివొచ్చి మళ్ళీ సమీక్ష చదివానండీ. 'వంటవాడే హంతకుడని' చెప్పనందుకు మరీ నచ్చేసింది మీ కథా పరిచయం.

    ప్రత్యుత్తరంతొలగించు