సోమవారం, అక్టోబర్ 13, 2014

ప్రజలు.. ప్రభుత్వం.. ఒక ఐ.ఎ.ఎస్

ప్రభుత్వంలో ఉన్నతోద్యాలు చేసి పదవీ విరమణ చేసిన అధికారులందరూ వరుసగా తమ ఆత్మకథలని వెలువరిస్తున్నారు. అయ్యేయెస్, ఐపీఎస్ అధికారుల ఆత్మకథలు వరుసగా అందుబాటులోకి వస్తూ గడిచిన మూడు నాలుగు దశాబ్దాల పాలనలో, విధాన నిర్ణయాలు తీసుకునే సమయంలో తెరవెనుక జరిగిన సంగతులు సామాన్యులు తెలుసుకోడానికి అవకాశం కల్పిస్తున్నాయి. పీవీఆర్కే ప్రసాద్  'అసలేం జరిగిందంటే,' మోహన్ కందా 'మోహన మకరందం' తర్వాత అదే వరుసలో డాక్టర్ కె.వి. రమణాచారి వెలువరించిన పుస్తకం ' ప్రజలు.. ప్రభుత్వం.. ఒక ఐ.ఎ.ఎస్'

కరీంనగర్ జిల్లా నారాయణపురంలో సంప్రదాయ శ్రీవైష్ణవ కుటుంబంలో జన్మించిన రమణాచారి పాఠశాల రోజులనుంచే చురుకైన విద్యార్ధిగా పేరుతెచ్చుకుని, కళాశాలకి వచ్చేసరికి తెలంగాణా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని రుచిచూశారు. కాలేజీలో చేరేందుకు ప్రధానమైన అడ్డంకి పేదరికం. కాలేజీలో చేరి కేవలం చదువుతో సరిపెట్టుకోకుండా విద్యార్ధి ఉద్యమాల్లో పాల్గొన్న వైనం ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశా, ఉద్యమాన్ని కూడా చదువులో భాగంగానే తీసుకున్నట్టున్నారు రమణాచారి. పీజీ చదివేందుకు పేదరికంతో పాటు సంప్రదాయమూ అడ్డొచ్చింది. ఎదిరించి మరీ పీజీ పూర్తిచేసి కళాశాల లెక్చరర్ గా జీవితం ఆరంభించారు.

జీవితం పెద్ద మలుపు తిరగడానికి కారణాలు సాధారణంగా చిన్నవే అయి ఉంటాయి. చాలా సందర్భాల్లో ఇవి, వెనక్కి తిరిగి చూసుకుంటే ఆశ్చర్యం కలిగించేంత అతిచిన్నవి అవుతాయి. లెక్చరర్ గా పనిచేసే కాలంలో కిరోసిన్ రేషన్ లో తప్ప దొరకని పరిస్థితి. రేషన్ కావాలంటే కార్డు తప్పనిసరి. కొందరు లెక్చరర్లు రేషన్ కార్డు కోసం దరకాస్తు చేయడానికి రెవిన్యూ కార్యాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఓ చిరుద్యోగి చేతిలో జరిగిన అవమానం రమణాచారి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ పరిక్షలు రాయడానికి కారణం అయ్యింది. తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించి భూ రాజస్వ మండలాధికారి (ఆర్డీవో) గా ఉద్యోగ జీవితం ప్రారంభించే నాటికి రమణాచారి వయసు కేవలం పాతికేళ్ళు.


రేషన్ కార్డు కోసం వెళ్ళినప్పుడు చూడడం తప్ప రెవిన్యూ ఆఫీసు ఎలా ఉంటుందో తెలియదు. ఎవరితో ఎలా మెలగాలో అంతకన్నా అవగాహన లేదు. ఫలితం, తొలి సంవత్సరం దాదాపు ప్రతి నెలా బదిలీలే. కాస్త కుదురుగా చేసిన ఉద్యోగం మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట ఆర్డీవో. అక్కడినుంచి రమణాచారికి బదిలీ అయినప్పుడు ఆ ప్రాంతం ప్రజలంతా బదిలీ ఆపాలంటూ రాస్తారోకో చేయడం, ఆర్డీవోగా ఆయన పనితీరుకి ఓ చిన్న మచ్చుతునక. టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కులీకుతుబ్షా అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ పాలనాధికారి బాధ్యత రమణాచారిని రాష్ట్ర స్థాయి నాయకుల దృష్టిలో పడేలా చేసింది.

కడప కలెక్టర్ గా రమణాచారి బాధ్యతలు నిర్వహిస్తున్న కాలంలోనే, నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కి కడపలో జరిగిన బహిరంగ సభలో దారుణమైన అవమానం జరగడం, జరిగిన సంఘటనకి కారణం కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలే అయినప్పటికీ కలెక్టర్ ని బాద్యుడిని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రమణాచారిని బదిలీ చేయడం, ఇంతజరిగినా ఐఏఎస్ అధికారుల సంఘం నోరు మెదపకపోవడం.. అటుపై జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ పీవీని రాష్ట్రానికి ఆహ్వానించి ఘనంగా సన్మానం చేసినప్పుడు సాంస్కృతిక శాఖ సంచాలకుడి హోదాలో రమణాచారే ఏర్పాట్లన్నీ స్వయంగా చూడడం... ఇదంతా ఆపకుండా చదివిస్తుంది.సంస్కృతిక శాఖ సంచాలకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి బాధ్యతలని ఎంతో ఇష్టంగా నిర్వహించారు రమణాచారి.

ఎన్టీఆర్, చంద్రబాబులతో సౌకర్యవంతంగా పనిచేయడాన్ని వివరంగా రాస్తూ, కాంగ్రెస్ టైం లో ఎదురైన ఇబ్బందులని రేఖామాత్రంగా ప్రస్తావించారు ఈ పుస్తకంలో.  పీవీఆర్కే, మోహన్ కందాలు తమ పుస్తకాలని తామే రాసుకోగా, రమణాచారి పుస్తకాన్ని పత్రికా రచయిత చీకోలు సుందరయ్య రాశారు. చదువుతుంటే "రమణాచారే స్వయంగా రాసి ఉంటే బావుండేది" అని ఎన్నోసార్లు అనిపించింది. ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్నప్పటికీ, కథనం విషయంలో సరైన శ్రద్ధ పెట్టలేదన్న భావన పదేపదే కలిగింది. తిరుమల 'కులశేఖరప్పడి ' ని 'కులశేఖరపది' అని రాశారు ప్రతిచోటా. కొన్ని కొన్ని ఎపిసోడ్స్ న్యూస్ పేపర్ క్లిప్పింగులని తలపించాయి. ఫోటోలన్నీ ఒక్కచోటే (చివర్లో) ఇవ్వడం మాత్రం మెచ్చుకోవాలి. (ఎమెస్కో ప్రచురణ, పేజీలు 208, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి