శుక్రవారం, సెప్టెంబర్ 26, 2014

నిక్వాణం-1

"... కలియుగే ...ప్రధమపాదే ...జంబూద్వీపే ...భరత వర్షే ..." కించపడుతూ పలుకుతున్నాయి నరసింహ శాస్త్రి పెదవులు. మాసిన అంగవస్త్రం, మాసికవేసిన పై వస్త్రం, చేతికి చిన్న గుడ్డ సంచీతో విశాలమైన ఆవరణ వీధివాకిట్లో నిలబడి ఉన్నాడతడు. యాయవారం చెప్పుకోడం అదే ప్రధమం. అలాంటి పరిస్థితి వస్తుందని ఏనాడూ ఊహించలేదు కనీసం. ఇంటి వాళ్ళు వచ్చేవరకూ అక్కడే నిలబడాలో, రారని నిశ్చయించుకుని వెనక్కి తిరగాలో తెలియని సందిగ్ధంలో గొంతు కాస్త పెంచి ఆవేల్టి తిథి, వారం, నక్షత్రం బిగ్గరగా చదివాడు. ఆ ఇంటి ఇల్లాలు పిడికెడు బియ్యం తెచ్చి అతని సంచిలో పోసింది నమ్రతగా.

"వాసుదేవార్పణం" గొణిగాయి అతని పెదవులు. అదిమొదలు మిట్టమధ్యాహ్నం వరకూ పాతిక గుమ్మాలు ఎక్కిదిగితే, ఐదు గుప్పిళ్ళ బియ్యం పడ్డాయి చేతి సంచీలో. కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వచ్చేసరికి కొడుకు జనార్దన శాస్త్రి గుమ్మంలో ఎదురుపడ్డాడు.

"నాన్నగాలొచ్చాలేవ్ అమ్మా.." పిల్లవాడు ఆనందంగా పెట్టిన కేక లోపలి ఇంట్లోకి వినిపించింది.

"ఏవన్నా తెచ్చారా? చేతులూపుకుంటూ వచ్చారా?" ధుమధుమలాడుతూ వచ్చిన మీనాక్షి ముఖంలో కాస్త వెలుగొచ్చింది, సంచీ చూడగానే. ఇట్టే లోపలికెళ్ళి మంచినీళ్ళ చెంబుతో తిరిగొచ్చి, "కాళ్ళు కడుక్కు రండి. ఇంత ఊళ్ళో ఆమాత్రం నాలుగ్గింజలు రాలకపోతాయా అని ఎసరు పెట్టేసుంచాను.. ఒక్క క్షణంలో వడ్డించేస్తాను," ఎంతో శాంతంగా చెప్పింది.

లెక్కకి ఐదు గదులున్నా చాలా పాతబడిపోయింది ఇల్లు. మట్టి గోడలు, సున్నం మొహం చూసి ఎన్నో ఏళ్ళయిపోయింది. వర్షాకాలం వచ్చిందంటే చెంబులు, గిన్నెలు అన్నీ నేలమీద పరిచినా ఇంకా ఏదో ఒక మూల వాన పడుతూనే ఉంటుంది. ఉద్యోగం చేసేంత చదువు, వ్యాపారం చేసేంత డబ్బూ లేని నరసింహశాస్త్రి ఎన్నో పనులు ప్రయత్నించి చివరికి యాయవారంలోకి దిగాడు. నలుగురూ చిన్నచూపు చూస్తే చూడనీగాక, కడుపునిండే దారి ముఖ్యం అని సరిపెట్టుకున్నాడు.

"ఇవాళే మొదలు కదా.. రెండ్రోజులుపోతే అందరికీ తెలుస్తుంది. కాసిన్ని బియ్యం వస్తాయి. కాస్త కుదుట పడ్డాక కుర్రాడి చదువు విషయం ఆలోచించాలి. వాడి ఈడు వాళ్ళు ఒక్కక్కరూ బర్లో చేరుతున్నారు," పిల్లాడిని జోకొడుతూ చెప్పింది మీనాక్షి. మౌనంగా ఉండిపోయాడు నరసింహశాస్త్రి.

చమురు దీపం కొండెక్కిన కాసేపటికి "ఆ గెడ్డం చేయించుకోరాదూ రేపు? ఒకటే గుచ్చుకుంటోంది," గుసగుసగా అందామె.

చుట్టుపక్కల పిల్లలందరూ బడికి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కడూ ఇంట్లో కాలక్షేపం చేయడం పెద్ద సమస్య అయిపోయింది జనార్దన శాస్త్రికి. ఎంతసేపని అమ్మ కొంగు పట్టుకుని తిరగడం? పైగా మీనాక్షి ఎప్పుడు దగ్గరికి తీస్తుందో, ఎప్పుడు చిర్రూ కొర్రూమంటుందో ఓ పట్టాన పసిగట్టడం కష్టం. తన కాలక్షేపం తను వెతుక్కునే ప్రయత్నంలో ఉన్న ఆ కుర్రాడిని వీధి గదిలో ఉన్న పాతకాలంనాటి పొడవాటి చెక్క పెట్టె ఆకర్షించింది.

అమ్మా నాన్నా నిద్రపోతున్న ఓ మధ్యాహ్నం వేళ కష్టపడి పెట్టె తెరిస్తే, ఓ పాత శిల్కు గుడ్డ మెత్తగా మెరుస్తూ కనిపించింది. ఆ మెత్తదనాన్ని చేతులకి తాకించి, ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు "ట్రుయ్" మన్న శబ్దం రావడంతో గుండె గుభేలుమంది జనార్దనానికి. నాన్నో, అమ్మో నిద్రలేస్తే ఇంకేమన్నా ఉందా? జాగ్రత్తగా పెట్టె మూసేశాడు కానీ, మనసు అక్కడే ఉండిపోయింది.

అదిమొదలు, ఆ పెట్టె మీద కుతూహలం పెరిగింది. ధైర్యం చేసి, శిల్కు గుడ్డని జాగ్రత్తగా పైకి తీస్తే, అడుగున కనిపించిన వస్తువు ఆశ్చర్యంలో ముంచెత్తింది అతన్ని. పెట్టెలో జాగ్రత్తగా అమర్చిన పొడవాటి వస్తువు పేరేమిటో తెలియదు కానీ, దానికున్న తీగల్ని ముట్టుకుంటే చాలు వింత వింత శబ్దాలు వస్తున్నాయి. ఉదయం ఇంట్లో బయల్దేరిన నాన్న తిరిగి వచ్చేది భోజనానికే. ఆయన బియ్యం తెచ్చేవరకూ అమ్మకి పెరట్లో గోడ పక్కన పక్కింటి వాళ్ళతోనే కాలక్షేపం. ఆ సమయంలో వీధి గదిలోకి వచ్చి, పెట్టి మూత తీసి, శిల్కు గుడ్డ తప్పించి, తీగెలతో ఆడుకోవడం ఓ అలవాటుగా మారిపోయింది ఆ కుర్రాడికి.

"ఈ ఏడన్నా పిల్లాడిని చదువులో పెట్టాలి. కనీసం మీరు దగ్గర కూచోబెట్టుకుని అక్షరాలన్నా దిద్దించండి," మీనాక్షి మాటకి సమాధానం చెప్పలేదు నరసింహశాస్త్రి, ఎప్పటిలాగే.

"నాకే చదువొస్తేనా? నాలుగు ముక్కలు నేనే చెప్పుకుందును. చీట్లపేక మీదున్న శ్రద్ధ పిల్లాడి చదువుమీద లేదు కదా.." అంటున్నప్పుడు మాత్రం విస్తరి ముందు నుంచి లేచిపోయాడు, ఉత్తరాపోశన పట్టకుండానే.

జనార్దనం వేళ్లకీ, లోహపు తీగెలకీ యిట్టే స్నేహం కుదిరింది. ఏ తీగెని ఎటు మీటితే ఎలాంటి శబ్దం వస్తుందో ఎవరూ చెప్పకుండానే తెలిసిపోతోంది అతనికి. ఆ తీగెలతో ఆటలు నిరంతరాయంగా సాగిపోతున్నాయి. వేళ్ళు నొప్పి పుడుతున్నా తీగెల్ని మాత్రం వదలాలని అనిపించడం లేదతనికి. 

ఆ ఉదయం, నరసింహశాస్త్రిని యాయవారానికి పంపి, మీనాక్షి పెరట్లో కబుర్లలో మునిగి ఉన్నప్పుడు వీధిగుమ్మంలో నుంచి బిగ్గరగా పిలుపు వినిపించింది "ఎవరండీ ఇంట్లో?" అంటూ. అంత క్రితమే ఆట పూర్తి చేసిన జనార్దనం పెరట్లోకి పరిగెత్తాడు. రెండో పిలుపుకి హడావిడిగా వీధిలోకి వచ్చింది మీనాక్షి, ఆ వెనుకే జనార్దనం. వీధిలో ఎవరో బుర్రమీసాల పెద్దమనిషి. ఆజానుబాహువు. గంభీరమైన విగ్రహం. అపరిచితుణ్ణి చూడగానే ఒక్క క్షణం తత్తరపడి, కొంగు భుజం చుట్టూ కప్పుకుంది.

"వారింట్లో లేరండీ.. వచ్చేస్తారు.. కూర్చోండి.. చిన్నా.. చాప తెచ్చి వెయ్యి నాన్నా" పిల్లాడికి పురమాయించింది హడావిడిగా. అవేమీ పట్టించుకునే పరిస్థితిలో లేడా పెద్దమనిషి. మీనాక్షిని చూస్తూనే చేతులెత్తి నమస్కరించేశాడు.

"ఎంత చక్కని నిక్వాణం తల్లీ! సరస్వతి అంశలో పుట్టినట్టున్నారు," అతనంటూ ఉంటే తెల్లబోవడం మీనాక్షి వంతయ్యింది.

"ఏకాండీ వీణ. శ్రేష్ఠమైన పనస మానుతో.. అదికూడా బొబ్బిలి వారు తయారు చేసింది అయి ఉంటుంది.. కదమ్మా?" అడిగాడు సంబరంగా.అతడేం మాట్లాడుతున్నాడో అక్షరం అర్ధం కాలేదు మీనాక్షికి. పెద్దమనిషికి ఎదురు చెప్పడం మర్యాద అనిపించడం లేదు. మంచినీళ్ళ చెంబు పిల్లాడి చేత అతనికిప్పించి గడప లోపలే నిలబడింది.

"చాలా సేపయి వింటున్నానమ్మా. అభినందించి వెడదామని పిలిచాను.. క్షమించాలి నన్ను," అంత పెద్దమనిషీ ఆడుతున్న మాటలకి అర్ధం ఏమిటో బొత్తిగా బోధ పడక తెల్లబోయి చూస్తోంది మీనాక్షి. ఆమెని రక్షించడం కోసమే అన్నట్టు యాయవారం ముగించుకుని ఇంటికి వచ్చాడు నరసింహ శాస్త్రి. వీధిలో పెద్దమనిషిని అయోమయంగా చూశాడు.

మీనాక్షి నోరు తెరిచేలోగానే ఆ పెద్దమనిషి అందుకున్నాడు "అయ్యా..మమ్మల్ని జానకిరామరాజు అంటారు. సూర్యవంశపు క్షత్రియులం. మీ పెదరాజు గారి బంధువులం. దైవానుగ్రహం వల్ల సంగీతం కొంత వంటబట్టింది. వీధినే వెడుతుంటే అమ్మగారి వీణావాదన వినిపించి ఆగిపోయాను. ఈమాటే చెప్పాలనిపించి ఉండబట్టలేక పిలిచాను. మీరూ కనిపించారు. సంతోషం.." భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు.

జరుగుతున్నది ఏమిటో బొత్తిగా తెలియని జనార్దనం "అమ్మింకా ఎంతసేపట్లో అన్నం పెడుతుందా" అని ఎదురుచూస్తున్నాడు.

నరసింహశాస్త్రి గొంతు పెగుల్చుకున్నాడు "అయ్యా, మీరు పొరబడుతున్నారు. మా ఇంట్లో వీణ ఉన్నమాట నిజవే. మా నాన్నగారు వైణికులు. ఆయన పోవడంతోనే ఆ వీణ వైభోగమూ పోయింది. నా ఇల్లాలు ఏనాడూ ఆ వీణని కనీసం తుడిచిన పాపాన పోలేదు. చెప్పకపోడవేం, ఆవిడకి సంగీతం అంటే ఏమంత ఇష్టం ఉండదు కూడాను.. మరి మీరు..." తర్వాత ఏం మాట్లాడాలో అర్ధం కాక ఊరుకున్నాడు.

ఆశ్చర్య పోవడం జానకిరామరాజు వంతయ్యింది. వీధి గది వైపు వేలెత్తి చూపుతూ "ఈ గది నుంచి వీణా నిక్వాణం నా చెవులతో నేను విన్నాను. ఇక్కడే నిలబడిపోయి మరీ విన్నాను. ఇందులో ఎంతమాత్రం పొరపాటు లేదు," స్థిరంగా చెప్పాడు. ఒక్కుదుటన వీధి గదిలోకి వెళ్ళిన నరసింహశాస్త్రికి పాత సామాన్ల మధ్యలో శుభ్రంగా తుడిచి ఉన్న వీణ పెట్టె కనిపించింది. తన తండ్రి ఆత్మ వచ్చి వీణ సాధన చేసుకుంటోందా అన్న సందేహం రాకపోలేదు.

వీధిలోకి వచ్చి, "మా ఇంట్లో ఉండేది నేను, నా భార్య, కొడుకు. ఆవిడ విషయం మనవిచేశాను కదూ తమకి. ఇక పసివాడికి వీణ అంటే ఏవిటో కూడా తెలియదు," అన్నాడు. జానకిరామరాజుకి పట్టుదల పెరిగింది. "అబ్బాయిని ఒక్కసారి పిలిపిస్తారా?" నమ్రతగా అడిగాడు. నరసింహశాస్త్రికి ఒళ్ళు మండకపోలేదు కానీ, తన తాహతుకి కోపం కూడదని గుర్తొచ్చి జనార్దనాన్ని పిలిచాడు.

"మీ పేరేవిటి బాబూ?" అంటూ పిల్లాడిని నవ్వుతూ పలకరించి, తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు జానకిరామరాజు. యధాలాపంగా అందుకున్నట్టుగా అతని చేతిని తన చేతిలోకి తీసుకుని వేళ్ళని చూడగానే తన సందేహం నిజమేనని అర్ధమయిపోయింది. తెల్లని వేళ్ళ చివర్లు ఎర్రగా రక్తం చిమ్ముతున్నాయా అన్నట్టున్నాయి.

నరసింహశాస్త్రినీ, మీనాక్షినీ అక్కడే వదిలేసి "నాతో రండి బాబూ" అంటూ జనార్దనాన్ని వీధి గదిలోకి తీసుకెళ్ళి, వీణ పెట్టె మూతని స్వయంగా తెరిచి, తీగెల్ని మీటమన్నట్టుగా సైగ చేశాడు జానకిరామరాజు. గోలీలాడినంత ఉత్సాహంగా వీణ తీగెలమీద విహరించాయి జనార్దనం లేత వేళ్ళు. నోళ్ళు తెరుచుకుని ఉండిపోయారు నరసింహశాస్త్రీ, మీనాక్షీ.

"సాయంత్రం ఓమారు వస్తాను," జనాంతికంగా చెప్పి వెళ్ళిపోయాడు జానకిరామరాజు. పిల్లవాడికి అన్నం తినిపిస్తూ వీణ విషయం మొత్తం రాబట్టింది మీనాక్షి. అప్పటినుంచీ సాయంత్రం అవ్వడం కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. బయట పడకపోయినా నరసింహశాస్త్రికీ కుతూహలంగానే ఉంది. ఏ ఆలోచనా లేని వాడు జనార్దనం ఒక్కడే.

సాయంకాలమవుతూనే, పెదరాజు గారిని వెంటబెట్టుకుని మరీ వచ్చాడు జానకిరామరాజు. "ఈ కుర్రవాడికి అపూర్వమైన స్వరజ్ఞానం ఉంది. ఇది దైవదత్తం తప్ప మరొకటి కాదు. ఈ ఊళ్ళో ఉండిపోవాల్సిన వాడు కాదు మీవాడు. బస పట్నానికి మార్చి, జనార్దనాన్ని సంగీతంలో ప్రవేశ పెడితే తిరుగులేని కళాకారుడు అవుతాడు," జానకిరామరాజు మాటల సారాంశం ఇది.

పెదరాజు గారంతటి వాడు తన గుమ్మంలోకి వచ్చినందుకే తబ్బిబ్బు పడిపోయాడు నరసింహశాస్త్రి. కానీ, ఏమాత్రం బయట పడకుండా "ఇక్కడంటే, ఊరి వారి దయవల్ల భుక్తి గడిచిపోతోంది మాకు. పట్నవాసం అంటే ఖర్చులూ అవీ..." నీళ్ళు నమిలాడు.

జవాబు సిద్ధంగానే ఉంది జానకిరామరాజు దగ్గర. నరసింహశాస్త్రికి తగిన పని చూసే వరకూ కుటుంబ పోషణ, పిల్లవాడి శిక్షణ ఖర్చులు తను ఆనందంగా భరిస్తానని భరోసా ఇచ్చాడు. వారం తిరిగేసరికల్లా ఆ కుటుంబం బస పట్నానికి మారింది, వీణతో పాటు మరికొన్ని ముఖ్యమైన సామాన్లతో సహా. ఉత్సాహంగా ఉన్న జనార్దనం నిశ్శబ్దంగా సెలవు తీసుకున్నాడు ఊరినుంచీ, దూరంగా కనిపించే గోదారి నుంచీ.


జానకిరామరాజు సమక్షంలోనే మొదటిసారిగా వీణ పూర్తి రూపాన్ని చూశాడు జనార్దనం. నున్నని కైవారం, అందంగా చెక్కిన లతలు, మెరిసే నగిషీలు, అన్నింటినీ మించి వేళ్ళతో తాకితే చాలు గలగలా పలికే పొడవాటి తీగెలు. తల్లిదండ్రులని, స్నేహితులనీ కూడా వీణ లోనే చూసుకోడానికి ఎంతో కాలం పట్టలేదు జనార్దనానికి. తనకొచ్చిన విద్యని కేవలం కొన్ని నెలల్లోనే జనార్దనం సునాయాసంగా నేర్చేసుకోవడంతో మరో గురువుని వెతకాల్సి వచ్చింది జానకిరామరాజుకి. వీణతో పాటే, చదువుచెప్పే మేష్టర్లని కూడా.

పల్లె జీవితం కన్నా పట్నవాసం హాయిగా ఉంది నరసింహశాస్త్రికీ, మీనాక్షికీ. వచ్చిన వారం రోజులకే చుట్టుపక్కలవాళ్ళతో స్నేహం కలిపేసి పట్నం పోకడల్ని ఔపోసన పట్టే పనిలో పడింది మీనాక్షి. ప్రతినెలా ఒకటో తారీఖు సాయంత్రానికల్లా ఉప్పుతో సహా నెలకి సరిపడే సమస్త సంబారాలూ జానకిరామరాజు ఇంటినుంచి వచ్చేస్తూ ఉండడంతో యాయవారమే కాదు, ఏ పనీ చేయాల్సిన అవసరం కనిపించడం లేదు నరసింహశాస్త్రికి.

ఆ కుటుంబం పట్నంలోనూ, కుర్రాడు పాఠాల్లోనూ కుదురుకున్న కొన్నాళ్ళకి జనార్దనానికి తొలి కచేరీ అవకాశం వచ్చింది. జానకిరామరాజు రప్పించాడు అనడం సబబు, నిజానికి. కచేరీ కోసం జనార్దనానికి కొత్త బట్టలు కొనడం మొదలు, వేదిక మీద ఎలా మసులుకోవాలో ఒకటికి పదిసార్లు చెప్పడం వరకూ, ఆహ్వాన పత్రికలు తయారు చేయించడం మొదలు ప్రముఖులందరినీ స్వయంగా వెళ్లి ఆహ్వానించడం వరకూ జానకిరామరాజు చేయని పనిలేదు.

కొత్తగా దొరికిన చీట్లపేక స్నేహితులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న నరసింహశాస్త్రికి జరుగుతున్నవాటిలో చాలా సంగతులు తెలియవు. కచేరీ రోజున ప్రేక్షకుల గేలరీలో మొదటి వరుసలో ఓ చివరికి కూర్చున్నారు నరసింహశాస్త్రి, మీనాక్షి.

"మీరు నా వెనుకే ఉండాలి గురువుగారూ.. నన్ను వదిలేసి ఎక్కడికీ వెళ్ళకండీ" వేదికెక్కే ముందు జానకిరామరాజుకి చెప్పాడు జనార్దనం. 'తంబురా అంతయినా లేని పిల్లాడు వీణ కచేరీ ఇస్తాట్ట' అన్న మాట ఊరంతా పాకిపోవడంతో కిటకిటలాడిపోయింది ఆడిటోరియం. వీణ ముందు కూర్చునే ముందు జానకిరామరాజు పాదాలకి భక్తిగా నమస్కరించాడు జనార్దనం.

ముందు వరుసలలో సంగీత పండితులు, వెనుకంతా సామాన్య జనం. తప్పులు వెతికే పనిలో ఒకరు. తప్పొప్పులతో సంబంధం లేకుండా ఆస్వాదించే వారు మరొకరు. కచేరీ పూర్తయ్యే సమయానికి ఉభయులూ మనస్పూర్తిగా కరతాళ ధ్వనులతో అభినందించారు జనార్దన శాస్త్రిని. మర్నాడు చాలా పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి ఆ వార్తని.

అటుపై, ప్రతి కచేరీలోనూ వేదికమీదే తొలిగురువు పాదాలకి భక్తిగా నమస్కరించడం అలవాటుగా చేసుకున్నాడు జనార్దనం. కచేరీ మధ్యలో జనార్దనం ఏమన్నా ఉద్వేగ పడితే, యిట్టే తెలిసిపోతుంది జానకిరామరాజుకి. ఆ క్షణంలో తన ఎడమ చేత్తో అతని వెన్ను నిమిరితే చాలు ఆ కుర్రాడు సాంత్వన పడతాడని బాగా తెలుసాయనకి. ప్రతి కచేరీలోనూ తొలివరుసలో చివరి రెండు సీట్లు మాత్రం నరసింహశాస్త్రి, మీనాక్షిలవే.

నిద్రపోయే సమయం తప్ప మిగిలిన సమయం అంతా దాదాపుగా వీణ ముందే గడుపుతున్నాడు జనార్దన శాస్త్రి. సంగీతం నేర్పే గురువులు సంబర పడిపోతున్నారు, ఆ కుర్రాడి ఉత్సాహం, గ్రహణ శక్తీ చూసి. పాఠాలు చెప్పే మేష్టర్లు మాత్రం ఏమంత ఉత్సాహంగా లేరు. జనార్దనానికి వీణ మీద ఉన్న శ్రద్ధ మిగిలిన పాఠాల మీద లేదు. ఏవి ఎలా ఉన్నా ఇంగ్లీషు మాత్రం తప్పనిసరిగా నేర్పాలన్నది జానకిరామరాజు ఆదేశం.

ఎనిమిదేళ్ళ తర్వాత నీళ్లోసుకున్న మీనాక్షి పండంటి మగ పిల్లాడిని ప్రసవించింది. కొడుక్కి మాధవ శాస్త్రి అని పేరు పెట్టుకున్నాడు నరసింహ శాస్త్రి. అతని ప్రమేయం లేకుండానే ఇల్లూ, వాకిలీ అమిరేయి.

విదేశంలో కచేరీ చేసొచ్చిన బాలమేధావి జనార్దనానికి పౌర సన్మానం ఏర్పాటు చేశారు పట్టణ ప్రముఖులు. జనార్దన శాస్త్రిని, అతని ప్రతిభని గుర్తించి, మెరుగు పెట్టి వెలుగులోకి తెచ్చిన జానకిరామరాజునీ పొగడ్తలతో ముంచెత్తారు. అంతే కాదు, వేదిక మీద జనార్దనంతో పాటు జానకిరామరాజుకీ ఘనంగా సన్మానం చేశారు. మొదటి వరుస చివరి ప్రేక్షకులిద్దరికీ ఒళ్ళు భగ్గున మండింది.

"కన్నవాళ్ళం మనం.. మనగురించి ఎవరికీ తెలీదు. సన్మానాలు మాత్రం ఆయనకీ.. అయినా మనవాడికుండాలి బుద్ధి," భార్య చెవిలో రుసరుసలాడాడాయన. "వాడికి కాస్త మంచీ చెడ్డా తెలియబరచాలి" అందామె, ఒళ్లో చంటి పిల్లాడికి పాలిస్తూ.

(కచేరీలో చిన్న విరామం)

8 కామెంట్‌లు:

 1. ఏదో ఇటు రాబట్టి సరిపోయింది కానీ.... ఆహ్వానం లేకుండానే కచేరీ మొదలెట్టారే!

  రిప్లయితొలగించండి
 2. బాగుందండీ... చూస్తుంటే ఏదొ జీవిత చరిత్ర రాస్తున్నట్లున్నారు.... చాలా బాగుంది తర్వాతి భాగం కోసం వైటింగ్.

  రిప్లయితొలగించండి


 3. @జ్యోతిర్మయి: ఎంతమాట! 'అందరూ ఆహ్వానితులే' కదండీ ఇక్కడికి :) ..ధన్యవాదాలు.
  @శర్మ: ధన్యవాదాలండీ..
  @నాగశ్రీనివాస: జీవితచరిత్ర కాదండీ, కథే! తర్వాతి భాగం (ముగింపు) సిద్ధం అవుతోంది.. ధన్యవాదాలు..

  రిప్లయితొలగించండి
 4. గోదారి ఒడ్డున వీణ కూడా గలగలా పలుకుతుందన్నమాట!! పరిపుష్టమైన పాత్రచిత్రణ.. అలవోకగా సాగిపోతున్న కథనం.. మహాభోగ్యంగా ఉందండీ 'నిక్వాణం'.

  రిప్లయితొలగించండి
 5. @కొత్తావకాయ: పట్టుకున్నారూ.. :)) ఏవూరి వీణయినా గలగలా పలుకుతుందండీ, పలికించే వాళ్ళని బట్టి.. కథనం నచ్చినందుకు సంతోషంగా ఉంది.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 6. నిక్వాణం - నెమలికన్ను తూలిక నుండి - గుండెల నిండా ఆర్ధ్రత ఆనందం నింపింది .... ;
  ;
  ]] nikwaaNam - nemalikannu tuulika numDi - gumDela nimDA Ardhrata, aanamdam nimpimdi

  రిప్లయితొలగించండి