సోమవారం, మార్చి 03, 2014

'అర్జున్' మంత్రం

తెలుగు టీవీ చరిత్రలోనే మొదటిసారిగా ఓ సంగీత కార్యక్రమం విదేశంలో చిత్రించారు ఈటీవీ 'పాడుతా తీయగా' బృందం. వ్యాఖ్యాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాద్య బృందం, తెరవెనుక సాంకేతిక నిపుణులు మరియు అతిధులు భారతదేశం నుంచి అతిధులుగా వెళ్ళగా, పోటీదారులందరూ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో స్థిరపడిన తెలుగువారు కావడం 'పాడుతా తీయగా' తాజా సిరీస్ 'అమెరికాలో రాగసాగరిక' ప్రత్యేకత!

అర్జున్ అద్దేపల్లి మొదటి విజేతగా నిలిచి పదివేల అమెరికన్ డాలర్లు బహుమతిగా అందుకున్న ఈ సిరీస్ లో, పుట్టపర్తి నారాయణాచార్యుల మనవరాలు వంశీప్రియ ద్వితీయ విజేతగా ఐదు వేల డాలర్లు గెలుచుకుంది. ఉదయబిందు, మనీషాలు మిగిలిన రెండు స్థానాల్లో నిలబడ్డారు. వీరిలో అర్జున్, మనీషాలు అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళు కాగా, వంశీప్రియ, ఉదయబిందు అక్కడికి వలస వెళ్ళిన తొలితరం తెలుగు వాళ్ళు. అర్జున్, మనీషా మాట్లాడుతున్నప్పుడు స్పష్టంగా వినిపించిన 'అమెరికన్ స్లాంగ్' వాళ్ళ పాటలో (ఎక్కడో తప్ప) వినిపించకపోవడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

నిజానికి ఈ కార్యక్రమం అమెరికాలో స్థిరపడిన తెలుగు వాళ్ళ గురించి మిగిలిన ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలని చెప్పింది. తెలుగు సంఘాల సహకారం లేనట్టయితే, ప్రవాసాంధ్రులు ఆదరించి ఉండకపోతే ఈ కార్యక్రమం నిర్వహించడం అసాధ్యం అయి ఉండేది ఈటీవీకి. వ్యయప్రయాసలతో పాటు ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించారు అనేకమంది ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమం కోసం. ఒక్కో రాష్ట్రం లోనూ రెండు నుంచి నాలుగు ఎపిసోడ్లు చొప్పున చిత్రీకరణ జరుపుకున్న ఈ కార్యక్రమం చూడడానికి టిక్కెట్లు కొనుక్కుని మరీ వెళ్ళారు అక్కడి తెలుగు వారు. (ఇండియాలో ఎంట్రీ పాసులు ఉచితం!)


వనరుల పరిమితి చాలాసార్లే కొట్టొచ్చినట్టు కనిపించింది. అతిధులు ఒక్కొక్కరూ ఆరు నుంచి ఎనిమిది ఎపిసోడ్ల పాటు కొనసాగడం, కొన్ని కొన్ని చోట్ల వేదిక మరీ ఇరుకిరుకుగా ఉండడం లాంటివి ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చూస్తున్న ప్రేక్షకుల దృష్టిని దాటిపోలేదు. పోటీకి వచ్చే ఔత్సాహికుల నాణ్యత గత కొద్ది సిరీస్ ల ధోరణి లోనే కొనసాగింది. స్థానికంగానే నాణ్యత తగ్గుముఖం పట్టినప్పుడు, విదేశంలో ఉన్న పరిమితులని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఆశించడం సరికాదనే అనిపిస్తుంది. అయితే, పాల్గొన్న గాయనీగాయకులందరూ తమని తాము మెరుగు పరుచుకోవడం మీద చాలా ఎక్కువ శ్రద్ధ చూపించారు. (నిజం చెప్పాలంటే, ఇండియా లో జరిగిన సిరీస్ లలో వారి కన్నా చాలా మెరుగ్గా)

గత సిరీస్ విజేత హరిణి పాడిన ఫ్యూజన్ తో ఆరంభమైన ఈ 'రాగ సాగరిక,' 'పాడుతా తీయగా' ప్రేక్షకులకి ఓ కొత్త ప్రపంచాన్ని చూపించింది. తెలుగుకి దూరంగా ఉండాల్సి వచ్చిన వారందరూ భాష మీద చూపించిన అభిమానం, ప్రేమ చూసేవారి దృష్టిని దాటిపోలేదు. ఉద్యోగాలు చేసుకుంటూ, ఇల్లు చక్కబెట్టుకుంటూ, పిల్లల్ని సముదాయించుకుంటూ కూడా సంగీతం కోసం సమయం కేటాయించుకోడం, 'పాడుతా తీయగా' బృందంతో పాటు రాష్ట్రాలన్నీ తిరగడం మామూలు విషయం కాదు. పాల్గొన్న గాయనీ గాయకులందరూ ఈ పనులన్నీ ఎంతో శ్రద్ధగా చేశారు. మంచులక్ష్మి అమెరికన్ యాసని విశాలహృదయంతో అంగీకరించేసిన 'బాలు'డు, ఎన్నారైల పాటల్లో చిన్న చిన్న ఉచ్చారణా దోషాలని సైతం క్షమించలేదు.

పరాయి నేల అన్న భావనో ఏమో తెలియదు కానీ, అతిధులతో బాలూ ఎప్పుడూ కన్నా మరింత ఎక్కువ చనువుగా ఉన్నారు. సునీత-బాలూ ల అతి పునరావృతం అయ్యింది సిరీస్ చివరి ఎపిసోడ్స్ లో. ఇబ్బంది పెట్టిన మరో విషయం పాటల ఎంపిక. ఈ విషయంలో నిర్వాహకులు ఏమాత్రం శ్రద్ధ చూపిస్తున్నట్టు లేరు. దాదాపు గత అన్ని సిరీస్ లలోనూ వినిపించిన పాటలే ఇప్పుడూ వినిపించాయి. చివరికి, ఫైనల్స్ ఎపిసోడ్ దీ అదే దారి. 'మది శారదా దేవి మందిరమే' 'హాయిహాయిగా' పాటలున్నాయి ఇందులో. ఈ పాటలు ఉండకూడదు అని కాదు, కానీ ప్రతిసారీ ఇవే పాటలా అనిపించేస్తోంది. తెలుగులో సినిమా పాటలకి లోటు లేదు కదా.. వచ్చే వారం నుంచీ చిన్న పిల్లల సిరీస్.. చాన్నాళ్ళ తర్వాత బుల్లి గళాలని వినొచ్చు మళ్ళీ!!

7 కామెంట్‌లు:

  1. ద్వితీయ స్థానం ఉదయబిందుకు దక్కిఉండాల్సిందేమో అనిపించింది.

    రిప్లయితొలగించండి
  2. సరిగ్గా చెప్పారు. కార్యక్రమం మీదా, బాలూ గారి మీదా ప్రవాసాంధ్రుల అభిమానం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఏన్నో ఏళ్ళుగా నిరాటంకంగా సాగుతున్న ఈ ధారావాహిక లో కొంచం కొత్తదనం కావాలి అనిపిస్తోంది, కొత్త పాటలో, కొత్త అంశాలో మరేదైనానో ఉంటే ఇంకా రక్తి కడుతుంది.

    రిప్లయితొలగించండి
  3. "సునీత-బాలూ ల అతి పునరావృతం అయ్యింది"

    అవునండీ,ఎప్పుడు ఈ అతికోకిల అక్కాయ్ వెళ్ళిపోతుందా అనిపించింది.బహుశా బాలుడికి అ.కో.అ ని చూసేటప్పటికి వెనకటి తరం గుర్తొస్తుందేమో మరి.

    మనీషా గొంతు ప్రత్యేకంగా ఉందండీ అందరిలోనూ

    రిప్లయితొలగించండి
  4. అర్జున్ కోసం ఈ ప్రోగ్రాం మిస్సవ్వకుండా చూసాను. నాకైతే మనీషా పాట కూడా బాగా నచ్చింది .సునీతా బాలూ గారి అతి కాస్త ఎక్కువ గానే కనపడింది .

    రిప్లయితొలగించండి
  5. అన్ని ఎపిసోడ్స్ చూడటం కుదరలేదు... మీరు వ్రాసింది చదివాక మొత్తం చూసినంత ఆనందంగా ఉంది... చాలా బాగా చెప్పారు.

    రిప్లయితొలగించండి
  6. @జలతారు వెన్నెల, సుభద్ర వేదుల, శ్రీనివాస్ పప్పు, రాధిక (నాని), వెంకటేశ్వర రావు, రాధిక: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి