గురువారం, మే 02, 2013

'నా అంతరంగ కథనం'

బుచ్చిబాబు రచనలని తలచుకోగానే లోతైన మనస్తత్వ చిత్రణ మనసులో మెదులుతుంది.. కథలైనా, నవలైనా కేవలం ఓసారి చదివేసి పక్కన పెట్టడం అన్నది బుచ్చిబాబు రచనల విషయంలో అస్సలు కుదరదు. అదే జాబితాలోకి వచ్చే మరో రచన 'నా అంతరంగ కథనం' పేరిట బుచ్చిబాబు వెలువరించిన ఆత్మకథ. నిజానికి ఇది పూర్తినిడివి ఆత్మకథ కాదు, తనకి ఊహ తెలిసిన నాటి నుంచి యవ్వనారంభ దశ వరకూ తన ఆలోచనా స్రవంతీ, తనకి ఎదురైన అనుభవాలు, తన చుట్టూ ఉన్న వాతావరణం వీటన్నింటినీ వివరంగా పొందుపరిచిన చిరు పుస్తకం ఇది. అయితేనేం, బుచ్చిబాబు అనేక రచనల తాలూకు మూలాలు ఆయన బాల్యంలోనే ఉన్నాయని చెబుతుందీ రచన.

"దానికీ దీనికీ ఏ సంబంధం లేకపోయినా మొదటి ప్రపంచ సంగ్రామం మధ్యలో ఏలూరులో నేను పుట్టినట్టు చెపుతుంది అమ్మమ్మ. ప్రపంచ సంగ్రామానికీ నా జననానికీ ఏ సంబంధమూ లేదని పూర్తిగా ఒప్పుకోలేను. యుద్ధం అంటే భయం నాకు. యుద్ధానికి వెళ్ళిన సైనికుడంటే హడలు. నలుగురు చేరి బిగ్గరగా తగవులాడుతుంటే అక్కడి నుంచి పారిపోతాను నేను. పెద్ద చప్పుడుకి తట్టుకోలేను. మోతగా తలుపులు మూసి గడియేసినా, ట్రంకు పెట్టె మూత దబ్బున మూసినా, తిన్న తర్వాత కప్పులో ప్లేట్లూ చప్పుడు చేస్తూ తీసినా, లారీ వేగంగా వెళ్ళినా, ఎవరైనా పని కూకలేసినా బాధ పడతాను..." అంటూ మొదలయ్యే ఈ ఆత్మకథ ఆసక్తిగా సాగుతూనే, అక్కడక్కడా ఆగి ఆలోచించమంటుంది.

పుట్టింది సంప్రదాయ కుటుంబంలోనే అయినా, తల్లిదండ్రులు ఇద్దరూ ఆధునిక భావాలు ఉన్నవాళ్ళు కావడం, మరీ ముఖ్యంగా తండ్రికి గారాల కొడుకు కావడం వల్ల అందమైన బాల్యాన్ని గడిపారు బుచ్చిబాబు. అసలుపేరు శివరాజు సుబ్బారావు.. కానీ అందరూ పిలిచిన పేరు 'బుచ్చి.' దీనికి 'బాబు' చేర్చి, మొదటిసారిగా 'బుచ్చిబాబు గారూ' అని పిలిచిన వారు చీరాల లో ఇంటి యజమాని. బుచ్చిబాబు తండ్రికి నీటిపారుదల శాఖలో ఒవర్సీయర్ ఉద్యోగం. పంట కాలువలు, లాకుల నిర్వహణ, ఎవరి పొలానికి ఎంతనీరు వదలాలి లాంటివి నిర్ణయించేది ఆయనే. రైతుల్లో మంచి పలుకుబడి ఉండేది ఆయనకి. అలా బుచ్చిబాబుకి యువరాజ భోగంతో గడిచింది బాల్యం.


తండ్రి ఉద్యోగంలో తరచూ జరిగే బదిలీల కారణంగా చిన్నతనంలో ఎన్నో ఊళ్లు తిరిగారు బుచ్చిబాబు. ఏవూరు వెళ్ళినా ఆయన స్నేహం కాలువలు, పొలంగట్లతోనే. చాలాచోట్ల 'చివరికి మిగిలేది' నాయకుడు దయానిధి, అమృతం సోదరుడు జగన్నాధం కనిపిస్తారు చిన్నప్పటి బుచ్చిబాబులో. అన్నట్టు, తన తల్లిదండ్రుల తమిళ స్నేహితురాలు 'కోమలి' పేరునే తన నవలలో ఒక నాయికకి పెట్టానని చెప్పారు. అంతేకాదు, కోమలి పాత్రమీద తనకి ఉన్న ఇష్టాన్ని గురించి చెబుతూ, ఆమె ప్రకృతికి దగ్గరగా కనిపిస్తుంది అంటారు బుచ్చిబాబు. చిత్రకళ మీద ఆసక్తి చిన్ననాడే మొదలయ్యింది బుచ్చిబాబుకి. కాలువ గట్ల మీద కూర్చుని స్కెచ్ లు గీయడాన్ని చాలాసార్లే గుర్తు చేసుకున్నారు.

అంతర్జాతీయ చిత్రకారుల పనితీరు గురించి నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి బుచ్చిబాబుకి. బాల్యంలో తనని ఆకర్షించిన దృశ్యాలు, తర్వాతి కాలంలో తను చూసిన వర్ణ చిత్రాల్లో ఏ చిత్రకారుడు చిత్రించిన వాటిలా ఉన్నాయో విశదంగా చెప్పారు. అంతేకాదు, ఆంగ్ల సినిమాలంటే కూడా బుచ్చిబాబుకి  ప్రత్యేకమైన ఆసక్తి. చార్లీ చాప్లిన్ అంటే ఆరాధన. చిన్నతనంలో తనది అగ్నిప్రమాదాలు చూసి సంతోషించే మనస్తత్వం అని చెబుతూ, స్కూలు పాకలు తగలబడి పోయిన సంఘటనని గుర్తు చేసుకున్నారు. చాలామంది పిల్లల్లాగే బుచ్చిబాబుకీ చదువంటే పెద్దగా ఇష్టం లేదు చిన్నప్పుడు. అయితే అందరు తల్లిదండ్రుల్లాగా ఆయన తల్లిదండ్రులు బలవంతంగా చదివించాలి అని ప్రయత్నం చేయలేదు.

బుచ్చిబాబు చిన్నప్పుడు ఆయన తల్లి జబ్బుపడ్డారు. ఇందువల్లే కావొచ్చు, తండ్రి దగ్గర చనువు చాలా ఎక్కువ బుచ్చిబాబుకి. కొంతకాలం పాటు దగ్గర బంధువుల ఇంట ఉండాల్సి వచ్చినప్పుడు, అక్కడి 'స్ట్రిక్టు' వాతావరణం ఎంతైనా ఇబ్బంది పెట్టింది ఆయన్ని. పుస్తకాలు చదవడం, స్నేహితులతో కలిసి సినిమాలు, నాటకాలు చూడడం.. ఇలా చిన్నప్పుడే సాహిత్యం మీదా, కళల మీదా ఆసక్తి ఏర్పడింది బుచ్చిబాబుకి. మొత్తం 112 పేజీలున్న ఈ పుస్తకం కేవలం బుచ్చిబాబు బాల్యం మాత్రమే కాదు. ఆయన ఆలోచనా స్రవంతి. బుచ్చిబాబు రచనలు కొన్నైనా చదివిన తర్వాత అప్పుడు ఈ పుస్తకం చదవడం బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చదివించే కథనం. (విశాలాంధ్ర ప్రచురణ, వెల రూ. 55, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

2 వ్యాఖ్యలు:

  1. Draaxaarasaanni okka sip cheyanicchi asampoorthiga asantruptigaa vadilesaaru Babu gaaru!Naaku chadivithe thanivi theeraka poorthy cheyananduku aathma kathakudimeeda chirukopam vacchindi!Something is better than nothing!..........Ani saripettukunnanu'Avunu mari em chestaam!

    ప్రత్యుత్తరంతొలగించు
  2. @సూర్య ప్రకాష్: అవునండీ... కొనసాగింపు రాసి ఉంటే చాలా బాగుండేది.. ... ధన్యవాదాలు

    ప్రత్యుత్తరంతొలగించు