శుక్రవారం, జనవరి 25, 2013

పరిమళించిన 'పద్మం'

పద్మానికి పరిమళం అబ్బింది. నీలి మేఘాలలో, గాలి కెరటాలతో కలిసిన ఆ పరిమళం పద్మానికి కొత్త గౌరవాన్నీ, సౌరభాన్నీ తెచ్చింది. అభిమాన స్వర రాణి ఎస్. జానకి కి కేంద్ర ప్రభ్వుతం కొంచం ఆలస్యంగానే అయినా 'పద్మభూషణ్' అవార్డుని ప్రకటించింది. గడిచిన యాభై ఐదేళ్లుగా సినీ సంగీతాన్ని అభిమానించే భారతీయులందరినీ తన స్వర మాయాజాలంలో కట్టి పడేసిన ఈ నిరాడంబర గాయనికి ఇన్నాళ్ళుగా పద్మ అవార్డు రాకపోవడం అన్నది, ఆ అవార్డుకే ఒక లోటు. ఇవాల్టితో అది తీరింది.

తన పందొమ్మిదో ఏట తమిళ, తెలుగు సినిమాలకి పాటలు పాడడంతో నేపధ్య గాయనిగా కెరీర్ ప్రారంభించిన జానకి వెనుతిరిగి చూసింది లేదు. కేవలం కథా నాయికకి మాత్రమే పాడాలనో, కేవలం ఒక తరహా పాటలు మాత్రమే పాడాలనో ఆమె పరిమితులు విధించుకోలేదు. తనకి వచ్చిన పాటని ఎంతబాగా పాడి మెప్పించ గలను అని మాత్రమే ఆలోచించారు. ఓ పక్క కథా నాయికలకి పాడుతూనే, మరోపక్క వ్యాంప్ పాత్రలకీ పాడారు జానకి.

"ఏం? ఈ పాటలు పాడకపోతే భోజనం దొరకదా?" లాంటి ఘాటైన విమర్శలకి లెక్కలేదు. వాటన్నింటికీ, మాటలతో కాక, పాటలతో మాత్రమే జవాబు చెప్పారు జానకి. అన్ని రకాల పాటలనీ పాడగలగడం, అన్ని రసాలనీ తన గొంతు అలవోకగా పలికించ గలగడం జానకికి దొరికిన వరాలు. వీటి ఫలితమే ఇరవై వేలకి పైగా పాటలు, నాలుగు జాతీయ పురస్కారాలు, లెక్కకు మిక్కిలిగా రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచే పది నంది అవార్డులు అందుకున్నారు జానకి.


ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ... దక్షిణ భారత సినీ సంగీతంలో ఈ త్రయం చేసిన ప్రయోగాలకి లెక్కలేదు. మరీ ముఖ్యంగా శృంగార రస ప్రధానమైన గీతాలకి బాలూ, జానకిల యుగళం పెట్టింది పేరు. దానికి లయరాజు స్వరాలు తోడైతే ఇక చెప్పేదేముంది.. 'మౌనమేలనోయి?' అన్న ప్రశ్న సర్రున దూసుకు వచ్చేయదూ. క్లిష్టమైన గమకాలని పలికించడమే కాదు, చిన్న చిన్న సంగతులతో పాటకి కొత్త అందం తేవడంలోనూ జానకి అందె వేసిన చేయి. ఆమె పాటలు వినేవాళ్ళకి ఈ విషయం ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు.

ఇళయరాజా ఆర్కెస్ట్రాలో ఎక్కువ పాటలు పాడిన రికార్డు జానకిది. అలాగనే ఆమె కేవలం కొందరు స్వరకర్తలకి పాడడానికే పరిమితమై పోలేదు. నాటి చలపతిరావు నుంచి, నేటి రెహ్మాన్ వరకూ ఎందరో సంగీత దర్శకుల స్వరాలకి ఆమె తన గళాన్ని అద్దారు. వర్ధమాన గాయకులకి రిఫరెన్స్ అనదగ్గ పాటలెన్నో జానకి ఖాతాలో ఉన్నాయి. అయితే, జానకిని అనుకరించడమే కాదు, అనుసరించడమూ కష్టమే. ఎందుకటే ఆమెది ఓ ప్రత్యేకమైన బాణీ. అనితర సాధ్యమైన వాణి.

టీవీల పుణ్యమా అని గత కొన్నేళ్లుగా గాయనీగాయకులు 'పాడడాన్ని' చూడగలుగు తున్నాం మనం. పాటకు అనుగుణంగా పాదం కదిపేవారూ, పాటతో సంబంధం లేకుండా విన్యాసాలు చేస్తూ పాడే వాళ్ళూ అనేక మందిని చూస్తున్నాం. తన గొంతులో ఎన్నెన్నో హొయలని ఒలికించే జానకి పాడడం చూసినప్పుడు మాత్రం "అసలీమె పెదాలు కదులుతున్నాయా?" అన్న సందేహం కలిగి తీరుతుంది. అలాగని పాడే పాటల్లో 'ఊపు' కి లోటు ఉండదు. అదో ప్రత్యేకమైన విద్య బహుశా.

పసిపిల్ల, పండు ముదుసలి, తొలి యవ్వనంలో ఉన్న బొంగురు గొంతు కుర్రవాడు... ఇలా ఎవరి గొంతునైనా ఇట్టే పట్టేసి, తనది చేసుకుని పాడడం జానకికి ఉన్న మరో ప్రత్యేకత. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడాన్ని మాటల్లో చెప్పకుండా, ఆచరణలో చూపడం ఆమె వ్యక్తిత్వానికి సూచిక. జానకి ఇంకా ఎన్నో, ఎన్నెన్నో పాటల్ని పాడాలనీ, అత్యున్నత పురస్కారాల్ని అందుకోవాలనీ మనస్పూర్తిగా కోరుకుంటూ, 'పద్మ' అవార్డు సందర్భంలో ఆమెకి హృదయ పూర్వక అభినందనలు.

6 కామెంట్‌లు:

  1. ఈ పద్మ పురస్కారాల కమిటీలో మన తెలుగువాళ్ళు ఉంటారు. ఆ తెలుగువాళ్ళకి తెలుగూ రాదు, ఇంగ్లీషూ రాదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పట్నుండీ హైద్రాబాదులో పెరిగారు మరి. ఎవడో రెకమెండేషన్ చేస్తే ఇలా కమిటీలో వచ్చి కూర్చుంటారు. మీ ఆంధ్రాలో ఎవరైనా ఉన్నారా అని ఛైర్మనో ఎవరో అడిగితే "లేరు" అనిచెప్పేసి అక్కడిచ్చిన ఫ్రీ మీల్సు మెక్కేసి రావడమే వాళ్లకి తెలుస్తుంది. అంతవరకు ఎందుకు లెండి. మన ఛీఫ్ మినిస్టర్ గారి తెలుగు మాట్లాడ్డం చూస్తే తెలియట్లేదా మన లాంగ్వేజీ, మనమూ ఎక్కడున్నామో?

    ఇది తెలుగు వాళ్ళు చేసుకున్న దౌర్భాగ్యం. ఈ దరిద్రం తమిళుల్లో కానీ, కన్నడిగుల్లో కానీ, వేరెవ్వరిలో కానీ కనిపించదు.

    ఈ తరం తెలుగు వాడినెవడినైనా (వయస్సు ఇరవై కన్నా తక్కువ ఉండాలి, ఈ తరం అంటే) పోతన రాసిన (అతి శులభమైన ద్రాక్షా పాకం సుమండీ) కింద ఇచ్చిన వచనం (పద్యం కూడా కాదు) అర్ధం చెప్పమనండి చూద్దాం?

    "ప్రదాత ఇగినూటి అర్ధ పరంపరా వామనంబై...

    (Bapu also got Padma Sri.. So this is a post on another blog copied here)...

    రిప్లయితొలగించండి
  2. జానకి గారికి అభిననదనలు.ఆవిడను సన్మానించడం కళ ను గౌరవించడమే

    రిప్లయితొలగించండి
  3. "ఈ నిరాడంబర గాయనికి ఇన్నాళ్ళుగా పద్మ అవార్డు రాకపోవడం అన్నది, ఆ అవార్డుకే ఒక లోటు."

    నిజం! nice post మురళి గారు!

    రిప్లయితొలగించండి
  4. @రాజ్ కుమార్ : ధన్యవాదాలండీ...

    @డీజీ: నిజమండీ.. మళ్ళీ మళ్ళీ నిరూపితమవుతున్న విషయం ఇది.. ...ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  5. @శశికళ: ధన్యవాదాలండీ..

    @కొత్తావకాయ: అవునండీ.. చాలా ఆలస్యంగా ప్రకటించారు కదా. ...ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి