శనివారం, జనవరి 05, 2013

నరుడు-జాజిమల్లి

అడివి బాపిరాజు రాసిన రెండు మినీ నవలలు నరుడు, జాజిమల్లి. రెంటినీ కలిపి ఓ సంకలనంగా వెలువరించింది విశాలాంధ్ర ప్రచురణాలయం. బాపిరాజు ఇతర సాంఘిక నవలలు నారాయణరావు, తుపాను, కోనంగి లతో పోల్చినప్పుడు ఈ రెండు నవలల్లోనూ స్పుటంగా కనిపించే భేదం ఒక్కటే. ఆ మూడు నవలల్లోనూ కథానాయకులు ఉన్నతాదాయ వర్గాల నుంచి వచ్చిన వారు కాగా, ఈ రెండు నవలల్లోనూ నాయకులు చాతుర్వర్ణ వ్యవస్థలో చివరి వర్గానికి చెందినవారు. అయినప్పటికీ వారు బాపిరాజు మార్కు కథానాయకులు. నల్లని వారైనా అందచందాల వారు, గుణ సంపన్నులు, అన్నింటినీ మించి గాంధీజీ భక్తులు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని జక్కరం గ్రామంలో ప్రారంభమవుతుంది 'నరుడు' కథ. ఆ ఊరి పురోహితుడు సుబ్రహ్మణ్య అవధానులు గారి ఇంట పాలేరు మాదిగ చంద్రయ్య. అతని కొడుకు ఎల్లమంద. సాటివారిలా కొడుకుని పనులకి పంపకుండా, చదువుకి పంపుతాడు చంద్రయ్య. ఎల్లమంద చదువు ఏ ఆటంకాలూ లేకుండా సాగి కాలేజీకి వస్తుంది. అదే సమయంలో మహాత్ముడి హరిజన ఉద్యమం పల్లెల్లోకి కూడా పాకడంతో, ఆ ఊళ్ళో వదాన్యులు కొందరు పూనుకుని ఎల్లమందని కాలేజీలో చదివించడానికి ముందుకు వస్తారు.

తన పుట్టుక కారణంగా వివక్ష ఎదుర్కొన్న ఎల్లమంద, ఫుట్ బాల్ ఆటలో తనకున్న ప్రావీణ్యం వల్ల కాలేజీ మొత్తంలో ఓ ప్రత్యేకత సాధించుకుని, మిత్రులని సంపాదించుకుంటాడు. (ఈ ఫుట్ బాల్ టోర్నమెంట్ సన్నివేశం మొత్తం - కించిత్ మార్పు చేర్పులతో - యండమూరి 'ఆనందోబ్రహ్మ' నవలలో కనిపిస్తుంది). ఇంజనీరింగ్ చదివిన ఎల్లమంద, ఎల్లమంద మూర్తి గా మారి ఆనకట్టల నిర్మాణం, జలవిద్యుత్ ఉత్పత్తి ల గురించి ఉన్నత చదువు నిమిత్తం విదేశాలకి వెడతాడు. (నీటి పారుదల, ప్రాజెక్టులు అనే అంశాలని స్పృశించిన తొలి తెలుగు నవల బహుశా ఇదే. ఈ మధ్య కాలంలో ఇదే అంశాన్ని విస్తృత కథా వస్తువుగా తీసుకుని 'దృశ్యాదృశ్యం' అనే చక్కని నవలని రాశారు రచయిత్రి చంద్రలత).


చదువు పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన మూర్తికి మహాత్ముడి ఉద్యమంలో పాల్గొనాలా లేక ఉద్యోగంలో చేరాలా అన్న ప్రశ్న మొదలవుతుంది. అదే సమయంలో తన స్నేహితుడి సోదరి, యురేషియన్ జాతి కన్య జెన్నిఫర్ తో మొదలైన పరిచయం ప్రేమగా మారుతుంది. వృత్తిరీత్యా వైద్యురాలు జెన్నిఫర్. యురేషియన్ లకి తెల్లని చర్మం ఉన్నా, వాళ్ళ జీవితాలు భారతీయ హరిజనుల కన్నా దారుణంగా ఉన్నాయని తెలుసు ఆమెకి. మూర్తి తన దేశంకోసం, తనవారి కోసం ఏం చేయగలిగాడు, మూర్తి-జెన్నిఫర్ ల ప్రేమకథ ఏ మలుపు తిరిగింది అన్నది ముగింపు. కేవలం తొంభై పేజీల ఈ మినీ నవల ఆసాంతమూ ఆపకుండా చదివిస్తుంది, ఆలోచనల్లో పడేస్తుంది. 

'గీతాదేవి' గా మారిన పద్మావతి కథ 'జాజిమల్లి.' పువ్వులని అమితంగా ప్రేమించే పద్మావతికి సంగీతం అన్నా ప్రాణం. భర్త బుచ్చి వెంకటరావు ఎండు చేపలు, రొయ్యపప్పు ఎగుమతి చేస్తూ బాగానే గడిస్తున్నాడు. మద్రాసు నగరంలో వారి నివాసం. పద్మావతి, వెంకట్రావుల స్వస్థలం నెల్లూరు జిల్లా. బెస్త కుటుంబం నుంచి వచ్చారు ఇద్దరూ. చిన్నప్పుడే మొగుడూ పెళ్ళాం అని పేరు పెట్టించేసుకున్న పద్దాలు, బుచ్చి వెంకులు ఒకటి కావడానికి మాత్రం కొంచం ఆలస్యం జరిగింది. ఈలోగా సైన్యంలో పని చేసి, ప్రపంచాన్ని చూసి వచ్చిన బుచ్చి వెంకులు బాగా బతకడం ఎలాగో తెలుసుకుంటాడు. పెళ్లి తర్వాత వారి మకాం కావలికి, అటుపై మదరాసు నగరానికీ మారుతుంది.

సంగీతం పట్ల పద్మావతికి ఉన్న ఆసక్తి గమనించిన వెంకటరావు ఆమెకి కర్నాటక సంగీతం నేర్పిస్తాడు. అంతే కాదు, చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యం అని నమ్మి ప్రైవేటుగా తను చదువుకుంటూ, పద్మావతినీ చదివిస్తాడు. సంగీతంలో పద్మావతికి యెంత పేరు వస్తుందంటే 'గీతాదేవి' అన్న బిరుదు అందుకుంటుంది ఆమె. సంగీత ప్రయాణం సాగుతూ ఉండగానే, వైవాహిక జీవితం పట్ల చిన్నగా అసంతృప్తి మొదలవుతుంది పద్మావతికి. వెంకటరావు తనకి తగిన వాడు కాదన్న భావన చిన్నగా మొదలై పెరిగి పెద్దది అవుతుంది.

సరిగ్గా అదే సమయంలో సినీ సంగీత దర్శకుడు రాధాకృష్ణ పరిచయం అవుతాడు ఆమెకి. పద్మావతి పాటనీ, అంతకన్నా ఎక్కువగా పద్మావతినీ ఇష్టపడతాడు అతడు. రెండు కుటుంబాల మధ్యా స్నేహం పెరిగాక, రాధాకృష్ణ భార్య సుశీలకి దగ్గరవుతాడు వెంకటరావు. ఆ రెండు జంటల కథా ఏయే మలుపులు తిరిగి ఏ తీరం చేరింది అన్నది నవల ముగింపు. ఎనభై ఏడు పేజీల మినీ నవల ఇది. ఎక్కడా ఆపకుండా చదివిస్తుంది. వెంకటరావు సైతం మహాత్ముడి అభిమాని. వ్యాపారంలో నీతిని పాటించే వాడు. తన కులాన్ని వృద్ధిలోకి తేవాలన్న తపన ఉన్నవాడు. కళా సంస్కృతుల పట్ల రచయిత బాపిరాజుకి ఉన్న మక్కువ రెండు నవలల్లోనూ కనిపిస్తుంది. (విశాలాంధ్ర ప్రచురణ, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

2 వ్యాఖ్యలు:

  1. 'నరుడు' చదవలేదు గానీ 'జాజిమల్లి' ఎందుకో నాకు నచ్చలేదండీ!

    ప్రత్యుత్తరంతొలగించు
  2. @చాణక్య: 'జాజిమల్లి' చదివారా మీరు?? అక్కడక్కడా కొంచం సినిమాటిక్ గా అనిపించింది నాకైతే... ధన్యవాదాలు

    ప్రత్యుత్తరంతొలగించు