మంగళవారం, జనవరి 01, 2013

ప్రవీణ్ గెలిచాడు...

మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 'పాడుతా తీయగా' సిరీస్ 'గ్రాండ్ ఫినాలే' చూస్తూ రెండువేల పన్నెండుకి వీడ్కోలు పలికి, రెండువేల పదమూడుకి స్వాగతం పలికాం మేము. సెమి-ఫైనల్స్ దశ నుంచీ ఊహిస్తున్నట్టే నెల్లూరుకి చెందిన యువ గాయకుడు ప్రవీణ్ కుమార్ ప్రధమ స్థానంలో నిలిచి మూడు లక్షల రూపాయల నగదు బహుమతి అందుకోగా, విజయవాడ అమ్మాయి చారుమతీ పల్లవి రెండో స్థానంలో నిలబడి లక్షరూపాయల బహుమానం అందుకుంది ఈటీవీ వారి నుంచి.

ఫైనల్స్ వరకూ ప్రవీణ్ కి గట్టి పోటీ ఇచ్చిన శరత్ సంతోష్ (హైదరాబాద్) మూడోస్థానం లోనూ, క్వార్టర్ ఫైనల్స్ నుంచీ తన ప్రతిభకి మెరుగు పెట్టుకుంటూ వచ్చిన విజయవాడ గాయకుడు సూర్య కార్తీక్ నాలుగో స్థానంలోనూ నిలబడ్డారు. గడిచిన సిరీస్ లతో పోల్చినప్పుడు, ఈ సిరీస్ చాలా ఆహ్లాదంగా సాగిందనే చెప్పాలి. ముఖ్యంగా అతిధులందరూ సంగీతానికీ పాట కీ సంబంధించిన వాళ్ళే కావడం వల్ల, సాంతమూ సంగీత ప్రధానంగానే సాగింది. ఇతరత్రా విషయాల ప్రస్తావన బహు తక్కువగా ప్రస్తావనకి వచ్చాయి.

అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు పై చేసిన కార్యక్రమం ఈ సిరీస్ కి హైలైట్ గా చెప్పాలి. అలాగే కార్తీక్, కల్పన లాంటి పరభాషా గాయకులూ అతిధులుగా హాజరయ్యారు. గాయనీ గాయకులు ఎంచుకున్న పాటలు సైతం వైవిధ్య భరితంగా ఉన్నాయి ఈసారి. మరీ ముఖ్యంగా క్వార్టర్ ఫైనల్స్ నుంచీ ప్రతి ఎపిసోడ్ లోనూ కనీసం రెండు మూడు పాటలన్నా అంతగా ప్రాముఖ్యం పొందని మంచి పాటలు వినిపించాయి. ఇది ఆహ్వానించాల్సిన పరిణామం. అలాగే, బాలూ-అతిథుల పరస్పర పొగడ్తలు ఉన్నప్పటికీ, పాటలు పాడిన వారికి ఉపయోగ పడే తగుమాత్రం సూచనలూ ఉన్నాయీసారి.


ప్రాధమిక దశ ఎంపిక ఈసారి కూడా ఆశ్చర్యం కలిగించింది. తొలి ఎపిసోడ్స్ లో నిష్క్రమించేది ఎవరో సులువుగానే అర్ధమైపోయింది. గత కొద్ది సిరీస్ ల నుంచీ ఇలా జరుగుతోంది ఈ కార్యక్రమంలో. అలాగని ఆంద్ర దేశంలో అవుత్సాహిక గాయకులు తగ్గిపోతున్నారని అనుకోలేం కదా. ఫైనల్స్ కి మిగిలిన నలుగురు గాయకుల్లో, శరత్ సంతోష్ బాల గాయకుడిగా జీ టీవీ వారి సంగీత కార్యక్రమం లో పాల్గొని ఫైనల్స్ వరకూ వచ్చాడు. ఆ అనుభవం అతనికి చాలా సార్లే ఉపయోగ పడింది. ఓ దశలో ప్రవీణ్ కి గట్టి పోటీ ఇచ్చిన శరత్, ఫైనల్స్ కి వచ్చేసరికి అనూహ్యంగా వెనుక బడ్డాడు.

శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉన్న ప్రవీణ్ లో చూడగానే ఆకట్టుకునేది పాట పట్ల అతని శ్రద్ధ. పాటలో లీనమై పాడే తీరు. అతను పాడుతున్నప్పుడు, పాటలో భావానికి అనుగుణంగా మారిపోయే శరీర భాష తెచ్చిపెట్టుకున్నది కాదనే చెప్పాలి. గ్రాండ్ ఫినాలే లో "ఈగ ఈగ ఈగ..." పాటని పాడిన తీరు అధ్బుతం అంతే. చారుమతీ పల్లవి ప్రత్యేకత ఆమె గొంతు. శాస్త్రీయ సంగీతమైనా, పాశ్చాత్య ధోరణి లో సాగే పాట అయినా ఆమె గొంతులో చక్కగా ఒదిగిపోతుంది. గ్రాండ్ ఫైనలే కి అతిధులుగా సంగీత దర్శకుడు ఉపద్రష్ట విద్యాసాగర్, 'డ్రమ్స్' శివమణి హాజరయ్యారు. వచ్చే సోమవారం నుంచి బాల గాయనీ గాయకులతో కొత్త సిరీస్.. ఎలా ఉంటుందో చూడాలి..

4 కామెంట్‌లు:

 1. నేను చారుమతి, ప్రవీణ్‌లలో ఒకళ్ళు వస్తారనుకున్నానండీ.. కానీ చివర రౌండ్స్‌లో స్పష్టంగా తెలిసిపోయింది, ప్రవీణ్‌దే ఈసారి టైటిల్ అని :))
  అవునండీ, ఈగ పాట మాత్రం అద్భుతంగా పాడాడు.. గూస్‌బంప్స్ అంతే!!

  రిప్లయితొలగించు

 2. అసలు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. చాలా మంచి ప్రోగ్రాం చూసిన తృప్తి మిగిలింది. వీరు నలుగురూ కూడా వజ్రపు తునకలే.

  రిప్లయితొలగించు
 3. ప్రవీణ్ ఈ మధ్య వచ్చిన గాయకులలో చాల మంచి గాయకుడు.గమకాలు అతని గొంతులో పలికే విధానం అద్భుతం.ఇక్కడ నాకు తెలిసిన ఒక విషయం చెప్పాలనిపించిందండి.పాడుతా తీయగా లో పాటల ఎంపిక గాయకులది కాదు.ఈటివి వారే ఎంపిక చేస్తారు.సెమి ఫైనల్ కి వెళ్ళిన అభ్యర్థి ద్వారా తెలిసింది .వాళ్ళుపాడిన ఒక్క పాట కూడా వాళ్ళు ఎంపిక చేసుకుంది కాదు.

  రిప్లయితొలగించు
 4. @నిషిగంధ: అవునండీ.. నేను కూడా ఆ పాట అవుతూనే అనుకున్నా "టైటిల్ పట్టుకుపోయాడు" అని... ధన్యవాదాలు

  @జయ: అవునండీ... చాలా బాగా జరిగింది ప్రోగ్రాం... ధన్యవాదాలు

  @శశి: పాటల ఎంపిక.... డూప్లికేషన్ లేకుండా వాళ్ళు కో-ఆర్డినేట్ చేస్తారు అనుకుంటున్నానండీ ఇన్నాళ్ళూ.. ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు