శుక్రవారం, ఆగస్టు 10, 2012

కాలుతున్న పూలతోట

వేర్వేరు నేపధ్యాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకి ఉన్నట్టుండి మృత్యువు అనివార్యంగా వచ్చి పడబోతోందని తెలిసింది. వాళ్ళిద్దరూ కూడా కేవలం మూడు పదుల వయసు దాటినవాళ్ళు. భవిష్యత్తుని గురించి ఎన్నో ఆశలు, కలలు ఉన్నవాళ్ళు. అయితే, త్వరలోనే చనిపోబోతున్నామని తెలిసిన మరుక్షణం జీవితాన్ని గురించి ఇద్దరి దృక్పధాల్లోనూ ఊహించని మార్పు వచ్చేస్తుంది. పెద్ద చదువులు చదివి, బ్యాంక్ ఆఫీసరుగా ఉద్యోగం చేస్తున్న కుమార్ జీవితాన్ని అంతం చేసుకునే మార్గాల అన్వేషణ మొదలుపెడితే, నిరక్షరాస్యురాలైన నాగమణి మృత్యువుని ఎదుర్కొనే మార్గాలు వెతుకుతుంది.

యవ్వనాన్ని పూలతోటతో పోలుస్తారు మన రచయితలూ కవులూ. అయితే ఆ పూలతోట కాలిపోతోంది అంటున్నారు యువ రచయిత సలీం. అలా కాలుస్తున్న అగ్ని పేరు 'ఎయిడ్స్'. కుమార్, నాగమణి ఇద్దరూ జీవితాన్ని గురించి తమ దృక్పధాలు మార్చుకునేలా చేసింది కూడా ఈ వ్యాధే. ఇంతకీ వీళ్ళిద్దరూ సలీం నవలలో పాత్రలు. సాహిత్య అకాడెమీ బహుమతి (2009) అందుకున్న ఆ నవల పేరు 'కాలుతున్న పూలతోట.' 2005-06 లో సలీం ఈ నవల రాసేనాటికి దేశమంతా చర్చలో ఉన్న సమస్య 'ఎయిడ్స్.' ఈ ఇతివృత్తంతో తెలుగులో వచ్చిన తొలి నవల ఇది.

భార్య మాధురి, ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతున్న కుమార్, అనుకోకుండా కాలేజీ నాటి స్నేహితురాలు సుధీరని కలుస్తాడు. కాలేజీలో సుధీరకి ప్రేమలేఖలు అందించిన అనేకమందిలో కుమార్ కూడా ఒకడు. ఊహించని విధంగా కుమార్ కి దగ్గరవుతుంది సుధీర. ఓ కాన్ఫరెన్స్ కోసం మద్రాస్ వెళ్ళిన కుమార్ అక్కడే మూడు రోజులు గడుపుతాడు సుధీరతో. నెల తిరక్కుండానే, ఆమె నుంచి వర్తమానం వస్తుంది కుమార్ కి. పెళ్ళికి దూరంగా ఉంటూ, తనకి నచ్చిన అందరితోనూ స్వేచ్ఛా జీవితం గడిపిన సుధీరకి ఎయిడ్స్ సోకిందనీ, ఆమె మరణానికి దగ్గరగా ఉందనీ సారాంశం. కుమార్లో మృత్యుభయం మొదలవుతుంది.


ఒంగోలు పట్టణంలో ఓ బస్తీలో ఉండే లారీ క్లీనర్ కోటయ్య. భార్య నాగమణి, కొడుకు శ్రీను. ఉన్నట్టుండి అనారోగ్యం బారిన పడతాడు కోటయ్య. ధర్మాసుపత్రికి తీసుకెళ్ళిన నాగమణి కి తెలిసిన విషయం ఏమంటే, కోటయ్యకి ఎయిడ్స్ సోకి మరణానికి దగ్గరగా ఉన్నాడనీ, తనూ, కొడుకూ కూడా హెచ్ ఐ వీ పాజిటివ్ అనీ. ఉన్న సమస్య చాలదన్నట్టు, ఓ టీవీ ఛానల్ వాళ్ళు కోటయ్యని ఇంటర్యూ చేసి, కనీసం అతని ముఖం దాచకుండా టీవీలో చూపిస్తారు. దీనితో బస్తీ జనం నాగమణి కుటుంబాన్ని అక్షరాలా బయటికి గెంటేస్తారు. మరో బస్తీకి మారితే అక్కడ కూడా టీవీలో చూసిన వాళ్ళు గుర్తు పట్టేయడం, అప్పుడే కోటయ్య మరణించడంతో - భర్త శవంతో రోడ్డున పడుతుంది నాగమణి.

సుధీర ద్వారా అనకి ఎయిడ్స్ సోకిందేమో అన్న భయం నిలువనివ్వదు కుమార్ ని. అలాగని ఆ విషయాన్ని భార్యకి చెప్పలేదు, డాక్టర్ని కలవలేడు, మిత్రుల సలహా తీసుకోలేడు. తనకి ఎయిడ్స్ ఉందని నలుగురికీ తెలిస్తే ఇన్నాళ్ళూ భద్రం దాచుకుంటూ వస్తున్న పరువు ఒక్కసారిగా పోతుందనీ, భార్య బిడ్డలు ఎయిడ్స్ రోగి తాలూకు మనుషులుగా ముద్రపడి దుర్భర జీవితం గడపాల్సి వస్తుందనీ..ఇలా ఎన్నో భయాలు. భార్యా పిల్లలని కనీసం తాకలేడు, తన జబ్బు వారికి అంటుకుంటుందనే భయంతో. తన శరీరంలో ఏ చిన్న మార్పు జరిగినా అది ఎయిడ్స్ సంకేతమే అనుకుంటూ, తను చిత్రవధ అనుభవిస్తూ, చుట్టూ ఉన్నవాళ్ళకి నరకం చూపించడం మొదలుపెడతాడు కుమార్. 

కుమార్, నాగమణిల కథలు ఏ కంచికి చేరాయన్నది 'కాలుతున్న పూలతోట' ముగింపు. నిజానికి కథ, కథనాల మీద కన్నా ఎయిడ్స్ ని గురించి వివరంగా చెప్పడానికే మొగ్గు చూపారు సలీం. ఫలితంగా, అనేక ప్రచార మాధ్యమాల ద్వారా ఇప్పటికే తెలిసిన విషయాలనే మరోసారి చదవాలి పాఠకులు. సంభాషణల్లో నాటకీయత, విషయాన్ని వివరించే తీరు వ్యాసరూపంలో ఉండడం.. ఇవి భాష మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పాయి. అయితే, ఎయిడ్స్ బాధితుల పట్ల సమాజం వైఖరి మారాల్సిఉందన్న విషయాన్ని గట్టిగా చెబుతుందీ నవల. 

"సాహిత్య అకాడెమీ బహుమతి అందుకున్న పిన్న వయస్కుడిని నేను. అంతే కాదు, నా మాతృ భాష ఉరుదూ. బహుమతి వచ్చింది తెలుగులో నేరాసిన నవలకి. మాతృ భాష కాని భాషలో చేసిన రచనకి ప్రతిష్టాత్మక బహుమతి అందుకున్న తొలి రచయితనీ నేనే," అన్న సలీం మాటలు చాలాసార్లే గుర్తొచ్చాయి, నవల చదువుతుండగా. (పేజీలు 232, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

5 కామెంట్‌లు:

  1. ఇంతకీ కొని చదవదగ్గదేనాండీ? మరీ వ్యాసరూప సమాధానంలా ఉంటుందా?

    రిప్లయితొలగించండి
  2. మురళీ గారు.. మంచి నవలా పరిచయం. అలా అప్పుడప్పుడు పుస్తకాల పరిచయం చదవకుంటే.. వెలితిగా ఉంటుంది. ఏం చదవాలో తోచనప్పుడు..నేను మీ బ్లాగ్ చూస్తాను. ఆ వెలితి తీరుతుంది. ధన్యవాదములు.

    పక్కింటి అబ్బాయి గారు...
    సాహిత్య అకాడెమీ బహుమతి అందుకున్న ఆ నవల... చదవడానికి బాగుంటుందనే అనుకుని చదువుతారు కదా!
    అవగాహన కల్గించడం కోసం వ్రాసినా పాత్రల స్వభావ చిత్రణ కోసం అయినా చదవ వచ్చు కదా ..:)

    రిప్లయితొలగించండి
  3. మురళిగారూ మంచి బుక్ గురించి చెప్పారు సలీం గారికి సాహితీ అవార్డ్ వచ్చిన నవల ఇది .
    రచాయిత నుండి అందుకున్న అదృష్టం దక్కింది నాకు ఈ నవలను సలీం గారు పంపార్. చాలా మంచి సందేశం ఉంది

    రిప్లయితొలగించండి
  4. @పక్కింటబ్బాయి: విషయం బాగా నలిగింది అవ్వడం ఒక డిసెడ్వాన్టేజ్ అండీ.. పాత్రల చిత్రీకరణ, వాటి సంఘర్షణ చిత్రించిన విధానం బావుంది.. అకాడెమీ అవార్డు ఆకర్షించే విషయం.. ధన్యవాదాలు..
    @వనజ వనమాలి: ధన్యవాదాలండీ..
    @మెరాజ్ ఫాతిమా: సలీం గారి కథలు కొన్ని చదివానండీ.. బాగున్నాయి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. balanced review. నేను ఈ మధ్యనే చదివాను

    రిప్లయితొలగించండి