మంగళవారం, ఆగస్టు 28, 2012

మంగళసూత్రం

కిక్కిరిసిన కళ్యాణ మండపంలో, జూనియర్ ఆర్టిస్టుల సాక్షిగా పెళ్ళికొడుకు హీరోయిన్ మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. ఇంతలో ఉన్నట్టుండి "ఆపండీ పెళ్ళి" అని వినిపిస్తుంది, పెళ్ళికొడుకుతో సహా అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరుగుతారు..ఇలాంటివి కొన్ని వందల సన్నివేశాలు.. హీరోయిన్ మెడలో విలన్ బలవంతంగా తాళి కట్టేయబోతూ ఉంటే, హీరో అదాటున వచ్చి విలన్ చేతిమీద కొట్టి హీరోయిన్ని రక్షించేస్తాడు...ఈ తరహా సీన్లు బోలెడన్ని.

నాయికని అల్లరి పెట్టబోతున్న విలన్ గుంపుని నాయకుడు చెదరగొడుతుంటే, అమ్మవారి విగ్రహం మెడలో మంగళసూత్రం నాయకుడి చేతిమీదుగా నాయిక మెడలో పడుతుంది. అక్కడినుంచీ, దైవసాక్షిగా అతనే ఆమె భర్త...ఇలాంటివీ అనేకానేక సన్నివేశాలు. మన తెలుగు సినిమాలు మంగళసూత్రానికి ఇచ్చిన ప్రాముఖ్యత ఇది. అతగాడు ఆమె మెడలో తాళి కడితే, ఆమె ఇక అతని పాదాల చెంత చోటు వెతుక్కోవలసిందే. శేష జీవితాన్ని అతని సేవలో తరియింప జేయాల్సిందే.

క్లైమాక్స్ కన్నా ముందు తెరమీద పెళ్ళి కనుక జరుగుతున్నట్టాయనా, తాళి సన్నివేశంలో "ఆగండి" అనే డవిలాగు వినడానికి సిద్ధ పడిపోతాం మనం. ఇంతకీ సినిమాలకి సంబంధించి మంగళ సూత్రం అంటే కథని మలుపు తిప్పే ఒకానొక వస్తువు. కానైతే, ఇదంతా నిన్న మొన్నటి విషయం. ఇప్పటి సినిమాల్లో పెళ్ళి సన్నివేశాలు ఎలాగైతే పెద్దగా ఉండడం లేదో, కథలు కూడా అలాగే మంగళసూత్రం చుట్టూ తిరగడం లేదు. మన సిని రచయితలకీ, దర్శకులకీ 'మంగళసూత్రం' అవుట్ డేటెడ్ సబ్జక్ట్ అయిపోయినట్టుంది.

"ఇదివరకు ఆడపిల్లల మెడ చూస్తే పెళ్లయ్యిందో, కాలేదో తెలిసేది. ఇప్పుడా వీలు కుదరడం లేదు," ఈమధ్యన కొంచం తరచూ వినిపిస్తున్న మాట ఇది. ఓ పెద్దాయన ఇదే మాట అంటే ఉండబట్టలేక "ఇప్పటి వాళ్ళవి చంద్రమతీ మాంగల్యాలు అయి ఉంటాయి లెండి," అని గొణిగాను. నా ఉద్దేశం అర్ధమయ్యో, కాకో ఆయన ఓ నవ్వు నవ్వారు. చంద్రమతి మాంగల్యం కేవలం హరిశ్చంద్రుడికి మాత్రమే కనిపించేది కావడం, ఈ కారణానికే కాటికాపరి వేషంలో ఉన్న హరిశ్చంద్రుడిని చంద్రమతి గుర్తించ గలగడం తెలిసిన కథే కదా.

వారం తిరక్కుండానే, మిత్రులొకరితో 'మంగళసూత్రం' అనే విషయం మీద కొంచం సుదీర్ఘమైన సంభాషణ జరిగింది. మంగళసూత్రాన్ని గౌరవించడానికీ, అది కట్టిన వాడిని గౌరవించడానికీ పెద్దగా సంబంధం లేదన్నది అంతిమంగా తేలిన విషయం. కొంచం తీరిక దొరికి, మంగళసూత్రాన్ని గురించి 'తెవికీ' ఏం చెబుతోందా అని వెతికాను. "వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు కలవు. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు కలవు."

మరికాస్త ముందుకు వెడితే, "మంగళ సూత్రము భార్యా భర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడులనుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం.శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు" అని కనిపించింది. 'వైవాహిక జీవితంలోని సమస్త కీడులని తొలగిస్తుంది' అని భావం కావొచ్చు. వెనకటి తరాల్లో, ఈ మంగళ సూత్రాన్ని గురించి చాలా పట్టింపులే ఉండేవి.

కాలంతో పాటు మార్పు సహజం. నమ్మకాల్లో మార్పు రావడం మరింత సహజం. కాబట్టి, మంగళసూత్రాన్ని కేవలం ఓ అలంకారంగా భావించడాన్ని తప్పు పట్టలేం. ఇంకా చెప్పాలంటే ఇది పూర్తిగా వ్యక్తిగత విషయం. ధరించాలా, వద్దా అన్నది వారి వారి ఇష్టాయిష్టాల మీద ఆధార పడి ఉంటుంది. పెళ్లికి కావాల్సింది మొదట మనసు, తర్వాతే మంగళసూత్రం. నిజానికి మంగళసూత్రం లేకుండా పెళ్ళి చేసుకునే పద్ధతులు చాలానే ఉన్నాయి. కానీ, మనసు లేకుండా జరిగే మనువుల్ని కేవలం మాంగల్యం నిలబెట్టగలదా అన్నది బహు చిక్కు ప్రశ్న. "మాకు పుట్టిన ఇద్దరు పిల్లలూ  మా పెళ్లికి సాక్ష్యం. వేరే రుజువులు, సాక్ష్యాలు అవసరమా?" అన్న స్నేహితురాలి ప్రశ్న గుర్తొస్తోంది, ఇది రాస్తుంటే.

19 కామెంట్‌లు:

 1. అదృష్టవంతులు... తెవికీ లో కనీసం మీకు ఏదో ఒకటైనా కనిపించింది. నేను ఎప్పుడు దేనికైనా చూస్తే " ఫలానా పదం మిద ఓ పేజీ సృష్టించు..." అనే సందేశమే వస్తూంటుంది.....

  రిప్లయితొలగించు
 2. చాలా చక్కగా చెప్పారు.
  మనసులు కలిసిన మనువుకి మంగసూత్రంతో పనిలేదండి.

  రిప్లయితొలగించు
 3. ఆడవాళ్ళకి పెళ్ళైంది అని తెలిసే ఐడెంటిటీ మంగళసూత్రంలాగానే మగవాళ్ళకి కూడా ఉండిఉంటే ఇలా బహుశా మరుగున పడేదికాదేమోనండి ఇది:-)

  రిప్లయితొలగించు
 4. టీవి లో ధర్మ సందేహాలు వస్తాయి అందులో ఒకరు చెప్పిన విషయం . మంగళ సూత్రం వేసుకోవాలా , మూడు ముళ్ళు ఉండాలా ? రెండు ఉంటే తప్పా ? అని ప్రశ్నించారట
  దానికి ఆతను చెప్పిన సమాధానం . ఇది మన సప్రదయం . మన సంప్రదాయం లో పెళ్లి ఇలా ఉండాలి.. ఇలా మంగళ సూత్రం కట్టుకోవాలి అని ఉంది. సంప్రదాయం ౫౦ శాతం మాత్రమే పాటిస్తాను అంటే అది నీ ఇష్టం, 75 శాతం పాటిస్తాను అంటే అది వారిష్టం . పద్ధతి ఎలా ఉందో చెప్పడం మా ధర్మం .. పాటించడం పాటించక పోవడం మీ ఇష్టం అని చెప్పారు . మంగళ సూత్రం కట్టిన తరువాత బాద్యత లేకుండా ఉండే మగాళ్ళు ఎంతో మంది ఉన్నారు . అలా అని దానికి విలువ లేదని చెప్పలేం. సంప్రదాయాలను అవకాశం ఉన్నత వరకు పాటిస్తే మంచిది . పాటించం అంటే వాళ్ళిష్టం

  రిప్లయితొలగించు
 5. నమ్మకం సంగతేమో కానీ మురళి గారూ ఇలా పోస్ట్ ఓపెన్ చేసి మంగళసూత్రం అన్న పదం వరకూ వచ్చేసరికి ఒక పెళ్ళికి సంబంధించిన శుభవార్త వచ్చింది ఫోన్ లో.మీకూ మీ పోస్టుకీ మంగళసూత్రానికీ దానిమీద ఉండాల్సిన నమ్మకానికీ వందనాలు. (ఇంక పోస్ట్ గురించి మీరెన్నుకునే కధా వస్తువు ఏదయినా దాన్ని చెప్పే తీరు మాత్రం ఎప్పుడూ ప్రత్యేకమే,అద్భుతమే అని చెప్పాల్సినందేనండీ నాబోంట్లకు.)

  రిప్లయితొలగించు
 6. మురళి గారు, ఎవరి ఇష్టం వారిది అనుకోండి, కానీ వైదిక సంప్రదాయం మీద నమ్మకం లేనప్పుడు అనవసరంగా వైదిక పద్ధతిలో వివాహం మాత్రం ఎందుకు చేసుకోటమో అర్థం కాదు. హాయిగా ఏ రిజిస్టర్ మారేజో చేసుకుంటే తల్లిదండ్రులకి కనీసం ఎనిమిది పది లక్షల క్షవర ఖర్మ తప్పుతుంది కదా. ఎటూ పెళ్ళి ఐంది అన్నదానికి సాక్ష్యంగా పిల్లలు ఉంటారు కదా :)

  రిప్లయితొలగించు
 7. మీ పోస్ట్ బాగుంది. మంగళసూత్రం పవిత్రత తెలియక చాలామంది వేసుకోవట్లేదు.పెద్దవారు పిల్లలకి చెప్పాలి.లేకపోతే అది కూడా ఒక గొలుసు అనుకుంటున్నారు తప్ప దాని విలువ తెలుసుకోవడం లేదు.మన సంస్కృతి మనకే సరిగ్గా తెలియదు ఇంకా పిల్లలకేం చెపుతాం అన్నట్లుంది నీటి సమాజం.again a nice post

  రిప్లయితొలగించు
 8. మేము కాలేజ్ లో వున్నప్పుడు ఒక అమ్మాయి మెళ్ళోని గొలుసు మంగళసూత్రం తో సహా తెంపుకుపోయాడో దొంగ. అప్పుడు ఆ అమ్మాయి భర్త , మంగళసూత్రం మీదే శ్రధధలేని దానివి నామీదేమి శ్రధ్ధ వుంటుంది అని పుట్టింటి కి పంపేసాడట . అప్పుడు మా కాలేజీ లో ఇదో పెద్ద టాపిక్ ఐపోయింది :)

  ఈ కాలం లో పదహారు రోజుల వరకు కూడా మంగళ సూత్రం వుంచుకునేవాళ్ళు తక్కువే ! ఏమి చేస్తాం , కాలం తో పాటు సద్దుకుపోవటమే :)

  రిప్లయితొలగించు
 9. కాలం మారింది. మంగళ సూత్రం విలువ తగ్గలేదు. దాని చుట్టూ అల్లుకున్న సెంటిమెంట్లే రూపం మార్చుకున్నాయి. ఇపుడు ఏ భార్యా, భర్త కాళ్ళ దగ్గర కాస్త చోటు వెతుక్కోవట్లేదనుకోండి. బ్రతుకు చిత్రం మారింది. అంతగా ఆధారపడే భార్య ను భర్తలూ భరించలేకపోతున్నరనుకుంటాను. ఇంకా మార్పు రావాలి కూడానూ. మంగళ సూత్రం ఒక్కటే ప్రమాణం కాదు కదా. వైవాహిక బంధం లో మిగిల్న పెళ్ళి నాటి ప్రమాణాలు కూడా బహు ముఖ్యం. వాటి విలువ తగ్గిందా.. ఇక పెళ్ళి లో పవిత్రత అనేది గోవిందా.

  రిప్లయితొలగించు
 10. మంచి విషయం ఎంచుకున్నారు. నొప్పించక తానొవ్వక అన్నట్టు తప్పించుకున్నారు కూడా "( నే కనిపెట్టేసాను) .

  రిప్లయితొలగించు
 11. నేను సినిమాపెళ్లిళ్లలో తాళికట్టే సమయానికి వచ్చి "ఆపండి" అన్న సన్నివేశాన్ని చూసి నా చిన్నతనం నుంచే ఆశ్చర్యపోతుండేవాణ్ణి. ఎందుకంటే నా లెక్కల్లో అప్పటికే పెళ్లైపోతుంది. .... నేను చూసిన తెలుగువారి పెళ్లిళ్లన్నింటిలో ప్రాంత, కుల భేదాలు లేకుండా సుముహూర్తానికి జీలకర్రా బెల్లం పెట్టిస్తారు. అంటే జీలకర్రా బెల్లం పెట్టగానే పెళ్లైపోతుందన్న మాట ఆ తర్వాతెప్పుడో తాళి కడ్తారు. మరి ఈ మాత్రం విషయం ఈ సినిమా రచయితలకీ, దర్శకులకీ పట్టదా అనుకుంటూంటాను.
  పైగా తాళికట్టేప్పటికే హీరోయిన్ కి పెళ్లైపోయింది అన్న భావనతో నాకు సినిమాలో కూడా రసాభాస అయిపోయి తర్వాతి సన్నివేశాలంతగా ఆనందించలేకపోయేవాణ్ణి. ఈ మధ్య ఆ "తాళి కట్టే వేళ పెళ్లి ఆపుట" అన్న సన్నివేశాలు రాకపోవడంతో హాయిగా ఉన్నాను.

  రిప్లయితొలగించు
 12. ఇప్పుడు అలంకారమే కావచ్చు.
  ఒకప్పుడు తాళి ఆడవాళ్ళ కనీసపు ఆస్తి, తాకట్టు పెట్టుకోవడానికి.

  రిప్లయితొలగించు
 13. చంద్రమతీ మాంగల్యం...:) బాగుంది మురళిగారు మీరు చమత్కరించిన విధం :)
  ఒక్క మంగళసూత్రం విషయంలోనేకాదు, ఇంకా చాలా విషయాల్లో పట్టింపులు ఉండేవట! మంగళ సూత్రం లేకుండా భర్తకు ఎదురుపడకూడదని, మట్టిగాజులు లేకుండా భోజనం వడ్డించకూడదని, మెట్టెలు లేకుండా గడప దాటకూడదని...ఇలా అన్నమాట! మీరన్నట్టు గౌరవించడం, మానేయడం వారి వారి వ్యక్తిగతం అనుకోండి.పెళ్ళికి పిల్లలు సాక్ష్యంఎలా అవుతారండి.సహజీవనం వల్లకూడా పిల్లల్ని కంటున్నరోజులివి.ఏది ఏమైనా ఇంకా మంగళసూత్రాన్ని గౌరవించేవాళ్ళు లేకపోలేదు సుమండీ!

  రిప్లయితొలగించు
 14. కాదేదీ టపాకనర్హం అని మరోసారి నిరూపించారు కదా! చక్కని టపా.

  స్త్రీ వ్యక్తిగత నిర్ణయానికి విలువ ఇవ్వాల్సిన ఎన్నో విషయాల్లో మంగళ సూత్రం మొదటిదండీ. దానికీ, కట్టిన వ్యక్తిపై ఉండే గౌరవానికీ ఏ సంబంధం లేదన్నదైతే పచ్చినిజం. పూల దండలు, కర్పూర కళికలు కావాలని మగవారూ ఆశించడం లేదేమో కదా. :)

  సహజీవన మాధుర్యాన్ని ఆస్వాదించగలిగే జంటకి ఋజువులూ సాక్ష్యాలుగా కాకుండా, ఓ తీపి గురుతుగా మాత్రమే మంగళసూత్రం అవసరమవుతుందేమో. IMHO

  రిప్లయితొలగించు
 15. @హరేఫల: ధన్యవాదాలండీ..
  @సృజన: ధన్యవాదాలండీ..
  @పద్మార్పిత: అంతేనంటారా?!! ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 16. @బుద్దా మురళి: "పాటించడం వాళ్ళిష్టం" ..అంతేనండీ.. ధన్యవాదాలు..
  @పప్పు శ్రీనివాసరావు: అయ్య బాబోయ్.. యెంత మాటా!! ధన్యవాదాలండీ..
  @లక్ష్మి: పెళ్లి ఖర్చు కేవలం తాళి కోసం మాత్రమె కాదు కదండీ.. తాళిబొట్టు ఆచారం లేని పెళ్ళిళ్ళలోనూ ఖర్చు తక్కువగా ఏమీ ఉండడం లేదు కదా.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 17. @స్వాతి: ధన్యవాదాలండీ..
  @మాలాకుమార్: ఇప్పటికీ అలాంటి వాళ్ళు ఉన్నారండీ.. ధన్యవాదాలు.
  @సుజాత: నిజం..నిజం..నిజం.... ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 18. @మీ ఇంటి ఆడపడుచు: :-) :-). ..ధన్యవాదాలండీ..
  @పక్కింటబ్బాయి: మంచి పాయింట్.. కానీ మన సినిమా వాళ్ళ దృష్టిలో పెళ్లి అంటే తాళి కట్టడం మాత్రమే కదండీ.. ధన్యవాదాలు.
  @బోనగిరి: తాకట్టు.. అది కూడా మగవాడు పెట్టకుండా వదిలితే, అప్పుడు కదండీ.. ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు
 19. @పరిమళం: అవునండీ... తెలుసు అవన్నీ.. ఇవీ చూస్తున్నాను.. వ్యక్తిగత ఇష్టానికి సంబంధించిన విషయం కదండీ ..ధన్యవాదాలు.
  @కొత్తావకాయ: మిగిలిన అన్ని విషయాల్లాగే ఇది కూడా 'అండర్ స్టాండింగ్' కి సంబంధించిన విషయం అనుకోవాలేమోనండీ.. ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు