"అందరికీ శకునాలుచెప్పే బల్లి తను వెళ్లి కుడితిలో పడిందిట.." బామ్మ నోట ఈ సామెత ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు చిన్నప్పుడు. ఇవాళ పదేపదే గుర్తొచ్చిన సామెత ఇది. యాదృచ్చికంగా చూసిన రెండు టీవీ కార్యక్రమాలు ఇందుకు కారణం. టీవీ ఛానళ్ళు మారుస్తూ బాపూ సినిమాల్లోని పాటలు వస్తుంటే 'స్టూడియో ఎన్' దగ్గర ఆగాను మధ్యాహ్నం. బహుశా ముళ్ళపూడి వెంకట రమణకి నివాళిగా ఏదన్నా కార్యక్రమం ప్రసారం చేస్తున్నారేమో అనుకున్నాను మొదట.
అయితే, వ్యాఖ్యానం చూశాక అర్ధమయ్యింది ఏమిటంటే, కనుమరుగైపోతున్న తెలుగు వారి కట్టూ బొట్టూ పట్ల ఆ చానల్ వారు తీవ్ర ఆవేదన వెలిబుచ్చుతూ చేసిన కార్యక్రమం అని. వారి ప్రకారం ఇప్పుడు స్కూళ్ళలోనూ, కాలేజీల్లోనూ, కార్యాలయాలలోనూ ఎక్కడా కూడా మహిళల వస్త్రధారణ, అలంకరణ మన సంస్కృతిని ప్రతిబింబించడం లేదు. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఫ్యాషన్ల వెంబడి పరుగులు తీస్తున్నారు తప్ప, సంస్కృతిని పట్టించుకోవడం లేదు.
టీవీ చానళ్ళు ఏ కార్యక్రమం చేయాలన్నా అందుకు ముడి సరుకు సినిమా తప్ప మరొకటి లేదు కాబట్టి, ఈ కథనానికి కూడా జతగా కొన్ని సినిమా పాటల క్లిప్పింగులని వాడుకున్నారు. దర్శకులు బాపూ, వంశీలకి తెలుగు వారి కట్టూ బొట్టూ అంటే యెంతో మమకారం అని చెబుతూ, వారి సినిమాల్లో పాటల క్లిప్పింగులు కొన్ని ప్రసారం చేశారు. అలాగే ఇప్పటి తాజా సినిమాల్లో తారల వస్త్రధారణ గురించి ఆందోళన చెందుతూ అర్ధనగ్న క్లిప్పింగులనీ పనిలో పనిగా ప్రసారం చేసేశారు.
అంతటితో ఊరుకోకుండా, ఇప్పుడందరూ పరభాషా తారలే కాబట్టి వారు తెలుగు అలంకరణని వాళ్లకి ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే చేసుకుంటున్నారనీ, అదికూడా పూర్తిగా కాకుండా, కొంతమేరకేననీ కూడా గమనించేశారు. "ఇలా అయితే తెలుగు సంస్కృతి నిలబడేదెలా?" అని ఆవేదన చెందేశారు కూడా. ఈకార్యక్రమం చూడగానే నాకు విపరీతంగా నవ్వొచ్చింది. ఎందుకంటే, సదరు కార్యక్రమాన్ని ప్రెజెంట్ చేసిన యాంకర్ పేరుకి చీర కట్టుకున్నా, ఇతరత్రా ఏ రకంగానూ కూడా తెలుగు అలంకరణ చేసుకోలేదు.
నేటి తెలుగు నాయికలు జడ వేసుకోడం లేదనీ, వోణీలని మరిచిపోయరానీ అరగంట సేపు ఆవేదన చెందిన ఆ యాంకర్ కూడా జడ వేసుకోలేదు. తూర్పు కొండల మధ్యన ఉదయించే సూర్యుడిలాంటి బొట్టూ కనిపించడం లేదు మన నాయికలకి అని చెప్పినావిడ నుదిటి మీద ఎంత పరకాయించి చూసినా బొట్టు కనిపించ లేదు నాకు. ఇక ఆవిడ చదివిన స్క్రిప్టులో తెలుగు పదాలని వెతికి పట్టుకోవడం చాలా కష్టమైపోయింది. మరి ఈ కార్యక్రమం చూశాక బామ్మ చెప్పిన సామెత గుర్తు రాకుండా ఎలా ఉంటుంది?
ఈ కార్యక్రమం చూడ్డానికి కొన్ని గంటల ముందే ఉదయాన అనుకోకుండా టీవీ తొమ్మిది దగ్గర కాసేపు ఆగాను. రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ లాంటి చర్చ. నిన్ననో, మొన్ననో ఆయన ఆ ఛానల్ మీద దావా వేసినట్టు ఎక్కడో చదివాను. ఆ నేపధ్యంలో, కార్యక్రమం ఏమై ఉంటుందా అని కాసేపు చూశాను. దావాకి కారణమైన తమ వివాదాస్పద ప్రోగ్రాం ని సమర్ధించుకోడానికి శతవిధాల ప్రయత్నించారు యాంకర్. "నా సినిమాలని ఏమన్నా అనండి. కానీ నావి కాని ఉద్దేశాలని నాకు ఆపాదించడం మానండి" అని మళ్ళీ మళ్ళీ చెప్పారు రాంగోపాల్ వర్మ.
"మీరీ వివాదం చేస్తున్నది మీ తదుపరి సినిమాని ప్రమోట్ చేసుకోడానికే కదా?" అని యాంకర్ తెలివిగా ప్రశ్నిస్తే, "నా సినిమా పబ్లిసిటీ కన్నా, మీ చానల్ కి పెరిగే టీఆర్పీ రేటింగే ఎక్కువ" అని అంతకన్నా తెలివిగా జవాబిచ్చారు వర్మ. మధ్యలో యండమూరి కలగజేసుకుని వర్మకి ఏదో సలహా ఇవ్వబోతే, దానిక్కూడా తీవ్రంగా స్పందించారు వర్మ. మెరుగైన సమాజం కోసం చర్చని హడావిడిగా ముగించారు ఛానల్ వారు.