మంగళవారం, డిసెంబర్ 08, 2009

పా

అతనో పన్నెండేళ్ళ కుర్రాడు.. తెలివైన వాడు, చురుకైన వాడు.. యెంత పెద్ద లేక్కనైనా క్షణంలో చేసేస్తాడు.. తన క్రియేటివిటీ ఉపయోగించి తయారు చేసిన మోడల్ కి స్కూల్ ఎగ్జిబిషన్ లో ప్రైజు గెలుచుకుంటాడు. ఐతే ఆ కుర్రవాడు పుట్టుకతోనే వృద్ధుడు.. జన్యు పరమైన లోపాల వల్ల కలిగే ప్రోజేరియా అనే వ్యాధి బారిన పడ్డాడు, పుట్టుకతోనే.. ఆ కారణంగానే అతని రూపు రేఖల్లో బాల్యానికి బదులు వృద్ధాప్యం కనిపిస్తుంది.. రూపం లో వృద్ధుడైనా చేతల్లో అతను పసివాడు.. స్నేహితులతో ఆడి పాడతాడు.. ఇంట్లో అమ్మ మీద అలుగుతాడు, అమ్మమ్మ ని ఏడిపిస్తాడు.. అబ్బో అతని అల్లరికి అంతే లేదు.. ఆ కుర్రాడి పేరు అరు.

అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో ఏబీ కార్పోరేషన్ నిర్మించిన 'పా' సినిమాకి దర్శకుడు ఆర్. బాలకృష్ణన్ (బాల్కి). తన సుదీర్ఘ నట ప్రస్థానంతో ఎన్నో చాలెంజింగ్ పాత్రల్లో నటించిన అమితాబ్ కి దొరికిన మరో చాలెంజింగ్ పాత్ర అరు. ఇంతకాలం నలుపు తెలుపు కలగలిసిన ఒత్తైన క్రాఫ్, గడ్డం తో, సూట్ ధరించి గంభీరంగా డైలాగులు చెప్పిన అమితాబ్ ఈ సినిమా కోసం ప్రోజేరియా సోకిన పన్నెండేళ్ళ బాలుడిగా మారిపోయారు. ఒత్తైన క్రాఫ్ స్థానం లో నున్నని గుండు, గంభీరమైన కంఠ స్వరానికి బదులు సన్నగా కీచుగా వినిపించే గొంతు, ఖరీదైన సూట్ కి బదులు మామూలు స్కూలు యూనిఫాం. స్కూల్లో జరిగే ఎగ్జిబిషన్ కి స్టాఫ్ రూం లో ఉన్న గ్లోబ్ దొంగిలించి, దానికి తెల్ల పెయింట్ పూసి 'సరిహద్దులు లేని ప్రపంచం' అనే కాన్సెప్ట్ తో ప్రదర్శనలో పెట్టి కప్పు గెలుచుకునే తెలివి తేటలు అరు సొంతం.

అరు తల్లి విద్య (విద్యాబాలన్) గైనకాలజిస్ట్. తను, తల్లి, అమ్మమ్మ.. వాళ్ళింట్లో ఉండేది ముగ్గురే. బళ్ళో మేష్టర్లందరికీ అతను ప్రియమైన విద్యార్ధి. క్లాసు పిల్లలందరికీ ఇష్టుడు. అతని ఆరోగ్యం బహు సున్నితమని మేష్టర్లకే కాదు, పిల్లలందరికీ తెలుసు.. అందుకే అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఎగ్జిబిషన్ కి ముఖ్య అతిధిగా ఆ స్కూలు పూర్వ విద్యార్ధి, యువ ఎంపీ అమోల్ (అభిషేక్ బచ్చన్) హాజరై అరు కి బహుమతి అందించడంతో వార్తా చానళ్ళ కంట్లో పడతాడు అరు. ఫలితం.. అతను తన స్వేచ్చని కోల్పోయే పరిస్థితి.. 'ఎంపీ వల్లే ఇదంతా..' అని అమోల్ మీద కోపం తెచ్చుకుంటాడు. ఆ తర్వాత అరు, అమోల్ మంచిస్నేహితులవుతారు.

రాజకీయాలని కెరీర్ గా తీసుకుని, ఆ రంగంలో 'మంచి' ని పెంచాలని తపన పడే వ్యక్తి అమోల్. ముప్పై రెండేళ్ళు వచ్చినా అతను పెళ్లి చేసుకోక పోవడం అతని తండ్రి (పరేష్ రావల్) కే కాదు, చాలామందికి మింగుడు పడని విషయం. రాజకీయంగా అతన్ని దెబ్బ తీయడం కోసం అతని శత్రువులు టీవీ చానళ్ళలో అతని మీద వ్యతిరేక కథనాలు ప్రచారం చేయిస్తే, వాటికి సమాధానంగా దూరదర్శన్ ద్వారా ప్రైవేటు వార్తా చానళ్ళ లో పనిచేసే జర్నలిస్టుల అవినీతిని బట్ట బయలు చేస్తాడు అమోల్. (మన చానళ్ళలో వస్తున్న కథనాల తీరు తెన్నులు చూస్తుంటే మనం కూడా ఈ తరహా 'ఆపరేషన్' లను త్వరలోనే చూస్తామేమో అనిపిస్తోంది.) చిత్రంగా మొదలైన అరు-అమోల్ ల స్నేహం అంతే చిత్రంగా బలపడుతుంది. తనకోసం చేసిన రుచిలేని చప్పని కిచిడీని తల్లి తినడాన్నే భరించలేని అరు కి, తనకోసం తల్లి చేసిన త్యాగం గురించి తెలుస్తుందొక రోజున.

'ప్రోజేరియా' వ్యాధితో బాధపడే పిల్లవాడు అనే అంశాన్ని మినహాయిస్తే, బాగా నలిగిన కుటుంబ కథ ఇది. ఈ సినిమాకి బలం అరు పాత్ర అయితే, సినిమాని నిలబెట్టింది అరు గా అమితాబ్ నటన. సుమారు అరడజను సన్నివేశాల్లో అమితాబ్ ప్రదర్శించిన నటనకి తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లాయి. 'ఇంతింతై..' అన్నట్టుగా కథ ముందుకు జరుగుతున్నా కొద్దీ అమితాబ్ తన నట విశ్వరూపాన్ని చూపించడం మొదలు పెట్టాడు. అతనికి పోటీగా నటించిన ఘనత విద్యా బాలన్ ది. ఆత్మగౌరవం ఉన్న వనితగా బలమైన పాత్ర దొరికింది ఈ అమ్మాయికి. కొన్ని కొన్ని సన్నివేశాల్లో అమితాబ్-విద్యా ల నటన నువ్వా-నేనా అన్నట్టుగా సాగింది. అభిషేక్ గురించి, ఆ మాటకొస్తే మిగిలిన నటీనటుల గురించి, చెప్పుకోడానికి పెద్దగా ఏమీలేదు.

మొదటి సగం చకచకా సాగినప్పటికీ, రెండో సగానికి వచ్చేసరికి కథనం కొంచం మందగమనంతో సాగింది. మరికొన్ని బలమైన సన్నివేశాలు రాసుకుని ఉండాల్సింది. పతాక సన్నివేశంలో సెంటిమెంట్ పతాక స్థాయికి చేరింది. అరు పాత్రనే సినిమాకి కర్త, కర్మ క్రియ చేసింది. సాంకేతిక విభాగాల్లో మొదట చెప్పుకోవాల్సింది మేకప్ గురించి.. హాలీవుడ్ రూపశిల్పి స్టీఫన్ తెర వెనుక శ్రమ తెరమీద స్పష్టంగా కనిపిస్తుంది.. పీసీ శ్రీరాం కెమెరా, ఇళయరాజా సంగీతం గురించి ఇవాళ కొత్తగా చెప్పుకోడానికి ఏమీ లేదు.. ఎప్పటిలాగే బాగా చేశారు ఇద్దరూ. నేపధ్య సంగీతం లో అక్కడక్కడా ఇళయరాజా సంగీతం చేసిన పాత తెలుగు సినిమాలు జ్ఞాపకం వస్తాయి. అమితాబ్, విద్యాబాలన్ ల కోసం చూడాల్సిన సినిమా ఇది.

20 కామెంట్‌లు:

  1. Nenu kuda bhayapadda curious case of benjiman button remake chestharemo ani overall a descent movie

    రిప్లయితొలగించండి
  2. నేను ముందే ఫిక్స్ అయిపోయానండీ...ఈ సినిమా టాక్ తో సంభందం లేకుండా చూడాలని...

    రిప్లయితొలగించండి
  3. అయితే తప్పకుండా చూడాల్సిన సినిమా అన్నమాట.!
    మంచి సినిమా గురించి చెప్పారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. 'paa' గురించి మీ పరిచయం బాగుంది!

    రిప్లయితొలగించండి
  5. నేను కూడా చూసెయ్యాలని నిర్ణయించుకున్నా, ఐనా మీ పరిచయం ఇంకా ఆసక్తి పెంచింది.

    రిప్లయితొలగించండి
  6. అద్భుతమైన సినిమా... అద్భుతమైన అమితాబ్ నటన...!!! అంతకంటే అత్యత్భుతమైన మీ పరిచయం...!!! ధన్యవాదాలండి...

    రిప్లయితొలగించండి
  7. సినిమా ని కళ్ళకి కట్టినట్టుగా వర్ణించారు.

    రిప్లయితొలగించండి
  8. పరిచయం బాగుంది మురళి గారు. ఎలా ఉన్నా బచ్చన్ సాబ్ కోసం ఒకసారన్నా చూడాలి ఈ సినిమాను. ఈ వయసులో అంతలా కష్టపడటం తనకే చెల్లింది.

    రిప్లయితొలగించండి
  9. చూస్తామండి, ఈ సినిమా, ఇంతమంది చెప్తున్నారుగా. మెల్లిగా వెళ్ళి చూడాలి. ఈ వ్యాధి సంగతి కూడా తెలుసుకోవాలి.

    రిప్లయితొలగించండి
  10. @హరే కృష్ణ: రెండో సగం మధ్యలో కొద్దిగా సాగతీత అనిపించిందండీ.. ఇంకొంచం బాగుండొచ్చు అని నా అభిప్రాయం.. ధన్యవాదాలు.
    @వీరుభొట్ల వెంకట గణేష్: ధన్యవాదాలండీ..
    @శేఖర్ పెద్దగోపు: చూశాక ఒక టపా రాయండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @మధురవాణి: అవునండీ.. బాగుంది.. ధన్యవాదాలు.
    @సునీత: చూశారా లేక క్రిస్మస్ కి వాయిదా వేశారా? ..ధన్యవాదాలు.
    @పద్మార్పిత: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  12. @సృజన: అవునండీ.. ధన్యవాదాలు.
    @భావన: ధన్యవాదాలండీ..
    @ప్రకాష్: మొదటి రెండు విషయాలతోనూ మీతో ఏకీభవిస్తున్నానండీ :):) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @అప్పారావు శాస్త్రి: మీ బ్లాగులో కామెంట్ రాయడం కష్టతరంగా ఉందండీ నాకు..టెక్నికల్ ప్రాబ్లం.. ve మీరు 'పలనాటి బ్రహ్మనాయుడు' గురించి ఏదన్నా రాస్తే చదవాలని ఉంది :) ..ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: బచ్చన్ కష్టం ప్రతి సీన్లోనూ కనిపిస్తుందండీ మనకి.. ధన్యవాదాలు.
    @జయ: చూడండి..చూడండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. సినిమా చూశాను ..నిజం మురళి గారూ చాలాచోట్ల అమితాబ్ నటన కంట తడి పెట్టించింది .అసలు అరుగా నటించింది అమితాబే అన్న నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి చాలా సమయం పట్టింది ...అయన చిన్నగా కనిపించే కొన్నిసాధారణ సన్నివేశాల్లో సున్నితంగా హాస్యాన్ని పండిస్తూనే ....అంతర్గతంగా మనసుని కదిలించారు .మీ రివ్యూ బావుంది ఎప్పటిలాగే ....క్లైమాక్స్ గురించి ప్రస్తావించకుండానే సినిమాహాలు వరకూ నడిపించగలరు మీరు !

    రిప్లయితొలగించండి
  15. @పరిమళం: క్లైమాక్స్ చెప్పేస్తే మీ అందరికీ ఆసక్తి తగ్గిపోతుంది కదండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. ఈ సినిమా యాడ్స్ చూసి ఎలాగయినా చూడాలని అనుకున్నా. కుదరలేదు . డి వి డి రాగానే చూడాలి.

    రిప్లయితొలగించండి