ఆదివారం, డిసెంబర్ 06, 2009

చిన్నారి దేవత

ఉన్నట్టుండి ఓ ఏడేళ్ళ బాలిక భవిష్యత్తు చెప్పడం మొదలు పెట్టింది. వార్తల కోసం ఆవురావురంటున్న వార్తా చానళ్ళకి ఈసంగతి తెలిసింది. ఆ అమ్మాయి పూర్వాపరాలేమిటి? ఆమె చెబుతున్నది ఎంతవరకూ నిజం? అన్న విషయాలు తెలుసుకునే తీరిక, ఓపిక సహజంగానే వాళ్ళెవరికీ లేదు.. ఒకరిద్దరికి అనిపించినా, తాము ఆ పరిశోధనలో ఉంటే మరేవేఅరో ఆ న్యూసు బ్రేకేస్తారేమో అన్న టెన్షన్.. వెరసి ఒక్క రోజులోనే ఆ బాలిక వార్తల్లో వ్యక్తి అయిపోయింది.. ఇప్పుడదే ఆ చిన్నారికి శాపం గా మారింది.

'శాంభవి' పేరు తెలియని వాళ్ళు ఇప్పుడు ఆంధ్ర దేశంలో ఎవరూ లేరు. చానళ్ళు, పత్రికలు పోటీపడి ఆ అమ్మాయికి ఉన్న 'అతీంద్రియ శక్తులని' ప్రచారం చేయడంతో ఇప్పుడామె ఎక్కడికి వెళ్ళినా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. ఆమె మాట్లాడే మాటలని ఆణిముత్యాలుగా స్వీకరించే వాళ్ళు, ఆమె మౌనానికి కూడా కొత్త కొత్త అర్ధాలు వెతికే భక్తులు పుట్టుకొస్తున్నారు. అప్పటికే పంజరంలో చిలుకగా మారిన ఆ అమ్మాయి జీవితంలో ఊహించలేనంత మార్పు వచ్చింది.. ఇనుప పంజరం, బంగారు పంజరం గా మారింది.

కర్నూలు జిల్లా సూర్యనందిలో ఆమెకోసం ఒక ఆశ్రమాన్ని నిర్మించడానికి, అందుకు బౌద్ధ గురువు దలైలామా ని ఆహ్వానించడానికి తెర మీద ఏర్పాట్లు జరుగుతుండగానే, తెర వెనుక రాబోయే సంపదలో పంచుకోబోయే వాటాలకి అనుగుణంగా తమ వంతు ఖర్చులు పెట్టుకునే పెట్టుబడి దారుల సంఖ్య, వాళ్ళ బలం మరింత పెరగడం మొదలయ్యింది. ఫలితం.. శాంభవి చుట్టూ ఉన్న ఉచ్చు మరింత బలపడింది. దలైలామా వస్తారా రారా అని చర్చా కార్యక్రమాలు నిర్వహించాయి టీవీ చానళ్ళు.

మనమందరం వార్తలు చదువుతూ, చూస్తూ, ఎప్పటిలాగే ఎలాంటి స్పందనా లేకుండా ఉండగా శాంభవి హక్కుల కోసం పోరాడడానికి ఒక సంస్థ ముందుకొచ్చింది. ఆమె ఉండాల్సింది గుడిలో కాదని, బడిలో అనీ వాదించింది. హక్కుల కమిషన్ ని ఆశ్రయించింది. కేసు విచారణ మొదలయ్యింది. ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి.. మళ్ళీ మీడియాకు వార్తల వరద. శాంభవి తల్లి ఎవరో ఇప్పటివరకూ తెలీదు. తండ్రి, 'సంరక్షకురాలు' చెబుతున్న విషయాలు పొంతన లేవు.

ఇదిలా ఉండగా, శాంభవి తరపున వాదిస్తున్న సంస్థ మీద ఎదురు దాడి మొదలయ్యింది. అన్ని మతాలూ పిల్లలకి దేవుడితో సమ హోదాని ఇచ్చాయే తప్ప, ఏమతమూ పిల్లలని దేవుళ్ళుగా మార్చమనలేదే? శాంభవిని తెరపైకి తెచ్చిన వర్గానికి స్వప్రయోజనాలు ఉన్నట్టే, ఆమె తరపున పోరాడే సంస్థకీ పోరాటం వల్ల ప్రయోజనాలు ఉండి ఉండొచ్చు. కానీ ఇక్కడ అంశం సున్నితమైనది.. ఒక ఏడేళ్ళ పిల్ల భవిష్యత్తుకి సంబంధించింది. 'అతీంద్రియ శక్తులు' ఉండడం వేరు.. ఉన్నాయన్న ప్రచారం జరగడం వేరు.. ఇప్పటివరకూ జరిగింది కేవలం ప్రచారమే.

మన పుణ్యభూమిలో దేవుడి ప్రతినిదులకి లోటు లేదు.. ఈ మతం ఆ మతం అని కాకుడా.. కొండొకచో మతాలకి అతీతంగా మనకి బోల్డంత మంది నడిచే దేవుళ్ళు. యాదృచ్చికమో, మరేమో తెలీదు కానీ వీళ్ళలో చాలామంది కరువు ప్రాంతాల్లో స్థావరం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు. కొందరు తాము సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని సమాజ సేవకి ఖర్చు పెడుతున్నారు.. సంతోషం. వీళ్ళ గతాలు మనం అడగకూడదు.. అది దేవ రహస్యం. వర్తమానానికి వస్తే, జరుగుతున్నవి చూస్తుంటే, శాంభవి ని వీళ్ళ బాటలోకి 'నెట్టే' ప్రయత్నాలు బలంగా జరుగుతున్నాయనిపిస్తోంది. ఆమెకి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను.

15 కామెంట్‌లు:

  1. దలై లామా అంటే ఎవరో తెలుసు కోవడానికి వారికి ౩ నెలలు పట్టిందట, అది కూడా నెట్ ద్వారా. దలై లామాను చూడడానికి వెళితే వీరికి అనుమతి కూడా లభిమ్చలేదట. తర్వాత ఆమె సంరక్షకురాలు అన్ని విషయాలను 'మేనేజ్' చేస్తున్నారు. ఈ యవ్వారం అంతా తేలికగా డబ్బు సంపాదించే ప్రక్రియలో ఒక భాగం మాత్రమే. నమ్మడం మన వీక్నెస్. కొంత మంది అంటారు ఆమె, శాంభవి తల్లి అని.

    రిప్లయితొలగించండి
  2. మనుషుల్లో బలహీనత ఉన్నంత కాలం ఇలాంటి శాంభవిలు పుట్టుకొస్తునే ఉంటారు. మనం చూస్తునే ఉంటాం.

    రిప్లయితొలగించండి
  3. అసలు ఆమె వయసు చాలానే ఉంటుందనీ, శారీరకంగా మాత్రం ఎదగలేదనీ అన్న ఇంకో కధనం కూడా విన్నాను ఆ మధ్య ఏదో ఛానెల్లో!! కానీ ఆ కేర్ టేకర్, హక్కుల సంస్థల మధ్య ఎలా నలిగిపోతుందో తలచుకుంటే మాత్రం చాలా బాధగా ఉంటుంది :(

    రిప్లయితొలగించండి
  4. 'అతీంద్రియ శక్తులు' ఉండడం వేరు.. ఉన్నాయన్న ప్రచారం జరగడం వేరు.. ఇప్పటివరకూ జరిగింది కేవలం ప్రచారమే.

    నిజంగా నిజం ఇది.

    రిప్లయితొలగించండి
  5. మన పూర్వీకులు రాయిలో కూడా దేముడిని చూడమన్నారు...మనవాళ్ళు అది పొరపాటుగా అర్ధం చేసుకుని ప్రతి రాయిని దేముడని కొలిచేస్తున్నారు...
    ఈ విషయంలో నిజనిజాలు ఎంత ఉన్నాయో తెలియవుకానీ మీరిచ్చిన లింక్ లో ఇంటర్వ్యూ చదివాకా ఆ పాప మీద జాలి కలిగింది.donno why..!
    వరమని భావిస్తున్న శక్తులు ఆమెకు శాపంగా మారకూడదనే కోరుకుంటున్నాను.స్వప్రయోజనాల కోసం పెద్దలు పిల్లలను వాళ్ళ బాల్యానికి దూరం చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం...

    ఈ టాపిక్ కు రిలేటెడ్ కాకపోయినా టి.వి.లో ప్రసారమయ్యే పోటీ ప్రదర్శనల వల్ల చిన్నపిల్లలు ఎంత నలిగిపోతున్నారో ఆ మధ్యన "నవ్య" (ఆంధ్రజ్యోతి)లో పడిన ఒక "ఆర్టికల్" పెట్టిన టపా link ఇది...వీలుంటే చదవండి...
    http://trishnaventa.blogspot.com/2009/06/blog-post_22.html

    రిప్లయితొలగించండి
  6. దేవుడు మనిషిని బుద్ధిజీవిగా పుట్టించాడు అంటారు కానీ నాకైతే ఆ బుద్ధి, తెలివితేటలు ఏదో కొద్దిమందికి మాత్రమే పెట్టి మిగతావారిని వెర్రి గొర్రెలుగా మార్చేసాడేమో అనిపిస్తోంది ఈమధ్య, ప్చ్ :(

    రిప్లయితొలగించండి
  7. నాకైతే ఒకచిన్నపిల్ల జీవితంతో ఆటలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమిటి? అందరూ కలిసి ఏం సాధిద్దామనుకుంటున్నారో?

    రిప్లయితొలగించండి
  8. hi murali garu...manchi naku unna doubts ni clarify chestunatlu ga undi mee post chaduvutuntey...

    naku telugu lo type easy ga cheyyagaligey software links kavali...search chestey dorukutayi kani meelanti valla salaha kuda kavali...pls help me out thank you in advance..

    రిప్లయితొలగించండి
  9. సాక్షిలో వచ్చిన ఆ ఇంటర్వ్యూ నేను కూడా చూసాను అప్పుడు. అప్పుడే అసలు నాకీ కొత్త సంగతి తెలిసింది. అసలేదయినా ఒక చిన్న న్యూస్ దొరికితే దానికి అంత టూమచ్ గా ప్రచారం కల్పించి...పది పైసల విషయాన్ని పది లక్షలంత చేసి చూపిస్తున్నారు మీడియా వాళ్ళు.
    ఈ మీడియా వల్ల అన్నీవిషయాల్ని భూతద్దంలో చూస్తూ చూస్తూ అలవాటు పడిపోయి కొన్ని రోజులకి సహజ స్పందన అనేదే లేకుండా మనం కూడా మీడియా వాళ్ళ లాగా అయిపోతామేమో అనిపిస్తోంది నాకు :-p

    రిప్లయితొలగించండి
  10. @అప్పారావు శాస్త్రి: ఆ అమ్మాయికి దొరికిన ప్రచారం చాలామందిని నమ్మేలా చేస్తోందండీ.. ధన్యవాదాలు.
    @శేఖర్ పెద్దగోపు: నిజమేనండీ.. ధన్యవాదాలు.
    @నిషిగంధ: జరుగుతున్న వాటిని తట్టుకోగలిగే వయసు కానీ, తనకి నచ్చని వాటిని ఎదిరించే వయసు కానీ ఆ పాప కి లేవండీ.. తను చాలా అసహాయ స్థితిలో ఉందనిపించడం లేదూ? ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @విశ్వ ప్రేమికుడు: ధన్యవాదాలండీ..
    @తృష్ణ: చదివానండీ. ధన్యవాదాలు.
    @లక్ష్మి: నాక్కూడానండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @జయ: త్వరలోనే మొత్తం విషయం బయటకి రావొచ్చండీ.. ధన్యవాదాలు.
    @శిరీష: గూగుల్ ట్రాన్స్లేషన్ లేదా లేఖిని ఉపయోగించండి.. ధన్యవాదాలు.
    @మధురవాణి: మీడియా వాళ్ళలాగా :):) ఏమోనండీ.. అలాగే ఉంది పరిస్థితి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. అమాయకులైన పల్లెవాసులూ,చదువు సంధ్యలు లేనివారూ , మానసిక బలహీనులూ ఇలా బాబాలనీ ,అమ్మలనీ నమ్మి పూజిస్తున్నారంటే జాలిపడొచ్చు కానీ బాగా చదువుకొని ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళూ అదే రీతి ...ప్చ్ ...ఇలాంటివారున్నంత కాలం ఈ దేవుళ్ళూ ,దేవతలూ ..తయారుచేయబడుతూనే ఉంటారు .ప్చ్ ....ఇప్పుడు ఈపిల్ల ... !

    రిప్లయితొలగించండి
  14. @భావన: ప్చ్.. ధన్యవాదాలండీ..
    @పరిమళం: శేఖర్ పెద్దగోపు గారు చెప్పినట్టు మనుషుల్లో బలహీనతలు ఉన్నంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి