మంగళవారం, అక్టోబర్ 20, 2009

నాయికలు-వసుంధర

వసుంధరకి పేదరికమంటే ఏమిటో అనుభవ పూర్వకంగా తెలీదు. ఎందుకంటే ఆమె డబ్బులో పుట్టి పెరిగింది. ఓ పల్లెటూరి భూస్వామ్య కుటుంబంలో చిన్న కోడలు అయ్యింది. కానీ వసుంధర ఆలోచనలెప్పుడూ పేద వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఇందుకు కారణం కేవలం ఆమె ఆర్ధిక శాస్త్రం లో ఎమ్మే చదవడం మాత్రమే కాదు, చిన్నప్పటి నుంచీ ఆమెకి సామాజిక స్పృహ కొంచం ఎక్కువే. ఇరవై మూడేళ్ళ క్రితం సి.సుజాత రాసిన 'సుప్త భుజంగాలు' నవలలో ప్రధాన పాత్ర వసుంధర.

కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని ఇష్టంగా చదువుకుని, పేద సాదల పట్ల లోపల్లోపల సానుభూతిని పెంచుకుని కూడా తన కళ్ళెదురుగానే వాళ్లకి అన్యాయం జరుగుతుంటే నోరు విప్పి మాట్లాడ లేని నిస్సహాయ స్థితి వసుంధరది. తన ఇద్దరు కొడుకులనీ అడ్డుపెట్టుకుని ఇంటి పెత్తనం చేసే అత్తగారు వీర రాఘవమ్మ, వ్యవసాయ పనుల్లో తలమునకలుగా ఉండే బావ రంగశాయి, వ్యాపారం లో ఊపిరి పీల్చుకునేందుకు కూడా టైము దొరకని భర్త రవి, పెద్దగా చదువుకోని తోడికోడలు యశోద, పట్నంలో చదువుకునే పిల్లలు.. ఇదే వసుంధర చుట్టూ ఉన్న ప్రపంచం.

కేవలం వీళ్ళు మాత్రమే కాదు.. పొలంలో పనిచేసే నారాయణ, ఇంట్లో పని చేసే అతని భార్య వెంకాయి, కూతురు రవణి, ఊళ్ళో కాన్వెంటు నడుపుతున్న అవివాహిత లలిత, జీవితాన్ని, సంపాదనలో సింహ భాగాన్నీ కమ్యూనిస్టు ఉద్యమానికే ధారపోసిన స్కూలు మాస్టారు కూతురు అన్నపూర్ణా.. వీళ్ళంతా కూడా వసుంధర ని ఆలోచింపజేస్తూ ఉంటారు. రోజంతా పనిచేసి సాయంత్రం ఇచ్చిన కూలి పుచ్చుకుని, ఆపై యజమానుల చేత తిట్లు తినే కూలీలను చూసి కాపురానికి వచ్చిన కొత్తలో చలించి పోతుంది వసుంధర. కూలీలకి చదువు చెప్పి వాళ్ళ ఆలోచనల్లో మార్పు తేవాలని వృధా ప్రయత్నం చేస్తుంది.

పుస్తకాలలో చదువుకున్న పెట్టుబడిదారీ విధానం ఆచరణలో కళ్ళ ముందు కనిపిస్తుంటే ఆశ్చర్య పోతుంది వసుంధర. కాలేజీ రోజుల్లో తను కార్ల్ మార్క్స్ గురించి మాట్లాడుతుంటే స్నేహితులు "నువ్వలా మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందే" అని ఎందుకు అన్నారో అర్ధమవుతుంది ఆమెకి. కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోకూడదన్నది ఆమె ఒకప్పటి ఆదర్శం. "ఇది ఆస్తిలో నీ వాటా.. అన్నయ్యతో పాటు నీకూ వాటా వద్దూ?" అని ఒప్పిస్తుంది తల్లి. వ్యాపారంలో వచ్చే లాభాల కన్నా మరేదీ ఆనందాన్నివ్వదు రవికి. పుస్తకాల్లో సిద్ధాంతాలకీ, జరుగుతున్నవాస్తవాలకీ బేరీజు కుదరక ఆలోచనల్లో పడుతుంది వసుంధర.

ఇమడలేని వాతావరణంలో ఉండడం కన్నా రవి నుంచి విడిపోతే? అన్న ఆలోచన వస్తుంది వసుంధరకి. తనకంటూ చదువు, ఆస్తి ఉన్నాయి కాబట్టి జీవనానికి ఇబ్బంది ఉండదు. కానీ అదే సమయంలో అవివాహిత లలిత, డ్రామా ఆర్టిస్టు పద్మావతిల అనుభవాలు ఆమెలో రెండో ఆలోచన కలిగిస్తాయి. భర్త వల్ల లభించే 'సోషల్ సెక్యూరిటీ' గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. భర్త అండ లేని స్త్రీలకి సమాజంలో ఎదురయ్యే ఇబ్బందులు ఆమెని పునరాలోచించుకునేలా చేస్తాయి.

ఎన్నో చేయాలని ఉన్నా ఏమీ చేయలేక పోతున్నానని వసుంధర సంఘర్షణ అనుభవించే సమయంలోనే ఆ ఊరి కూలి జనంలో చిన్నపాటి విప్లవం మొదలవుతుంది. భూస్వాములతో వచ్చిన తగాదా వల్ల కూలీలెవరూ ఊళ్ళో పని చేయరాదని నిర్ణయించుకుని, పొరుగూళ్ళలో పనులు వెతుక్కుంటారు. అంతేకాదు, పొరుగూరి కూలీలెవరినీ ఊళ్ళో అడుగు పెట్టనివ్వరు. ఈ పరిణామం చాలా ఉత్సాహాన్నిస్తుంది వసుంధరకి. బహుశా ఆ స్పూర్తితోనే కావొచ్చు, పల్లెటూరి ఉమ్మడి కుటుంబపు సంప్రదాయానికి విరుద్ధంగా అత్తగారినీ, బావగారినీ ఎదిరించి పేదల పక్షాన మాట్లాడుతుంది వసుంధర.

కథా రచయిత్రిగా మంచి పేరు తెచ్చుకున్న సి. సుజాత తొలి రచన 'సుప్త భుజంగాలు' 1986 లో ప్రచురితమయ్యింది. వర్గ పోరాటాన్ని చిత్రించిన ఈ నవలలో రచయిత్రి పేదల కష్టాలనీ, భూస్వాముల దుర్మార్గాలనూ వివరించారు. పేదలకి సాయం చేయాలని భూస్వాములకి ఉన్నా, ఏకారణాల వల్ల వాళ్ళు ఆ పని చేయలేరో వివరించే ప్రయత్నం చేశారు. ఆసక్తి కరమైన కథనం ఈ నవల ప్రత్యేకత. ప్రస్తుతం ఈ నవల మార్కెట్లో అందుబాటులో లేదు.

11 కామెంట్‌లు:

  1. మురళి గారు, ఎంతైనా మీరు మీరేనండి! ఇప్పటివరకు నాకు తెలుగు సాహిత్యం గురించి చాలా తక్కువ తెలుసు అనుకునేదాన్ని. కాని, మీ బ్లాగ్ చూసాక, నాకు తెలుగు సాహిత్యం గురించి గుండు సున్నా లో అర సున్నా కూడా తెలీదని అర్ధం అయింది. మీరు ఇన్ని పుస్తకాలు చదవటం ఒక ఎత్తు ఐతే, వాటిని ఇలా చక్కగా చదవసొంపుగా (వినసొంపు లాగా) పరిచయం చేయడం ఒక ఎత్తు. ఇప్పటివరకు మీరు పరిచయం చేసిన 18 నాయికలలో నాకు పెర్సొనల్ గా (అంటె, నేను చదివిన) తెలిసింది ఒక్కరో ఇద్దరో అంతె. కాని, మీ పరిచయం చదివాక మాత్రం వాళ్ళందరూ నాకుతెలిసినట్లే ఉంది సుమీ.

    రిప్లయితొలగించండి
  2. వసుందర గురించి చదువుతుంటే ఎందుకో, ఫ్రీడం ఫైటర్ అనీబిసెంట్ జీవిత చరిత్ర గుర్తు వచ్చింది .

    రిప్లయితొలగించండి
  3. @ Ruth .. భేషుగ్గా చెప్పారు. మురళిగారు ఈ వరుసతో "పాత్రల పరిచయ సాహిత్యం" అనే కొత్త సాహిత్య వర్గానికి శ్రీకారం చుట్టారన్నా అతిశయోక్తి కాదేమో. అంత చక్కగా ఉంటున్నాయి ఈ వరుసలో వచ్చిన పరిచయాలన్నీ.

    మురళి గారూ, మూడో పేరాలో చివరి వాక్యాలు కొంచెం గల్లంతయినట్టున్నాయి, సరిచూడగలరు.

    రిప్లయితొలగించండి
  4. బాగుందండి పరిచయం.మొన్న వారెవరో చెప్పినట్లు మీ పుస్తక పరిచయాలతో ఒక పుస్తకాన్ని ప్రచురిస్తే బాగుంటుందేమోనండి.

    రిప్లయితొలగించండి
  5. దాదాపుగా సగటు మహిళ జీవిత విధానమిదే. ఎన్ని భావాలు, ఆవేశాలు ఉన్నా అణుచుకునే వారే ఎక్కువ. వారి ఇష్టప్రకారం పోరాటం సాగించే వారి సంఖ్య చాలా తక్కువ. సంఘం లో మారిన స్త్రీ పరిస్థితి శాతం చాలా చాలా తక్కువ. వసుంధర లాంటి వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగితే బాగుంటుంది. రచయిత్రి యొక్క ప్రభోదం ఇంక ఎక్కువగా స్త్రీలని మేల్కొలపాలి. తమలో తాము కుమిలిపోయె స్త్రీలకి మీ, ఈ పుస్తక పరిచయం కూడా మంచి ప్రోత్సాహాన్ని, బలాన్ని ఇస్తుంది. మీ పరిచయం చాలా బాగుంది. మీరు పరిచయం చేస్తే పుస్తకం చదవవలసిన పనే ఉండదు.

    రిప్లయితొలగించండి
  6. @Ruth: తెలుగు సాహిత్యం ఒక మహా సముద్రం అండి.. క్రమం తప్పకుండా చదివినా కొన్ని నీటి బొట్లని మాత్రమె రుచి చూడగలం.. కాబట్టి మనం ఒక పడవ ప్రయాణికులమే.. పరిచయం చదివాక మీకు నచ్చిన నాయికల గురించి ఆయా నవలలు చదవండి.. ఇంకా బాగా తెలుస్తారు వాళ్లందరూ.. ధన్యవాదాలు.
    @అనఘ: నాకైతే పోలిక కనిపించలేదండీ.. ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: పాత్రల పరిచయ సాహిత్యం కొత్త ప్రక్రియ ఏమీ కాదు కదండీ.. పరిచయాలు నచ్చుతున్నందుకు ధన్యుణ్ణి.. మీరు చెప్పిన వాక్యాలు సవరించాను.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. @తృష్ణ: అయ్యబాబోయ్.. పుస్తకమే.. బహుశా అది పీహెచ్డీ థిసిస్ అవుతుందండీ :):).. (రకరకాల పుస్తకాల ప్రేరణ ఉంది కదా మరి) ..ధన్యవాదాలు.
    @జయ: "మీరు పరిచయం చేస్తే పుస్తకం చదవవలసిన పనే ఉండదు." ఇదే నిజమైతే ఇది నా వైఫల్యం అండీ.. నా దృష్టిలో పరిచయం అన్నది పుస్తకాన్ని చదివించేదిగా ఉండాలి.. నేను ఆయా పుస్తకాల గురించి అంతా చెప్పేస్తున్నానా? అన్న డౌట్ మొదలయ్యింది నాలో.. పరిచయం నచ్చినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. పొలిక కాదండీ తన ఆశయాల కోసం కుటుంబాన్ని త్యాగం చేసింది ,వసుందర చేద్దామనుకుని చెయ్యలేకపోయింది

    రిప్లయితొలగించండి
  9. ఇది మీ వైఫల్యమెందుకవుతుంది. నాలాంటి వాళ్ళకు ఇంత వివరణ ఉంటే తప్ప చదవరు కద. నిజం చెప్పాలంటే నేను నవలలు చదవటం ఇప్పుడే మొదలు పెట్టాను. నా లాంటి వాళ్ళను కూడా మీరు చదివించ గలుగు తున్నారు కదా.

    రిప్లయితొలగించండి
  10. @అనఘ: ఓహ్.. అలా అంటారా..
    @జయ: నవలలు చదివి వదిలేయకుండా వాటి గురించి బ్లాగులో రాస్తూ ఉండండి..

    రిప్లయితొలగించండి
  11. అందరు సగటు స్త్రీలలాగే ముందు భర్త వల్ల లభించే 'సోషల్ సెక్యూరిటీ'గురించి ఆలోచించినా .....చివరికి అనుకున్నది సాధించిందన్నమాట మన నాయిక !

    రిప్లయితొలగించండి