చాలా రోజుల తర్వాత థియేటర్లో సినిమా చూశాను. కొంచం అరవ వాసన వేసిన డబ్బింగ్/ద్విభాషా చిత్రం పేరు 'లవ్ ఫెయిల్యూర్.' పేరు లాగానే, సినిమాలో సంభాషణలు కూడా ఎక్కువగా ఇంగ్లిష్ కలిసిన, అప్పుడప్పుడూ అరవంలాగా అనిపించే తెలుగులో వినిపించాయి. తొమ్మిదేళ్ళ క్రితం శంకర్ తీసిన 'బోయ్స్' మొదలుకొని ఇప్పటివరకూ కాలేజీ కుర్రాడి పాత్రలోనే ఎక్కువగా కనిపిస్తున్న సిద్ధార్థ కథానాయకుడు. నాయిక అమలపాల్. వీళ్ళిద్దరూ ఇంజనీరింగ్ విద్యార్ధులు. వీళ్ళు ప్రేమించుకోవడం అది విఫలమవుతూ ఉండడమే ఈ సినిమా.
అరుణ్ (సిద్ధార్థ్)ది చూడ చక్కని కుటుంబం. తండ్రి లాయర్, తల్లి మాటకి ఎదురు చెప్పనివాడు. ఈ కారణానికి అరుణ్ ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. పార్వతి (అమలా పాల్) నేపధ్యం ఇందుకు విరుద్ధం. తల్లిదండ్రులు (అలనాటి అందాల హీరో సురేష్, కేరక్టర్ నటి సురేఖా వాణి) ఎప్పుడూ గొడవలు పడుతూ, విడిపోయేందుకు మానసికంగా సిద్ధపడిపోయి ఉంటారు. రెండు జంటలదీ ప్రేమ వివాహమే. అరుణ్, పార్వతి అనుకోకుండా ఒకరికొకరు పరిచయమై, అనుకుని స్నేహితులై ఆ తర్వాత ప్రేమికులవుతారు. ఏడాది తిరక్కుండానే అరుణ్ ప్రేమలో ఓడిపోతాడు.
అరుణ్, తగు మాత్రం ఉపన్యాసాలతో తన ప్రేమ కథని ప్రేక్షకులతో పంచుకోవడమే రెండుగంటల సినిమా. అరుణ్ ప్రకారం, పార్వతికి సహనం తక్కువ. తన మాటే నెగ్గాలంటుంది, నెగ్గించుకుంటుంది. ఇతగాడు మిక్కిలి ఓరిమితో భరిస్తున్నప్పటికీ, ఎప్పుడూ ఏదో ఒక కొత్త తగువు తెస్తూ ఉంటుంది. అరుణ్ లో తప్పులు వెతకడానికి ఉత్సాహ పడే పార్వతి, తన దగ్గర తప్పులున్నాయనే విషయాన్ని ఒప్పుకోనే కోదు. కథని అరుణ్ కోణం నుంచి చూపడం వల్ల అనుకుంటా, పార్వతి ఓ తెలివి తక్కువ అమ్మాయిలాగా అనిపించింది.

ప్రేమలో ఓడిపోయిన అరుణ్, తన మిత్రుల ప్రేమ ప్రయత్నాలు చూస్తూ, తోచిన వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాడు. పార్వతికి పాపం ఇంటి గొడవలకే ఎంత సమయమూ చాలదు. అదీ కాకుండా, ఆ అమ్మాయి కెరీర్ ఓరియంటెడ్. స్టేట్స్ వెళ్లి పై చదువులు చదవాలన్న లక్ష్యం ఒకటి ఉంటుంది. అరుణ్ కి ఈ శషభిషలేవీ లేవు కాబట్టి పార్వతి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసేస్తూ ఉంటాడు. పార్వతి తల్లిదండ్రుల కథ, అరుణ్ మిత్రుల ప్రేమకథలతో పాటు, పార్వతి-అరుణ్ ల ప్రేమ కథ కూడా ఓ మలుపు తిరగడమే సినిమా ముగింపు.
కథలో కొత్తదనం ఏమీ లేదు. కథనంలో కొత్తదనం చూపించడం కోసం ప్రయత్నించాడు దర్శకుడు బాలాజీ మోహన్. మరికొంచం గట్టి ప్రయత్నం చేసి ఉండాల్సింది. సిద్ధార్థ్ ని కాలేజీ విద్యార్ధిగా చూడగానే, "నే బీయే పాసయ్యానమ్మా" అంటూ గాద్గదికంగా పలికే 'అన్నగారు' గుర్తొచ్చారు. హీరోయిన్ ని చూస్తున్నంతసేపూ ఒకే కోరిక పదే పదే కలిగింది. ఓ దువ్వెన, సబ్బు, తువ్వాలు ఆ అమ్మాయి చేతిలో పెట్టి "కాస్త తల దువ్వుకుని, ముఖం కడుక్కురా అమ్మాయ్" అని చెప్పాలని. ప్రేమకథలకి సంగీతమే బలం అంటారు కానీ, ఈ సినిమాకి ఆ బలంకూడా లోపించింది.
సాంకేతిక విభాగాల్లో, ఫోటోగ్రఫీ బాగుంది. మొదటి సగం బాగా సాగతీతగా అనిపించడానికి ఎడిటింగ్ కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ గానీ, హాస్యనటులు కానీ లేరు. అరుణ్ స్నేహితుడు విగ్నేశ్ ప్రేమకథని హాస్య భరితంగా చూపించే ప్రయత్నం చేశారు. మిగిలిన విభాగాల గురించి పెద్దగా చెప్పుకోడానికి ఏమీలేదు. అనేకానేక ఉపన్యాసాల తర్వాత, సినిమా చివర్లో ఇచ్చే ఉపన్యాసంలో ఒక్కసారైనా ప్రేమలో పడ్డవాళ్ళకి తన కథ నచ్చి తీరుతుందనే అర్ధం వచ్చేలా మాటాడాడు అరుణ్. బహుశా, నేనింకా ప్రేమలో పడలేదేమో...