సోమవారం, జూన్ 29, 2026

ఉలికిపడకు కుకు కుకు ...

నన్నయ భట్టుకు నవలలు నచ్చే వేళ
కౌగిలి పర్వం కొత్తగ రాస్తావా...
చక్కిలిగింతలు తిక్కన కొచ్చిన వేళ
నర్తనశాలకు నాతో వస్తావా...

మూడున్నర దశాబ్దాల నాటి ముచ్చట ఇది. 'సుందరకాండ' (1992) సినిమా విడుదలై విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న కాలంలో, 'ఆంధ్రప్రభ' దినపత్రిక ఆదివారం అనుబంధంలో ఒక వ్యాసం ప్రచురితమయ్యింది. వ్యాసకర్త (బహుశా ఫిలిం జర్నలిస్టు) సినీ గీత రచయిత వేటూరిని దుమ్మెత్తి పోశారు. 'ఉలికిపడకు..' పాటలో 'నన్నయ భట్టుకు నవలలు నచ్చే వేళ' అనడం వ్యాసకర్తకి అభ్యంతరం. 

"తెలుగునాట సాహిత్యం మొదలయ్యిందే నన్నయ ఆరంభించిన మహా భారత ఆంధ్రీకరణతో.. అప్పటికి నవలలు ఎక్కడ ఉన్నాయి? అవి నన్నయకు నచ్చుతాయని ఈ గీతరచయిత ఎలా అనుకుంటారు?" అనే ధోరణిలో సాగిందా విమర్శ వ్యాసం. తర్వాతి వారాల్లో ఖండన వ్యాసం చూసిన జ్ఞాపకం లేదు. 'నవల' అనే మాటకి 'స్త్రీ' అనే అర్ధం కూడా ఉన్నది కదా అన్నదే నాటికీ, నేటికీ నా సందేహం. 

నన్నయ పేరు తలచుకోగానే గుర్తొచ్చేవి ఆంధ్ర మహాభారతంలో 'ఆది పర్వం' 'సభా పర్వం'. శృంగార ప్రధాన గీతంలో 'కౌగిలి పర్వం' అనే ప్రయోగాన్ని చక్కగా అమిరింది. నన్నయతో ఆగకుండా, ఆ వెంటనే తిక్కననీ, నర్తనశాలనీ కూడా డ్యూయెట్ లోకి తీసుకురావడం వేటూరి సంతకం. 

సాధారణంగా ఒక సినిమాలో ఓ పాట విస్తృతంగా జనాల్లోకి వెళ్ళినప్పుడు మిగిలినవి కాస్త వెనుకబడడం సహజమే. అలా, 'సుందరకాండ' సినిమాకి సంబంధించి సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చే పాట 'ఆకాశాన సూర్యుడుండడు..' సినీ పరిభాషలో క్లాసు, మాసు అన్న తేడా లేకుండా అందరినీ అలరించిన పాట ఇది. ఈ సినిమాలో పాటల సాహిత్యాన్ని గురించి జరిగిన కొద్దిపాటి చర్చలనీ ఈ పాటే ఆక్రమించింది, సహజంగానే. వేదాంత సారాన్ని ఒడిసిపట్టి ఈ పాటని రాసిన వేటూరే, అదే సినిమాకోసం పూర్తి శృంగారభరిత గీతాన్ని రాయడం అప్పటికే అటు సినిమా వాళ్ళకీ ఇటు ప్రేక్షకులకి కూడా అలవాటైపోయిన పరిణామం. 

ఉలికిపడకు కుకు కుకు
పెదవి కలిపేందుకు కు కుకు
కలలు కనకు కుకు కుకు
కథలు నడిపేందుకు కు కుకు
చిలక పలికిన వయసుకు
వయసు తొడిగిన సొగసుకు
షరాలు పెంచకు... కు కుకు కుకు

పల్లవిలో 'షరా' మాట అప్పటికి బహుళంగానే వాడుకలో ఉంది. ముఖ్యంగా ఉత్తరాలలోనూ కోర్టు కాగితాల్లోనూ ఎక్కువగా కనిపించేది. 'షరతు' అని ఒకానొక అర్ధం. 

మొగ్గ విచ్చే వేళ నా మోజులన్నీ
పోటు తుమ్మెదల్లే తేనె విందుకొస్తావా
సిగ్గులొచ్చే వేళ నే దగ్గరైతే పాలబుగ్గలోనే ఎర్రపొంగులిస్తావా
మత్తుగ మల్లెలు అత్తరు చిందేవేళ
చంపకమాలలు సొంపులకిస్తావా
పైటల చాటుల పద్యము రాసేవేళ
ఉత్పలమాలలకూపిరి పోస్తావా
నీవడిగే దోపిడిలో... నీ ఒడిలో ఒత్తిడిలో
వసంతవేళకు... కు కుకు కుకు

'పోటు తుమ్మెద' అంటే మగ తుమ్మెద. 'మొగ్గ విచ్ఛే వేళ' లో శ్లేష ఊహకి అందేదే.  శ్రీనాధుడు తదితర కవులందరూ శృంగార రస ప్రధాన వర్ణనలకోసం ఎంచుకున్న వృత్తాలు ఉత్పలమాల, చంపకమాల. 

ఆడదయ్యే వేళ నీ అందమంతా
ఎండ కన్ను దాటి గుండెలోకి వస్తావా
పాయసాలు పొంగే నీ పక్కకొస్తే
ముద్దు బారసాల ముందుగానే చేస్తావా
నన్నయభట్టుకు నవలలు నచ్చేవేళ
కౌగిలి పర్వం కొత్తగ రాస్తావా
చక్కిలిగింతలు తిక్కనకొచ్చినవేళ
నర్తనశాలకు నాతో వస్తావా
నా ఎదలో పూ పొదలో... నా కథలో నీ జతలో
సందేహమెందుకు కుకు కుకు

పూర్తి పామరులకీ, పూర్తి పండితులకీ సమంగా నచ్చేసే ఈ పాట, శ్లేష-శృంగార రసాల మేళవింపు. కీరవాణి ట్యూనుకీ, బాలు-చిత్రల గానానికీ వంకపెట్టలేం. వెంకటేష్-అపర్ణ, బృందంతో కలిసి నర్తించారు. దర్శకత్వం కె. రాఘవేంద్ర రావు, బీఏ, కాబట్టి చిత్రీకరణలో మరికొంచం ఆశించిన వాళ్ళకి మాత్రం కొద్దిపాటి నిరాశ తప్పదు. ఈపాట చిత్రీకరణకు అవుట్ డోర్ ని ఎందుకు ఎంచుకున్నారన్నది ఎప్పుడూ ఆశ్చర్యమే. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి