సోమవారం, డిసెంబర్ 09, 2024

అవస్థ

నాలుగున్నర దశాబ్దాలకి పూర్వం యు.ఆర్. అనంతమూర్తి రాసిన కన్నడ నవలకి 'అవస్థే' కి రంగనాథ రామచంద్రరావు చేసిన తెలుగు అనువాదం 'అవస్థ' నవల. దక్షిణ కర్ణాటక లోని శివమొగ్గ (షిమోగా) ప్రాంతానికి చెందిన అనంతమూర్తి, ఆ ప్రాంతాన్ని, అక్కడి స్వాతంత్య్రానంతర రాజకీయ వాతావరణాన్ని ఇతివృత్తంగా తీసుకుని రాసిన నవలలో ప్రధాన పాత్ర కృష్ణప్ప గౌడ. పేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి, అక్షరం సాయంతో ఎదిగి, నాయకత్వ లక్షణాల కారణంగా శాసన సభ్యుడిగా విజయాలు సాధించడమే కాక, ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడే స్థాయికి చేరతాడు. ఈ దశలోనే అతణ్ణి అనూహ్యంగా అనారోగ్యం కబళిస్తుంది. పక్షవాతం కారణంగా శరీరం చచ్చు బడుతుంది. గౌడ ఆరోగ్యవంతుడవుతాడనీ, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడనీ అనుచరుల్లో గొప్ప నమ్మకం.  

గౌడ రాజకీయ అనుచరుల్లో ఒకడైన నాగేశ, కృష్ణప్ప గౌడ జీవిత చరిత్ర రాయడానికి పూనుకుంటాడు. అతనికి చెప్పే క్రమంలో గౌడ తన జీవితాన్ని నెమరు వేసుకోవడం, అటుపై తన ఇంటికి నడిచి వచ్చిన ముఖ్యమంత్రి పదవిని చేపట్టే విషయంతో సహా తన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోడానికి ఉద్యుక్తుడు కావడంతో నవల ముగుస్తుంది. బాల్య జీవితం కృష్ణప్ప గౌడ వ్యక్తిత్వం పై ఎలాంటి ప్రభావాన్ని చూపింది, యవ్వనంలో అతని జీవితంలో ప్రవేశించిన వ్యక్తులు తర్వాతి జీవితం మీద ఏవిధంగా తమదైన ముద్రని వేశారు అన్నది సునిశితంగా చెప్పారు రచయిత. పశువుల్ని కాసుకునే కృష్ణప్ప గౌడ జీవితంలోకి మహాదేవయ్య రావడం అతని జీవితంలో మొదటి మలుపు. కేవలం మహాదేవయ్య పూనిక, ఆర్ధిక సాయంతోనే గౌడ బడిలో చేరతాడు. నిజానికి మహాదేవయ్య కథలోనే ఒక నవలకి సరిపోయేంత వస్తుంవుంది. 

కాలేజీ రోజుల్లో కృష్ణప్ప గౌడ జీవితంలో ప్రవేశించే అణ్ణాజీ కథ మరో నవలకి సమానం. విస్తృతంగా చదివి, ఇంగ్లీష్ తో అనర్గళంగా మాట్లాడే ఈ వామపక్ష మేధావికి ఉన్న ఒకే ఒక్క వ్యసనం స్త్రీ. కృష్ణప్ప గౌడ మీద అన్నాజీ ప్రభావం తక్కువదేమీ కాదు. తనని ప్రేమించిన గౌరీ దేశపాండే కి కృష్ణప్ప తన ప్రేమని తెలుపక పోవడం వెనుక అణ్ణాజీ  ప్రభావం కూడా కొంత కారణం. తర్వాత జీవితంలో గౌడ అనుసరించిన రాజకీయ మార్గం, నడిపిన ఉద్యమాలు, పాటించాలని ప్రయత్నించే విలువలు వీటన్నిటి వెనుకా అణ్ణాజీ ప్రభావం వుంది. అసలు, కృష్ణప్ప గౌడ జీవితం ఒక ముఖ్యమైన మలుపు తిరిగి, రాజకీయ నాయకుడిగా మారడానికి కారణం కూడా అణ్ణాజీనే.  గౌడ శారీరక బలహీనతని, మానసిక బలహీనతలనీ సమాంతరంగా చిత్రిస్తూ రావడం, అలాగే వర్తమానంలో జరిగే కథతో సమాంతరంగా ఫ్లాష్ బ్యాక్ లని చెబుతూ రావడం వల్ల నవల చదివే పాఠకులకి ఊయల ఊగుతున్న అనుభూతి కలుగుతుంది చాలాసార్లు. 


కృష్ణప్ప గౌడ ఆశయాలకీ, ఆచరణకీ మధ్య ఉన్న భేదం, తత్కారణంగా అతని అంతర్మధనమే 'అవస్థ' నవల లో ప్రధాన కథ. నిజానికి ఇలా భేదం వుండడం రాజకీయాల్లో సర్వ సాధారణం. అయితే, గౌడ అందరు నాయకుల లాంటి వాడు కాదు. అతని వ్యక్తిత్వం ప్రత్యేకమైనది. ఈ వ్యక్తిత్వమే 'అవస్థ' నవలకు ఆయువు పట్టు. అతని జీవితంలో స్త్రీలందరూ గౌడని ఎంతో కొంత ప్రభావితం చేసిన వాళ్ళే. తల్లి శారదమ్మ, చిన్నప్పుడు ఆదరించిన రుక్మిణమ్మ, కాలేజీ రోజుల్లో ఆరాధించిన గౌరీ దేశ్ పాండే, కొంతకాలం సహజీవనం చేసిన లూసినా, అణ్ణాజీ స్నేహితురాళ్ళు - మరీ ముఖ్యంగా చిన్నవీరయ్య భార్య ఉమ, గౌడ పెళ్లాడిన సీత, నర్సు జ్యోతి.. వీళ్లందరి ప్రభావం కృష్ణప్ప గౌడ చర్యలపై కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా, వరంగల్ జైలు జీవితం అతనిపై చెరగని ముద్ర వేసింది. మౌన సన్యాసి ప్రభావమూ తక్కువది కాదు. 

ఉన్నత ఆశయాలని కలిగి ఉండడానికి, వాటిని ఆచరణలో పెట్టడానికి మధ్య భేదాన్ని సూక్ష్మంగా చిత్రించిన నవల ఇది. కృష్ణప్ప గౌడ ఆశయాలు గొప్పవి. అతడు వాటిని కలిగి ఉండడానికి దారి తీసిన పరిస్థితులూ ప్రత్యేకమైనవి. అయితే, వాటిని ఆచరణలో పెట్టలేకపోవడానికి కారణాలు మాత్రం ఊహించగలిగేవే. గౌడకి తన లక్ష్యంతో పాటు దానిని చేరుకునే మార్గమూ ముఖ్యమే. అతని సమస్యంతా తాను వెళ్తున్న మార్గం పట్ల పేరుకుపోయిన తీవ్రమైన అసంతృప్తి. దానిని మార్చలేని (మార్చుకోలేని) అసహాయత. "యితడు మానసికంగా అత్యంత బలవంతుడా లేక అతి దుర్బలుడా?" అనే ప్రశ్న పాఠకులకి చాలాసార్లే వస్తుంది. అతడిలో కనిపించే ద్వంద్వాలు ఒక్కోసారి అయోమయంలో పడేస్తాయి. అయితే, ఈ ద్వంద్వాలకి కారణాలు అతడి నేపధ్యం లోనూ, పెరిగిన విధానంలోనూ దొరుకుతాయి. 

రంగనాథ రామచంద్రరావు తెలుగు అనువాదం సరళంగా వుంది. కన్నడ నుడికారాన్ని ఉపయోగించక తప్పని సందర్భాలలో ఇచ్చిన ఫుట్ నోట్స్ పాఠకులకి ఎంతో ఉపయుక్తం. అచ్చుతప్పులు తక్కువే. బాగా నిరాశ పరిచింది ఏదైనా ఉందంటే అది ముందుమాట. ఈ ముందుమాటలో మహాదేవయ్య  - పరమేశ్వరయ్య గానూ, అణ్ణాజీ - అప్పాజీ గానూ మారిపోయారు. కొన్ని వాక్యాలు పునరుక్తులయ్యాయి. నాలుగు పేజీల ముందుమాటలో ఇన్ని తప్పులు ఎలా వచ్చాయో అని ఆశ్చర్యం కలిగింది. కన్నడలో నవల గానే కాక సినిమాగానూ విజయవంతమై అవార్డులు పొందింది. అయితే, సోషలిస్టు నాయకుడు శాంతవేరి గోపాల గౌడ వారసులు, అనుచరుల నుంచి కోర్టు కేసులు ఎదుర్కొన్నారు అనంతమూర్తి. గోపాల గౌడ జీవితాన్నించి స్ఫూర్తి పొంది కృష్ణప్ప గౌడ పాత్రకి రూపకల్పన చేశారు. ఛాయ రిసోర్స్ సెంటర్ ప్రచురించిన 198 పేజీల 'అవస్థ' వెల రూ. 160. ఆన్లైన్ లో కొనుగోలు చేయవచ్చు. 

2 కామెంట్‌లు: