మొదటి అభినందన నిర్మాత ఎల్బీ శ్రీరామ్ కి. పెట్టిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ అని తెలిసి కూడా సబ్జెక్టు మీద ప్రేమతో 'కవిసమ్రాట్' సినిమాని నిర్మించినందుకు. రెండవది నటుడు ఎల్బీ శ్రీరామ్ కి. తెలుగులో తొలి జ్ఞానపీఠ గ్రహీత 'కవిసమ్రాట్' విశ్వనాథ సత్యనారాయణ మాట తీరు, హావభావాలు ఎలా వుంటాయో ఇప్పటి వాళ్లకి ఎవరికీ తెలిసే అవకాశం లేదు. కానైతే, నటుడు ఎల్బీ శ్రీరామ్ ఏ పాత్రలో ఎలా ఉంటాడో బాగా తెలుసు. తాను ఇన్నాళ్లూ పోషించిన పాత్రల ప్రభావం ఏమాత్రం కనిపించని విధంగా 'కవిసమ్రాట్' పాత్ర పోషించి, అవుననిపించిన నటుడు ఎల్బీ శ్రీరామ్ ని అభినందించాల్సిందే. వరుసలో మూడో వాడు, ఈ సినిమాకి కథ, మాటలు రాసుకుని, స్క్రీన్ ప్లే చేసుకుని, దర్శకత్వం వహించిన సవిత్ సి. చంద్ర నీ అభినందించాలి.
గంట నిడివి గల ఈ 'కవిసమ్రాట్' బయోపిక్ కాదు. కేవలం విశ్వనాథ సత్యనారాయణ జీవితంలో కొన్ని ఘట్టాలకి దృశ్యరూపం. ఆ ఘట్టాల ఆధారంగా విశ్వనాథ వ్యక్తిత్వం, వ్యక్తిగత జీవితం, నాటి సంఘం, సాహిత్య వాతావరణం ఇవన్నీ ప్రేక్షకులు తెలుసుకునే అవకాశం ఇచ్చిన చిత్రం. దృశ్యాలని అనుసంధానం చేసే కథ చిన్నదే. తన స్వగ్రామం నందమూరులో జీర్ణస్థితిలో ఉన్న శివాలయాన్ని పునరుద్ధరించాలన్నది విశ్వనాథ శోభనాద్రి కల. ఆ కలని శోభనాద్రి కుమారుడు సత్యనారాయణ ఎలా నెరవేర్చాడు అన్నది కథ. ఇంగ్లీష్ సినిమాల పట్ల విశ్వనాథకి గల మోజు, వంటలో ప్రవేశం, సమకాలీన సాహిత్యం పట్ల ధోరణి, తనకి సాయం చేసిన వాళ్ళని మరవని తత్త్వం, బీదరికం లోనూ దూరం చేసుకోని ఆత్మాభిమానం ఇలాంటివన్నీ కథనంలో భాగమై ఆసాంతమూ సినిమాని ఆసక్తికరంగా మలిచేందుకు దోహద పడ్డాయి.
ప్రారంభంలో వచ్చే 'నందమూరి తారకరామారావు' సన్నివేశంలో కనిపించిన నాటకీయత కొంత కలవరపెట్టిన మాట నిజం. అయితే, ఆ నాటకీయత ఆ ఒక్క సన్నివేశానికే పరిమితం కావడం పెద్ద ఊరట. 'దొరసాని' సన్నివేశం లోనూ ఒకింత నాటకీయత లేకపోలేదు కానీ, ఆ సంఘటన అలాగే జరిగింది అనడానికి దాఖలా విశ్వనాథ అచ్యుతదేవరాయలు రచన 'మా నాయన గారు' (అజో-విభొ కందాళం ఫౌండేషన్ ప్రచురణ). నటీనటుల నటనని గురించి చెప్పుకోవాలంటే ప్రధాన పాత్రధారి ఎల్బీ శ్రీరామ్ అంతా తానే అయ్యారు. తమ్ముడు వెంకటేశ్వర్లు పాత్ర ధరించిన అనంత్ బాబు కి ఇంచుమించు సమంగా స్క్రీన్ స్పేస్ దొరికింది. మిగిలిన పాత్రల్లో కాస్త ఎక్కువ సేపు కనిపించింది 'ప్రసన్న కవి' గా టీఎన్నార్ (సుదీర్ఘ వీడియో ఇంటర్యూల ద్వారా పాపులర్ అయిన జర్నలిస్టు, కరోనాలో కాలం చేశారు).
డాక్టర్ జోశ్యభట్ల సంగీతాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శివాష్టకం, విశ్వనాథాష్టకం లో భాగాలని కీలక సన్నివేశాలకి నేపధ్య సంగీతంగా వాడుకోవడం వల్ల ఆయా సన్నివేశాల అందం ఇనుమడించింది. ఆ కాలపు ఇళ్ళు, నాటి వాతావరణ చిత్రణ కి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ తెరమీద కనిపిస్తుంది. అయితే, కృష్ణా జిల్లా నేపధ్యంగా జరిగే కథలో అక్కడక్కడా గోదావరి నది కనిపించడం, ఆ మాండలీకం వినిపించడాన్ని కాస్త సరిపెట్టుకోవాలి. 'వేయిపడగలు' చుట్టూ అల్లిన సన్నివేశాలు నాకు ప్రత్యేకంగా అనిపించాయి, నాటి ఆంధ్ర విశ్వకళా పరిషత్తు బహుమతిని అడివి బాపిరాజు 'నారాయణరావు' తో కలిసి పంచుకున్న విషయాన్నీ ప్రస్తావించి వుంటే బాగుండేది అనిపించింది. 'రామాయణ కల్పవృక్షము' కీ విశ్వనాథ వ్యక్తిగత జీవితానికీ వేసిన ముడి కన్విన్సింగ్ గా వుంది.
కరోనానంతర కాలంలో థియేటర్లకి వెళ్లడం బాగా తగ్గి, సినిమాలు టీవీలోనే చూస్తున్నందువల్ల ఈ చూడడంలో వచ్చిన మార్పు ఏమిటంటే ఏ సినిమానీ ఏకబిగిన చూడకపోవడం. కాసేపు చూసి ఆపడం, మర్నాడో, మూడో నాడో కొనసాగించడం.. ఇలా అన్నమాట. ఈ మధ్య కాలంలో ఏకబిగిన చూసిన సినిమా ఈ 'కవిసమ్రాట్'. అంతే కాదు, సినిమా పూర్తి కాగానే మళ్ళీ మొదటికి వెళ్లి, చివరివరకూ రెండో సారి చూసిన సినిమా కూడా ఇదే. మొదటి సారి చూసినప్పుడు ప్రకటనలు అడ్డు పడడం సహజమే (యూట్యూబ్ లో కాబట్టి, ప్రకటనలు తప్పవు). కానీ, రెండో సారి కూడా ప్రకటనలు అడ్డమే అనిపించాయి. రెండు సార్లూ కూడా, చూస్తున్నంత సేపూ విశ్వనాథ రచనలు గుర్తొస్తూనే ఉన్నాయి. అయితే, రెండో సారి చివర్లో ఉండగా 'అల నన్నయకి లేదు...' గుర్తొచ్చింది (ఈ ప్రస్తావన సినిమాలో కూడా వుంది, వేరే విధంగా). ఎందుకంటే, విశ్వనాథ సమకాలీన రచయితలు ఎవరి గురించీ కూడా సినిమాలు రాలేదు మరి!!