గురువారం, డిసెంబర్ 14, 2023

ముసురు

ఆత్మకథలు ఆయా రచయితల అనుభవాలు, జ్ఞాపకాలు, ఆలోచనలకు అక్షర రూపం. సాధారణంగా అనుభవాలనీ, జ్ఞాపకాలనీ ప్రధానంగా అక్షరబద్ధం చేస్తూ అక్కడక్కడా తమ ఆలోచనల్ని పంచుకుంటూ ఉంటారు. అయితే, ఆలోచనలకి పెద్దపీట వేస్తూ సాగిన ఆత్మకథ ముదిగంటి సుజాతారెడ్డి విరచిత 'ముసురు'. తెలుగు అధ్యాపకురాలిగా సుదీర్ఘ కాలం పనిచేసిన సుజాత, అకడమిక్ పుస్తకాలతో పాటుగా కథా సంకలనాలని, నవలలనీ వెలువరించారు. వాటితో పాటు, పదమూడేళ్ల క్రితం తన ఆత్మకథని ప్రకటించారు. నిజాం కాలం మొదలు ప్రపంచీకరణ వరకూ డెబ్భై ఏళ్ళ కాలాన్ని, ఆకాలంలో తెలంగాణ సమాజంలో వచ్చిన మార్పులని వివరించడంతో పాటు ఉమ్మడి కుటుంబాల మొదలు ఆత్మగౌరవ పోరాటాల వరకూ ప్రతి విషయం మీదా తనకున్న స్థిరమైన అభిప్రాయాలని ప్రకటించారు. 

నిజాం పాలన అనగానే మొదట గుర్తొచ్చేది నిజాం అకృత్యాలు, దొరల ఆగడాలు. చరిత్రలోనూ, సాహిత్యంలోనూ రికార్డయినవి ఇవే. అయితే, దొరల విషయంలో అసత్యాలు చలామణిలోకి వచ్చాయంటారు నల్గొండలో ఓ గడీలో పుట్టి పెరిగిన సుజాత. దొరలు స్త్రీలని ఎంతగానో గౌరవించారు తప్ప ఎవరితోనూ అమర్యాదగా ప్రవర్తించేవారు కాదనీ, బోనాల పండుగ లాంటివి కేవలం స్త్రీలంతా కూడి జరుపుకునే వారనీ చెబుతూ, కథలు, నవలలు రాసిన వారిలో చాలామందికి వాస్తవ జీవితం పట్ల అవగాహన లేకపోవడం వల్లనే దొరలని విలన్లుగా చిత్రించారని వివరించారు. నీటి వసతి లేకపోవడం వల్ల, తెలంగాణలో భూస్వాములకు కూడా రాబడి అంతంతమాత్రంగానే ఉండేదని, గౌరవమర్యాదలు ఉన్నంతగా సంపదలు ఉండేవి కావంటారు. 

తండ్రికి చదివించే ఆసక్తి లేకపోయినా పట్టుపట్టి హైదరాబాద్ లో కాలేజీలో చేరారు సుజాత. పేరుకి రెడ్డి కాలేజీ, హాస్టల్ అయినా అన్ని కులాలు, మతాల విద్యార్థులు అక్కడ ఉండేవారని, ఎంతోమంది అక్కడ చదువుకుని ప్రయోజకులు అయ్యారని గుర్తుచేసుకున్నారు. డిగ్రీ చదువుతూ ఉండగానే గోపాలరెడ్డి తో వివాహం జరిగింది సుజాతకి. ఆయన జంధ్యం వేసుకున్న బ్రహ్మసామాజికుడు. అంతే కాదు, సంస్కృతంలో ఎమ్మే చదువుకున్న వాడూను. పెళ్లి తర్వాత చదువు కొనసాగించడమే కాదు, పీహెచ్డీ పూర్తి చేశారు సుజాత. మధ్యలోనే గోపాలరెడ్డి కి జర్మనీలో పనిచేసే అవకాశం రావడంతో కొన్నాళ్ళు అక్కడ గడపడమే కాకుండా, ఒక యూనివర్సిటీలో లైబ్రేరియన్ గా పని చేసి, సంస్కృత సాహిత్యాన్ని గురించి బాగా తెలుసుకుని, భారత దేశానికి తిరిగి వచ్చాక 'సంస్కృత సాహిత్య చరిత్ర' పుస్తకం రాశారు కూడా. 

అప్పటికి జర్మనీ తూర్పు, పశ్చిమాలుగా విడిపోయి ఉంది, బెర్లిన్ గోడ సాక్షిగా. ఆ రెండు దేశాల మధ్య భేదాలే కాకుండా, జర్మనీ-భారత జీవన విధానాలని సూక్షంగా పరిశీలించి ఒక సిద్ధాంత పత్రం స్థాయిలో విశ్లేషించారు సుజాత. ఇలాంటి పరిశీలనే తెలంగాణ కట్టుబొట్టు-గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల కట్టుబొట్టు మధ్య ఉన్న దగ్గరి పోలికల గురించి కూడా చేశారు. మిద్దె ఇళ్ల మొదలు అపార్ట్మెంట్ల వరకూ గృహ నిర్మాణ శైలులని గురించీ, నిరాడంబరమైన ఆర్య సమాజపు పెళ్లిళ్ల మొదలు కార్పొరేట్ వెడ్డింగ్ ల వరకూ జరిగిన ప్రయాణాన్ని గురించి, ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, పిల్లల పెంపకం, చదువులు ఉద్యోగాల్లో పోటీ వరకూ అనేక విషయాల మీద తన ఆలోచనలని సవివరంగా పంచుకున్నావారు. 

తన కూతురు, కొడుకు వాసవిక, ఉదయన (ఎంత చక్కని పేర్లు!!) మొదలు తన దగ్గర చదువుకున్న విద్యార్థుల వరకూ ఆ తరం యువత ఆలోచనలు, జీవన విధానం గురించి చెప్పారు. అప్పటికే తరాల అంతరాలని గుర్తించిన రచయిత్రి, 1990 తర్వాత ఇంటా బయటా కూడా మార్పు శరవేగంతో చొచ్చుకొని వచ్చిందంటారు. తన జీవితంలో జరిగిన ఒక్కో విషయాన్నీ చెబుతూ, ఆ విషయంతో పాటుగా దానికి సంబంధించి వచ్చిన మార్పులు (చదువు, ఉద్యోగం, పెళ్లి...), తన ఆలోచనలు, అభిప్రాయాలూ రాస్తూ వచ్చారు. ఒక పేజీ ఆమె జీవితం కనిపిస్తే, తర్వాత పది పన్నెండు పేజీలు తులనాత్మక అధ్యయనం, ఆలోచనల ప్రకటనగా సాగింది రచన. తన బాల్యాన్ని గురించి, రచనా వ్యాసంగాన్ని గురించీ వివరంగానే చెప్పినా, ఉద్యోగ జీవితాన్ని గురించి క్లుప్తంగానే చెప్పారు. 

"ఆత్మకథలు చరిత్ర పునర్నిర్మాణానికి పనికి వస్తాయనే అభిప్రాయం బలంగానే ఉంది. సుజాతారెడ్డి ఆత్మకథ మరో రకంగా ఉపయోగపడుతుంది. సాయుధ పోరాట చరిత్రను, దాని వెలుపలి జీవన విధానాన్ని కలిపి తెలంగాణకు సంబంధించిన సంపూర్ణ సామాజిక చరిత్రను నిర్మించడానికి ఉపయోగపడుతుంది. తెలంగాణ సామాజిక పరిణామ క్రమాన్ని కొత్తగా అర్ధం చేసుకోడానికి వీలు కల్పిస్తుంది" అన్నారు కాసుల ప్రతాపరెడ్డి తన ముందుమాటలో. ఆత్మకథలతో పాటు, తెలంగాణ పరిణామ క్రమం మీద ఆసక్తి ఉన్న వాళ్లకి నచ్చే పుస్తకం ఇది. 'రోహణమ్' ప్రచురించిన ఈ 231 పేజీల పుస్తకం వెల రూ. 250. విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ, నవయుగ పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి