సోమవారం, మే 22, 2023

శరత్ బాబు...

బ్లాకండ్ వైట్ సినిమాల్లో కొంగర జగ్గయ్య, హీరోతో సమంగా కథానాయికని ప్రేమిస్తున్నట్టయితే సినిమా చూస్తున్న ప్రేక్షకులకి యిట్టే తెలిసిపోయేది - ఇతడి ప్రేమ త్యాగాన్ని కోరుతుందని. కేవలం రెండో హీరో మాత్రమే కాదు, విలన్ గానూ, కేరక్టర్ ఆర్టిస్టు గానూ రాణించారు జగ్గయ్య. సినిమాలు నలుపు-తెలుపుల్లో నుంచి రంగుల్లోకి మారాక జగ్గయ్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అతికొద్దిమంది నటుల్లో ఒకరు శరత్ బాబు. నలగని, చక్కని దుస్తులు, చెదరని క్రాఫు, రిమ్ లెస్ కళ్లద్దాలు.. గాంభీర్యం కలగలిసిన ఆహార్యం. చిన్న నవ్వులో కనిపించే చిరు వంకర అతని విలన్ వేషాలకి భలేగా కలిసొచ్చింది. కళ్ళజోడు తీసి చేత్తో పట్టుకుంటే సెంటిమెంటు, కళ్లద్దాలు పైనుంచి వోరగా చూస్తే విలనీ.. వెరసి క్లుప్తమైన నటన. 

హీరో మెటీరియల్ అయివుండీ, కథానాయకుడిగా గట్టిగా నిలదొక్కుకోలేక పోయిన కొందరిలో ఒకడు శరత్ బాబు. చలం, రంగనాథ్ ల కోవ. పాత్ర ఏదైనా, అతడు తెరమీద కనిపించాడంటే, దృష్టి నిలిపి చూడాల్సిందే. హీరోగానే కెరీర్ మొదలుపెట్టినా, చిత్ర పరిశ్రమ తత్వాన్ని యిట్టే అర్ధం చేసుకుని అట్టే కేరక్టర్ల లోకి, విలనీ లోకీ మారిపోయాడు. వయసులో తనకన్నా పెద్ద వాళ్ళకి 'అన్న' అయ్యాడు. కొండొకచో నాన్న కూడా అయ్యాడు. పోలీసు, దొంగ వేషాలతో పాటు రెంటినీ కలగలిపిన నెగటివ్ పాత్రల్లోనూ ఔననిపించాడు. దాదాపు ఒకే సమయంలో వచ్చిన 'సితార' 'సీతాకోకచిలుక' సినిమాలు రెంటిలోనూ శరత్ బాబు కేరక్టర్ ఆర్టిస్టు. చేసిన కేరక్టర్ల లో భేదం రేఖామాత్రమే అయినా, వాటిని అభినయించిన విధం ఎంత ప్రత్యేకం అసలు! 

ఆముదాలవలస హోటల్ ఓనర్ గారబ్బాయి సత్యంబాబు దీక్షితులు, శరత్ బాబుగా మారిన క్రమాన్ని గురించి పెద్దగా తెలిసింది లేదు. ఆ ప్రారంభపు రోజుల్ని మాత్రమే కాదు, తర్వాత కాలంలో తిన్న ఎదురు దెబ్బల గురించీ ఎక్కడా పెద్దగా మాట్లాడలేదు. విడాకుల తర్వాత రమాప్రభ చేసిన ఆరోపణల విషయంలోనూ అదే మౌనం. ఆ మౌనమే ఆ పెళ్లి కథలో శరత్ బాబుని విలన్ని చేసేసింది. 'అభినందన' లాంటి త్యాగపూరిత పాత్రలు చేసినా, అతన్ని తలచుకోగానే దుష్ట పాత్రలే మొదట గుర్తొచ్చేలా జరిగిన ట్యూనింగ్ లో రమాప్రభ ఎపిసోడ్ ప్రభావం తెలియకుండానే ఉందేమో. 'సంసారం ఒక చదరంగం' లాంటి సినిమాల్లో వేసిన పాత్రలు అత్యంత సహజంగా ఉండడమూ మరో కారణం కావొచ్చు. నటీనటులకి ఒక్కో 'ఇమేజి ' స్థిర పడిపోవడం అన్నది కొత్త విషయం కాదు కదా. 

'ఇది కథ కాదు' 'గుప్పెడు మనసు' 'అన్వేషణ' 'సాగర సంగమం' 'స్వాతి' 'ఓ భార్య కథ' ... గుర్తు చేసుకుంటూ వెళ్తే ఎన్ని వైవిధ్య భరితమైన పాత్రలో అసలు. శరత్ బాబు యంగ్ లుక్ కి అలవాటు పడిపోవడం వల్ల కావచ్చు, 'శుభప్రదం' లాంటి సినిమాల్లో వయసు మళ్ళిన (అప్పటికి తన వయసుకి తగ్గవే అయినా) పాత్రల్లో చూడడం అలవాటవడానికి కొంచం టైం పట్టింది. 'సాగర సంగమం' క్లైమాక్స్ లో కమల్ హాసన్ మీద వర్షం పడకుండా అడ్డం పడడం (జయప్రద గొడుగు తెచ్చేలోగా) తెరమీద కనిపించేది ఒక్క క్షణమే అయినా చెరగని ముద్ర వేసే సన్నివేశం. "ఇలాంటి ఫ్రెండ్ ఒక్కరున్నా చాలు" అనుకోని ప్రేక్షకులు ఉండరేమో అసలు. నిజానికి ఆ సీన్లో బోల్డంత అభినయించవచ్చు. అలా కాకుండా సహజంగా చేయడమే శరత్ బాబు ప్రత్యేకత. 

శరత్ బాబు వేసిన పోలీసు వేషాల గురించి ప్రత్యేకం చెప్పుకోవాలి. తెరమీద పోలీసు యూనిఫామ్ ధరించాలన్నది నటీనటుల్లో చాలామందికి కల. నెరవేర్చుకునే అవకాశమూ దొరుకుతుంది. కానైతే, ఆ యూనిఫామ్ అందరికీ సెట్ అవ్వదు. పెద్ద హీరోల విషయంలో అభిమానులు కాసేసుకుంటారు కాబట్టి సమస్య ఉండదు, కానీ కేరక్టర్ ఆర్టిస్టుల విషయంలో అలా కాదు. సెట్ అయ్యే వాళ్ళకి మాత్రమే యూనిఫామ్ వేస్తారు. శరత్ బాబు ఖాకీ యూనిఫామ్ వేసుకుని కనిపిస్తే, అచ్చంగా పోలీస్ ఆఫీసర్ లాగే ఉండేవాడు. అక్కడ కూడా ఆఫీసరే, కానిస్టేబుల్ వేషంలో చూడలేం. నిజానికి పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నది తన చిన్నప్పటి కల అట. అయితే ఐ సైట్ సమస్య ఉండడంతో ఆ ఉద్యోగం రాదని నిశ్చయించుకుని, సినిమాల వైపు చూశానని చెప్పాడు ఓ ఇంటర్యూలో. (ఇది కూడా 'డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా' లాంటిదే కావచ్చునేమో.) 

సినిమా వేషాలు తగ్గుతుండగానే టీవీకి షిఫ్ట్ అయిపోయిన శరత్ బాబు, చాలా ఏళ్ళ పాటు ఈటీవీ కి నిలయ విద్వాంసుడు. ఒక్క 'అంతరంగాలు' సీరియలే ఏళ్ళ తరబడి సాగింది. పాటలతో పాటు శరత్ బాబు కూడా ప్రత్యేక ఆకర్షణ ఆ సీరియల్ కి. మహిళా ప్రేక్షకుల్లో అతడికున్న ఫాలోయింగ్ ఆ సీరియల్ ని నిలబెట్టి, సుదీర్ఘంగా సాగేందుకు దోహదం చేసింది. అప్పుడప్పుడూ సినిమాల్లోనూ కనిపిస్తూ ఉండడం వల్ల శరత్ బాబు రిటైర్ అయిపోయాడు అనే ఆలోచన రాలేదెప్పుడూ. గత రెండు మూడు నెలలుగా అనారోగ్యం వార్తలు మాత్రం తరచూ కనిపిస్తున్నాయి. టీవీ చానళ్ళు చంపేసి, నాలిక్కరుచుకున్న సందర్భాలూ ఉన్నాయి. (చంపడం మీద వీళ్ళకి ఇంత ఉత్సాహం ఏమిటో, కాస్త ఆలస్యం అయినా కన్ఫర్మ్ చేసుకుని వార్త వెయ్యొచ్చు, కొంపలు మునగవు). ఎందుకో తెలియదు కానీ, శరత్ బాబు 'ఫిర్యాదులు లేని మనిషి' అనిపిస్తాడు. తన పాత్రని ముగించుకుని (బహుశా తృప్తిగానే) వెళ్ళిపోయాడు. శరత్ బాబు ఆత్మకి శాంతి కలగాలి. 

6 కామెంట్‌లు:

  1. ఇతరులకు “కొంపలు” మునగవు, కానీ టీవీ వారికి మాత్రం మునుగుతాయేమో?. ఎందుకంటే ఈ వార్త ముందర మేమే చెప్పాం మేమే చెప్పాం అని చెప్పుకోవడం కోసం ఆ తొందర అనిపిస్తుంది.

    శరత్ బాబు ఓ జెంటిల్-మన్ ఏక్టర్ అనచ్చు. హుందాగా నటించేవాడు. తెర మీద చూస్తుంటే ఆహ్లాదకరంగా ఉండేది. అతని నిష్క్రమణం తెలుగు చలనచిత్ర రంగానికి లోటే. ఒక అధ్యాయం ముగిసిందనవచ్చు. శరత్ బాబు గారి ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలి 🙏.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. టీవీల కన్నా ముందు యూట్యూబ్ ఛానళ్ల గొడవ ఎక్కువగా ఉందండీ ఇప్పుడు. వాళ్ళు అందుకుంటున్నారు, ఛానళ్ల వాళ్ళు వంత పాడుతున్నారు..
      'జెంటిల్మన్ యాక్టర్' ఒప్పుకుంటానండీ.. ధన్యవాదాలు.

      తొలగించండి
  2. బాగా వ్రాశారు. హుందా తనం నిలుపుకున్న కొద్దిమంది నటులలో శరత్ బాబు ఒకరు. అతిలేకుండా సహజంగా నటించే వారు. మంచి అందగాడు స్ఫురద్రూపి అయి ఉండి రమాప్రభను పెళ్లి చేసుకోవడం అభిమానులకు అంతగా నచ్చలేదు. తమిళ్ కన్నడ చిత్రాలలో కూడా మంచి పాత్రలు వేశారు.🙏🏻

    రిప్లయితొలగించండి