మహాత్మా గాంధీ చేసిన మొదటి సత్యాగ్రహం 'చంపారన్' నీలి రైతులకి మద్దతుగా 1917 లో జరిగింది. అహింసాయుతంగా జరిగిన ఆ సత్యాగ్రహం సహాయనిరాకరణ తదితర అహింస ఉద్యమాలకి నాంది పలికింది. అయితే, చంపారన్ కి అరవయ్యేళ్ళ ముందే బెంగాల్ లో నీలి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారనీ, 1857 నాటి సిపాయిల తిరుగుబాటుకి దోహదం చేసిన అంశాల్లో బెంగాల్ నీలి సమస్యకూడా ఒకటని చరిత్రని క్షుణ్ణంగా చదివిన వారికి తప్ప మిగిలిన వారికి తెలిసే అవకాశం లేదు. బెంగాల్ నీలి రైతుల తిరుగుబాటు తర్వాత, ప్రత్యామ్నాయం ఆలోచించిన బ్రిటిష్ ఇండిగో ప్లాంటర్ల దృష్టి ఆంధ్ర ప్రదేశ్ లో మచిలీపట్టణం రేవుపట్టణ పరిసర గ్రామాల మీద పడిందనీ, మచిలీపట్నం-నిజాంపట్నం పోర్టుల మధ్య గ్రామాల రైతులు నీలిని పండించి రాణీకాసులు సంపాదించుకున్నారన్నది చరిత్రలో మరుగున పడిపోయిన సంగతి. దేశ రాజకీయాలని, ఆంధ్ర రైతాంగపు చరిత్రని మలుపుతిప్పిన నీలి పంట ఇతివృత్తంగా చంద్రలత రాసిన బృహన్నవల 'నీలంపురాశి'.
చంద్రలత పేరు చెప్పగానే తానా నవలల పోటీలో బహుమతి గెలుచుకున్న 'రేగడి విత్తులు' నవల మొదట గుర్తుకురావడం సహజం. నాకుమాత్రం నీటిపారుదల ప్రాజెక్టులు ఇతివృతంగా ఆమె రాసిన 'దృశ్యాదృశ్యం' నవలంటే ప్రత్యేకమైన ఇష్టం. ఒక డ్రై సబ్జెక్టుకి ఫ్యామిలీ డ్రామాని జతచేసి, ఆద్యంతమూ ఆసక్తిగా చదివించడమే కాక, చిన్న పాత్రలని కూడా ప్రధాన కథలో భాగం చేసిన నవలది. 'దృశ్యాదృశ్యం' తర్వాత ఆ రచయిత్రి నుంచి వస్తున్న పెద్దనవల కావడం, పైగా చరిత్ర నేపథ్యంతో రాసిన నవల కావడం వల్ల చాలా కుతూహలంతో చదవడం మొదలుపెట్టాను. చదువుతున్నంత సేపూ, నవల పూర్తి చేసి పక్కన పెట్టాక కూడా నాకు అనిపించింది ఒక్కటే "చంద్రలత ఓ పరిశోధన రాక్షసి". మొత్తం 538 పేజీల ఈ నవల కోసం ఆమె చేసిన పరిశోధన సినాప్సిస్ నిడివి నవలకి మరో నాలుగు రెట్లు ఉంటుందనిపించింది.
బెంగాల్ నీలి ఉద్యమం మొదలు, భారత దేశానికి వలస వచ్చిన ఆంగ్లో-ఇండియన్ల జీవిత శైలి, స్థానికులతో వాళ్ళ సంబంధాలు, నాటి స్థానిక వ్యవసాయ పద్ధతులు, ఉమ్మడి కుటుంబ జీవన విధానం, తీరప్రాంతపు మోతుబరి రైతులు వ్యాపారులుగా పరిణమించిన వైనం, వంశపారంపర్యంగా చేసే అద్దకం వృత్తి, ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాణి పాలనా పగ్గాలు అందుకున్న తరుణంలో కొత్తగా తయారైన సివిల్ సర్వెంట్ల ఆలోచనలు, పని తీరు, నాటి బెంగాల్ విద్యావంతుల్లో బ్రిటిష్ వారి పట్ల పెరిగిన ఆరాధన, కాలక్రమంలో ఆ అభిమానం అనుమానంగా మారిన వైనం, ఇందుకు దోహదం చేసిన పరిస్థితులు... ఇలా ఒకటని కాదు. సమాచార సేకరణ ఒక ఎత్తైతే, కథా క్రమాన్ని అనుసరించి, చారిత్రక క్రమానికి తగ్గట్టుగా కథా కాలాన్ని నిర్మించుకుని, సేకరించిన సమాచారాన్ని కథలో పొదగడం మరో ఎత్తు. నీలిపంట, నీలిమందు, నీలికళ్ళ మనుషులు (ఆంగ్లో-ఇండియన్స్), కథనిండా కనిపించేవి ఇవే.
బెంగాల్ కి చెందిన విద్యావంతుడు శిశిర్ కుమార్ మిత్ర (శిశిరుడు), మచిలీపట్టణం రేవుకి దగ్గరగా ఇండిగో ఎస్టేట్ నడిపే ఆంగ్ల కుటుంబం రాబిన్సన్స్, స్థానిక రైతు సాంబశివుడి కుటుంబం అనే మూడు కథల ముప్పేటగా సాగుతుంది 'నీలంపురాశి'. శిశిరుడు బెంగాల్ నుంచి తలదాచుకోడం కోసం మచిలీపట్నం రావడంతో మొదలయ్యే కథ అనేక మలుపులు తిరుగుతూ సాగర తీరంలో జరిగే ఒక అనూహ్య సంఘటన అనంతర పరిణామాలతో ముగుస్తుంది. బెంగాల్ నీలి ఉద్యమంతో పాటు, ఆంధ్ర రైతుల జీవితాల్లో నీలిపంట తెచ్చిన మార్పులు, కంపెనీ నుంచి రాణి కి పాలన మారిన సందర్భంలో జరిగిన చారిత్రక సంఘటనలు, వాటి ఫలితంగా స్థానికులు పొందినవి, కోల్పోయినవి, వీటన్నింటినీ చర్చిస్తూ సాగుతుంది ఈ నవల. బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలు, కథ ముందుకు సాగే కొద్దీ చిక్కపడే కథనం ఈనవల ప్రత్యేకతలుగా చెప్పాలి.
బెంగాల్ నుంచి శిశిరుడు మచిలీపట్టణం ఎందుకు వచ్చాడు, తమ బెంగాల్ సహచరులు కోల్పోయిన నీలి వ్యాపారాన్ని రాబిన్సన్స్ కుటుంబం ఎలా అందిపుచ్చుకుంది, నీలి పంట ఫలితంగా సాంబశివుడిలోనూ, అతని కుటుంబంలోనూ వచ్చిన మార్పులేవిటన్నది స్థూలంగా చెబుతూనే, సూక్ష్మ స్థాయిలో స్థానిక అద్దకం పరిశ్రమ, వంశపారంపర్యంగా వాళ్ళు దాచుకంటూ వస్తున్న 'నీలి' రహస్యాలు, పొంగళ్ళు పెట్టడం లాంటి ఆచారాలు, గోవాడ ప్రభల తిరనాళ్ళు, వలస వచ్చాక మరింత బ్రిటిష్ గా మారిపోయే ఆంగ్లేయుల కుటుంబ జీవనం, స్థానిక జమీందారీలు, మిషనరీలు, చర్చిలు, స్కూళ్ళు, స్థానికుల దృష్టిలో దొరలూ, బ్రిటిష్ వారికి పంక్తి బాహ్యులూ అయిన యురేషియన్లు (భారతీయ తల్లికి, ఆంగ్లేయ తండ్రికి పుట్టిన సంతానం) లాంటి అనేక సూక్ష్మ విషయాలని సందర్భోచితంగా ప్రస్తావించారు రచయిత్రి.
శిశిరుడు మచిలీపట్నం రావడంతో కథ మొదలు పెట్టడం, అతని నేపధ్యాన్ని, ప్రయాణపు అనుభవాలని తాపీగా చెబుతూ పోవడం వల్ల తొలి వంద పేజీల్లో కథనం బహు నింపాదిగా సాగిన భావన కలిగింది. వందపేజీల తర్వాతే కథలో నీలి పంట ప్రవేశించింది. అక్కడినుంచీ కథనం వేగం పుంజుకుంది. నవలని శిశిరుడి కథతో కాక, రాబిన్సన్స్ కథతో మొదలు పెట్టి ఉంటే ఈ 'నింపాది' సమస్య ఉండేది కాదు. మరికొన్ని కారణాలకి కూడా రాబిన్సన్స్ తో కథని మొదలు పెట్టడమే సమంజసం. మరి రచయిత్రి కథని ఈ ఆర్డర్ లో ఎందుకు చెప్పారో. రాబిన్సన్స్ వారసుడు, స్థానిక రైతాంగం 'హరయ్య బాబు' అని పిలుచుకునే హ్యారీ పాత్ర మీద రచయిత్రికి కలిగిన ప్రత్యేకమైన అభిమానం మరో సమస్య. అతని స్నేహితుడు, ఆపై కుటుంబ సభ్యుడు అయిన ఐసీఎస్ అధికారి ఆష్లీ కన్నా హ్యారీని ఓ మెట్టు పైన చూపించడానికి రచయిత్రి ప్రత్యేకంగా కష్టపడ్డారనిపించింది. ఐసీఎస్ శిక్షణలో ప్రథముడిగా నిలిచిన ఆష్లీకి స్థానికులు తనకి నమస్కరించినప్పుడు ఎలా ప్రతిస్పందించాలో హ్యారీ నేర్పించడం ఇందుకు పరాకాష్ట. ఈ ఆష్లీ లో అక్కడక్కడా 'దృశ్యాదృశ్యం' కేశవ ఛాయలు కనిపించాయి.
మమ్మారోజీ, లూయిసా, పార్వతి లాంటి బలమైన స్త్రీపాత్రల్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. గ్రేట్ గ్రానీని, సారా విత్ హెచ్ నీ కూడా పాఠకులు ఓ పట్టాన మర్చిపోలేరు. పోస్ట్ మాస్టర్ లక్ష్మీనారాయణ, వ్యాపారి సత్యనారాయణ పేర్ల మధ్య రచయిత్రి చాలాసార్లు తికమక పడ్డారు. లక్ష్మీనారాయణ గురించి చెబుతూ అతన్ని సత్యనారాయణ అని ప్రస్తావించడం చాలాసార్లు జరిగింది. 'బృందావనం' వారి మేనల్లుడు కనుక పోస్ట్ మేష్టారు పాత్రకి ఆ పేరు సబబే. వ్యాపారి పేరు మార్చుకుని ఉంటే ఈ ఇబ్బంది ఉండకపోయేదేమో. మిగిలిన ఏ పాత్రల విషయంలోనూ ఈ సమస్య లేదు కానీ అచ్చుతప్పులు మాత్రం చాలానే కనిపించాయి. ప్రూఫ్ ని మరింత శ్రద్ధగా దిద్దడం అవసరం. తొలి వంద పేజీలు కొంచం ఓపిగ్గా చదివితే, ఆ తర్వాత ఆపకుండా చదివించే కథనం. కథాకాలం నాటి ఆంగ్ల సాహిత్యాన్ని, రచయితల్ని, పాత్రల్ని నవలలో సందర్భోచితంగా ప్రస్తావించడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చివర్లో ఇచ్చిన 'ఆధార పట్టిక & పదసూచిక' పాఠకులకి అత్యంత సహాయకారి.
నీలిపంటకి, నీలిమందుకి సంబంధించి దాదాపు అన్ని విషయాలనీ కథలో భాగం చేసినా, 'నీలివార్త' గురించి ప్రస్తావించలేదు ఎందుకో మరి. ఇప్పుడు 'రూమర్/గాసిప్' అని పేరుబడిన నీలివార్తల్ని ఒకప్పుడు పనికట్టుకుని ప్రచారంలోకి తెచ్చేవారట. నీలిమందు ఉడకనప్పుడు ఇలాంటి వార్తల్ని ప్రచారంలోకి తెస్తే అప్పుడు బాగా ఉడుకుతుందని ఓ నమ్మకం ఉండేదని, అలా పుట్టినవే నీలివార్తలనీ గోదావరి జిల్లాల్లో జనబాహుళ్యం చెప్పుకునే మాట (మిగిలిన ప్రాంతాల సంగతి తెలియదు, రచయిత్రి పరిశోధన చేసిన ప్రాంతాల్లో ఈ 'నీలివార్త' వెనుక కథ ప్రచారంలో లేదేమో). చారిత్రక సంఘటనలకి కల్పిత పాత్రలని జోడించి రాసిన ఈ నవల తాను తలపెట్టిన 'విక్టోరియన్ నవలా త్రయం' లో మొదటిదని చెప్పారు రచయిత్రి, 'నీలంపురాశి' కి చివర్లో రాసిన 'కథనానికి ముందు, తర్వాత' వ్యాసం చివర్లో. రాబోయే రెండు నవలల కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. (ప్రభవ పబ్లికేషన్స్ ప్రచురణ, వెల రూ. 495, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఆన్లైన్ లోనూ లభిస్తోంది).
నెమలికన్ను ...
రిప్లయితొలగించండిఎంత మృదువుగా పలకరించిందీ పూట!
ఎంత తెలుసుకోవాలని ప్రయత్నించినా, ఎంతో కొంత మిగిలి పోతూనే ఉంటుంది. అలాంటిదే, మురళి గారు ప్రస్తావించిన నీలివార్త ఉదంతం.
"ఇండిగో జర్నల్స్ " గా పిలవబడిన నీలి వార్తాపత్రికలదే నవల లోని ఒక ప్రధానంశం కనుక, అవి పుట్టించి,పెంచి పోషించిన "నీలి వార్తలు" ల ప్రస్తావన అనివార్యంగా వచ్చింది. అయితే, వాటి అర్థం వేరు.అవసరం వేరు. మనమీనాడు మాట్లాడే..నీలి వార్తల వైనం వేరు.
మురళి గారి వలన ఆ మాటచుట్టూ అల్లుకొన్న కొత్తవిశేషాలు తెలిసాయి.
ఇంకెన్ని కొత్త విషయాలు నేర్పుతుందో కదా నా ఈ చిన్నప్రయత్నం!
మురళి గారికి అనేక ధన్యవాదాలు.నిశితంగా చదివినందుకు. సముచిత సూచనలను అందించినందుకు.
సరిదిద్దుకొనేందుకు తప్పకప్రయత్నిస్తాను.
ఈ వ్యాసాన్ని పంపిన భాస్కర్ కూరపాటి గారికి వందనాలు.
10-4-2023
ధన్యవాదాలండీ..
తొలగించండివిక్టోరియన్ నవలాత్రయం లో రెండో నవలని వీలైనంత త్వరగా అందించండి..
కథ రాకడ వాన రాకడ తెలియదు కదండీ!:-) తప్పకుండా వీలయింత త్వరలో రాసేందుకు ప్రయత్నిస్తాను. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. నమస్కారం.
తొలగించండి